డూండీ సినిమాలు.. ట్రెండ్ సెట్లు

రంగావఝల భరద్వాజ

టాలీవుడ్ చరిత్రలో పోతిన డూండేశ్వర్రావు అనే పేరుకు ఓ ప్రత్యేకత ఉంది. అనేక సంచలనాలు ఆ పేరుతో లింకై ఉన్నాయి. టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ అన్నీ ఆయన రూపకల్పనలో తయారైనవే. మాస్ మూవీస్ ను క్లాసిక్ రేంజ్ లో నిర్మించడం డూండీ స్టైల్. ఆయన ఏం చేసినా ఓ స్పెషాల్టీ ఉండేది. తొలిరోజుల్లో రాజ్యలక్ష్మీ ఫిలింస్ పేరుతోనూ…ఆ తర్వాత త్రిమూర్తీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీదా డూండీ నిర్మించిన చిత్రాల విశేషాలు మీకోసం
డూండీ పేరు వినగానే తెలుగు సినీ అభిమానుల హృదయాల్లో బోల్డు  మధుర జ్నాపకాలు. హిట్ మ్యూజిక్, హిట్ కాంబినేషన్స్, హై వోల్టేజ్ ఎమోషన్స్ , కళ్లు చెదిరే సెట్స్…అదిరిపోయే ఫైట్స్ …ఇవన్నీ ఒకే చిత్రంలో కలబోసుకుని ఉన్నాయంటే అది ఖచ్చితంగా డూండీ చిత్రమే. మాస్ టూ క్లాస్ అన్ని తరగతుల ప్రేక్షకులనూ ఏకకాలంలో మెప్పించినవి డూండీ చిత్రాలు.
డూండీగా పాపులర్ అయిన పోతిన డూండీశ్వర్రావు తెలుగు తెర మీద అనేక ప్రయోగాలు చేశారు. సినిమా కు సంబంధించినంత వరకు నిర్మాత అంటే జస్ట్ డబ్బులు అరేంజ్ చేసేవాడు మాత్రమే కాదు…సగం సినిమాకు తనే క్రియేటర్ అని చాటిన నిర్మాతల్లో డూండీ ఒకరు. అందుకే డూండీ తీసిన సినిమాలన్నీ ఆయన స్టైల్లోనే ఉంటాయి. డైరక్టర్ ఎవరైనా…అవి డూండీ సినిమాలుగానే చలామణీ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి సినిమా హాల్ విజయవాడ మారుతీ టాకీస్. దాని యజమాని పోతిన శ్రీనివాసరావు కుమారుడే డూండీ. మారుతీ ధియేటర్ చమ్రియా అనే డిస్ట్రిబ్యూటర్ కాంట్రాక్ట్ లో ఉండేది. చమ్రియా కంపెనీ యజమాని సుందర్ లాల్ నహతా. ఆయనతో పరిచయమే డూండీని సినిమా నిర్మాణంలోకి నడిపింది. అలా 1956లో జయం మనదే సినిమాతో నిర్మాణరంగంలోకి అడుగు పెట్టారు.
రాజశ్రీ ఫిలింస్ తారా చంద్ బర్జాత్యా తో చమ్రియా ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న సుందర్ లాల్ నహతాకు సాన్నిహిత్యం ఉండడంతో జయం మనదేకు తారాచంద్ కూడా భాగస్వామిగా వ్యవహరించారు. రాజశ్రీ బ్యానర్ మీద ఎన్.టి.ఆర్ హీరోగా నిర్మాణమైన జయంమనదే చిత్రానికి తాతినేని ప్రకాశరావు డైరక్టరు. మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్ అయిన ఈ మూవీకి ఘంటసాల సంగీతం అందించారు.
ఆ తర్వాత బర్జాత్యా లేకుండా సుందర్ లాల్ నహతా, డూండీ కలసి చిత్ర నిర్మాణం ప్రారంభించారు. నిర్మాతగా సుందర్ లాల్ నహతా పేరుండేది గానీ…వ్యవహారం అంతా సహనిర్మాత డూండీనే నిర్వహించేవారు. బ్యానర్ పేరు శ్రీ ప్రొడక్షన్స్ అని పెట్టుకున్నారు. అశ్వర్థ్ నారాయణ కూడా భాగస్వామిగా ఉండేవారు. జయం మనదే తర్వాత శ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సతీఅనసూయ తీశారు. ఆ తర్వాత అక్కినేని హీరోగా శాంతి నివాసం తీశారు.
శాంతి నివాసం సినిమా కథ డూండీ తయారు చేసిందే. 1940లోనే దేశ విభజన కన్నా చాలా ముందే… భారతదేశం వదిలి పాకిస్తాన్ వెళ్లిపోయిన యూసుఫ్ అనే ఫిలింమేకర్ తీసిన ఐనా హిందీ సినిమా ఆధారంగా ఈ కథ తయారైంది. సినిమా నిడివి 21 వేల అడుగులు వచ్చింది. ఒక్క సీన్ కూడా కట్ చేయడానికి వీల్లేదని డైరక్టర్ సిఎస్ రావు పట్టుపట్టారు. డూండీ మాత్రం డోంట్ కేర్ అంటూ 16,500 అడుగులకు కట్ చేసి రిలీజ్ చేశారు. సినిమా సూపర్ హిట్ అయింది.
డూండీ చదువు పూర్తైన కొత్తలో ఓ సారి విజయా స్టూడియోస్ కి వెళ్లారట. నాగిరెడ్డి పిల్చి రంజన్ నటించిన నీలమల్లై తిరుడాన్ సినిమా చూపించారు. ఎలా ఉందంటే బాగుందన్నారు డూండీ. అయితే ఈ సినిమా పాతిక వేలకు ఇస్తాను. డబ్ చేసుకో అని ఆఫర్ ఇచ్చారు నాగిరెడ్డి. ఓకే అని దాన్నే కొండవీటి సింహం పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసి సక్సస్ అయ్యారు డూండీ. డూండీ ఏం చేసినా డిఫరెంట్ గా చేసేవారు. విజయం సాధించేవారు.
సుందర్ లాల్ నహతాతో కల్సి చాలా సినిమాలే తీశారు డూండీ. ఎన్.టి.ఆర్ తో శభాష్ రాముడు, మంచి మనిషికి మంచి రోజులు… అక్కినేనితో శభాస్ రాజా సినిమాలు తీశారు. బయట సినిమాలు డైరక్ట్ చేయని భరణీ రామకృష్ణతో శభాష్ రాజా డైరక్ట్ చేయించారు డూండీ. అలా అక్కినేని, రామకృష్ణలు హిట్ పెయిర్ గా ప్రూవ్ చేశారు.
మాసీ కథలను క్లాసీగా తీయాలనేది డూండీ అభిప్రాయం. ఈ ఒపీనియన్ లోంచి వచ్చిన కథే బందిపోటు. అప్పటి వరకు వచ్చిన జానపదాలకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది బందిపోటు ట్రీట్ మెంట్. కృష్ణా జిల్లా కు చెందిన త్రిపురనేని మహారథిని తీసుకువచ్చి ఈ సినిమాకు డైలాగ్స్ రాయించారు. పాటలు కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి. ఘంటసాలతో ఓ ప్రత్యేకరాగంలో ఊహలు గుసగుసలాడే పాట చేయించారు. బందిపోటు తో శ్రీ ప్రొడక్షన్స్ స్థానంలో రాజ్యలక్ష్మీ కంబైన్స్ వచ్చి చేరింది.
తమిళ్ లో సూపర్ హిట్ అయిన పాశమలార్ సినిమాను తెలుగులో తీయాలని నిర్ణయించారు డూండీ. ఎన్.టి.ఆర్ సావిత్రి అన్నా చెల్లెళ్లు అని డిసైడ్ అయ్యారు. చాలా మంది కాదన్నారు. డూండీ వినలేదు. రచయితగా ముళ్లపూడి వెంకటరమణని డిసైడ్ అయ్యారు. సాక్షాత్తు ఎన్టీఆరే వద్దు…సముద్రాల జూనియర్ ని పెడదామన్నారు. డూండీ వినలేదు. సినిమా రిలీజై హిట్ అయ్యాక ఎన్టిఆర్ తో సహా అందరూ డూండీయే కరెక్ట్ అనేశారు.
ఎన్.టిఆర్ తోనే గుడిగంటలు తీశారు డూండీ. ఆ సినిమా కూడా పెద్ద హిట్. అదీ తమిళ రీమేకే. రీమేక్స్ అయితే మినిమమ్ గ్యారంటీ అని భావించేవారు డూండీ. తెలుగు నేటివిటీకి పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం లేకుండా ఉండే తమిళ సినిమాలనే సెలక్ట్ చేసుకునేవారు. సంగీతంతో సహా దాదాపు యధాతధంగా తీసేయమనేవారు. సాధ్యమైనంత వరకు వి. మధుసూధనరావు దర్శకుడు. ఘంటసాల సంగీత దర్శకుడు.
జానపదాలను డిఫరెంట్ గా ప్రజంట్ చేసిన డూండీనే జానపదాల ట్రెంట్ ను మార్చాలని డిసైడ్ అయ్యారు. ప్రత్యామ్నాయంగా యాక్షన్ ఓరియంటెడ్ జేమ్స్ బాండ్ సినిమాలను బరిలోకి దింపారు. విజయం సాధించారు. అప్పుడే తేనె మనసులు, కన్నెమనసులు చిత్రాల్లో నటించిన కృష్ణను పిల్చి గూఢచారి 116 సినిమా తీశారు డూండీ. హాలీవుడ్ లో ఓ ఊపు ఊపుతున్న బాండ్ ను 1966లో తెలుగు తెర మీదకు దిగుమతి చేసి అద్భుత విజయం సాధించారు.
మల్లిఖార్జునరావు డైరక్ట్ చేసిన గూఢచారి 116 సినిమాలో ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ ఓ పాత్ర పోషించారు. చలపతిరావు ఓ క్లబ్ సాంగ్ కు ముందు కనిపించి చిన్న ఇంట్రడక్షన్ ఇస్తారు. డీరి డీరి డిరి డీ అంటూ ఘంటసాలతో న్యూవేవ్ సాంగ్ పాడించారు. ఇలా చాలా స్పెషాల్టీస్ ఉన్నాయీ సినిమాలో.
గూఢచారి 116 క్రిష్ణకు సరిగ్గా మూడో సినిమా. అప్పటికి కన్నెమనసులు యావరేజ్ అయ్యిందనే నిస్ప్రహలో ఉన్నారు కృష్ణ. అలాంటి టైమ్ లో వచ్చిన ఆఫర్ కు ఎగిరి గంతేశారు. తను కూడా జేమ్స్ బాండ్ సినిమాలు చూసి ఉండడంతో మరింత హ్యాపీ అయ్యాడు. సినిమా విడుదలై భారీ విజయం సాధించింది.
అంతే గూఢచారి 116 సక్సస్ చూసి చాలా మంది మాస్ నిర్మాతలు దర్శకులు కృష్ణ వెంటపడ్డారు. యాక్షన్ ఓరియంటెడ్ బాండ్ మూవీస్ కోసం కథలను తయారు చేయమని రైటర్స్ మీద బోల్డు ప్రజర్ పెట్టేశారు. అలా కృష్ణ యాక్షన్ హీరోగా ఓ ట్రెండ్ సెట్ చేశారు.
బాండ్ మూవీ సక్సస్ తర్వాత కైకోడుత్త దైవం సినిమాను తెలుగులో ఎన్.టి.ఆర్ హీరోగా మరపురాని కథ టైటిల్ తో సినిమా తీయాలనుకున్నారు డూండీ. కుదరలేదు. అదే సినిమాను కృష్ణతో తీశారు. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలు వేస్తున్న వాణిశ్రీని మరపురాని కథతో పూర్తి స్థాయి హీరోయిన్ గా పరిచయం చేశారు డూండీ. ఆ తర్వాత వాణిశ్రీ వెనక్కు తిరిగి చూడలేదు.
మరపురాని కథ తర్వాత డూండీ తన ఫోకస్ బాలీవుడ్ కి షిఫ్ట్ చేశారు.ఫర్జ్, మౌసమ్ లాంటి సినిమాలు తీసి అక్కడా జండా ఎగరేశారు.డూండీ సెలక్షన్ కూడా డిఫరెంటే..కమ్యునిస్ట్ పార్టీ నుంచి వచ్చిన వి.మధుసూదనరావును సతీతులసి అనే పతివ్రత కథతో దర్శకుడుగా పరిచయం చేశారు డూండీ. ఆయనతోనే వీరాభిమన్యు తీయించారు.
డూండీ కెరీర్ లో ఓ స్పెషల్ సినిమా వీరాభిమన్యు. శోభన్ బాబును అభిమన్యుడు పాత్రకు తీసుకుని కమ్యునిస్ట్ గా ముద్ర పడ్డ వి. మధుసూధనరావును డైరక్టర్ గా పెట్టి ఓ పౌరాణికం తీయడం గొప్ప సాహసం. నిజానికి వీరాభిమన్యుకు పింగళిని మాటలు రాయమని అడిగారు డూండీ. కమలాకరను డైరక్టర్ గా పెట్టుకుంటే రాస్తాననడంతో వద్దనుకున్నారు. అదిగో నవలోకం లాంటి వీరాభిమన్యు పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.
టెక్నికల్ గా తన సినిమాలు ఎవరూ వేలు పెట్టని స్టైల్ లో ఉండాలని బలంగా కోరుకునేవారు డూండీ. వీరాభిమన్యు లో పద్మవ్యూహం టేకింగ్ చాలా రిచ్ గా చేశారు. కెమేరామెన్ రవికాంత్ నగాయిచ్ తో ట్రిక్ షాట్స్ తీయించి ఆడియన్స్ ను ఆశ్చర్య చకితులను చేశారు.
మధుసూధనరావును స్టార్ డైరక్టర్ ను చేసిన ఘనత డూండీకే చెందుతుంది. హిందీలో జితేంద్రకు సక్సస్ ఫుల్ కెరీర్ ప్రజంట్ చేసింది కూడా డూండీనే. అలా టాలెంట్ ఎక్కడున్నా ఐడెంటిఫై చేసి ఛాన్స్ ఇచ్చేవారు డూండీ.
సుందర్ లాల్ నహతాతో సుదీర్ఘకాలం ప్రయాణించిన డూండీ డెభై దశకంలో తమ్ముడు బాబ్జీతో కలసి సినిమాలు తీయడం ప్రారంభించారు. త్రిమూర్తీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఆయన తీసిన చిత్రాలన్నీ దొంగ టైటిల్ తోనే ఉండడం ఓ పెద్ద సెన్సేషన్. బహుళా ఇలా ఒకే టైటిల్ తో సినిమాలు తీసిన నిర్మాతలు డూండీ తప్ప ఇంకెవరూ ఉండరేమో.
డెబ్బై దశకంలో సుందర్ లాల్ నహతా నుంచి బయటకు వచ్చిన డూండీ తన సోదరుడు బాజ్జీతో కల్సి చిత్ర నిర్మాణం చేపడ్డారు. భలే దొంగలు తీశారు. మొదట్నించి రీమేక్స్ సేఫ్టీ అని గట్టిగా నమ్మిన డూండీ ఈ సినిమాకు కూడా ఓ హిట్ బాలీవుడ్ సినిమానే ఎంచుకున్నారు. చోర్ మచారే షోర్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కృష్ణ, నాగభూషణం లతో పాటు ఓ ముఖ్యపాత్రకు మోహన్ బాబును సెలక్ట్ చేసుకున్నారు . మోహన్ బాబు నట జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా ఇదే.
భలే దొంగలు సక్సస్ కావడంతో దొంగలకు దొంగకు శ్రీకారం చుట్టారు డూండీ. ఇదీ రీమేకే. శశికపూర్ సినిమా ఫకీరా డూండీ దొంగలకు దొంగకు ఆధారం. కృష్ణ మోహన్ బాబులు నటించిన ఈ చిత్రం శతదినోత్సవాలు జరుపుకోవడమే కాదు. రిపీట్ రన్స్ లో కూడా భారీగా వసూలు చేసింది. ఆరుద్ర రాసిన పోరా బాబూ పో… పాట చాలా పెద్ద హిట్ అయ్యింది.
కృష్ణతోనే మరో రెండు దొంగ చిత్రాలు తీశారు డూండీ. అందులో ఒకటి దొంగల వేట. డూండీ తీసిన దొంగ సినిమాలన్నిటికీ కె.ఎస్.ఆర్ దాసే డైరక్టరు. సత్యం సంగీత దర్శకుడు. వినోద్ ఖన్నా హిట్ మూవీ ఇన్ కార్ ఆధారంగా తీసిన దొంగల వేట డూండీని నిరుత్సాహపరిచింది. సినిమా బాగానే ఉన్నా…గత సినిమాల రేంజ్ లో హిట్ కాలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకున్నారు డూండీ బాబ్జీ సోదరులు.
ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ … వచ్చిన త్రిమూర్తీ వారి దొంగ చిత్రం దొంగలు బాబోయ్ దొంగలు. అందులోనూ కృష్ణే హీరో. దర్శకుడు కె.ఎస్.ఆర్ దాస్. ఈ సినిమా కూడా అంతంత మాత్రంగానే నడవడంతో సినిమా నిర్మాణానికి దూరమయ్యారు డూండీ. అయితే చిత్ర పరిశ్రమ నుంచి మాత్రం దూరం కాలేదు.
తన కెరీర్ లో అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించిన డూండీ కృష్ణకు మాస్ ఇమేజ్ తెచ్చారు. హిందీలో జితేంద్రకూ, తెలుగులో మోహన్ బాబుకూ కెరీర్ ప్రసాదించారు. వాణిశ్రీ లాంటి హీరోయిన్ ను ఇండస్ట్రీకి అందించారు. అభిమాన వతి అనే సినిమాకు డైరక్టర్ గా కూడా వ్యవహరించారు. ఇండస్ట్రీ లో నిర్మాత స్థాయి పడిపోయిందని అందుకే తాను నిర్మాణానికి దూరం జరిగానని డూండీ చెప్పేవారు.
సినిమా హీరో చుట్టూ తిరిగినంత కాలం మంచి సినిమాలు రావని…కమర్షియల్ సినిమా అన్నంత మాత్రాన అడ్డమైన చెత్తా తీయమని కాదని చెప్పేవారు డూండీ. ఆలోచింపచేసే విధంగా కూడా కమర్షియల్ సినిమాలు తీయచ్చనేవారు. టాలీవుడ్ లో అనేక మలుపులకు సాక్ష్యంగా నిల్చిన డూండీ 2005లో కన్నుమూశారు. డూండీ మరణంతో తెలుగు సినిమా చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం ముగిసిపోయింది. తెలుగువారు మరచిపోలేని చిత్రాలు నిర్మించిన పోతిన డూండీశ్వర్రావుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎప్పటికీ రుణపడే ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *