ఒకే ఒక్కడు సంపత్కుమార

మనం ఒక వ్యక్తిని వ్యక్తిగా అంచనావేస్తాం. ఒక శక్తిగా కూడ వ్యక్తి సద్గుణుడైతే మంచివాడంటాం. వ్యక్తి ప్రతిభావంతుడైతే శక్తిమంతుడంటాం. అవి రెండూ కలిసినవాన్ని మహానుభావుడు, మహాత్ముడని అంటాం. ప్రతిభ గొప్పదా, మంచితనం గొప్పదా అని అంటే, రెండూ అనవలసి వస్తుంది. ఒకటి మాత్రమే ఉండి ఇంకొకటి లేకపోతే వ్యక్తి అంతగా రాణించడు, జనుల హృదయాల్లో చోటుచేసికోడు, అట్టే కాలం జ్ఞాపకముండదు.

సంపత్కుమారాచార్య ప్రతిభావంతుడే కాడు, గుణవంతుడు కూడా. అతడు ఎన్నో ప్రామాణిక గ్రంథాలు, వ్యాసాలు, కవితలు వ్రాశాడు. అయినా చిత్రమేమిటంటే, ఎందరెందరో చిన్నవాళ్ళకు మిన్నవాళ్ళకొచ్చిన సాహిత్య అకాడమీ అవార్డులు అన్ని ప్రామాణిక గ్రంథాలు వ్రాసిన అతనికి రాలేదు. అలాంటివి రావడానికి అనేక కారణాలుంటాయి. అవిప్పుడు ఎందుకు లెండి. అసలా వ్యక్తికి పైరవీ అంటే ఏమిటో తెలియదు. ఏనాడూ అవేవో రావలసినవి రాలేదన్న నిస్పృహ, నిరాశ ఉండేది కాదు. సృజనాత్మక, పరిశోధనాత్మక కోరికలు తప్ప. ఆ కోరికలు కేవలం కోరికలు కావు, సదా అతనిని వదలని అతడు వదిలించుకోలేని తపనలు. అతని జీవితమొక నిత్య సాహిత్య తపస్సు. ఎప్పుడూ ఏదోచేయాలన్న చింతనలో మునిగితేలేవాడు. అయినా అప్పటికీ అందరిలో అందరివాడిలా, అందరిలో తానూ ఒకడుగా నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. అతడు విద్యార్థులకు కేవలం పాఠాలు చెప్పేవాడుకాదు. వారిని ప్రేమించేవాడు, సాహిత్యాభిరుచి పెంచుకోవడానికి ప్రేరేపించేవాడు. వాళ్లు పెరుగుతుంటే ఎంతో సంతోషించేవాడు తానే పెరుగుతున్నట్లు. అతడు పాఠాలు చెప్పడం విద్యార్థులకొక వింత, అదొక పండగ. అంత ఆకర్షణీయంగా, పాండిత్యంగా, విమర్శనాత్మకంగా, వికాసవంతంగా, చలాకీగా, చమత్కారంగా చెప్పేవాడు. ‘వేయిపడగలు’ నవలలో ‘‘మాయన్న యర్థము చెప్పుట యనగానేమని? అలాగున భగవంతుని యెదుట గూర్చున్నట్లే.’’ ‘‘మీరు విమర్శించి చక్కగా చెప్పెదరు. దానినందుకొనుటకు మనస్సు పరిపక్వముగా నుండవలయును. మీరు జన్మతః ఉపాధ్యాయులు’’అంటుంది గిరిక ధర్మారావు గురించి. గిరిక ధర్మారావు గురించి అన్నవి అక్షరాలా సంపత్కుమారాచార్యగారి బోధనా పటిమకు కూడా వర్తిస్తాయి. సంపత్ తన పరిశోధనలకు, విమర్శలకు చెందిన వ్యవహారాలలో బహు సీరియస్‌గా ఉండేవాడు కాని ఇతర విషయాల్లో సరదాగా ఉండేవాడు. చాయ్, వక్కపొడి, మిఠాయి, అడపాదడపా మంచి కంపెనీ ఉంటే కంపెనీ కొరకు కాస్త సుర నీరు ఇష్టపడేవాడు. మేధావంతులతో చర్చలు జరపడమంటే, వారితో సరదాగా గడపడమంటే అతనికి అతి ఇష్టం.
ఆయన జగిత్యాల కళాశాలలో లెక్చరర్‌గా ఉన్నన్నిరోజులు విద్యార్థులకే కాదు ఊరి వారందరికీ అదొక సాహిత్య పండగగా ఉండెడిది. జగిత్యాల కాలేజ్‌ను అప్పట్లో ‘‘కొండలరావుగారి కాలేజ్’’అని అంటుండేవారు దాని ఖ్యాతివలన. వాస్తవానికి ఆ ఖ్యాతి నాకుకాదు అతనికి చెందవలసింది. ఎందుకంటే నేను కళాశాల డిసిప్లిన్ కొరకు మాత్రమే పాటుపడేవాన్ని, కాని కళాశాలను ఒక విద్యా-సాహిత్య-సాంస్కృతిక సంస్థగా వికాసవంతంగా తీర్చిదిద్దవలసిన బాధ్యతంతా నేనతనికే ఒప్పచెప్పేవాన్ని. నావద్ద అతనికున్నంత స్వేచ్ఛ మరెవరికీ ఉండేదికాదు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘‘అతడు మొదట పుట్టి సాదాతనం ఆ వెనుక అతనిని చూచి పుట్టిందేమోననిపించేది’’. అతని సీదాతనాన్నికాక అతని సాదాతనాన్ని చూస్తుంటే. సాహిత్య అభిప్రాయాలకొస్తే ‘డ్ఘౄఔ్ఘఆ్ద జ్ఘీఒ ఘ శ్య శ్యశఒళశఒళ ఘౄశ’. అసందర్భంగా అప్రస్తుతంగా, అసమర్థతతో, ఆకతాయిగా ఎవరైనా మాట్లాడితే ‘‘ఖబర్దార్!’’ అని నిర్మొహమాటంగా నిష్పక్షపాతంగా మందలించేవాడు, నిలదీసేవాడు. అలా సాధికారతతో, సాహసంతో నిలదీయగలవారు ఆరోజుల్లో తెలంగాణాలో ముగ్గురే ముగ్గురుండేవారు. కాళోజీ, సంపత్, గౌతమరావుగారు. ఇప్పుడేరీ అలాంటి దిగ్గజాల్లాంటి, దిక్సూచిల్లాంటివాళ్లు. అంత ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసంగల సాహిత్య సాంఘిక సామాజిక సామ్యవాద మొనగాళ్లు?
‘చేరా’ అంతటివాన్ని కూడా సంపత్ కాస్త హెచ్చరించి, కాస్త బుజ్జగించి తనతో చాలావరకు అంగీకరించేట్టు తిప్పుకోగలిగాడు. ఒకసారి సత్యనారాయణగారు ‘‘ఈ పద్యాలెలా ఉన్నాయో చెప్పవోయ్’’ అని వారు రాసినవి కొన్ని చూపిస్తే ‘మీరు రాసినట్లు లేవు’ అని అన్నాడట అంత పెద్దవాడు కదాయని ఏమాత్రం వెనకాడక. విశ్వనాథ అప్పుడే వాటిని చించేసి తరువాత తిరిగి రాశారట. నండూరి కృష్ణమాచారిగారి లాంటి సాహిత్య ఉద్దండుణ్ణికూడా ఒకచోట తప్పుపట్టాడట. ఎంత పెద్దవాళ్ళయినా అతనితో సాహిత్య విషయాలు మాట్లాడాలంటే ఎంతో జాగ్రత్తగా, ఒళ్ళుదగ్గరపెట్టుకొని మాట్లాడేవారు.
సంపత్ బహు స్నేహశీలి. స్నేహితులకొరకు అతడు అతనికెంత నష్టమైనా కష్టమైనా ఓర్చుకునేవాడు, అది ఎంతవరకు పోయిందంటే, మూడుసార్లు చేతిలో ఉన్న పర్మనెంట్ ఉద్యోగాన్ని వదిలి స్నేహితులకొరకు అతడు మరొక చోటికి మరొక కొత్త ఉద్యోగం కొరకు పోయేవరకుపోయింది. చేతిలో ఉన్న టీచర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి అతడు కరీంనగర్‌లోని తనకు చాలా ఇష్టమైన గౌతమ్‌రావు కొరకు జగిత్యాలలో అపుడపుడే నెలకొల్పబడిన కళాశాలలో లెక్చరర్‌గా చేరేవరకు, అటు తదుపరి కాకతీయ విశ్వవిద్యాలయంలో వారి స్నేహితులుకొరకు, బంధువేకాక తనకు అత్యంత ఇష్టుడైన కోవెల సుప్రసన్నచార్యగారి కొరకు ఆ విశ్వవిద్యాలయంలో చేరేవరకు పోయింది.
అతని సాహిత్య ప్రేమ అతని దేశ ప్రేమతో ముడిబడి ఉందనేది బహుశా నాకొక్కడికే ఎక్కువ తెలుసేమో! ఎందుకంటే బహు విద్యాలయాలలో నా విద్యాభివృద్ధి సేవ కూడా నా రాజకీయ నేపథ్యంతో ముడిబడి ఉందన్న సంగతి చాలామందికి తెలియనట్టే, అతని అధ్యాపక సేవ కూడా అతని దేశభక్తితో ముడిబడి ఉందని చాలామందికి తెలియదు. నేనొక ఫ్రీడమ్ ఫైటర్ కనుక నా ధైర్యం, నా సాహసం, నా పరిపాలనా క్రమశిక్షణ నాకు నా జైలు యాత్రలనుండి అబ్బిన వరాలని అప్పటికీ ఇప్పటికీ చాలామందికి తెలియదు. నేనది ఎప్పుడూ ఎవ్వరికీ చెప్పేదీ, చెప్పుకునేదీ కాదు కాని సందర్భం వచ్చింది కనుక చెప్పవలసి వచ్చింది. సంపత్ కూడా ఫ్రీడమ్ మూవ్‌మెంట్‌తో సంబంధమున్నవాడే. కనుక అతనికి అతని విధి నిర్వహణల్లో సామాజిక స్పృహ చాలా ఉండేది.
సంపత్ కూడా ప్రత్యేక తెలంగాణ కావాలని కోరినవాడే. ఆనాటి రజాకార్ల జోరు రోజుల్లో అతడు అతని కుటుంబ సభ్యులతోపాటు వరంగల్ నుండి విజయవాడ ప్రాంతానికి కాందిశీకునిలా తరలిపోయినవాడే. ఫ్రీడమ్ మూవ్‌మెంట్‌తో ఏదో ఒకవిధమైన దగ్గరి సంబంధమో, దూరపు సంబంధమో ఉన్నవాడే. ఆ రోజుల్లోనే ఆ తరలిపోయిన ప్రాంతాలలోని విద్యా, సాహిత్య సాంస్కృతిక సాంఘిక గ్రంథాలయాల అభివృద్ధి చూసి అచ్చెరువొంది, అయ్యో! మన రాష్ట్రంలో, అంటే ఇప్పటి తెలంగాణా ప్రాంతంలో ఇలాంటి అభివృద్ధి లేదే అని ఎంతో విచారపడినవాడే. అది వారిలో అప్పటినుండే ప్రాంతీయ అభివృద్ధికి చెందిన అభిలాష రేకెత్తించింది. అదే కావచ్చు, నన్ను చేసినట్లే అతనిని కూడా తెలంగాణవాదిని చేసింది. సంపత్‌కు సిగరెట్టంటే మహా ఇష్టమని గండ్ర లక్ష్మణరావు సంపత్ యొక్క సిగరెట్ ప్రేమ గురిచి ‘‘సంపత్ సారుకు సిగరెట్ అంటే ఎంత ప్రేమంటే జగిత్యాలలో ఉండగా ముందటి వరండాలో సిగరెట్ పీలుస్తూ కుర్చీలో కూర్చుని ఉన్న ఒక ఫొటో ఫ్రేమ్ కట్టించుకొని వెనకాల గోడకు వ్రేలాడదీసికొనేవాడు. మాకు నవ్వేసేది, ఇంత పెద్ద సార్‌ను కూడా ఇది వదిలిపెట్టలేదే’’నని వ్రాశాడు అతని ఒక వ్యాసంలో. ఒక్క నా ముందు తప్ప సంపత్ అందరిముందు బాజప్తా సిగరెట్ త్రాగేవాడు. నాయెడ అతనికి అంత వినయం, అంత మర్యాద, అంత గౌరవం. అది భయం కాదు. నా క్రమశిక్షణా పాటింపువలన అతనికి అతని సాహిత్య కృషి సాధ్యమైందన్న కృతజ్ఞతాభావం. సంపత్ భాగ్యవంతుడు కాదు. అతనికి అతని పుస్తకాలే, పరిశోధనలే, అతని శిష్యులే అతని సాహిత్య మిత్రులే భాగ్యం. అయినా ఎంతో ఉన్నవానిగా గంభీరంగా ఎప్పుడూ నవ్వుకుంటూ ఉండేవాడు. సంపత్ సదా సంతోషి. అందుకేనేమో అతనికాతని తల్లిదండ్రులు ఆ పేరు పెట్టారు. తెలంగాణలో సంపత్ అనే పదాన్ని జనసామాన్యం ‘సంపత్తు’ అని సంబోధిస్తారు. చిన్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఆప్యాయంగా ‘సంపత్తూ’ అని పిలుస్తారు. విశ్వనాథవారు, గౌతమ్‌రావుగారు సంపత్‌ను ఎప్పుడూ ‘మా సంపత్తు’ అని అనేవారు. అలాగే నేను కూడా అతనిని సంపత్‌కుమారాచార్య అని అనేవాన్ని కాదు. కొన్నాళ్లు గడిచినకొలది నాకు కూడా అతనిని సంపత్ అని అనడమే అలవాటైపోయింది. అదొక హృదయేచ్ఛ, స్వేచ్ఛ. ‘గుండె లోతుల్లో కొట్టాడుతున్నాది అది’ అన్నట్లు, అప్పటికీ, ఇప్పటికీ అతనిని అలా పిలవాలన్న కుతి అలాగే మిగిలిపోయింది. సంపత్ ఒక మంచి మనిషిగా, ఒక మంచి అధ్యాపకుడిగా, ఒక మంచి పరిశోధకుడిగా, ఒక మంచి పండితుడిగా, ఒక మంచి విమర్శకుడిగా, ఒక సాహిత్య వ్యాప్తికి పాటుపడిన కృషీవలుడిగా, ఒక చెప్పుకోదగ్గ రోల్ మోడల్, ఒక కేస్ స్టడీ, ఒక ఐడియల్. సంపత్‌కు ఒకటా, రెండా! ఆరు భాషలొచ్చేవి- తెలుగు, కన్నడం, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, సంస్కృతం. బహుశా ఎంతో కొంత తమిళం కూడా. తెలుగు, సంస్కృతం, హిందీ, కన్నడాలలో ఎం.ఎ చేసినాడని ఎవరికీ చెప్పాలని చెప్పేవాడు కాదు. కొన్నాళ్లు అతడు మద్రాస్ ప్రాంతాల్లో ఉన్నాడు కూడా. తెలుగు తదుపరే ఇంగ్లీష్ అని వాదించేవాడు కాని ఇంగ్లీష్‌ను ద్వేషించేవాడు కాదు. సత్యనారాయణగారి లాగే ఇంగ్లీష్ సినిమాలు కూడా చాలా చూసేవాడట, అలాగే హిందీ సినిమాలు కూడా. మోడర్నిటీ అంటే అది. దేనినీ ద్వేషించకపోవడం, ఎవరినీ దూషించకపోవడం. కానీ తాను సరైనదని నమ్మినదానిని ససేమిరా వదలకపోవడం. సంపత్ పాత క్రొత్తల సమ్మేళనం. దుస్తులను బట్టి సాంప్రదాయవాది అని అనేవారికి మోడర్నిటీ యొక్క నిగూఢార్థం తెలియదు. సంపత్‌లాంటి వారి గుణగణాలు తెలిస్తే, అలాంటివారిని చూస్తే తప్ప. సంపత్‌కు సాహిత్యమే కాదు సంగీతమంటే కూడా మహా ఇష్టం. తెలియక కాదు తెలిసి హిందూస్తానీ పాత పాటలంటే చాలా ఇష్టపడేవాడు.
మొత్తానికి సంపత్ చాలా గట్టివాడు. అసలు సిసలైన దేశీయవాది, సాంప్రదాయ ఆధునికతల సమ్మేళనం. ఎంతో మితవాదే కాదు, మితభాషి కూడా. ళూక ఇ్ఘ్ఘశషళజూ షఖఆఖూళజూ దఖ్ఘౄశఇళజశ. అలాంటి వాళ్లంతా ఫోయారు, ఇంకా పోతూనే ఉన్నారు. సాహిత్యరంగం దినదినం బీదదై, పేదదై, పేలవమైపోతోంది! అనిపిస్తుంది. ‘వేయిపడగలు’లో విశ్వనాథవారు తుదిపేజీలో ‘‘అయ్యో! అయ్యో! నా దేశం ఇలా అయిపోతోందే! ఇలా అయిపోతోందే!’’ ‘‘ఆహా! ఏమి కాలము! ఏమి కాలము! ఏమి మార్పు! ఏమి మార్పు! ఎనె్నన్ని మంచివి నశించిపోతున్నాయి! ఎనె్నన్ని మంచివి కానివి, కొరగానివి తలెత్తుతున్నాయి!’’ అంటూ కన్నీళ్లు కారుస్తూ వ్రాసినవి జ్ఞాపకమొస్తున్నాయి.

– డా. వెల్చాల కొండలరావు, 9848195959

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *