కొత్తదనాల కోసం ఆర్తి.. ఆదుర్తి

రంగావఝల భరద్వాజ

తేనె మనసులు వర్కింగ్ స్టిల్

ఇండియన్ స్క్రీన్ మీద ప్రొడ్యూసర్లైన డైరక్టర్లు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో మోస్ట్ సక్సస్ ఫుల్ ప్రొడ్యూసర్ కమ్ డైరక్టర్ ఆదుర్తి సుబ్బారావు. కొత్తదనం కోసం తపించి కళాత్మక విలువలతో సినిమాలు తీసి తీయించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసి వెళ్ళిపోయిన మనసు దర్శకుడు నిర్మాత ఆదుర్తి. సినీగేయకవిగా, ఎడిటర్ గా, కెమేరా అసిస్టెంగ్ గా, అసిస్టెండ్ డైరక్టర్ గా, డైరక్టర్ గా, ప్రొడ్యూసర్ గా ఇలా చెలరేగిపోయాడు ఆదుర్తి. స్కూల్ ఫైనల్ తర్వాత ఫొటోగ్రఫీ మీద ఇంట్రస్ట్ తో పైచదువులు వదిలేసి ముంబై వెళ్లారు ఆదుర్తి. కెమేరా అసిస్టెంట్ గా పనిచేస్తూనే ప్రాసెసింగ్‌ కు మారారు.అట్నుంచి ఎడిటింగ్‌ కు షిప్ట్ అయ్యారు. నార్వే కర్‌ అనే ఎడిటర్‌ దగ్గర అసిస్టెంటుగా చేరారు. ఆదుర్తి టాలెంట్ చూసి దర్శకుడు ఉదయశంకర్‌ తన ‘కల్పన’ కు అసిస్టెంట్‌ డైరెక్టర్ కమ్ అసిస్టెంట్‌ ఎడిటర్‌ అవకాశమిచ్చారు. అలా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు ఆదుర్తి సుబ్బారావు.
ఆదుర్తికి సాహిత్యం లో కూడా ప్రవేశం ఉంది. టెక్నీషియన్ గా పనిచేస్తూనే మంగళసూత్రం, సర్కస్ రాజు లాంటి సినిమాలకు పాటలు రాశారు. కె.ఎస్ ప్రకాశరావు దీక్షకు అసిస్టెంట్ గా పనిచేసిన ఆదుర్తి కి ఆ టైమ్ లోనే అమరసందేశం డైరక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. సినిమా ఫ్లాప్ అయినా…డైరక్టర్ గా ఆదుర్తి టాలెంట్ నచ్చి అన్నపూర్ణా వారి రెండో సినిమా తోడుకోడళ్లు కు అవకాశం ఇచ్చారు దుక్కిపాటి మధుసూథనరావు. విచిత్రంగా ఆదుర్తికీ అది రెండో సినిమానే. అదిరిపోయే హిట్ అయిందా సినిమా.
అలా మొదలైన అక్కినేని ఆదుర్తి కాంబినేషన్ పదహారు సినిమాలకు విస్తరించింది. అక్కినేని, ఆదుర్తి, ఆత్రేయ ఇది ఆ రోజుల్లో హిట్ త్రయం. తెలుగు , తమిళం, హిందీ భాషల్లో అనేక సక్సస్ ఫుల్ మూవీస్ డైరక్ట్ చేసిన ఆదుర్తి అక్కినేని హీరోగా వచ్చిన మంచి మనసులు చిత్రంతో నిర్మాతగా మారారు. తమిళ్ లో తనే తీసిన కుముదం ఆధారంగా తీసిన మంచిమనసులుతో బాబూ మూవీస్ సంస్ధకు అంకురార్పణ చేశారు. మోడ్రన్ థియేటర్స్ సుందరంతో కల్సి బాబూ మూవీస్ లో చాలా సినిమాలు తీశారు.
అక్కినేనితోనే బాబూ మూవీస్ రెండో సినిమా అనౌన్స్ చేశారు ఆదుర్తి. ఆత్రేయ, ముళ్లపూడి వెంకటరమణ కల్సి తయారు చేసిన కథతో తెరకెక్కిన ఆ దృశ్యకావ్యమే మూగమనసులు. మనసు మూగదే కానీ బాసుంటది దానికీ…చెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇది. మూగమనసులు ఆత్రేయను మనసుకవిగాను, మహదేవన్ ను మామగానూ మార్చేసింది. అక్కినేని జీవితంలో మరపురాని చిత్రంగా నిల్చిపోయింది. పూర్వ జన్మ కాన్సెప్ట్ ను పాపులరైజ్ చేసింది.
అక్కినేని తో రెండు చిత్రాలు నిర్మించిన ఆదుర్తి సుబ్బారావు ముళ్లపూడి చెప్పిన కథను కొత్త వాళ్లతో తీయాలని సంకల్పించారు. ఆ సినిమాలో నటించిన కొత్త నటీనటులతోనే ఆ తర్వాతా కంటిన్యూ అయ్యారు. అలా అనుకోకుండా బాబూ మూవీస్ బ్యానర్ లో మూగమనసులే అక్కినేని నటించిన చివరి చిత్రం అయింది. అక్కినేని లేకుండా తెరకెక్కిన బాబూ మూవీస్ వారి తొలి రంగుల చిత్రం ఓ సూపర్ స్టార్ కు పురుడు పోసింది.
మూగమనసులు సక్సస్ తర్వాత ఆదుర్తి సుబ్బారావు ముళ్లపూడి వెంకటరమణ చెప్పిన యూత్ ఫుల్ స్టోరీని తెరకెక్కించదల్చుకున్నారు. రెండు కుర్ర జంటల ప్రేమ నేపధ్యంలో సాగే ఈ సినిమాకు కూడా ఆనవాయితీ ప్రకారం మనసులు కలిసొచ్చేలా…తేనెమనసులు అని టైటిల్ పెట్టారు. కృష్ణ, రామ్మోహన్ అనే ఇద్దరు కొత్త హీరోలను సుకన్య, వాసంతి అనే ఇద్దరు కొత్త హీరోయిన్లనూ పరిచయం చేస్తూ పూర్తి రంగుల్లో సినిమా తీసారు ఆదుర్తి. తెలుగులో మొదటి సాంఘిక రంగుల చిత్రంగా చరిత్రకెక్కిందా సినిమా.
తేనెమనసులు సినిమాలో ఆదుర్తి డైరక్షన్ లో నటించే అవకాశం కోసం చాలా మంది ప్రయత్నించారు. చాలా మంది ప్రముఖులు మిస్ అయ్యారు. అలా మిస్సైన పెద్దోళ్లలో ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, డ్రీమ్ గాళ్ హేమమాలిని, రెబల్ స్టార్ కృష్ణంరాజులు ఉన్నారు. వీళ్లను రిజక్ట్ చేసిన త్రిసభ్య కమిటీలో ముళ్లపూడి వెంకటరమణ, కె. విశ్వనాథ్, సెల్వరాజ్ లు సభ్యులు. కొత్తవారితో తెరకెక్కిన తేనెమనసులు సూపర్ డూపర్ హిట్ అయింది.
తేనెమనసులు తర్వాత బాబూ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన సినిమా కన్నెమనసులు. తేనెమనసులు టీమ్ నే కన్నెమనసులుకూ రిపీట్ చేశారు ఆదుర్తి. గాజులమ్మ అనే ఒక గ్రామదేవత కథ నేపధ్యంలో సాగే ప్రేమ కథా చిత్రం కన్నెమనసులు. నీ మనసుకు తెలుసు నా మనసు…నీ వయసుకు తెలియదు నీ మనసు….లాంటి టిపికల్ వాక్యాలతో ఆత్రేయ రాసిన పాటలు కన్నెమనసులు చిత్రాన్ని మ్యూజికల్ సక్సస్ చేశాయి.
కన్నెమనసులు తర్వాత ఆదుర్తి బయట సినిమాలతో బిజీ అయ్యారు. అక్కినేని హీరోగా ఆదుర్తి తీసిన డాక్టర్ చక్రవర్తి కి ప్రభుత్వం ఉత్తమ దర్శకుడు అవార్టు ఇచ్చింది. ఆ పురస్కారం కింద వచ్చిన నగదుకు కొంత కలిపి అక్కినేని భాగస్వామ్యంతో చక్రవర్తి చిత్ర అనే బ్యానర్ పెట్టి ప్రయోజనాత్మక చిత్రాల రూపకల్పనకు దిగారు ఆదుర్తి సుబ్బారావు. ఆర్థికంగా కలసిరాకపోయినా…మంచి పేరు తెచ్చాయా రెండు చిత్రాలూ.
వ్యాపార అంశాల్ని పక్కన పెట్టి సామాజిక ప్రయోజనాత్మక సినిమాలు నిర్మించాలనే సదుద్దేశంతో చక్రవర్తి బ్యానర్‌పై సుడిగుండా
లు, మరో ప్రపంచం చిత్రాల్ని తీశారు. ఈ రెండు చిత్రాలూ మంచి పేరు తెచ్చాయిగానీ… ఆర్థికంగా నష్టాల్ని చవి చూశాయి. మొదటి సినిమా సుడిగుండాలు. దేశ భవిష్యత్తుకు అవసరమైన యువత పరిస్థితి ఏమిటో చెప్పడంతో పాటు యువత అలా తయారవడం వెనుక పెద్దల, సమాజం పాత్ర ఎంతుందో అర్ధం చేయించే ప్రయత్నం చేశారు.
నాణ్యమైన వ్యక్తులు లేకుండా నాణ్యమైన సమాజ నిర్మాణం జరగదు అనే మహాత్మాగాంధీ సూక్తి ఆధారంగా నిర్మించిన చిత్రం మరో ప్రపంచం. నాటక రచయిత మోదుకూరి జాన్సన్ ను ఈ చిత్రం ద్వారా రచయితగా పరిచయం చేశారు. అలాగే కరుణామయుడు పాత్రతో పాపులర్ అయిన విజయచందర్ తొలి చిత్రం కూడా మరో ప్రపంచమే.
ప్రయోజనాత్మక చిత్ర నిర్మాణంలో ఉంటూనే …. బాబూ మూవీస్ బ్యానర్ లో తన శిష్యుడు కె.విశ్వనాథ్ డైరక్షన్ లో ఉండమ్మా బొట్టు పెడతా తీశారు ఆదుర్తి సుబ్బారావు. రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా , చాలులే నిదురపో జాబిలికూనా లాంటి అపురూపమైన పాటలతో వచ్చిన ఉండమ్మా బొట్టు పెడతా అద్భుతమైన విజయాన్ని సాధించింది.
ఉండమ్మా బొట్టు పెడతాతో సక్సస్ కొట్టిన తర్వాత ఆదుర్తి సుబ్బారావు మళ్లీ బయట సినిమాల డైరక్షన్ పనులతో బిజీ అయిపోయారు. కొంత గ్యాప్ తర్వాత రవి కళా చిత్ర మందిర్ పేరుతో మరోసారి చిత్ర నిర్మాణానికి దిగారు ఆదుర్తి సుబ్బారావు. ఆ బ్యానర్ మీద రూపొందిన రెండు చిత్రాల విశేషాలు చూద్దాం.
సుందరంతో కల్సి ఆదుర్తి నిర్మించిన చివరి చిత్రం ఉండమ్మా బొట్టుపెడతా. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని రవి కళా చిత్ర మందిర్ పేరుతో కొత్త సంస్ధ ఏర్పాటు చేశారు ఆదుర్తి. ఆ బ్యానర్ లో వచ్చిన తొలి చిత్రం మాయదారి మల్లిగాడు.
చెడ్డవారుగా ముద్ర పడ్డ వారంతా చెడ్డవారూ కాదు. మంచి వారుగా చెలామణీ అవుతున్న వారంతా మంచి వారూ కాదనే కాన్సెప్ట్ తో ఆదుర్తి మార్క్ ట్రీట్మెంట్ తో ఆకట్టుకున్న చిత్రం మాయదారి మల్లిగాడు. ఆత్రేయతో ఓ కాన్వర్ జేషనల్ డ్యూయట్ రాయించి కొత్త ట్రెండుకు నాంది పలికారు ఆదుర్తి. వస్తా వెళ్లొస్తా…రేపు సందేళ కొస్తా పాట…అప్పట్లో పెద్ద హిట్టు.
మనసు చిత్రాల దర్శకుడుగా మనసును తడిమే పాటొకటి ఆదుర్తి చిత్రాల్లో తప్పనిసరిగా ఉంటుంది. మాయదారి మల్లిగాడులో వచ్చే జైలు పాట భగవద్గీతకు గీతానుసరణ. నవ్వుతూ బతకాలిరా…తమ్ముడూ నవ్వుతూ పోవాలిరా..సచ్చినాక నవ్వలేవురా…ఎందరేడ్చినా…తిరిగిరావురా అంటూ ఆత్రేయతో రాయించుకున్నారు…ఆదుర్తి.
ఆదుర్తి నిర్మించిన చివరి చిత్రం గాజుల కిష్టయ్య. తను పరిచయం చేసిన కృష్ణతోనే చివరి చిత్రం చేయడం విశేషం. అలాగే తనకు అత్యంత ఆప్తుడు అక్కినేనితో మహాకవి క్రేత్రయ్య సినిమా తొంభై శాతం పూర్తి చేసిన సయమంలో కన్నుమూయడం బాధాకరం. ఆ మిగిలిన భాగాన్ని సి.ఎస్.రావు కంప్లీట్ చేశారు.
గాజుల కిష్టయ్యలో రాజమండ్రికి చెందిన జరీనావహాబ్ ను పరిచయం చేశారు ఆదుర్తి. నిన్నటి కమల్ హసన్ విశ్వరూపంలో సైకియాట్రిస్ట్ కారక్టర్ లో కనిపిస్తుంది జరీనా. ఇందులోనూ ఆదుర్తి మార్క్ పాట…నవ్వులు రువ్వే పువ్వమ్మా…ఆ నవ్వులు నాకు ఇవ్వమ్మా..ఉన్న నాలుగు నాళ్లూ నీలా నవ్వుతుంటే చాలమ్మా…. వినిపించినప్పుడల్లా ఆదుర్తి గుర్తు రాక మానరు.
కె.విశ్వనాథ్, బాపు లాంటి కళాత్మక దర్శకుల్ని తన వారసులుగా అందించి 1975 అక్టోబర్ ఒకటిన సెలవంటూ ఈ లోకాన్ని వీడారు ఆదుర్తి సుబ్బారావు. తెలుగువారు ఎప్పటికీ మరచిపోలేని మరపురాని చిత్రాలు తీసి, నిర్మించి తెలుగువారిని రుణగ్రస్తుల్ని చేసిన మరచిపోలేని దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *