అమ్మాయి ఎలా ఉండాలో కుంచెతో శాసించినవాడు

రెండు ఊపిరులు మాట్లాడుకుంటున్నాయి.. రెండు స్పర్శలు పలకరించుకుంటున్నాయి.. రెండు కళ్లు ఊసులాడుకుంటున్నాయి. గాలి కూడా చొరబడని ఇద్దరి సమాగమం పరవశంగా పాట పాడుకుంటోంది.. పరువం వానగా కురుస్తుంటే…ఆ వానలో .. మల్లెపందిరి నీడలో.. జాజిమల్లియలు పరచుకున్న మంచం మంద్రంగా హమ్మింగ్ చేస్తోంది.. వాళ్ల పెదాలు వణుకుతున్నాయి.. కానీ పలకటం లేదు. వాళ్లు ఎన్నో మాట్లాడుకుంటున్నారు.. ఒక్క అక్షరం కూడా బయటకు వినిపించటం లేదు.. ఇంతకీ వాళ్లేం మాట్లాడుకుంటున్నారు.. ఏం పాడుకుంటున్నారు.. ? ఏ భాషలో ఊసులాడుకుంటున్నారు.. ? అందరికీ తెలుసు.. కానీ, ఏమని చెప్పాలి? అక్షరానికి అందని పరవశం అది.. వాళ్లు కదలటం లేదు.. కానీ, ఆ ఊపిరుల సెగ, చూస్తున్న వారికి తగులుతూనే ఉంది. ఆ పరవశాన్ని వీళ్లు అనుభవిస్తున్నారు… అ పరవశాన్ని అందిస్తున్నది ఒక బొమ్మ.. ఆ బొమ్మకు ప్రాణం పోసిన వాడు బాపు..
విశ్వంలో అత్యంత అందమైన అమ్మాయి ఎక్కడుందో తెలుసా? ఇంకెవరు.. ఒక తెలుగమ్మాయి.. తెలుగింటి చిన్నదాని ముందు ఎంతటి అప్సరసలైనా దిగదుడుపే…. ఈ ఒంపులు.. ఆ ఒంపుల్లోని సొంపులు.. ఆ సొంపుల్లో తలదాచుకున్న అద్భుత సౌందర్యం.. తెలుగు అమ్మాయి ఇంతందంగా ఉంటుందని లోకానికి చాటి చెప్పిందెవరు? ఒక వంకర గీత. అవును… ఒకే ఒక వంకర గీత అమ్మాయి ఒంపుల్లో సొంపుల్ని కనువిందు చేసింది. ఇంతకంటే అందంగా ప్రపంచంలో మరే అమ్మాయి ఉండదని తేల్చేసింది..
పిడికెడు నడుము.. బారెడు జడ.. మూరెడు కొంగు …దాచినవన్నీ చూపీ చూపకుండా దోబూచులాడుతాయి. అందుకోమని దోవ చూపినట్లే చూపి అంతలోనే దాచుకుంటూ మిడిసి పడుతాయి. వగలు పోతాయి.. వయ్యారాలు ఒలకబోస్తాయి.. ఏమందం.. ఏమి చందం.. ఇంతటి అందాలను పోతపోసుకున్న అమ్మాయి తెలుగమ్మాయి కాకుండా.. మరో అచ్చర ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా?
ఎక్కడి నుంచి వచ్చిందీ అందం.. ఒకే ఒక్క వంకర గీత.. అమ్మాయి అందానికి సొబగులు దిద్దింది.. ఒకే ఒక్క కుంచె ఆమెకు సృష్టికర్త కూడా ఇవ్వనంత అందాన్ని ఇచ్చింది. ఎన్ని పువ్వులు.. ఎన్ని రంగులు.. ఎన్ని సొగసులు.. రంగు రంగులు రంగరించి ఒంపు సొంపుల్లో దాచిపెట్టి మనసుకు మతి పోగొట్టింది. ఎంత రసికుడు ఆ చిత్రకారుడు..? తెలుగు అమ్మాయి అంటే ఇలాగే ఉండాలని తన కుంచెతో శాసించిన వాడు.. ఒకే ఒక్కడు.. బాపు.
చెంగావి చీరకట్టిన చెలి, చెంతచేరి మాటాడుతుంటే చెలికాని కనురెప్పలు కొట్టుకుంటాయా? కొంగుమాటున దోబూచులాడే శృంగారం గుబులు రేపకపోతే ఆ చీరకే సిగ్గుచేటు కాదా? ఆ కట్టు… ఆ బొట్టు.. చెంగుమని ఎగిసిపడే ఆ చెంగులు… అందానికి కొమ్ముకాసే కొంగు, సౌందర్యానికే సౌందర్యం కాదా..వన్నెల రాణికి సిరిజోతలను ఏరికూర్చి పెట్టే అందాల పూబోణి చీరకట్టిన చిన్నారి వయ్యారాలు బాపూ బొమ్మలో తప్ప మరెక్కడ వగలు పోతాయి చెప్పండి.. అందుకే కదా.. అమ్మాయి అంటే బాపు బొమ్మలా ఉండాలని అనేది.. అనిపించుకోవాలని కోరుకునేది..
పరువం మురిపెం కలగలిస్తే దానిపేరు తెలుగమ్మాయి.. ఎలియాస్ బాపు బొమ్మ.. అష్ట విధ శృంగార నాయికలు.. బాపు బొమ్మల్లోనే ప్రాణం పోసుకున్నాయి. ఆమె చదివినా అందమే.. అలంకరించుకుంటున్నా అందమే.. కవ్వం చిలికినా.. ముగ్గులల్లినా.. ఆమెలో అంతులేని సౌందర్యాన్ని కుప్పలు తెప్పలుగా కుమ్మరించి.. గీత గీసి, పోత పోసి… ప్రాణమిచ్చిన వాడు బాపు కాక మరెవరున్నారీ లోకంలో..
కళ్లు ఆకాశానికి, కాళ్లు నేలలోకి.. హెచ్చు తగ్గుల్లో అందం ప్రస్థానం.. ఎంత వరకు విస్తరించిందో ఆమెను సృష్టించిన బ్రహ్మయినా చెప్పలేడు.. ఆమె అందానికి అంతా రకరకాలుగా చిరునామాలు వెతుక్కున్నారు.. కళ్లన్నారు.. దొండ పళ్లన్నారు.. నడుమన్నారు.. నాట్యమన్నారు..నడకన్నారు.. కానీ, బాపు బొమ్మలో మాత్రం ప్రతి అణువూ అందమే… ప్రతి కణమూ శృంగార సౌభాగ్యమే.. ప్రతి చిత్రమూ కదిలి వచ్చే కన్నె అప్సరే…

లోకంలో సాధారణంగా కవులు కవితలే రాస్తారు.. కథకులు కథలే రాస్తారు.. కార్టూనిస్టులు కార్టూనులే వేస్తారు.. పెయింటర్లు పెయింటింగ్సే వేస్తారు.. కానీ.. బొమ్మలు, వర్ణ చిత్రాలు, కార్టూనులూ, గ్రాఫిక్ చిత్రాలు.. ముఖ చిత్రాలు, ప్రముఖ చిత్రాలు, శుభలేఖలు, గ్రీటింగ్‌లూ ఇలా అన్నీ వేసి మెప్పించి గెలిచిన వీరుడు బాపు..
ఈ నిశ్చల చిత్రాలతో పాటు.. చలన చిత్రాలను కూడా కల్పించిన సంచలన చిత్రకారుడు బాపు ఒక్కడే.. .. లుక్
ఆ కుంచె పలకరించని వస్తువు లేదు. రచించని చిత్ర రేఖా కావ్యం లేదు.. ఆలపించని రేఖా చిత్ర రాగం లేదు.. నర్తించని రేఖా చిత్ర నాట్య విన్యాసం లేదు గాక లేదు. రాతగీత సంగీత సాగరాల రాజహంస బాపు.. వేలాది చిత్రాలను గీసి.. మధించి.. వాటిలోంచి వెన్నె తీసిన గీతాచార్యుడు బాపు..
పరబ్రహ్మ నుంచి బాల కృష్ణుడు..
ఆది కవి నుంచి అప్పారావు ..
గురజాల నుంచి గొల్లపూడి
నన్నయ్య నుంచి నారాయణ రెడ్డి ..
భగవద్గీత నుంచి భమిడిపాటి..
పొయెట్రీ నుంచి పోర్‌ట్రెయిట్
కార్టూన్ నుంచి కార్ ట్యూన్
దేవతలూ, దానవులూ, నరులూ, వానరులూ
వేదాలు ఉపనిషత్తులూ కావ్యాలూ ప్రబంధాలూ..
కథలూ, కథానికలూ, నాటిక, నాటకాలూ.. నవలలూ.. సినిమాలూ
పిల్లల భారత భాగవతాలు…
ఇంటింటా మెలిగే ఎమెస్కో
పుస్తక దీపాలు -గాలిబ్… గోదాదేవి తిరుప్పావై, వీరజనార్దనం
సీతాకల్యాణం, శ్రీనివాస కల్యాణం, శివపార్వతీ కల్యాణం
గిరీశం, పార్వతీశం, గణపతి, బుడుగు
గంగా గోదారి కావేరీ…
తిరుమల… భద్రాచలం… కోటప్పకొండ దేవస్థానాలు..
ఇలా ఎన్నని చెప్పేది..ఏమని చెప్పేది.. ఎన్ని రాశాడో.. ఎన్ని గీశాడో.. ఎవరడిగినా లేదనకుండా.. కాదనకుండా గీసిచ్చాడు.. ప్రతిగా ఏమీ అడిగిన వాడు కాదు..అవకాశాలు అందివచ్చినా ఆశపడిన వాడు కాదు.. తృణమో.. పణమో.. ఇచ్చింది ఏదో తీసుకుని తృప్తి పడిన వాడు.. తెలుగువారి పుణ్యం కొద్దీ.. తెలుగమ్మాయి అదృష్టం కొద్దీ.. తెలుగు కుంచె పుణ్యమా అని తెలుగువారి రంగుల ప్రపంచాన్ని రసమయం చేయటానికి పుట్టుకొచ్చిన వాడు బాపు..
నేటికి సరిగ్గా 8 దశాబ్దాలకు పూర్వం పుట్టిన వెలుగు మొలక బాపు. ఆ మొలక పుట్టగానే కాంతి పుంజం విచ్చుకుంది. ఆయన చిత్రాలకు హద్దులు లేవు.. ఆయన ఎదుగుదలకు పరిమితులు లేదు.. శ్వాసకు కూడా స్థానం లేనంతగా ఆయన జీవితంలో బొమ్మలు కలిసిపోయాయి. నిశ్చల చిత్రాలుగానే ప్రాణం పోసుకుని చలన చిత్రాలుగా రూపాంతరం చెందాయి. .. లుక్
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 79 ఏళ్ల క్రితం సత్తిరాజు లక్ష్మినారాయణ పుట్టాడు.. ఈ లక్ష్మినారాయణ బాపుగా ఎలా మారాడో తెలియదు కానీ, ఆయన గీత మాత్రం ఆయన్ను తెలుగు చిత్రకళకు.. వ్యంగ్యచిత్రాలకు నిజంగానే బాపును చేసింది.
12ఏళ్ల వయసు నుంచే ఆయన పుస్తకాలకు బొమ్మలేయటం.. ముఖచిత్రాలు గీయటం, మ్యాగజైన్లలో కార్టూన్లు వేయటం వంటివి చేస్తూ వచ్చాడు. వీటితో పాటే కామిక్స్, గ్రీటింగ్ కార్డులు.. సినిమాల పబ్లిసిటీ సంబంధించిన చిత్రాలను కూడా వేస్తూ వచ్చాడు. ఆయన ముగ్గురు సంతానం ఆయన వారసత్వాన్ని తీసుకోకపోయినా, ఆయన మాత్రం ఆజీవన పర్యంతం తన బొమ్మల మధ్యనే గడుపుతున్నాడు.
1960 దశకం అంతా ఓ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలో ఆర్ట్ డైరెక్టర్‌గా ఉన్నాడు.. 1967 నాటికి బాపు బొమ్మలు కదలటం ప్రారంభించాయి.. మాట్లాడటం మొదలెట్టాయి.. పాటలు పాడటమూ నేర్చుకున్నాయి. చిత్రకారుడు బాపు కాస్తా చలనచిత్రకారుడయ్యాడు. తెలుగమ్మాయి అందాలన్నీ ఇదిగో ఇలా చలన చిత్రాలలో చిత్రవిచిత్ర శృంగార రస రాజ్యాల్ని శాసించాయి.
మొత్తం 33 సినిమాలు.. అందులో మూడింటికి జాతీయ పురస్కారాలు.. మరో మూడింటికి రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు.. అంతేనా… 9 హిందీ చిత్రాలూ బాపు గారి ఖాతాలో ఉన్నాయి. అన్నింటినీ మించి తెలుగు టెలివిజన్ చరిత్రలో అజరామరంగా నిలిచిన భాగవతం సీరియల్‌ను 40 గంటల నిడివిలో రూపొందించిన వాడు బాపు.
టిటిడి ఆస్థాన విద్వాన్, రఘుపతి వెంకయ్య, ఆంధ్ర యూనివర్సిటీ కళాప్రపూర్ణ, తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారం, ఎస్‌వి యునివర్సిటీ డాక్టరేట్.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఆయాసం తప్ప అవార్డుల, రివార్డుల లెక్కలకు అంతుండదు.
భద్రాచల రామాలయం, కోటప్ప కొండ దేవాలయాలలో అలంకరణకు ఉచితంగా వర్ణచిత్రాలు గీసిచ్చిన వాడు బాపు. పోతన్న దగ్గరి నుంచి శ్రీనాథుడి దాకా ఆయన పోతపోయని కవి లేడు.. ఈయన గీతలకు వాళ్ల కవిత్వాలు చిత్ర కవిత్వాలుగా మారిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *