అశ్రు కావ్యము

శ్రీ దావూద్

నిజమనోవ్యథ లన్నియు న్ని దురఁ గూర
నేడు సుఖపరవశులయి నెగడుచున్న
వారి కిప్పట్ల దొఱకదు తీరి కపుర
యలతి మముబోంట్ల కరుణగాథలు వినంగ,

పూర్ణిమాచంద్రుతోడ సముద్రమునకు
బరిచయ మ్మెట్టు లొదవెనో యెఱుకవడదు
కిరణపుంజము పయినుండి యరుగు దేర
దరగపిండును గౌఁగిలింతలకుఁ దారు

వెక్కిలింతలతో నేడ్చి వెండి వెండి
నేను నాకరుణాగాథ నెమరు వేయ
వినియు వినని తెఱంగున వెలఁది నీవు
సుమములం గిల్లు నెపమునఁ జూచె దకట !

అస్మదీయకుటీర సీమాంగణమున
నాక్రమించెను బ్రళయాబ్ద మట్టె వచ్చి
గాఢ విరహము వ్యాపింపఁ గాంచి వికృతి
యంధతామసి హృదయాన నలమి కొనియె.

ఎన్ని నిర్జనరజనులం దేను జుక్క
సెమ్మెల న్వెలిగించి చూచితిని నిన్ను
స్వాగత మొసంగు నుపహారసరణి నీకుఁ ,
గడకు మందాకినీధార విడిచి నాఁడ.

నాకు మిధ్యగఁ దోచు నీనగ్నజగతి
నవుర | చిరసత్యసుందరం బై తి వీవు
దేవి జీవనసంగి వై కేవలమ్ము
కలితకల్యాణసౌఖ్యమార్గమున నుంటి

శశివదనమున వలిపెమున్ సవదరించి
యంచలముచాటు దీపము నుంచి నాదు
బ్రదుకు గోధూళి వేళకుం బ్రాకినపుడు
పరమకౌతుకహృదయాన వచ్చి తీవు

ఘనమునన్ శ్రావ్యసుందర గర్జపగిది
గర్జలోఁ జంచలాచలత్కాంతిమాడ్కి
కనులలోని కనీనికాకరణిఁ గంటి
పాపలో శ్యామకాంతినా వచ్చి తీవు.

ప్రతిమయందున జీవంబుపగిది నాదు
కనుల భవదీయసౌందర్యగరిమ నిల్చె
నొక్క సుందర రేఖగా నున్న దదియ
లక్ష సంఖ్యలఁ బ్రత్యేక లక్ష్య మట్లు

సరసతావకపావనస్పర్శ నంది
శీతలానిలములు నన్ను జెనకునపుడు
ఆశ్రుధారల గురియించి యనవరతము
నేను భయమునఁ గంపింపఁ బూనుచుందు

నాకనులటెప్ప వ్రాల్ప కానందవశత
నాయనంత సౌందర్యము నరసి మురిసి
ప్రతిభమెయి దాని గొని తెచ్చి భద్ర మనుచు
సుకవి కర్పింతు నే మహోత్సుకత మెఱయ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *