గొల్లపూడి మారుతీరావు

నేను నా చిన్నప్పుడే నా చిన్నతనాన్ని నష్టపోయాను. అది నాకు దక్కిన అదృష్టం. నా పద్నాలుగవయేటనే మొదటి రచన చేశాను. ఆనాటి తెలుగు సాహిత్య రంగంలో పేరు మోసిన ఎందరో పెద్దల మధ్య తిరిగాను. పురిపండా అప్పలస్వామి, మొసలికంటి సంజీవరావు, మసూనా, అంగర వెంకట కృష్ణారావు, అంగర సూర్యారావు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి – యిలాగ. అనాటి ఓ కవి సమ్మేళనంలో ఆవంత్స సోమసుందర్‌, గొర్రెపాటి వెంకట సుబ్బయ్య, మల్లాది రామచంద్రశాస్త్రి వారి సరసన నిలబడి అప్పట్లో రాసిన ఉమర్‌ ఖయ్యాం పద్యాలు చదివేశాను. నన్ను ‘సాఖీకవి’ అన్నారు ఆవంత్స. అప్పట్లో తెన్నేటి విశ్వనాథంగారి ఆధ్వర్యంలో విశాఖపట్నం టౌనుహాలులో పురిపండా
అప్పలస్వామిగారు జరిపించిన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి కనకాభిషేకంలో అభినందన పద్యాలు రాసి చదివాను. మరో 35 సంవత్సరాల తర్వాత – ఆయన కాలధర్మం చెందాక – ఆయన ట్రంకుపెట్టెను కాగితాలన్నిటితో సొంతం చేసుకుని, వారిమీద పరిశోధన చేసిన చామర్తి కనకయ్య (కనక్‌ ప్రవాసి) గారు నా పద్యాల వ్రాతప్రతి నకలుని నాకు పంపారు. పురిపండా నన్ను శ్రీపాదకి పరిచయం చేశారు. అలాగే శ్రీశ్రీకి. ఈ పెద్దల మధ్య చెట్లెక్కి ఆడే నా చిన్నతనం జారిపోయింది. నాకంటే పెద్దలు, లబ్ధ ప్రతిష్టులు, ప్రసిద్ధుల మధ్య గడపడం-నన్ను కమ్మెచ్చులాగ సాగదీసి ఎంతో కొంత భయభక్తుల్ని బాధ్యతల్ని వినయాన్ని నేర్చింది. ఇది గొప్ప అదృష్టం. చాలామందికి దక్కని, ప్రయత్నించినా కలిసిరాని మరొక అద్భష్టం నాకు కొంగు బంగారమయింది.
అది నా జీవితమంతా తొలినాటి నుంచీ నా అభిరుచీ, వృత్తీ ఒకటే కావడం. నా మనస్సుకి వచ్చిన ఆనందాన్నిచ్చిన పనే నా వృత్తికావడం. దినపత్రిక, వారపత్రిక, రేడియో, టీవీ, రంగస్థలం, సినిమా, ప్రసంగవేదిక, ఏంకరింగు, నాటక ప్రయోక్త, వక్త- యివన్నీ ఒకదాన్ని ఒకటి ఒరసుకు సాగే ప్రక్రియలు. జీవితమంతా – కింది తరగతి నుంచి పై తరగతికి వెళ్లినట్టు ప్రక్రియలో సాంద్రత, స్వారస్యం, అప్పీలు,
రీచ్‌ పెరిగే స్థాయిలలో, మాధ్యమాలలో జీవిక సాగడం – గొప్ప అదృష్టం. అవకాశం. అనుభవం. దక్షత తర్వాతి మాట. మౌలిక రచన, నటన, కళ – యివేవీ నాకు వారసత్వం కావు. తల్లిదండ్రుల తరాలలో ఎవరూ చేపట్టని, ఎవరికీ తట్టని కోణాలివి. మాది సాదా సీదా బ్రాహ్మణ
కుటుంబం. మా నాన్న 11మంది సంతానంలో అయిదో కొడుకు. వారాలు చేసుకుని ఎస్సెల్సీ దాకా చదువుకున్నారు. మా పెదనాన్న ఒకాయన సత్రం గుమాస్తా మరొకాయన వంటలు చేసేవాడు. మా అమ్మ పెద్ద చదువుకోలేదు. కాని పురాణాలు చదువుకునేపాటి
నేర్చుకుంది. మంచి గొంతు. చాలా అందమయింది. నాలాగే. లేదా నేను ఆమెలాగే. ఈ ముక్కు మాత్రం నా సొంతం. ఆమె ముక్కు కూడా కోటేరు వేసినట్టు ఉండేదికాని – నా దగ్గరికి వచ్చేసరికి మరింత సాగి గెద్దముక్కు అయింది. ఏ విషయమయినా ఒక ప్రణాళికతో
– కథలాగ మనస్సుకు హత్తుకునేట్టు చెప్పేది. ఆ ధోరణి నాకు వంట బట్టిందనుకుంటాను. నాకు చీరెకడితే మా అమ్మ. ఆమె వాగ్ధోరణి, మొండి కర్తవ్య దీక్ష ప్రథమ కోపం, అనారోగ్యం, అందం, రోగాలూ అన్నీ నాకు వారసత్వంగా వచ్చాయి. ఆమెకు ఏయే
దశలో ఏమేం వచ్చాయో గుర్తుపెట్టుకునేవాడిని. ఆ దశలో అవి నాకూ వస్తాయని నమ్మకం. ఆ వరస ఏనాడూ తప్పలేదు. “నీకు ఏయే యిబ్బందులొచ్చాయో చెప్పు. నేనూ నీ వయస్సులో వాటికి సిద్ధ పడతాను” అనేవాడిని. “అవేం రావు. నువ్వు బాగుంటావు” అనేది. అది
ఆమె ఆశీర్వాదం, కాని శరీరానికి, ఆమె యిచ్చి జీన్స్‌కి ఆ పెద్ద మనస్సు లేదు.
మా అమ్మకి నేను రచనలు చేయడం సుతరామూ నచ్చేదికాదు. కారణం – 1955 ప్రాంతంలో రచనా వ్యాసంగం. ఉపాధి కాగలదని ఊహించలేని దశ. ఆమెకి నేను సినీమాల్లో చేరడం బొత్తిగా యిష్టంలేదు. నా కీర్తీ డబ్బూ ఏనాడూ ఆమెని అబ్బురపరచలేదు. చార్లీ చాప్లిన్‌ తల్లి గుర్తుకొస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిని సాధించాక చాప్లిన్‌ తల్లిని అడిగాడు: what do you think all of this అని.
ఆమె అప్పటికే మతిస్థిమితం తప్పింది. As long as it’s make you happy అన్నది ఆమె సమాధానం.
1982 ఏప్రిల్‌ 23 న “ఇంట్లో రామయ్య – వీధిలో కృష్ణయ్య” ఇంటర్వెల్‌కి నేను స్టార్‌ని. మా అమ్మకి ఆ సినీమా పక్కని కూర్చుని చూపించాను. అప్పటికే దేశం నా వేషం చూసి ఉర్రూతలూగుతోంది. కాని మా అమ్మ చలించలేదు. సినీమా అంతా అయాక ఉండబట్టలేక అడిగాను- ఎలావుందని. “అందరూ నిన్ను తిడుతున్నారు. నువ్వా రెండో అబ్బాయి వేషం వెయ్యాలసింది” అంది. నేను సినీమాలో విలన్‌ని. రెండో అబ్బాయి సినీమాకి మొదటి అబ్బాయి – చిరంజీవి. చిరంజీవికి ఈ మాట చెప్పాను. మా అమ్మ స్వభావం చెప్పడానికి చేసిన శాఖా చంక్రమణం ఇది.
నా జీవితంలో చేసిన పెద్ద పొరపాటు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మేథమెటికల్‌ ఫిజిక్స్‌ విభాగంలో చేరడం. నన్ను ఇంగ్లీషు డిపార్టుమెంటులో చేర్చుకుంటామన్నారు. అప్పటి ప్రొఫెసరు కె.ఆర్‌. శ్రీనివాస అయ్యంగార్‌. తెలుగు రచయితకి ఇంగ్లీషు చదువేంటి
అన్నది ఆనాటి నా అసంగతమైన మీమాంస. తర్వాత ఆసలు చదువుకి శీతకన్ను వేసి లైబ్రరీలో చదువే సాగించాను. I was bad student and best actor of andhra university నా విశ్వవిద్యాలయం చదువు ఓ పీడకలగా డిగ్రీతో బయటపడే దిశగా, కె.వి.
గోపాలస్వామిగారి ఆధ్వర్యంలో ఆరుబయలు రంగస్థలంలో ప్రాచుర్యం దిశగా సాగింది.
ఆనాటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకున్న తరం – తెలుగు సాహిత్యంలో బలమైన ముద్ర వేసిన తరం. కొండముది శ్రీరామచంద్రమూర్తి, నిడదవోలు మాలతి, కొలకలూరి ఈనాక్‌, మోదుకూరి జాన్సన్‌, ఏటుకూరి ప్రసాద్‌, జ్యేష్ట కవన శర్మ, నేనూ. ఆంధ్రాభ్యుదయోత్సవాలు ఆ రోజుల్లో ప్రసిద్ధమైనవి. 1956లో నలుగురు ఉపన్యాసాలకు వచ్చారు. ఇద్దరు తెలంగాణా కవులు – యువకులు. ఒకాయన పొట్టిగా, గట్టిగా మీదకెగిసే నిప్పురవ్వలాగ ఉన్నారు. మరొకాయన ఉంగరాల జుత్తు, అందంగా అలంకరించిన పుష్పగుచ్చంలాగ ఉన్నారు. పొట్టి ఆయన పేరు దాశరధి. పుష్పగుచ్చం పేరు సి. నారాయణరెడ్డి. మాకా పేర్లు కొత్త. దాశరథి రాసిన ‘అచుంబితం” గేయాన్ని మోదుకూరి జాన్సన్‌, లభాను అతి శ్రావ్యంగా పాడారు.
మాట్లాడని మల్లెమొగ్గ మాదిరిగా నడిచిరా
నిశ్శబ్దం ఎరుగనట్టి నిమ్నగవలె విడిచిపో
చేదగు కన్నీటి బొట్టు చిందిన చప్పుడులు విను
వాదింపగరాని మనసు పరివాదిని లోతుగను-
యిప్పటికీ గుర్తుంది. ఆనాటి నారాయణ రెడ్డిగారి శ్రావ్యమైన ప్రసంగమూ గుర్తుంది. మరొక వ్యక్తి శ్రీశ్రీ. ఎంత ప్రముఖుడో అంత చప్పని ప్రసంగం. ఇంకొకరు నటుడు. కె. వెంకటేశ్వరరావు. నిజానికి ఆయన పేరూ వినలేదు. కాని గంటసేపు ప్రేక్షకుల్ని తన ప్రసంగంతో ఉర్రూతలూగించారు. తర్వాత నా జీవితమంతా ఈ నలుగురితోనూ ముడిపడింది. నేనూ, దాశరధిగారూ రేడియోలో కలిసి పనిచేశాం. వెంకటేశ్వరరావుకి నా జీవితంలో అతి ముఖ్యమైన నాటకాలు రాశాను. నేను రాసిన ఎన్నో సినీమాలకు సినారె పాటలు రాశారు. నటుడిగా వారు రాసిన ఎన్నో పాటలను నటించాను. ఇక శ్రీశ్రీ. మద్రాసు రేడియోలో ఆయన నన్ను ఇరకాటంలో పెట్టని సంవత్సరమంటూ ఉండేది కాదు.
మరొక వింత సంఘటన చెప్పాలి. ఆనర్స్‌లో ప్రముఖ నవలా రచయిత ధామస్‌ హార్టీ నవల “ది మేయర్‌ ఆఫ్‌ కాస్టర్‌ బ్రిడ్జ్” మాకు నాన్‌ డిటైల్డ్‌ మొదటిరోజు ప్రొఫెసరు ముత్తుస్వామిగారు హెంచర్డ్ సంతలో తాగి జూదంలో తన భార్యనీ బిడ్డనీ ఓడిపోయిన అధ్యాయం చెప్పారు. ఇక మనస్సు ఆగలేదు. నవలంతా చదివేసి, ఇంకా తనివి తీరక 600 పేజీల నవలనీ మళ్లీ ఆయన క్లాసుకి వచ్చే లోపల – అంటే వారంలో అనువదించాను. అది ‘పరాజితుడు’గా తరువాత ప్రచురితమయింది. విశేషమేమంటే తీరా ఆ నవలలో పరీక్ష తప్పాను!
అయితే అలా పరీక్ష తప్పిన మరొక పెద్దాయన నాకు వత్తాసు. ఆయన పేరు పుట్టపర్తి నారాయణాచార్యులుగారు. ఆయన వ్రాసిన ‘పెనుగొండ లక్ష్మి నవలని విద్వాన్‌ పరీక్షకి పాఠ్యగ్రంథంగా పెట్టారు. ఆయనే ఆ పరీక్షకు హాజరుకావాల్సి వచ్చింది. పరీక్ష రాశారు. కాని తప్పారు. కారణం ఆ రచనకు సంబంధించిన ఒక్క ప్రశ్నకి సమాధానం క్షుణ్నంగా రాశారు. మిగతా ప్రశ్నలకు వ్యవధి చాలలేదు. అయితే ఓటమిలో నాకు తోడు. అదీ ఊరట.
ఆ రోజుల్లో – అంటే 1956 మాట – యింట్లో కిరసనాయిలు దీపాలే ఉండేవి. ఆ దీపాల వెలుగులో పాఠ్యపుస్తకాలు మీదనే పెట్టి దొంగతనంగా కింద తెల్ల కాగితాల మీద కథ రాసేవాడిని. మా అమ్మ వెనుకనుంచి వచ్చి పట్టేసేది. అక్కడ్నుంచీ దీవెనలు. ఆ రోజుల్లో రోజూ విధిగా ఒక కథ రాసేవాడిని. పుంఖాను పుంఖంగా పత్రికలకు పంపేవాడిని. ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ, చిత్రగుప్త, ప్రజామిత్ర, భారతి-యిలాగ. వాటిని చూసి మా అమ్మ తిట్లు. గతిలేక పోస్టాఫీసుకు వెళ్లి-పోస్టు మాస్టరుని బతిమాలుకుని – కేరాఫ్‌ పోస్టు మాస్టరు అడ్రసు సంపాదించుకున్నాను. దాదాపు అన్నీ తిరిగి వచ్చేవి. ఒక్కటయినా ప్రచురితం కాదా అని ఆశ. అదో మైకం. ఆవేశం. ఏదో చెప్పాలనే ఆరాటం.
కూతుర్ని టెన్నిస్‌ క్రీడాకారిణిని చేసి ప్రపంచస్థాయిలో నిలపాలని స్విట్టర్లాండులో ఓ తల్లి ఆరాటం. ఆమె ఆదర్శం మార్టినా నవ్రతిలోవా. కూతురుకి ఆమె పేరే పెట్టుకుంది. మార్టినా హింగిస్‌. ఆ అమ్మాయి పెరిగి పెద్దదయి ప్రపంచ ప్రఖ్యాతి సాధించింది. నాలాంటివారికి ఆ అదృష్టం లేదు. పెద్దల ఆంక్షల్ని దాటి అభిరుచిని కాపాడుకున్న అదృష్టవంతుడిని నేను. అయితే పేరు ప్రఖ్యాతులు వచ్చాక కూడా ఇది అదృష్టమని మా అమ్మ ఒప్పుకోలేదు. ఆనర్స్‌ చావుతప్పి కన్ను లొట్టపోయినట్టుగా పూర్తిచేసి 1959 లో ఆంధ్ర ప్రభలో ఉపసంపాదకుడిగా చేరాను. మానాన్నగారికి కోపం. చిత్తూరు వెళ్లినందుకు మా అమ్మకి అయిష్టత.
చిన్నతనాన్ని చిన్నప్పుడే నష్టపోయానన్నాను. కాని నేను చేసే ఏ పనిలోనయినా చిన్నప్పటినుంచే నేనే పెద్దని. చదువుకొనే రోజుల్లోనే రాఘవ కళా నికేతన్‌” అనే సంస్థని నడిపాను. నా సంస్థలో 50 ఏళ్ల ముడియాల సూర్యనారాయణగారు, మా డ్రాయింగు మేష్టారు భండారు సత్యనారాయణగారు నటించేవారు. నా మొదటి సన్మానం నా చిన్నతనంలో నా ఉపాధ్యాయులు చేశారు. సభలో మా నాన్నగారున్నారు. ప్రసంగాలు: “వీడు ఈ మారుతి గట్టివాడు – బాగా రాస్తాడు..” యిలా సాగాయి. అదొక మధురమైన జ్ఞాపకం. ఆ దశ నుంచి నేను సినీనటుడినయి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొన్న రోజుల వరకూ- ఆయన ఆఖరి రోజుల్లో మా నాన్నగారు నా పరోక్షమయిన అభిమాని.
కళ్లు సరిగ్గా కనిపించని రోజుల్లో- దినపత్రిక వెనుక పేజీల్లో వచ్చే సినీ ప్రకటనలలో- ఎక్కడో రూపాయంత నా బొమ్మ ఉండేది. సూర్యరశ్మి వెలుగులో పేపరు ఉంచి ఆ బొమ్మని వెదికి చూసేవారు. నా నాటకాలకు నేనే రచయితని, ప్రయోక్తని, నటుడిని, దర్శకుడిని, కార్యదర్శిని.
పూర్ణా పిక్చర్స్‌ అధినేత గ్రంధి మంగరాజుగారు మాకు పోషకులు. పది పదిహేను రూపాయలు ఇచ్చేవారనుకుంటాను. టౌన్‌ వాలుకి రూపాయి అద్దె. నేనే సభని నిర్వహించి, ఉపన్యాసం ఇచ్చి, తెరవెనక్కి వెళ్లి, నటులకి మేకప్‌ చేసి, చేసుకుని నాటకం వేసేవాడిని.
ఇప్పటికీ ఆ ప్రదర్శనల కరపత్రాలు – 54 ఏళ్ల తర్వాత నా దగ్గర ఉన్నాయి. నా ఆనర్స్‌ పట్టా నాకెప్పుడూ గర్వాన్ని కలిగించలేదు. కాని మా నాన్నగారికి అది తాను చాలా ఖర్చు చేసి కొడుక్కి సంపాదించిపెట్టిన పట్టా. ఆయన ఎప్పుడు ఉత్తరం రాసినా నా పేరు చివర బి.యస్సీ (ఆనర్స్‌) రాయడం మరిచిపోయేవారు కారు. మా అమ్మ నా చదువుకీ వృత్తికీ, కీర్తికీ రాజీ పడింది. ఆమెకి నేను పింఛను వచ్చే గుమాస్తా పని చేస్తూ విశాఖపట్నంలో ఉండాలని కోరిక.
ఉపాధికి ఆస్కారం కల్పించని వ్యావృత్తిమీద విముఖత ఆనాటిది. ఉపాధికి అర్థమూ, మార్గమూ మారిపోయిన తరం ఈనాటిది. ఈతరం – నాపిల్లలూ, మనుమలూ నా వ్యాసంగాన్ని అంతగా పట్టించుకోరు. వాళ్లకిదంతా అర్ధం కాని సొద. వాళ్లకి నేను ‘ప్రముఖుడినని తెలుసు. అంతవరకే they are resigned to my celebrity status. రెండు తరాల అలసత్వం మధ్య 50 సంవత్సరాల కృషి జీవనం, తృప్తి.
ఎమిలీ డికిన్సన్‌ అంటుంది;
fame is a bee
it has a song
it has a sting
ah! it has a wing
కీర్తి తేనెటీగలాంటిది. దానికి లాలించే పాట వుంది. కాటేసే కొండె వుంది. ఎగిరిపోయే రెక్కలూ ఉన్నాయి – అని. ఇంతదూరం ప్రయాణం చేశాక రచ్చ గెలిచానన్న తృప్తి. జీవితంలో విజయాలు వాటంతటవే ఎల్లల్ని నిర్ణయిస్తాయి. కాలం, విలువలు, ధోరణులు – వాటికి పరిమితు లవుతాయి. సెన్సాఫ్‌ హ్యూమర్‌ అవసరం. నవ్వుకోవడం ఒక ఆటవిడుపు. చదువయాక ఢిల్లీలో మా చిన్నాయనగారింటికి వెళ్లాను. చావు తప్పిన గుడ్డి చదువు డిగ్రీ అది. ఆయన మిలట్రీలో పనిచేసేవారు. ఆయన నన్ను మిలట్రీ ప్రెస్సులో కంపోజిటర్‌ ఉద్యోగానికి తీసుకెళ్లారు. కళ్లనీళ్లు తిరిగాయి. చెయ్యనని వెంటనే బస్సెక్కి ఇంటికి వచ్చేశాను. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రూఫ్‌ రీడర్‌ ఉద్యోగానికి పరీక్షకి వెళ్లాను. పరీక్షలో తప్పాను. కారణం – సిగరెట్టు అనే మాట స్పెల్లింగు తప్పురాసి. వెనకటికి ఒకాయన అన్నాడు. read ans read about the harm that cigarette makes and decided not to read . అని. నేనూ తర్వాత రెండేళ్లు కసిగా సిగరెట్లు కాల్చాను. స్పెల్లింగూ, పొగాకు వార్నింగూ క్షుణ్నంగా అర్ధమయాక మానేశాను. మరో ఏభై ఏళ్ల తర్వాత నాకు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియానుంచి ఫోన్‌ వచ్చింది. ఆ సంస్థ విచిత్రమైన పొయిటిక్‌ జస్టిస్‌! సంవత్సరం పాటు ‘సురభి పత్రిక సంపాదకుడిగా ఎన్నో మంచి శీర్షికలు నిర్వహించాను. ఎందరో
ప్రముఖులచేత రచనలు చేయించాను. సరే. ఢిల్లీ కథకి వద్దాం. నార్ల వెంకటేశ్వరరావు, కపిల కాశీపతి, పురిపండా అప్పలస్వామి, తెన్నేటి విశ్వనాధం గార్ల పరిచయ లేఖలు పట్టుకుని విజయవాడలో దిగాను- ఆంధ్రప్రభలో ఉద్యోగానికి. వార పత్రికలో చేరి శ్రీపాదవారి మాటల్లో కథలు గుట్టలు గుట్టలుగా రాసేయాలని తహతహ. ఆరు నెలలు తిప్పి దినపత్రికలో చేర్చుకున్నారు. నీలంరాజు వెంకట శేషయ్యగారు. అదిన్నీ చిత్తూరుకి బదిలీ చేశారు. అక్కడ కొత్త ఎడిషన్‌ ప్రారంభించాలి. కళ్లనీళ్లు తిరిగాయి. చిత్తూరు ఎడిషన్‌ ఎడిటరు జి.కృష్ణగారు బుజ్జగించి తీసుకెళ్లారు. వి.డి.ప్రసాదరావుగారు, రావూరు వేంకట సత్యనారాయరావుగారు, జొన్నలగడ్డ రాధాకృష్ణయ్య, నండూరు పార్ధసారధి- మేమంతా చిత్తూరు చేరాం. కొంతకాలం తర్వాత తిరుమల రామచంద్రగారు వచ్చి చేరారు. ఆయన మా రూం మేటు. నెలల తరబడి కలిసి జీవనం. ఆఫీసులో పక్క పక్కనే కుర్చీలు. వార్తల పని లేనప్పుడు ఆయన మిలటరీ అనుభవాలు దొర్లేవి. ఇద్దరం పద్యాల్లో పలకరించుకునేవాళ్లం.
రెండు గుర్తున్నాయి:
వడయు బోండాయు కాఫీయు వరుస గాను
విందు గుడిచినవారలే విబుధ వర్య?
అయన నమాధానం:
వడ యొక్కటె యున్నద ఆ
వడయును కుడువంగ బోగ చలచల్ల నయెన్‌
వడి వడి నమిలితి నంతే
చెడిపోయితినయ్య నేను చెలికాడ భువిన్‌.
నా జీవితంలో ప్రముఖమయిన మలుపులు, నా జీవితాన్ని అర్ధవంతం చేయగల వ్యక్తుల కలయిక – అన్నిటికీ మూలకేంద్రం చిత్తూరు అవుతుందని తెలీదు. అప్పుడు చిత్తూరు కలెక్టరు బి.కె.రావుగారు. మునిసిపల్‌ కమీషనర్‌ గుంటూరు శేషేంద్ర శర్మగారు. అక్కడి మిత్రులు మధురాంతకం రాజారాం, కలువకొలను సదానంద, రాజేంద్ర, వల్లంపాటి వెంకట సుబ్యయ్య, కె.సభా ప్రభృతులు. ఆ రోజుల్లోనే చిత్తూరు రచయితల సంఘాన్ని ప్రారంభించాం. అక్కడినుంచే తిరువణ్డామలైలో ఉంటున్న చెలంగారి ఆశ్రమానికి ప్రయాణాలు. అక్కడ జలసూత్రం రుక్కిణీనాధ శాస్త్రి, యామిజాల పద్మనాభస్వామి వంటివారి పరిచయం. చెలంగారు హెచ్చరించిన ప్రళయానికి భయపడి వీరిద్దరూ చిత్తూరు
వచ్చి కొంతకాలం ఉన్నారు. మరో గొప్ప స్నేహం “మా తెలుగుతల్లి సృష్టికర్త శంకరంబాడి సుందరాచారిగారి పరిచయం. ఆయన కంచినుంచి తరుచు వచ్చేవారు. అక్కడ ఉండగానే నా పెళ్లి. నాకు పెళ్లయాక దంపతులం ఆయనకి మా యింట్లోనే పాదాభివందనం చేసి బట్టలు పెట్టాం. అక్కడే గోడకి అనుకుని కూర్చుని ఆశీర్వాద పద్యం రాశారు శంకరంబాడి.
నకల సౌభాగ్య సంపత్తి, నరసమైత్రి
ఆయురారోగ్య ఘనక్తీర్తి ఆత్మ తృప్తి
యోగఫలశక్తి, భుక్తి నుఖ సుప్తి గలిగి
మారుతీ శివకాములు మనగ వలయు
ఆయన వాక్శుద్ధిగల హితులు. ఆయన చెప్పినవన్నీ అక్షరాలా జరిగాయి. మా ఆవిడ శ్రీపాదవారమ్మాయి. అమె చిన్నాన్నలు శ్రీపాద గోపాల కృష్ణమూర్తిగారు, ఇప్పుడు శతజయంతిని జరుపుకుంటున్న పద్మభూషణ్‌, సంగీత కళానిధి శ్రీపాద పినాకపాణిగారు. మా మామగారికొక ప్రత్యేకత ఉంది. ఆయన శ్రీపాద రామకృష్ణారావుగారు. సి.నారాయణరెడ్డిగారికి గురువులు. మా ఆవిడని ఎప్పుడు కనిపించినా “గురుపుత్రి” అని పలకరిస్తారు రెడ్డిగారు. ఆచంట జానకిరామ్‌గారు తిరుపతిలో ఉండేవారు. వారి శ్రీమతి శారదాదేవి-
మహిళా కళాశాలలో తెలుగు ప్రొఫెసర్‌. ఆయనే నన్ను రేడియోకి వెళ్లమని ప్రోత్సహించారు. ఓసారి విశ్వనాథ సత్యనారాయణగారికి చిత్తూరులో సన్మానాన్ని ఏర్పాటు చేశారు శేషేంద్ర శర్మగారు. అంతకుముందే ప్రచురితమయిన నా తొలి నవల “చీకటిలో చీలికలు
కాపీని శర్మగారికిచ్చాను. విశ్వనాథవారి కళ్లబడి ఉంటుంది. రెండు మూడు పేజీలు తిప్పినట్టున్నారు. ఆనాటి సభలో వేరే కారణానికి అగ్గిమీద గుగ్గిలమయి ఉన్నారు. కారణం ఆరుద్ర- వారి కిన్నెరసాని పాటలు ‘పిప్పరమెంటు’ పాకమని ఎక్కడో అన్నారట. అదీ
కోపానికి కారణం! ఆ ప్రసంగం అటూ యిటూ తిరిగి నా నవల మీదకు వచ్చింది. నన్నూ నాలుగు మాటలు చెరిగారు. అడియన్సులో ఉన్న శర్మగారూ, మాల్లాది రామచంద్రశాస్రిగారూ ఇబ్బంది పడ్డారు- ఆ నవల నాదేనని గుర్తుపట్టి. మర్నాడు శర్మగారింట్లో విందు. రాత్రి నన్ను తిట్టిన విషయం విశ్వనాథవారితో చెప్పినట్టున్నారు. ప్రసంగం టేపు పెట్టారు. ఆయన పక్కనే కూర్చున్నాను నేను. నన్ను విమర్శించే మాటలు వచ్చాయి. నా వేపు తిరిగి “మిమ్మల్ని తిట్టానా?” అన్నారు విశ్వనాథ. నేను నవ్వాను. “ఆ నవలకి ఎంత ప్రాచుర్యం వస్తుందో తెలీదుగాని మీ విమర్శకారణంగా దాన్ని గుర్తుంచుకుంటాను” వంటి మాటేదో అన్నాను. ఆయన కరిగిపోయారు. ఉదాత్తమయిన వ్యక్తి పశ్చాత్తాపాన్ని – తనకంటే చిన్న వ్యక్తి మీద ఎలా చూపిస్తారు?
ఆరోజు సాయంకాలం రామ విలాస సభలో ఆర్‌. బి.రామకృష్ణరాజుగారు చేస్తున్న సన్మానం. విశ్వనాథ ముందుగా బజారుకెళ్లి కొన్ని శాలువాలు కొన్నారు. ఆ నభలో యువ రచయితలందరినీ పేరు పేరునా పిలిచి కప్పారు. నేను సిగ్గుపడి ముందుకు రాకపోతే
ఆయనే నా దగ్గరకు వస్తూ “పెళ్లయి పిల్లల్ని కన్నవాళ్లకి ఇంకా సిగ్గేమిటండీ” అంటూ కప్పారు. ఇప్పుడు ఆ శాలువా ఏమయిందో గుర్తులేదు. కాని ఆ సన్మానం స్పర్శ గుర్తొచ్చినప్పుడల్లా ఈ భుజాలు పొంగుతాయి. మనస్సు ఆర్ద్రమవుతుంది.
చిత్తూరులో ఉన్న మూడేళ్లూ వందలాది వ్యాసాలు, కథలూ, నాటికలూ రాశాను. ఆంధ్రప్రభలో ‘కులాసా కబుర్లు శీర్షికని నిర్వహిచాను. పంచాయితీల్లో, గ్రామాల్లో, పాఠశాలల్లో, అర్థం లేని సభల్లో ఉపన్యాసాల వెల్లువ సాగింది. ఈగల సంహార వారోత్సవాల మీదా, టీకాలు వేయించే ప్రోగ్రాంలమీదా, కుటుంబ నియంత్రణ – ఏదయినా, ఎక్కడయినా, ఎప్పుడయినా, కలం మెరుగులు దిద్దుకుని మనస్సు ఉపన్యాసాల వొరవడిని లొంగదీసుకున్న ప్రయోగాత్మకమైన దశ అది.
తర్వాతి దశ-గవర్నమెంటు ఉద్యోగం- రేడియోలో. నూటికి నూరుపాళ్లూ గవర్నమెంటు ధోరణిలోనే సాగింది. బ్రహ్మచారిగా రేడియో ఉద్యోగానికి దరఖాస్తు పెట్టాను. పెళ్లికొడుకుగా పరీక్ష రాశాను. పెళ్లాన్ని పురిటికి పంపించి ఇంటర్వ్యూకి వెళ్లాను. అబ్బాయికి బారసాల చేసి తండ్రిగా ఉద్యోగంలో చేరాను. ఈ దశలు నా జీవితంలో త్వరగా జరిగాయా, ఉద్యోగమే ఆలశ్యమయిందా చెప్పడం కష్టం.
హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం ఒక భువన విజయం. దేవులపల్లి కృష్ణశాస్త్రి, నాయని సుబ్బారావు, మునిమాణిక్యం నరసింహారావు, బుచ్చిబాబు, భాస్మరభట్ల కృష్ణారావు, స్థానం నరసింహారావు, దాశరధి, బాలాంత్రపు రజినీకాంతరావు, యండమూరి సత్యనారాయణ, వేలూరి సహజానంద, రావూరి భరద్వాజ, తురగా కృష్ణమోహన్‌రావు, పాలగుమ్మి విశ్వనాధం, వింజమూరి వరదరాజ అయ్యంగార్‌, మంచాల జగన్నాధరావు, న్యాయపతి రాఘవరావు, న్యాయపతి కామేశ్వరమ్మ, వారణాశి రామమూర్తి వేణు, కేశవపంతుల నరసింహశాస్త్రి, ఉషశ్రీ, శంకరమంచి సత్యం- యీ వాతావరణంలో చేసే పని ఉద్యోగమేమిటి? ఓ గొప్ప వైభవం. ఇరవై మూడు సంవత్సరాల యువ రచయితకి మైకం. మా జీతం ఎంతో తెలిసేది కాదు. ఏ పని చెయ్యకూడదో తెలిసేది కాదు. అన్ని పనులూ మావే. జీవితంలో ఇది అరుదైన అదృష్టం. దీనికి పునాది చిత్తూరులో ఉండగానే పడింది.
1962లో చైనా దురాక్రమణ జరిగింది. అప్పటికే నా నాటికల ప్రదర్శనలు చూసిన కలెక్టరు బి.కే. రావుగారు నా చేత ఒక నాటిక రాయించారు- ‘వందేమాతరం’. నేనే ప్రయోక్తని. చిత్తూరు జిల్లాలో నాలుగు చోట్ల చిత్తూరు, తిరుపతి, నగరి, మదనపల్లిలో ప్రదర్శనలు ఏర్పాటు చేసి ఆ రోజుల్లో యుద్ధ నిధికి 50 వేలు వసూలు చేయించారు. ఆంధ్రప్రదేశ్‌ పౌర సంబంధాల శాఖ తరఫున హైదరాబాదు గాంధీ (గౌండ్సులో ఎగ్జిబిషన్‌లో ప్రదర్శన. అప్పటి అశాఖ డైరెక్టరు నరేంద్ర లూధర్‌. తర్వాత చీఫ్‌ సెక్రటరీ అయ్యారు. అప్పటి ఆ శాఖ మంత్రి పి.వి. నరసింహారావుగారు. వందేమాతరం నాటికని పారసంబంధాల శాఖ ప్రచురించింది. ఆ నాటికకి పి.వి. గారు ముందుమాట రాశారు. అప్పటికి వారితో నాకు వ్యక్తిగత పరిచయం లేదు. హైదరాబాదు వచ్చాక పరిచయం ప్రారంభమయింది. వారి జీవితమంతా ఒక మిత్రుడిగా ఆత్మీయతను చూపారు. ఆయన ముఖ్యమంత్రి అయి, కేంద్ర మంత్రి అయి, ప్రధాని అయి, పదవీ విరమణ చేశాక కూడా ఆ ఆత్మీయత కొనసాగింది. హైదరాబాదులో ఎన్నో సభలలో కలిసి ప్రసంగాలు చేశాం. నిజానికి నేను ఆత్మకథ రాయడానికి నన్ను ప్రోత్సహించింది ఆయనే. పదవీవిరమణ చేశాక ఢిల్లీలో వారిని కలుసుకోవడానికి వెళ్లినప్పుడు ఆయన వ్రాసిన “ది ఇన్సైడర్‌’ గ్రంథాన్నిస్తూ ఆత్మకథని ప్రారంభించమన్నారు. “తర్వాత సవరణలు చేసుకోవచ్చు. ప్రతీరోజూ ఎంతో కొంత రాయండి. అలా రాయకపోతే ఈ గ్రంథం రాయగలిగే వాడిని కాదు” అన్నారు. నన్ను ఆత్మకథ రచనకు ప్రోత్సహించిన మరొక వ్యక్తి ప్రముఖ దర్శకుడు మహేష్‌ భట్‌.
హైదరాబాదు రేడియో ఉద్యోగం నా జీవితంలో ఓ గొప్ప అధ్యాయం. 1963 జనవరి 16న రేడియో ప్రవేశం. మార్చిలో దాశరధిగారు నన్ను పలకరించారు- “ఎక్కడుంటున్నావు అబ్బాయ్‌!” అంటూ. గగన్‌ మహాల్‌ రోడ్డులో కారు షెడ్డును ఒక వాటాగా తీర్చిన యింట్లో. నన్ను అన్నపూర్ణా పిక్చర్స్‌ అధినేత దుక్కిపాటి మధుసూదనరావుగారు కలుసుకోవా లనుకుంటున్నారు. తుళ్లిపడ్డాను. ఆయన నన్ను
కలుసుకోవడమేమిటి? దాశరధి నవ్వారు. ఇద్దరూ మా ఇంటికొచ్చారు. మా ఇంట్లో ఓ గడ్డిమోదా, ఒక కుర్చీ. అన్నపూర్ణా
పిక్చర్స్‌ మేనేజింగ్‌ డైరెక్టరు ఒకదానిమీదా, దాశరధిగారు మరొక దానిమీదా కూర్చున్నారు. కోడూరి కౌసల్యాదేవిగారి చక్రభ్రమణం” నవలకి ప్రీన్‌ప్లే రాయాలి. నాకు ఆ రచన తెలీదన్నాను.
“ఆయనకి రాయించుకోవడం తెలుసు. నువ్వు లే” అన్నారు దాశరథి. అబిడ్స్‌ తాజ్‌మహల్‌ హొటల్‌ రూం నెంబరు 18 దుక్కిపాటిగారిది. తలుపులు తెరవగానే గది మంచం మీద అప్పటికి నేను రాసిన రచనలు ఉన్నాయి. నా సినీరచనా వ్యాసంగానికి అక్కడ అక్షరాభ్యాసం జరిగింది. సినీ మాధ్యమానికి దుక్కిపాటి నా గురువు. తదాదిగా 20 సంవత్సరాలు, నాలుగు నందీ అవార్డులు. నందీ అవార్డులు ప్రారంభమయిన మొదటి సంవత్సరమే ఉత్తమ రచయిత అవార్డును అందుకున్నాను. నా మొదటి సీనుని సాపు రాసుకున్న వ్యక్తి దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుగారి కో డైరెక్టరు కె.విశ్వనాథ్‌. డబ్బూ, కీర్తి, ఉక్కిరి బిక్కిరి చేసే పని వత్తిడి- అది ఒక ఉప్పెన.
ఈ దేశానికి మొదటి ప్రధాని నెహ్రూ పోయినప్పుడు నేను రేడియోలో ఉన్నాను. పి.వి. నరసింహరావు వంటి ప్రముఖుల స్పందనలు రికార్డు చేశాను. హఠాత్తుగా లాల్‌ బహదూర్‌ శాస్త్రిగారు వెళ్లిపోయినప్పుడు డ్యూటీలో ఉన్న మొదటి ఆఫీసర్ని నేనే. అవన్నీ
విలువైన జ్ఞాపకాలు. మహిళా కార్యక్రమంలో ముప్పాళ్ల రంగనాయకమ్మగారి “బలిపీఠం” ఆ రోజుల్లో పెద్ద సంచలనం. ఇవి కేవలం ఏరిన కొన్ని నమూనాలు. ఒక పక్క రేడియో, మరొక పక్క సినీమా జోడుగుర్రాలయి సాగాయి.
కె.విశ్వనాధ్‌కి 7 గొప్ప సినీమాలు రాశాను. ఎస్‌.డి.లాల్‌కి ఎన్టీ రామారావుగారు నటించిన 6 హిట్‌ సినీమాలు రాశాను. అట్లూరి పుండరీకాక్షయ్యగారికి అయిదు మంచి సినీమాలు రాశాను. కథా చౌర్యానికి బలి అయిపోయినవి పోగా నా ఖాతాలో మన్నికయిన
సినీమాలు చాలా మిగిలాయి. మొత్తం 81. ఈలోగా విజయవాడ బదిలీ. విజయవాడ ఆకాశవాణి మరోగొప్ప పండిత పరిషత్తు.
జలసూత్రం రుక్మిణీనాధశాస్త్రి, ఆమంచర్ల గోపాలరావు, కందుకూరి రామభద్రరావు, ప్రయోగ నరసింహశాప్రి, డాక్టర్‌ జి. వి.కృష్ణారావు, బందా కనకలింగేశ్వరరావు, నండూరి సుబ్బారావు, సి. రామమోహనరావు, వింజమూరి శివరామారావు- వీరుకాక సంగీత రంగంలో అతిరథులు వోలేటి వెంకటేశ్వర్లు, శ్రీరంగం గోపాల రత్నం, నల్లాన్‌ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, దండమూడి రామమోహనరావు, అన్నవరపు రామస్వామి, వి.బి.కనకదుర్ల, ఉషశ్రీ, శంకరమంచి సత్యం విజయవాడ బదిలీ అయి వచ్చారు.
జీవితంలో అభిరుచినీ, దక్షతనీ, ఓ ఆదర్శాన్నీ నిర్దేశించిన పెద్దల సమక్షమది. విజయవాడ రేడియోకి నేను రాసిన మంచి నాటికలు- కళ్యాణి, సర్వే స్టోన్‌ నంబరు 23, ఓ సీత కథ. ఓ సీత కథలో ౩. వెంకటేశ్వరరావు ముఖ్యపాత్ర చేశారు. శంకరమంచి ప్రయోక్త. సర్వే స్టోన్‌కి బందా ప్రయోక్త. వోలేటి, శ్రీరంగం గోపాలరత్నం, వి.బి. కనకదుర్గ – ఇంకా ఎందరో నటించిన మంచి నాటిక. విజయవాడలో ఉండగా ఎమెస్కో ప్రచురణలకి రాసిన మూడు నవలలు- పిడికెడు ఆకాశం, వెన్నెల కాటేసింది, మళ్లీ రైలు తప్పిపోయింది నవలలకి కితాబులు అందించిన సినారె ఉత్తరాలు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. విజయవాడలో రాసిన గొప్ప నాటిక ‘కళ్లు. ఆంధ్రనాటక కళా పరిషత్తు
పోటీలలో నాటకానికీ, నాటికకీ ఒకేసారి బహుమతిని అందుకోవడం అప్పటికి చరిత్ర. అదీ విజయవాడలోనే.
ఆ తర్వాత రెండేళ్లు శబల్పూరులో అరణ్యవాసం. అక్కడా రెండు హిట్‌ సినీమాలు కథ, మాటలు రాశాను-మరపురాని తల్లి, పాపం పసివాడు. తర్వాత మద్రాసు.. మద్రాసులో ఎప్పుడు ఉన్నా సుధారా హోటల్లో నాది 18వ నంబరు గది. 12వ నంబరు గదిలో ఒకాయన ఉండేవారు. రోజంతా ఆయన పాటల పరిశమ. నాది మాటల పరిశ్రమ. ఆయన సి. నారాయణరెడ్డిగారు. రోజూ రాత్రిళ్లు అనుభవాల్ని కలబోసుకునేవారం. నన్ను ఉద్యోగం రాజీనామా చేయమని ధైర్యం చెప్పింది ముగ్గురు- సినారె, ముళ్లపూడి, తాతినేని రామారావు. రాజీనామా చేసినంతపని చేశాను కాని చెయ్యలేదు. మద్రాసు జీవితం- ఉద్యోగాన్ని విరమించవచ్చునని ధైర్యాన్ని ఇచ్చిన దశ. అయితే
ఎనిమిదేళ్ల తర్వాత అనుకోకుండా ఓ గొప్ప మలుపు, అదృష్టం తమాషాగా కలిసి వచ్చింది. కచ్చేరీ రోడ్డులో స్కూటర్‌ ఆక్సిడెంటు జరిగి నా కాలూ చెయ్యా విరిగాయి. అది పెద్ద మలుపు. నాకు కడప బదిలీ అయింది. ఆరు నెలలు మంచం మీద ఉన్నప్పుడు ఒకాయన
నిర్మాత ఏ. కామేశ్వరరావుగారు ఆసుపత్రికి వచ్చారు. నిర్మాత రాఘవకి ఓ సినీమా రాసిపెట్టాలన్నారు. ప్రతిఫలం అత్యల్పం. అయితే నా షరతుల మీద నాతో ఒదిగే దర్శకుడయితే చేస్తానన్నాను. ఓ రోజు హై స్కూలు ఎగ్గొట్టి వచ్చినట్టున్న ఓ కుర్రాడు మా యింటికి వచ్చాడు. అతను కోడి రామకృష్ణ. ఆరు నెలలు చర్చించి ఓ కథ తయారు చేశాం – తరంగిణి. అయితే ఇది కాస్త పేరున్న దర్శకుడు చేపడితే రాణించే కథ అనిపించి అటకెక్కించాం. మరికొన్ని నెలల తర్వాత రూపు దిద్దుకున్న కథ- ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. నిర్మాత రాఘవ తన విశ్వాసాలను నిర్దుష్టంగా ఏర్పరుచుకున్న మూర్ఖుడు. ఇలాంటి వ్యాపారాలకి కావలసిన మూర్ఖత్వమది. నేను ప్రధాన పాత్రని వెయ్యాలన్నాడు. కోడి రామకృష్ణ విశ్వాసమూ అదే. నాకప్పుడు 42. అలవికాని కుటుంబ సమస్యల్లో, ఉద్యోగ సమస్యల్లో ఉన్నాను. సినీమా బాగా రాణిస్తే 42 యేట నాకు ఒరిగేదేమిటి? కాకపోతే ఈ వయస్సులో చెయ్యి కాల్చుకోవడమెందుకు? మొరాయించాను. ఎదిరించాను. విసుక్కున్నాను. ఆ సమయంలో కె. విశ్వనాధ్‌కి “శుభలేఖ” అనే మంచి చిత్రాన్ని రాస్తున్నాను. మధ్యలో ఎందుకీ పిడకలవేట? ఇదీ నా ఆలోచన. కాని చివరికి ఇద్దరి మూర్ఖపు నమ్మకాలకు తలవొంచాను. మొట్టమొదటిసారిగా కెమెరాముందు నిలబడ్డాను. 1982 ఏప్రిల్‌ 28 ఉదయం తొమ్మిది గంటలకి తెలుగు ప్రేక్షకులు ఓ కొత్త ముఖాన్ని చూసి షాక్‌ అయారు;
అనందించారు; ఆదరించారు. 31 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ ఆపనే చేస్తున్నారు. ఈ ప్రసంగం సమయంలో నేను రెండు సినిమాలు చేస్తున్నాను.
ఇందువల్ల దక్కిన లాభం – కీర్తి డబ్బు. నష్టం – రచయిత పూర్తిగా నిద్రపోయాడు. ఈ దశలో రాసిన ఒకే ఒక చిత్రం- ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిర్మించి, కె. విశ్వనాధ్‌, కమల్‌హాసన్‌, నేనూ నటించిన “శుభసంకల్పం. నట జీవితం 31 సంవత్సరాలుగా సాగుతోంది. ఇంకా ఆగలేదు. ఎన్నో అనూహ్యమైన మలుపులు. ఒకటి రెండు చెప్తాను. మా నాన్నగారు నా జీవితంలో – నా కప్పుడు 12 ఏళ్లుంటాయి. ఒకేసారి మూడణాలు ఇచ్చి మా ఇంటి ఎదురుగా ఉన్న సెలక్టు టాకీసులో రిలీజయిన విజయా పిక్చర్స్‌ మొదటి చిత్రం ‘షావుకారు’ చూడమన్నారు. అది నాకు ఆశ్చర్యాన్ని కలిగించిన సంఘటన. షావుకారు జానకి గారు నాకంటే 10 ఏళ్లు పెద్ద. నేను రచయితనయి, నటుడినయాక మేమిద్దరం భార్యాభర్తలుగా కనీసం మూడు సినీమాల్లో నటించాం. ఎస్‌. వరలక్ష్మి గారి మొదటి చిత్రం “బాలరాజు” నేను
మా అమ్మ వొడిలో కూర్చుని చూసిన గుర్తు. ఆవిడ నాకంటే పన్నెండేళ్లు పెద్ద. మేమిద్దరం కనీసం మూడు సినీమాల్లో భార్యాభర్తలుగా నటించాం. ఓసారి బి. నాగిరెడ్డిగారు నన్ను పిలిచి: “నాకు తెలుసు ఏనుగుని సర్కసు బల్ల మీద ఫీట్‌ చేయమంటున్నానని. మీరు నా
సినీమాలో ప్రముఖ పాత్ర వెయ్యాలి” అన్నారు. షావుకారు కథ వారికి చెప్పాను. విసూ గారు దర్శకత్వం వహించిన ‘నేటి సావిత్రిలో ప్రముఖ పాత్రని వేశాను. అదే విజయావారి ఆఖరి చిత్రం. 260 సినీమాల అనుభవాలకు ఈ వ్యవధి, ఈ సందర్భమూ చాలదు.
నాకిష్టం లేని పని మా అబ్బాయిల్లో ఆఖరివాడు – శ్రీనివాస్‌ చేశాడు. కోడిని ఒప్పించి అసిస్టెంటుగా దర్శకత్వ శాఖలో చేరాడు. మంచి దర్శకుడవుతాడని రాఘవేంద్రరావు, కమల్‌హాసన్‌, కె, ఎస్‌.రామారావు, గోపాల రెడ్డివంటి వాళ్లు అన్నప్పుడు పొంగిపోలేదు. ఊరట చెందాను. లాయరు కొడుకు లాయరు కావాలని, డాక్టరు కొడుకు డాక్టరు కావాలని, ఏక్టరు కొడుకు ఏక్టరు కావాలని అనుకోవడం రివాజు. అనుకొంటూ వాళ్ల తలలు, మన ఓపికనీ పరీక్షించే రోజులివి. దర్శకుడిని చేయడం, చేయాలనుకోవడం అరుదు. అట్లూరి పూర్ణచంద్రరావుగారు అతనికి దర్శకత్వం ఛాన్స్‌ ఇచ్చారు. నాతో ధైర్యంగా తన ఆలోచనల్ని చెప్పలేదని పాత్రోని రాయమన్నాను. కాని పూర్ణచంద్రరావుగారు నా తలవొంచారు. కోరి ప్రేమించి, కట్టుకున్న పెళ్లాంతో 9 నెలలు కాపురం చేశాడు. సినీమాకి 9 రోజులు దర్శకత్వాన్ని వహించాడు. తొమ్మిదోరోజు ఆక్సిడెంట్‌. వెళ్లిపోయాడు. సరిగ్గా 52వ రోజున మా అబ్బాయి స్థానంలో నిలబడి జీవితంలో మొదటిసారి ‘స్టార్ట్‌ కెమెరా” చెప్పాను. కట్ చెప్పడానికి నోరురాక భోరుమన్నాను. 26 ఏళ్ల కుర్రాడు ఊహించుకున్న ప్రేమకథ, 56ఏళ్ల పుత్రశోకంతో ఉన్న తండ్రి చేతిలో ఏమవుతుంది? మారుతీరావుని చూస్తే తెలుగు ప్రేక్షకులకి పాత్ర కనిపించలేదు. కొడుకుని పోగొట్టుకున్న తండ్రే కనిపించాడు. వేషాలు తగ్గిపోయాయి. నా కెరీర్‌ గ్రాఫ్‌ కొండ దిగింది. వాసూ పోయినప్పుడు ఓ కవిత రాశాను. దాన్ని ఎప్పుడూ పూర్తిగా చదవలేకపోయాను.
అందులో కొన్ని వాక్యాలు.
ఈ నావ గమ్యందాకా నడుస్తుందనుకున్నాను
ఈ చెయ్యి కష్టంలో నా భుజం మీద వాలుతుందనుకున్నాను
ఎంత చిన్న కారణానికయినా
ఆకాశం పగిలేలా ప్రతిధ్వనించే ఆ నవ్వు
నాకంటే ఎక్కువకాలం నిలుస్తుందనుకున్నాను.
ఇంకా అసంవూర్తిగా మిగిలిపోయిన నా కలలకి
ఆ మూర్తిలో వర్యవసానాన్ని వెదుక్కున్నాను
ఆ వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని చూసీ
ఇక ధైర్యంగా వృద్ధాప్యాన్ని ఆహ్వానించవచ్చనుకున్నాను
నాకంటే విలాసంగా, నిండుగా, గర్వంగా బతికే మనిషి
ప్రిన్స్ చార్మింగ్
ఏ పని చెయ్యాలన్న ధైర్యం కంటే రెండడుగులు ముందు నడిచేవాడు
ఏ కంటిలో నీటిని చూసినా చేతిని మైళ్లకొద్దీ సాచి తుడిచేవాడు
కడుపున వుట్టిన అచ్చమైన స్నేహితుడు
నాన్నా అన్న పిలుపులో నేనున్నానన్న ఓదార్పు
కష్టం ఎవరి ముఖంలో చూసినా కళ్లల్లో ఎరుపు
తనకి అక్కరలేని చావుకి ఆరు రోజులు కాపలా కాశాడు
జేబులో రూపాయుంటే చెయ్యి వెయ్యి ఖర్చు చేస్తుంది
సూర్యరశ్మికి మరింత వెలుగునిచ్చే శక్తివి నువ్వని
అమ్మ మీద పద్యాన్ని గదిలో టేబిలు మీద ఉంచాడు
ఖరీదయిన జీవితం అతని వ్యసనం
ఆకలికీ అవసరానికీ తలవంచే మనుషులు అతని బలహీనత
ఏడు నముద్రాలు దాటి కోరుకున్న రాకుమారి కోసం పదేళ్లు తపస్సు చేశాడు
చిన్న కెరటాన్ని దాటి యిటువేపు అడుగు వెయ్యలేకపోయాడు
ఎన్ని సూర్యోదయాలు ఆ చిరునవ్వుని నష్టపోయాయి?
ఎన్ని జీవితాల్లోంచి స్నేహం శలవు తీనుకుంది?
నా అడుగుజాడల్ని కొలిచి మిల్లీ మీటరు తేడా లేకుండా నడిచేవాడు
నాకంటే ముందుకు ఎందుకు అడుగు వేశాడో అర్ధం కాదు
కన్నాను కనుక ‘నాయనా” అనాలి కాని
నాకు అతి విలువైన మిత్రుడు, ఆర్తత్రాణ పరాయణుడు
ఇప్పుడే ఆ సందు మలువు తిరిగాడు
ఈ గాయం ఇంకా పచ్చిగా వుంది
గుండె గొంతులో అడ్డుపడుతోంది క్షమించండి
ఈసారికి శలవు తీసుకుంటాను
మరోసారి నా దీనత్వాన్ని మరికాస్త విప్పుకుంటాను..
సంజయ్‌ గాంధీ పోయిన సంవత్సరానికి పార్లమెంటు లాబీలో ఇందిరా గాంధీని ఆమె సహాధ్యాయి, మిత్రురాలు పపుల్‌ జయకర్‌ తారసపడినప్పుడు అడిగారట. “ఇప్పటికయినా దుఃఖం నుంచి తేరుకున్నారా?” అని. ఇందిరాగాంధీ సమాధానం చెప్పలేదు. నార్త్‌ బ్లాక్‌లో తన గదికి వెళ్లి ఒక చీటీ మిత్రురాలికి పంపించిందట. “జీవితంలో మనస్సుకి తగిలిన గాయాలు ఎన్నటికీ మానవు. ముట్టుకున్నప్పుడల్లా బాధ జివ్వుమంటుంది. కాని కాలం ఆ బాధతో సహజీవనాన్ని చేయడాన్ని అలవాటు చేస్తుంది.” అదీ నా పరిస్థితి.
తర్వాతి జీవనం ఏమిటి? కసిగా రోజుకి 18 గంటలు వనిచెయ్యడాన్ని అలవరచుకున్నాను. రాత్రి మూడో పెగ్గు దాటకూడదని వెయ్యి దేవుళ్లకి మొక్కుకునేవాడిని. భరించలేని వేదన అప్రమత్తంగా ఉంటే మనిషిని అధః పాతాళానికి తొక్కేస్తుంది. అది భయంకరమైన దశ.
నాటకం నా ఊపిరి. నా రచనా జీవితంలో నా ముఖ్యమైన రచనలకు ప్రధానంగా ముగ్గురే ప్రయోక్తలు. కె.వెంకటేశ్వరరావు, చాట్ల శ్రీరాములు, బి.వీ. రామారావు. ముగ్గురులో ఎక్కువ ప్రయోగాత్మక రచనలు శ్రీరాములుకోసం రాశాను. 35 సంవత్సరాల కిందట రాసిన “గో టు హెల్ నాటకాన్ని మళ్లీ తన 81వ యేట ఈ మధ్యనే మళ్లీ పునర్నిర్మించాడు. తెలుగుదేశం గర్వించే ప్రయోక్తలలో శ్రీరాములు ఒకడు. బి.వి. రామారావు నేను సృష్టించిన చరిత్రలన్నింటికీ భాగస్వామి. ఆంధ్రనాటక కళా పరిషత్తు రెండు ప్రదర్శనలు- కరుణించని దేవతలు, కళ్లులో ప్రధాన పాత్రలు పోషించాడు. కొన్ని రచనలు రాయడానికి అతనే కారకుడు. ఒక విచిత్రమైన అనుభవం చెప్పాలి. కుటుంబ నియంత్రణ స్పురణకు వచ్చే రీతిగా ఒక నాటకం – ‘ఒక చెట్టూ రెండే పువ్వులూ”. చాలామంచి నాటకం. ‘నీలయ్య గారి దయ్యం” మంచి నాటిక. నాటకాన్ని సాంగ్‌ అండ్‌ డ్రామా డివిజన్‌ హక్కుల్ని కొన్నది. ఒకరోజు విజయవాడ రేడియో స్టేషన్‌కి సురభి కంపెనీ స్థాపకులు ఇద్దరు- ఆవేటి నాగేశ్వరరావు, నటీమణి పూర్ణిమ వచ్చారు. ఆ నాటకాన్ని సాంగ్‌ అండ్‌ డ్రామా డివిజన్‌ తరఫున ప్రదర్శించడానికి సుమతిని సంపాదించారు. నాకెంత పారితోషికం కావాలి? అడగడానికి వచ్చారు. ఎంత? అన్నాను. బాగా ఆలోచించి ప్రదర్శనకి 5 రూపాయలు ఇస్తామన్నారు. ఇది 1971మాట. కేవలం అయిదు రూపాయిలా? నాకు ఆవేశం వచ్చింది. నాకు డబ్బు అక్కరలేదు. ప్రదర్శించండి అన్నాను. నన్ను ఒప్పించబోయారు. వద్దన్నాను. తర్వాత మల్లాది వెంకట కృష్ణశర్మగారికి గర్వంగా ఈ మాట చెప్పాను. ఐదు రూపాయలు వద్దన్నానని. ఆయన గుండె బాదుకున్నాడు. “ఎంతపని చేశావయ్యా? నాకు ఏ రెండున్నరో యిస్తే జీవితమంతా కాలుమీద కాలేసుకుని బతికేస్తున్నాను. అయిదు రూపాయలు వదులుకున్నావా?” అని మొత్తుకున్నాడు. నాకర్థం కాలేదు. సురభి కంపెనీ కొన్ని వందల ప్రదర్శనలు కొన్ని సంవత్సరాలు పాటు యిస్తుందట. ఇచ్చిందేమో. నాకు తెలియదు. సురభి కంపెనీ అనే ఉద్యమానికి ఇది మచ్చుతునకగా ఈ సంఘటన నాకెప్పుడూ జ్ఞాపకం వస్తుంది. ఈటీవీ ఛానల్‌ ‘ప్రారంభించకముందే రెండు కార్యక్రమాలను నన్ను నిర్వహించమని కోరారు. ‘మనసున మనసై, “ప్రతిధ్వని. ఒకటి కుటుంబపరమైన వినోద కార్యక్రమం. రెండవది రాజకీయ విశ్లేషణాత్మకమైన కార్యక్రమం. ఆ రోజుల్లో “మనసున మనసై చాలా పాపులర్‌ కార్యక్రమం. అలాగే జెమినిలో “ప్రజావేదిక కూడా చాలా మందిని ఆకర్షించింది. వ్యాసాలు రాశాను. కథలు రాశాను. సభలకు పరిగెత్తాను, దేశాలు తిరిగాను. ట్రావెలింగ్స్‌ రాశాను. ఎలిజీలు రాశాను- నన్ను నేను రక్షించుకోవడానికి. నా దుఃఖం నుంచి పారిపోవడానికి. ఒక్కరికే- యిలాంటి మార్గాంతరం లేదు; తెలియదు. నా భార్య! ఆవిడకి నేను పెద్ద గొడుగునయాను. విశాఖలో మా యింటి దగ్గర్లో రిటైరయిన ఓ పోస్టు మాస్టరు ఉండేవారు- విష్ణుభట్ల నరసింహశాస్త్రి. ఆయనకి ఒక్కగానొక్క కూతురు. నాకు ఆనర్స్‌లో జూనియర్‌. అమెరికాలో సెటిలయింది. భర్త, పిల్లలూ. ఆ రోజుల్లో ఇప్పటి ఫోన్లు, కంప్యూటర్లు లేవు. మా యింట్లో ఫోన్‌ ఉండేది. కూతురుతో మాట్లాడడానికి ఆదివారం ఉదయం మా ఇంటికి వచ్చేవారు. ఒక్కోసారి కూతురు ఫోన్‌ చేసేది కాదు. “పని వత్తిడిలో ఉందేమో” అని వెళ్లిపోయేవారు. ఆయన రామకృష్ణ మిషన్‌ సభ్యులు. అతి సాధువు. “మిమ్మల్ని వదిలి వెళ్లిపోయిందని కూతురుమీద కోపం లేదా?” అనడిగేవాడిని. “ఎందుకూ కోపం? దాని బతుకు అది బతుకుతోంది. కాదనడానికి నేనెవర్ని” ఈయన ముఖ్యపాత్రగా ‘సాయంకాలమైంది’ నవల రాశాను. ఆంధ్రప్రభలో ధారవాహికగా ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు ప్రచురించారు. నవలని చదివి వేయి పడగల్ని గుర్తుచేసుకున్నవారు- పిరాట్ల వెంకటేశ్వర్లు, డాక్టరు పప్పు
వేణుగోపాలరావు, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ వంటివారు పాతిక మంది ఉండగా విజయవాడలో కొందరు ‘సాయంకాలమైంది’ అభిమాన సంఘాన్ని ఏర్పరుచుకున్నారు. ఈ నవల అభిమాని మరొకరున్నారు- పి. వి. నరసింహారావు! చదివి పెద్ద ఉత్తరం రాశారు.
ఈ నవలకి తెలుగు విశ్వవిద్యాలయం బహుమతి, వరంగల్లు సహృదయ సాహితి ఉత్తమ నవల బహుమతి వచ్చాయి. అంతకంటే జ్ఞాపకం ఉండిపోయే ప్రశంస ఒకటుంది. నాకు చెర్లపల్లి జైలునుంచి సెన్సారయిన ఉత్తరం ఒకటి వచ్చింది. “చిన్నప్పుడు మీ వేషాలు చూసి ఈ గొల్లపూడిగాడు ఎప్పుడయినా కనిపిస్తే దుడ్డుకర్రతో బుర్ర బద్దలు కొట్టాలనుకొనేవాడిని…” అంటూ *ఈ మధ్య మీ ‘ఎర్రసీత నవల, మీ ‘సాయంకాలమైంది” నవల చదివాను. మనస్సుకి సాంత్వన కలిగింది. మీ అనుమతి తీసుకోకుండానే మీ అభిమానిగా మారిపోయాను” అంటూ ఒక ఖైదీ రెండు పేజీల ఉత్తరం రాసి కింద సంతకం చేశాడు. అడ్రసు; ఖైదీ నంబరు 405, మహానది బ్లాక్‌, పేరు జూలకంటి
శ్రీనివాసరెడ్డి అనే మొద్దు శీను. ఒక హంతకుడిలో ఈ స్పందన నాకు ఎప్పటికప్పుడు గుర్తుకొస్తూంటుంది. అమెరికాలో ఉంటున్న ఓ 26 ఏళ్ల యువకుడు, కేవలం కాన్వెంటు చదువు చదువుకున్నవాడు, సాయంకాలమైంది నవల గురించి విని, కేవలం ఈ నవల చదవడానికి తెలుగు నేర్చుకున్నాడు. ఆ మధ్య అమెరికా వెళ్లినప్పుడు అతను భార్యతో వచ్చి నన్ను కలిశాడు. ఒక నవలకి ఒక దేశపు ప్రధాని, ఒక హంతకుడు, భాషరాని ఒక యువకుడు అభిమానులు కావడం ఏ బహుమతులకన్నా విలువయినవని నా ఉద్దేశం. 56 సంవత్సరాల జీవితాన్ని 56 నిముషాల ప్రసంగంలో కుదించడం అసాధ్యం. అయినా ప్రయత్నిస్తున్నాను. పరిగెత్తుతున్నాను.
నారాయణ రెడ్డిగారికీ, నాకు ఎంతో ఆత్మీయమైన సాంగత్యం. ఆయనకి భారతీయ జ్ఞానపీఠ్‌ పురస్కారం ఇచ్చినప్పుడు మద్రాసులో మిత్రులంతా హోటల్‌ సవేరాలో సత్మారం చేశాం. అప్పుడు నేను ప్రధాన వక్తని. ఆయనకి రాజాలక్ష్మీ ఫౌండేషన్‌ పురస్కారం ఇచ్చినప్పుడు నేను ప్రధాన వక్తని. ఆయన సమగ్ర సాహిత్య 5,6 సంపుటాలు విశాఖలో విడుదల చేసినప్పుడు నేను ప్రధాన వక్తని. నా షష్టిపూర్తికి, నాకు జరిగిన ఎన్నో సన్మానాలకి ఆయన వక్త. నాకు వంగూరి ఫౌండేషన్‌ నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలో ఇచ్చిన జీవిత సాఫల్య పురస్కారాన్ని ఆయన చేతుల మీదుగా అందుకున్నాను. మా ఇద్దరి రచనలతో ఎన్నో సినీమాలు వచ్చాయి. ఆయన పాటల్ని ఎన్నింటినో నటించాను. మాధ్యమాలన్నింటిలో పనిచేయడం ఈ జీవితానికి దక్కిన అదృష్టం. చేపట్టిన ప్రతీ ప్రక్రియా ఒక ల్యాండ్‌ మార్క్‌ కావడం మరో అదృష్టం. తెలుగు సాహిత్య చరిత్రలో గురజాడ అప్పారావు రాసిన కన్నాశుల్కాన్ని ఫుల్‌స్టాపులూ, కామాలూ పొల్లుపోకుండా 42 పాత్రలతో రూపొందించిన బృహత్తర నిర్మాణంలో నేను గిరీశం చేశాను-నా 62వ యేట. అదొక అపూర్వమైన అనుభవం. జీవితంలో ఏనాడూ ఆధునిక నాటకం ఛాయలకురాని శ్రీకృష్ణపాత్రధారి పీసపాటి నరసింహమూర్తిగారిని లుబ్ధావధాన్లు పాత్ర చేయడానికి రాముడు వలస వెళ్లి ఒప్పించాను. ఆయన లుబ్ధావధాన్లు. నా చిన్నతనం నుంచి ఆయన నాటకాల్ని అభిమానిగా చూసిన నేను-ఆయన తమ్ముడు గిరీశం. సిగపట్లు తప్ప పోటీపడి నటించాం. నాటకంలో మా యిద్దరికీ ఒకే సీను. అది చూసిన వారికి చిరస్మరణీయం.
నా రచనల మీద నాలుగు విశ్వవిద్యాలయాల్లో- నా సమగ్ర సాహిత్యం మీదా, నా నాటకాల మీదా, నా నవలల మీదా, నా కాలమ్‌ రచనల మీదా నాలుగు పి.హెచ్‌.డి పట్టాలు తీసుకున్నారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో, నాగార్జున విశ్వవిద్యాలయాల్లో, వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ముగ్గురు ఎమ్‌.ఫిల్‌. సిద్ధాంత వ్యాసాలను రాశారు. నా కొడుకులిద్దరూ ఇంగ్లీషులో ఎమ్మే చదివి ఎమ్‌.ఫిల్‌ చేశారు. ఇద్దరికీ ఎంతో కొంత నేను పాఠాలు చెప్పాను. మా పెద్దబాయి తన 48వ యేట ఎమ్మే చదివాడు. అతనికి షేక్స్పియర్‌, శామ్యూల్‌ బెకెట్స్‌ ఓనీల్‌, జీన్‌ పాల్‌ సాగ్రే, బెక్‌, థియేటర్‌ ఆఫ్‌ ఎబ్సిర్జ్‌, బుచ్చిబాబు బోధించాను. 17 పేపర్లు ఒకే విడతలో రాసి మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి పాసయ్యాడు. తర్వాత నా నాటకం మీద శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎమ్‌.ఫిల్‌. చేశాడు. ప్రముఖ రచయిత మధురాంతకం రాజారాంగారు కొడుకు గొల్లపూడి మారుతిరావు కొడుక్కి గైడ్‌. అంశం? నా నాటకం గోటు హెల్‌. తెలుగు నాటకాన్ని ఇంగ్లీషులో ఎలా
ఉదాహరించను? అన్నాడు మా అబ్బాయి. అతని కోసం నాటకాన్ని ఇంగ్లీషులో రాశాను. ఎమ్‌.ఫిల్‌. విషయం. the color of anger in east and west: a comparitive study of john osbome’s look back in anger and gollapudi marutirao’s “go to hell”
పిల్లలు నా భుజాల మీద నిలబడతారు కనుక ఈ ప్రసంగంలో వారికి ఈ మాత్రం స్థానం.
ఒకప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నా నాటిక ‘కళ్లు” ఎమ్మే క్లాసుకి పాఠ్యగ్రంథం. డాక్టర్‌ అంబేద్మర్‌ విశ్వవిద్యాలయం ఎమ్మే కోర్స్‌లకి కథా చిత్రాలు, వార్తా చిత్రాలకు సిలబస్‌ రాశాను. ఐక్య రాజ్యసమితి అనుబంధ సంస్థ యునెస్కో ప్రాజెక్టుగా 18 విజ్ఞాన సర్వస్వాలు తయారవుతున్నాయి. ఈ అనుబంధ సంస్థ కార్యాలయాలు ఇంగ్లండు, పారిస్‌, అబూదాబీల్లో ఉన్నాయి. ఈ విజ్ఞాన సర్వస్వాలు ఈ భూగ్రహం మీద పర్యావరణానికి సంబంధించిన అన్ని విషయాలను సమగ్రంగా విశ్లేషించే అతి విలువయిన పరిశోధనల గ్రంథాలను ప్రచురిస్తుంది. ఇప్పటికి 800 ఈ బుక్స్‌ని ప్రచురించింది. It has intensive state of art coverage of many disciplines, with contributions by thousands of scholars from over 100 countries and edited by over 395 subject experts. It is rich in iner disciplinary subjects and attempts to forge inter disciplinary pathways between disciplines. ఈ విజ్ఞాన సర్వస్వం
పేరు Encyclopaedia of life suppoting systems. ఈ సర్వస్వాల విషయ నిర్దేశనకు ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల మేధావులతో ఒక సంపాదక మండలి ఉంది. అందులో నేను సభ్యుడిని. అంతేకాదు. ఈ ప్రణాళిక కార్య రూపాన్ని నిర్దేశించే జాయింట్‌ కమిటీలో ప్రపంచంలో కేవలం 14 మందే ఉన్నారు. అందులో నేనొకడిని. ప్రాచీన కాలం నుంచీ మన సాహిత్యంలో మన విజ్ఞాన నిధులలో ఈ స్పృహ ఉన్నదా? ఉంటే ఎలా వుంది? ఈ విషయాల్ని చర్చించే ప్రముఖుల వ్యాసాలతో ‘భారతీయ సాహిత్యం” మీద ఒక సంపుటానికి నేను సంపాదకుడిని. ఇది నాకు దక్కిన అరుదయిన అద్భష్టమనుకుంటాను. నేను ఈ విజ్ఞాన సర్వస్వానికి communication – media sustainable development and catharsis of ideas అనే పరిశోధనా వ్యాసాన్ని రాశాను. ఇది నాకు చాలా తృప్తినిచ్చిన కృషి.
ఇవాళ దాదాపు 40 ఏళ్ల తర్వాత – ఇంటర్నెట్‌లో ‘కౌముది” మాస పత్రికలో నా నవలలు ఈ తరం చదువుతోంది. ఎందరో కొత్త అభిమానులు, యువకులు నన్ను పలకరిస్తున్నారు. ఇప్పుడు కంప్యూటర్‌ నా మొదటి స్నేహితుడు. తెలుగులో నా రచనలు
టైపు చేస్తాను. ఒక బ్లాగ్‌, ఒక ఫేస్‌ బుక్‌ నిర్వహిస్తాను. తెల్లారిలేస్తే కంప్యూటర్‌తోనే నా జీవితం. అదొక వ్యసనం; ఆయుధం; అవకాశం!
ఇక సత్కారాలు, సన్మానాలు, అప్పాజోశ్యుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేoషన్‌ వారి ప్రతిభా జీవిత సాఫల్య పురస్కారం, వంగూరి చిట్టెన్‌రాజు ప్రపంచ తెలుగు మహా సభల జీవిత సాఫల్య పురస్కారం, 96 ఏళ్ల చరిత్ర ఉన్న కాకినాడ యంగ్‌మెన్స్‌ హాపీ క్లబ్‌ జీవిత
సాఫల్య పురస్కారం, కళ్లు నాటికకి, ‘సాయంకాలమైంది” నవలకీ సాహిత్య అకాడమీ పురస్కారం, రెండు ధర్మనిధి పురస్కారాలు, మద్రాసు తెలుగు అకాడమీ తెలుగు వెలుగు పురస్కారాలు, రాజా లక్ష్మీ ప్రత్యేక పురస్కారం, వంశీ బర్మిలీ గురజాడ అప్పారావు బంగారు
పతకం-యివన్నీ పెద్ద జాబితా.
ఈ మధ్య ప్రారంభించిన గొప్ప ఉద్యమం-వందేళ్ల కథకి వందనాలు-ధారావాహిక. హెచ్‌ ఎం టీ వీ ఛానల్‌ ద్వారా ప్రసారమౌతోంది. గత నూరు సంవత్సరాలలో రాసిన ప్రసిద్ధ కథా రచయితల ప్రసిద్ధ కథలు, ఆయా రచయితల పరిచయం, వారి జీవితంలో ముఖ్య ఘట్టాలను ప్రతిఫలించే ఫోటోలు, చేతివ్రాత-చివరగా ఎంపిక చేసిన కథ వైశిష్ట్యాన్ని విశ్లేషించే ప్రత్యేక సంచికా కార్యక్రమమది. ఇదొక పరిశోధనాత్మకమయిన కృషి తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిసారిగా ఆయా వ్యక్తుల వీడియో రికార్డింగు చేశాను. తొంభయ్యో
పడిలో ఉన్న ఎందరో రచయితల్ని రికార్డు చేశాను. మునిపల్లెరాజు, కాళీపట్నం రామారావు, ఘండికోట బ్రహ్మాజీరావు, దాశరధి రంగాచార్య, శివరాజు సుబ్బలక్ష్మి- వీరందరినీ రికార్డు చేశాను. చింతా దీక్షితులుగారబ్బాయి బాలం భట్టు పూనాలో దొరికారు. అడివి బాపిరాజు గారి మనుమరాలు దయాల్బాగ్‌లో ఉన్నారు. నెల్లూరి కేశవస్వామి శాస్రిగారబ్బాయి నరసింహశాస్రిగారు 88, మునిమాణిక్యం నరసింహారావుగారి మనుమరాలు ఎనభయ్యో పడిలో ఉన్నారు. రచయిత ఎస్‌. నటరాజన్‌ (కలం పేరు శారద) చివరివరకూ తెనాలిలో
జంగిడిలో వడలు అమ్ముకు బతికాడు. మూర్చ రోగంతో 42వ యేట పోయాడు. ఆయనతో పేదరికాన్ని ఆకలినీ, దైన్యాన్ని పంచుకున్న ఆలూరి భుజంగరావుగారికి 84 సంవత్సరాలు. ఇవన్నీ తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోగల ఇంటర్వ్యూలు. నాకు
ప్రత్యేకంగా ఒక పాఠశాల. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను. కొందరు రచయితలు సూచించిన 217 కథల నుంచి 116 కథల్ని ఎంపిక చేశాం. ఇప్పటికి 33 కథలు ప్రసారమయాయి. ఈ ధారావాహిక ప్రసారం పూర్తయేనాటికి నాకు 75వస్తాయి.
నేను వారానికి రెండు కాలమ్స్‌ రాస్తాను- తెలుగులో 31 సంవత్సరాలుగా,.. హన్స్‌ ఇండియా ఆంగ్ల దినపత్రికకి సంవత్సరం నుంచి. తెలుగు కాలమ్‌ చాల వెబ్‌ సైట్లలో వస్తుంది. నా జీవితంలో ఒక అసంతృప్తి మిగిలిపోయింది. అది తీరేది కాదు. నేను మీలాగ ఓ పద్ధతిలో తెలుగు చదువుకున్నవాడిని కాదు. అభిరుచిని చుక్కానిగా చేసుకుని తెలుగు వనంలో జొరబడిన వాడిని. చాలా సార్లు- ఇప్పటికీ నా ఆలోచనకి తెలుగు పదాలు లొంగక గింజుకుంటూంటాను. శరీరానికి వచ్చిన వయస్సు మెదడుదాకా ప్రయాణం చెయ్యకుండా అడ్డకట్ట వేశాను. ఆరోగ్యకరమైన ఆనందప్రదమైన జీవితానికి ఒకే రహస్యం-మనది కాని, ఎదుటి వ్యక్తి ఆశించని ‘మంచి” పనిని చేసుకుంటూ పోవడం.
మహాత్ముడు బారిష్టరు చదువు చదివి దక్షిణాఫ్రికాలో చక్కగా ప్రాక్టీసు చేసుకుని ఉంటే మనకే గొడవలేదు. సమాజ హితాన్ని నెత్తిన వేసుకున్నాడు; మహాత్ముడయాడు. పోతన, మదర్‌ థెరిస్సా, ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, గ్రాహం బెల్‌ ఆ పనే చేశారనుకుంటాను.
తలవొంచుకు కృషి చెయ్యి. తల ఎత్తుకు జీవించు.
“ప్రాణము దైవమునొద్ద వడ్డి బేహరమున కప్పుగొంటి,
రుణమంతయు నిమ్మని తల్పుదట్టినన్‌ సరసర హేమనిష్కముల
సంచులు ముందర విప్పి బోసెదన్‌” అన్నారు దువ్వూరి రామిరెడ్డి. అది అహంకారం కాదు. ఆత్మ విశ్వాసం. నా ఆత్మకథలో రాసిన రాబర్ట్‌ బ్రౌనింగ్‌ మూడు ఇంగ్లీషు వాక్యాలతో ఈ తెలుగు ఉపన్యాసాన్ని ముగిస్తాను.
grow old along with me
the best in yet to come
the first for which the last was made
నమస్కారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *