టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా.. అట్లూరి తడాఖా

రంగావఝల భరద్వాజ

తెలుగు నిర్మాతల తడాఖా బాలీవుడ్ దాకా చాటిన నిర్మాతల్లో అట్లూరి పూర్ణచంద్రరావు ఒకరు. తొమ్మిది భాషల్లో సినిమాలు తీశారు. పదో తరగతి తో చదువుకు స్వస్థిచెప్పిన అట్లూరి పూర్ణచంద్రరావు జీవితంలో చాలా పెద్ద విజయాలే సాధించారు. అరుదైన రికార్టులూ నెలకొల్పారు. చాలా మంది కెరీర్ లను మలుపు తిప్పారు. ఎందరికో జీవితాన్ని ప్రసాదించారు.

ప్రతి ఒక్కరిలోనూ నిగూఢమైన శక్తి ఉంటుంది. అది బయటపడ్డప్పుడే తెలుస్తుంది. ఈలోపు మనం అనేక కొలబద్దలు పెట్టి దాన్ని కొలిచే ప్రయత్నం చేస్తాం. ఎందుకూ పనికిరారని ఒక్కోసారి జడ్జిమెంట్లూ పాస్ చేసేస్తుంటాం. కానీ అలాంటి వారే అపురూప విజయాలు సాధించి కొలబద్దలకు సవాల్ విసురుతూ ఉంటారు. అలాంటి అరుదైన విజయసారధి అట్లూరి పూర్ణచంద్రరావు. కృష్ణాజిల్లా చౌటుపల్లి గ్రామంలో పుట్టిన పూర్ణచంద్రరావు దేశంలో తొమ్మిది భాషల్లో చిత్రాలు నిర్మించి విజయబావుటా ఎగరేయగలని ఆ రోజు ఎవరూ ఊహించలేదు.
ప్రముఖ దర్శక నిర్మాత ఉప్పలపాటి విశ్వేశ్వర్రావు గుడివాడలో కొంతకాలం జ్యోతి ట్యుటోరియల్స్ నిర్వహించారు. అందులో చదువుకున్నారు అట్లూరి పూర్ణచంద్రరావు. పదోతరగతి ఫెయిల్ కావడంతో ఇక లాభం లేదనుకుని బెజవాడ వచ్చేశారు. నిజానికి ఆత్మహత్య చేసుకుందామని కృష్ణానది దగ్గరకు వచ్చి అక్కడే ఓ కాంట్రాక్టర్ దగ్గర 27 రూపాయల జీతానికి పనిలో చేరారు. ఆ తర్వాత అనుకోకుండా…నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ లో రిప్రెజెంటెటివ్ గా ఎదిగారు. ఆ తర్వాత అదే నవయుగ గుంతకల్ బ్రాంచ్ మేనేజర్ గా విజయపథంలో తొలి మజిలీ చేరుకున్నారు.
ఈ ప్రయాణంలో కొంతకాలం గుడివాడ గౌరీశంకర్ థియేటర్ లోనూ, విజయవాడ రామాటాకీస్ లోనూ ఆపరేటర్ గా అనుభవం గడించారు పూర్ణచంద్రరావు. బుక్కింగు క్లర్కుగా కూడా అప్పుడప్పుడూ వ్యవహరించారు. నవయుగ గుంతకల్ మేనేజర్ గా ఉండగా తాతినేని ప్రకాశరావు దగ్గర అసిస్టెంట్ గా చేరడం కోసం మద్రాసు రైలెక్కేశారు. విఠలాచార్య, పి. పుల్లయ్యల దగ్గర పనిచేశారు. దేవదాసు నిర్మాత డి.ఎల్.నారాయణ, ఎస్.భావనారాయణల ప్రోత్సాహంతో ప్రొడక్షన్ లైన్ లోకి వచ్చి బెజవాడ నవభారత్ బుక్ హౌస్ ప్రకాశరావు గారిని భాగస్వామిగా చేసుకుని అగ్గిమీద గుగ్గిలం తీశారు.
జానపదాల హీరో కాంతారావు నటించిన అగ్గిమీద గుగ్గిలం సినిమా ఓ మోస్తరు విజయం సాధించి లాభాలు తెచ్చింది. ఆ తర్వాత అపాయంలో ఉపాయం, గజదొంగ గంగన్న.ఉక్కుపిడుగు లాంటి సినిమాలు తీశారు పూర్ణచంద్రరావు. అదే టైమ్ లో అసిస్టెండ్ డైరక్టర్ గా పనిచేసే కాలంలో స్నేహం కలిసిన కె.ఎస్.ఆర్ దాస్ డైరక్షన్ లో రౌడీరాణి తీశారు. రికార్టు స్థాయిలో పాతిక లక్షల వసూళ్లు సాధించిందా సినిమా.
స్వతహాగా నాడియా టైప్ సినిమాలంటే మోజు ఉన్న పూర్ణచంద్రరావు డెత్ రైడ్స్ ఎ హార్స్ సినిమా కథను హీరోయిన్ కు అన్వయించి రౌడీ రాణి అన్నారు. ఎన్.టి.ఆర్ రెండు వందలో సినిమా కోడలు దిద్దిన కాపురం సినిమా మీద రిలీజ్ చేసిన రౌడీరాణి భారీ విజయం సాధించడం కాదు…పూర్ణచంద్రరావు బాలీవుడ్ ప్రవేశానికి రంగం సిద్దం చేసింది.
సినిమా మేకింగ్ లోనూ, ప్రమోషన్ లోనూ కొత్త పంథా అనుసరించడం అట్లూరి పూర్ణచంద్రరావు ప్రత్యేకత. రీమేక్ కు అవకాశం ఉన్న కథలను ఆయన ఎంపిక చేసుకునేవారు. మాస్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి అంచనా కట్టేవారు. అక్కినేనితో రైతుకుటుంబం లాంటి సినిమా తీసినా ….పూర్ణచంద్రరావుకు భారీగా పేరు తెచ్చిన సినిమా మాత్రం పాపం పసివాడు.
పాపం పసివాడు లాస్ట్ ఇన్ ద డిజర్ట్ అనే ఇంగ్లీష్ మూవీ ఆధారంగా తీసిన చిత్రం. అంత భారీగా తీయాల్సిన అవసరం లేదని సన్నిహితులు హెచ్చరించినా పూర్ణచంద్రరావు వినలేదు. ప్రత్యేకంగా ఆ సినిమా కోసం ఓ ఛార్టర్ ప్లేన్ కొన్నారు. రాజస్థాన్ ఎడారిలో తీశారు. స్టార్స్ లేకుండా కలర్ తో చిత్రీకరణ జరిపారు. ఈ దెబ్బతో అయిపోయాడు అన్న వాళ్లంతా ఖంగు తినేలా సినిమా బ్రహ్మాండమైన విజయం సాధించింది. సినిమా కోసం కొన్న ప్లేన్ లోనే ఊరూరా కరపత్రాలు జల్లారు. జనం వింతగా చెప్పుకున్నారు. ప్రమోషన్ ఎంత కొత్తగా డిజైన్ చేస్తే సినిమా అంత హిట్ అవుతుందని ప్రూవ్ చేశారు. స్టార్ హీరోలు లేకుండా… డ్యూయెట్స్ లేకుండా కేవలం అమ్మ ఒడి చేరేందుకు ఓ తప్పిపోయిన పిల్లాడు పడే ఆవేదన ఆధారంగా రెండున్నర గంటల సినిమా నడపడం మామూలు విషయం కాదు… ఆ ఫీట్ సక్సస్ ఫుల్ గా చేశారు డైరక్టర్ రామచంద్రరావు. కృష్ణ తీసిన మోసగాళ్లకు మోసగాడు సినిమాయే తనను పాపం పసివాడు తీయడానికి పురిగొల్పిందనేవారు పూర్ణచంద్రరావు. అందులో ఆత్రేయ రాసిన అమ్మా చూడాలి..నిన్నూ నాన్నను చూడాలి పాట ఎవర్ గ్రీన్ హిట్ . సత్యం ట్యూన్, సుశీల గానం అద్భుతం.
ఆ తర్వాత శోభన్ తాతినేని రామారావు కాంబినేషన్ లో రాజువెడలె, దేవుడు చేసిన పెళ్లి లాంటి చిత్రాలు తీశారు. మురళీమోహన్ ను హీరోగా పరిచయం చేస్తూ జగమే మాయ తీశారు. ఈ అన్ని సినిమాలూ యావరేజ్ గానే నడిచాయి. అదే టైమ్ లో ఎన్.టి.ఆర్ సూపర్ హిట్ యమగోల బాలీవుడ్ లో లోక్ పరలోక్ పేరుతో రీమేక్ చేశారు పూర్ణచంద్రరావు. ఆ సినిమా పెద్ద హిట్ కొట్టింది. ఆ తర్వాత వరసగా బాలీవుడ్ రీమేక్స్ తో బిజీ అయిపోయారు. అలాంటి సయమంలో ఎస్.ఎ.చంద్రశేఖర్ తో తమిళ, తెలుగు భాషల్లో చట్టానికి కళ్లు లేవు చిత్రాన్ని నిర్మించారు.
చట్టానికి కళ్లు లేవు తమిళ్ లో రజనీకాంత్ చేసిన కారక్టర్ ను తెలుగులో చిరంజీవి చేశారు. ఈ సినిమాతోనే చిరంజీవి సూపర్ స్టార్ కృష్ణకు సవాల్ విసిరారు. అప్పటి వరకు క్రైమ్ నేపధ్యంలో వచ్చిన చిత్రాలు చేయాలంటే కృష్ణే చేయాలనే వాతావరణం ఉండేది. చట్టానికి కళ్లు లేవుతో ఆ ఏరియాలోనూ జండా ఎగరేశారు చిరంజీవి.
తెలుగు, తమిళ, హిందీ భాషలతో పాటు అనేక ఇతర భాషల్లోనూ చిత్రాలు నిర్మించారు పూర్ణచంద్రరావు. మొత్తం తొమ్మిది భాషల్లో 82 చిత్రాలు తీశారు. కాంతారావుతో మొదలు పెట్టి రవితేజ దాకా అనేక మంది హీరోలతో సినిమాలు తీసిన నిర్మాత రామానాయుడు తర్వాత పూర్ణచంద్రరావు ఒక్కరే. అందుకే టాలీవుడ్ చరిత్రలో ఆయనదో ప్రత్యేక అధ్యాయం.
బాలీవుడ్ లో పూర్ణచంద్రరావు తీసిన సినిమాలన్నీ పెద్ద హిట్సే. ఏక్ హీ భూల్, మాంగ్ భరో సజనా. అంధాకానూన్ , చాల్ బాజ్, ఆఖరీ రాస్తా ఇలా అనేక చిత్రాలు సూపర్ డూపర్ హిట్స్ కొట్టాయి. హిందీ సినిమాలతో బిజీగా ఉంటూనే అడపాదడపా తెలుగులోనూ సినిమాలు తీశారు. ఆజ్ కీ ఆవాజ్ సినిమాను రజనీకాంత్, సుమన్ లతో తెలుగులో తీసి సక్సస్ కొట్టారు. కొత్త టెక్నీషియన్స్ ను ఎంకరేజ్ చేయడంలోనూ, కొత్త టాలెంట్ ను ఐడెంటిఫై చేయడంలోనూ అట్లూరి పూర్ణచంద్రరావు చాలా స్పెషలు. ప్రస్తుతం కోలీవుడ్ లో టాప్ హీరోగా వెలుగుతున్న అజిత్ హీరోగా గొల్లపూడి మారుతీరావు కుమారుడు శ్రీనివాస్ డైరక్షన్ లో సినిమా ప్రారంభించారు పూర్ణచంద్రరావు. ప్రేమపుస్తకం పేరుతో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే డైరక్టర్ శ్రీనివాస్ మ్యుత్యువాత పడ్డారు. అయినా సినిమా పూర్తి చేసి విడుదల చేశారు. ఆ తర్వాత ఎందుచేతో పూర్ణచంద్రరావు తెలుగు చిత్రాలకు దూరమయ్యారు.
తమిళ, మళయాళ, మరాఠీ, ఒడియా భాషల్లో సైతం సినిమాలు తీసిన అట్లూరి పూర్ణచంద్రరావు ప్రేమపుస్తకం తరవాత సినిమాలకు దూరం జరిగారు. నోయిడా లో వీడియో స్టూడియో నిర్వహణ కూడా భారం అయిపోయింది. నెమ్మదిగా అది టీ సిరీస్ వాళ్లకి అమ్మేసి ఊటీలో స్థిరపడిపోయారు పూర్ణచంద్రరావు. కానీ కాలం ఎల్లకాలం ఒక్కలా ఉండదు. ఆయన మళ్లీ ముందుకు వచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్ సక్సస్ ఫుల్ గా ఆడారు.
ఓ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ ఉన్నట్టుండి సినిమాలు తీయడం మానేసింది. అట్లూరి పూర్ణచంద్రరావు ఎందుచేతో సినిమాల పట్ల విరక్తి చెందారు. తన సినిమాల హక్కులు అమ్మేశారు. నోయిడాలో ఉన్న స్డూడియో టీ సిరీస్ వాళ్లకి అమ్మేశారు. ఫ్యామ్లీతో వెళ్లి ఊటీలో సెటిలయ్యారు. ఆ టైమ్ లో అనుకోకుండా రామోజీరావు కలసి మళ్లీ సినిమాలు తీయమని కోరడంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్ లో వెంకీ తీశారు.
చిత్ర ఇతివృత్తాన్ని అనుసరించి అది భారీ బడ్జెట్‌తో నిర్మించాలా, లో బడ్జెట్‌లో నిర్మించాలా అనే అంశంపై నిర్ణయం తీసుకుని చిత్ర నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించే తత్వం అట్లూరి పూర్ణచంద్రరావుది. వెంకీ లాంటి సక్సస్ ఫుల్ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అట్లూరి పూర్ణచంద్రరావు ఆ వెంటనే తేజ డైరక్షన్ లో ఔనన్నా…కాదన్నా నిర్మించారు.
మనీ లాంటి సక్సస్ ఫుల్ ఎంటర్ టైనర్లు తీసిన శివనాగేశ్వర్రావు కాంబినేషన్ లో మిష్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి తీశారు. లైలా, శివాజీ జంటగా నటించిన ఈ సినిమా కూడా ఓ మోస్తరుగానే ఆడింది. నిర్మాతకు నష్టాలు తెచ్చే సినిమాలు పూర్ణచంద్రరావు ఎన్నడూ తలకెత్తుకోలేదు. తను సేఫ్ గా ఉండాలి. తనను నమ్ముకున్న వారూ క్షేమంగా ఉండాలనే తత్వం ఆయనది. అందుకే ఆయన చిత్రాలన్నీ పెద్ద ఎంటర్ టైనర్లుగా మిగిలిపోయాయి.

One thought on “టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా.. అట్లూరి తడాఖా”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *