మధువుకు పుట్టినిల్లు

lips, red, woman-1690875.jpg

పరువానికి పరదాలేమిటి? ప్రణయానికి తొలి తలుపులు ఏవి? ప్రియురాలికి తలపుల్లో గిలిగింతలు పెట్టేదెవరు? చిరు వణుకుల్లో, మెల్ల మెల్ల మెల్లగా.. అణువణువునూ ఏకం చేసేదెవరు? ముద్దుకు ముద్దరాలు.. చిరునవ్వుల చిలిపి చెలి..దేవతల అమృతంతో తయారైనవి.. మధువుకు పుట్టినిల్లు.. దొండపళ్లు..

అందమైన ముఖానికి
అరవిందం లాంటి ద్వారాలు
ఆ తలుపుల్లో కోటి తలపులు
కనులతో కనులు కలిసినప్పుడు
అవి రెండూ పలకరించుకుంటాయి
ఆహ్వానించుకుంటాయి
ఆకర్శించుకుంటాయి
అతనిని ఆమె దరికి చేరుస్తాయి
ఆమెను అతనిలో లీనం చేస్తాయి
ప్రేమలో మాధుర్యానికి ప్రధానమైంది ఏదంటే టక్కున వచ్చే ఏకైక సమాధానం ముద్దు.. మన్మధలీలలో రాలుగాయి ఎవరంటే అంతా చెప్పే ఒకే మాట ముద్దు. మతిని ఆమడదూరం తరిమేసే మత్తును ఇచ్చేదేమంటే అంతా చెప్పే మాట… ముద్దు.. కానీ, ఆ ముద్దుకు మురిపాల ముంగిళ్లు ఏవి?
అధరం..అధరం మధువులను పంచుకున్నప్పుడు వాటిలోని ఎరుపు రంగు విరిగిపోతుందిట.. అన్ని రంగుల్నీ తనలోకి ఇముడ్చుకుని కౌగిట్లో బంధించి అంతశ్చేతనలోకి ఆహానం పలుకుతుందిట. పరువాల పరదాల్ని తొలగించేది అధరమే.
పాలమీగడ కంటే మెత్తవి..  పూల రెమ్మల కంటే సున్నితమైనవి .. తేనె పలుకులకు అధరమే మధురమైన చిరునామా

దేవతలు సముద్రాన్ని మధించి అమృతాన్ని సాధించుకున్న కథ తెలిసిందే.. కానీ, ఆ తరువాత ఆ అమృతాన్ని చిలకడం మొదలు పెట్టారట. అలా చిలుకుతున్నప్పుడు అందులోంచి వెన్నలాంటి పదార్థం ఒకటి బయటపడింది. ఆ వెన్నతోనే మనిషి పెదాలను సున్నితంగా మలిచాడట బ్రహ్మ. అందుకే అవి అంత సుతిమెత్తగా ఉన్నాయి. అమృతం నుంచి తయారైనవి కాబట్టే అధరాలు మధువును చిలికిస్తున్నాయి.
అతని శ్వాసకు అధరాలు చివురాకుల్లా వణికిపోతాయి. ఆ వణుకు తగ్గేందుకు పెదవి కోరుకునే ఒకే ఒక్క వరం ముద్దు.. పెదవికి సిద్ధాంతాలు లేవు. ముద్దుకు రాద్ధాంతాలు లేవు. ఈ రెంటికీ వావివరుసలున్న బంధువు మధువు. అచ్చమైన అనుభూతులు పరిమితులు దాటి ఆవరించినప్పుడు ఆధరాలు మధుసేవలో లీనమైపోతాయిట.

పెదవి మనిషికి మాత్రమే లభించిన ఏకైక వరం.. ప్రపంచంలో మిగతా జీవజాలంతో పోలిస్తే మనిషికి ఉన్న పెదవులు ప్రత్యేకంగా కనిపిస్తాయి. మిగతా జీవజాలానికి లోపలివైపు ఉండే పెదవులు.. మనకు మాత్రం బయటకు మళ్లి ఉంటాయన్న సంగతిని మీరెప్పుడైనా గమనించారా?

పెదవులు బయటకు మళ్లి ఉండటం వల్లనే మనిషికి అందంగా ముద్దు పెట్టడం చేతనైంది. అధరామృతాన్ని ఆస్వాదించటం సాధ్యమైంది.

నా పెదవులు నీవైతే.. నీ నవ్వులు నేనవుతా..పెదవులు కలిసిన పరువం మనది. నీ అధరాల నుంచి సుధారసాలను గ్రోలుతూ, నరాలను మెలికలు తిరగేసుకున్నాక, నీ పెదవులు ఏ ధ్వని చేసినా, ఆ మధుశాల మధుజ్వాలగా మారిపోతుంది…

రసరాజ్యంలో పెదవికి ఉన్న ప్రాధాన్యం గురించి ఇంతకంటే ఏం చెప్పేది?
ముఖం అందంగా ఉందంటే, దాని గొప్పతనం కళ్లతో పాటు పెదవుల్లోనే ఉంటుంది. కళ్లు చూపులతోనే కట్టిపడేస్తాయి. కానీ పెదవులు.. ప్రణయ సామ్రాజ్యాన్ని ఏలే మధుపాత్రలు..రెండు ఊపిరులను ఒకటి చేసే శక్తి వాటికి మాత్రమే ఉంది.
ముంగురులు, నుదురు, కళ్లు, పెదవులు.. ఈ నాలుగూ మన్మథ సామ్రాజ్యంలో అత్యంత కీలకమైనవని వాత్సాయనుడు చెప్పాడు. అందులో పెదవులకే అగ్రతాంబూలం ఇచ్చాడు.

అందాల రాశి, వెన్నెల కళ్లను కదిలిస్తూ, పాలమీగడల చెక్కిళ్ల పక్కన దొండపండు లాంటి పెదవిని మునిపంటితో సుతిమెత్తగా నొక్కుతూ ఉంటే మైమరిచిపోని వాడు ఉంటాడా? పెదవులపై మునిపంటితో మృదువుగా చేసే గాటుకు వాత్సాయనుడు ప్రవాళమణి అంటూ ముద్దుగా పేరు కూడా పెట్టుకున్నాడు.

పెదవులకు ఎందుకింత ప్రాముఖ్యం వచ్చింది.. కేవలం సుతిమెత్తగా ఉండటమే దీనికి కారణం కాదు. మగవారిలో, ఆడవారిలో కానీ, సెక్సప్పీల్‌లో ముఖ్యమైంది పెదవులే. శరీరానికి సరికొత్త అనుభవాలను తొలుత కలిగించేవి ఇవే. పెదవులు కదిలినప్పుడు, సన్నగా వణుకుతున్నప్పుడు కార్డిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది ఒకరకమైన వశీకరణ హార్మోన్ లాంటిది.. ఇష్టమైన వాళ్లను మరింత దగ్గరకు చేర్చే అద్భుతమైన అనుభవం అధరం. చేతులు కలవటం.. పెదవులు కలవటం వల్ల ప్రేమికుల్లో ఒత్తిడి క్రమంగా పెరుగుతూ వస్తుంది.

అధర చుంబనం వల్ల టెస్టొస్టిరిన్ అనే హార్మోన్ ప్రియుడి నుంచి ప్రియురాలికి బదిలీ అవుతుంది. దీనివల్ల ఇద్దరి మధ్య రసస్ఫూర్తి మరింతగా పెరిగిపోతుంది. మృదు సుగంధం లాంటి ఆ ఆస్వాదన అమూల్యం.

పెదవులను రెంటినీ ఒక దగ్గరకు తీసుకుని వచ్చేది ఆర్బిక్యులారిస్ ఓరిస్ అనే ఓ కండరం. దీన్ని కిస్సింగ్ మజిల్ అంటారు. పెదవులు రెండూ కలిసి ముద్దుల ముచ్చట్లు తీరుస్తున్నప్పుడు ముఖంలోని 34 కండరాలూ కదిలిపోతాయి. 112 ఇతర కండరాలు కూడా ఈ సమయంలో పనిచేస్తాయి. ఇదే సమయంలో శరీరంలోని డోపామెన్ అనే రసాయనం బ్రెయిన్‌లో ఉత్పత్తి అవుతుంది. ఇది పెరుగుతున్న కొద్దీ శరీరానికి నిద్ర పట్టదు..ఆకలీ మందగిస్తుంది.. ప్రేమకు ప్రధాన లక్షణాలు ఇవే.

ఇంత అందాల రాశులైన పెదాలను కాపాడుకోవటం పెద్ద సవాలే.. అధరం నుంచి వెల్లడయ్యే మధురానికి ఎలాంటి సిద్ధాంతాలు లేకపోవచ్చు. కానీ, అ మధురాధరాలకు మాత్రం సిద్ధాంతాలు ఉన్నాయి. అమరిక ఎలా ఉన్నా, అందంగా కనిపించేందుకు.. ఆకర్శించేందుకు అధరం ఖచ్చితంగా ఓ మధుశాలగా కనిపించాల్సిందే.. ఇందుకు ఏం చేయాలి..?
అందంగా కనిపించటం ఎలాగో ఆడవాళ్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. కానీ, శరీరంలో అత్యంత కీలకమైనవి.. శృంగారానికే కాకుండా, మన మాటకూ, మన చేతకూ కూడా ముఖ్యమైన భాగం.. అన్నింటిలోనూ అతి సున్నితమైన విభాగం అధరం. ఇది నిజంగా గాజుబొమ్మ. మిగతావేవి ఎలా ఉన్నా అధరాలు అదిరేలా అదురుతూ ఉంటేనే అసలైన అందం బయటకు వ్యక్తమయ్యేది.

సమ్మర్.. పెదాలు పొడిపొడిగా ఉండే కాలం. వీటిని వెట్‌గా ఉంచుకోవటం పెద్ద సమస్య. దీనికి తోడు వీటిని సౌందర్యాన్ని అద్దే కాస్మొటిక్స్‌ను ఎంపిక చేసుకోవటంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం. పెదాలను అందంగా మెరిపించేందుకు ఈ కాస్మొటిక్స్‌లో వాడే ఫాట్ ఇన్‌గ్రెడెంట్స్ కారణం. లిప్‌స్టిక్ తీసుకునే ముందు ఈ ఇన్‌గ్రెడెంట్స్ ఏమిటన్నది గమనించటం ముఖ్యం. మనం ఏదైనా తినేప్పుడు లిప్‌స్టిక్ కరిగిపోకుండా ఉండాలి. లేకుంటే అధరంలోని అమృతం కాస్తా హాలాహలంగా మారుతుంది.

పెదాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి
క్లీనింగ్‌కు కాటన్ మాత్రమే వాడాలి
పచ్చి పాలతో క్లీన్ చేసుకోండి
ఆ తరువాతే లిప్‌స్టిక్ వేసుకోవాలి
నిలుచుని లిప్‌స్టిక్ వేసుకోకండి
అది పరుచుకునిపోతుంది
పై పెదవి తరువాత కింది పెదవికి వేసుకొండి
లిప్‌స్టిక్ పై లిప్‌గ్లాస్ వాడండి
అధరాలు అదిరిపోయేలా తయారవుతాయి

రొమాంటిక్ టచ్‌లో ఉంటేనే అధరాలకు అందం.. చూసే వారికి ఆనందం. ఇందుకోసం అధరాలు హద్దులు దాటాలి.. లిప్‌స్టిక్‌తోనే వాటి హద్దులు విస్తరిస్తాయి.
శరీర సౌష్టవాన్ని బట్టి లిప్‌స్టిక్ ఉంటేనే ముద్దూముచ్చట.. ముఖానికి తగినట్లుగా ఉంటేనే లిప్స్‌కి హాట్ టాక్ వచ్చేది.

పరువం చేసే.. అల్లరి హద్దులను చెరిపేసి… ఆనందాల అనుభూతుల్ని … అంచులను దాటి అందించే అధరాలకు… మందారం రంగు అద్దుకుంటే… సూరీడు కంటే అందంగా తయారవుతాయంట. వాటిని చూస్తే సూరీడు కూడా చల్లబడిపోయి, అతని ఎరుపంతా వెన్నెల తెలుపవుతుందిట. ఆ తెలుపు మల్లెలై, ఆ మత్తు మధువై, ఆ మధువు పందిరిమంచంపై మధురఘాతాలు చేస్తాయి. అందుకే అవి మధువుల్ని పంచుకుంటాయి. మనసుల్ని లీనం చేసుకుంటాయి. ఏ వర్ణనలకూ అవి అందవు కాబట్టే అంతా అంటారు అధరం అదుర్స్ అని..

కోవెల సంతోష్ కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *