జెరూసలేం

ప్రపంచానికి రాజధాని ఎక్కడుందో తెలుసా? దేశాలకు రాజధానులుంటాయి.. రాజ్యాలకు రాజధానులుంటాయి.. కానీ, ప్రపంచానికి రాజధాని ఉండటం విచిత్రమే. ఇలాంటి రాజధాని ఒకటుందన్న సంగతి ప్రపంచానికే తెలియదు.. కానీ, సమస్త విశ్వాన్ని నడిపిస్తున్నది.. నియంత్రిస్తున్నది.. శాసిస్తున్నది ఒక చిన్న నగరం.. అగ్రరాజ్యాల నుంచి చిన్న దేశాల వరకు అన్ని దేశాలకూ ఇదొక పవిత్ర ప్రదేశం.. 70శాతం జనాభాకు దేవభూమి. ప్రపంచంలో మూడు ప్రధాన మతాలకు ఇది కేంద్ర స్థానం.. జెరూసలెం.. ది సెంటర్ ఆఫ్ ది వరల్డ్..

అదేమీ భూమధ్యరేఖపై నిలుచుని లేదు.. కానీ, భూమికి ఆ ప్రాంతం గరిమనాభి.. అదేమీ సంపన్న నగరం కాదు.. కానీ, ప్రపంచానికి అదే ఆధార భావభూమిక. అదేమీ ఓ దేశ రాజధాని కాదు.. కానీ, ప్రపంచం దాని కనుసన్నల్లో నడుస్తుంది. ఒక ప్రత్యేక ప్రాధాన్యత అంటూ ఏదీ లేని నగరం కానీ, ప్రపంచానికి ఏకైక ప్రధానంగా మారిన నగరమిది…

ప్రపంచంలోని మూడు ప్రధాన మతాలు
యూదు
క్రైస్తవం
ఇస్లాం
మూడింటికీ అది పవిత్ర ప్రదేశం
అసంఖ్యాక ప్రజల మూలాలను
ఇముడ్చుకున్న ప్రదేశం

ఒక చిన్న నగరం ఇవాళ విశ్వాన్ని శాసిస్తోంది.. అక్కడ యూదుమతం పుట్టింది.. ఆ తరువాత రెండు పాయలుగా క్రిస్టియానిటీ, ఇస్లాంలు ఆవిర్భవించాయి. అందుకే జెరూసలేం.. ప్రపంచానికి కేంద్ర స్థానమై నిలుచుంది.. దేవదేవుడి కుమారుల పవిత్ర పాదస్పర్శతో పునీతమైన నగరం జెరూసలేం..

ఏకేశ్వరోపాసన చేసే మూడు మతాలకు ఈ నగరం పునాది వేసింది. మధ్యప్రాచ్యంలో ఎక్కడో మారుమూలన ఉన్న ఈ నగరం నుంచి విస్తరించిన ఈ మతాలు ఇవాళ సమస్త విశ్వాన్ని నియంత్రిస్తున్నాయి. రోజూ కోటాను కోట్లమంది ప్రజలు దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చే పుణ్యక్షేత్రం ఇది.

డేవిడ్
ఇబ్రహిమ్
జీసస్
మహమ్మద్

నలుగురు మహాపురుషులు ఈ ప్రపంచానికి మార్గదర్శనం చేశారు..అడ్డంకులన్నింటినీ అధిగమించి ప్రజానీకాన్ని నూతన మత మార్గంలో ప్రవేశపెట్టిన దివ్యపురుషులు వీరు. మన కళ్లముందు నడయాడిన విశ్వ గురువులు వీరు. మనిషి రూపంలో అవతరించిన దేవదేవుళ్లు.. ఛిన్నాభిన్నమైపోతున్న సమాజాన్ని తమదైన రీతిలో ఉద్ధరించి.. అనంతమైన ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించిన వాళ్లు.. మహామహిమాన్వితులు నడయాడిన పవిత్రమైన భూమి.. జెరూసలెం.
దాదాపు నాలుగు వేల సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ప్రయాణంతో జెరూసలేం చరిత్ర ప్రారంభమైంది.. ఇబ్రహిం అనే ఒక వ్యక్తి సుదూర ప్రయాణం చేసి చేరుకున్న గమ్యం జెరూసలేం… ఇబ్రహిం గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువే.. కానీ, ఆ ఇబ్రహిం కోట్ల మందికి ఇవాళ ఆరాధ్య దైవం.. యూదులకు, క్రిస్టియన్లకు, ముస్లింలకు ఆయన దైవంతో సమానం.. ఈ మూడు మతాలకు ఒక విధంగా మూలపురుషుడనదగ్గవాడు ఇబ్రహిం.. ఇతని ప్రభావం వల్లే జెరూసలేం ప్రపంచానికి భక్తికేంద్రం అయింది.
హిబ్రూ బైబిల్ కథనం ప్రకారం ఇప్పుడు ఇరాక్‌లో ఉన్న ఒరు నగరం నుంచి వందల మైళ్ల దూరం ప్రయాణించి జెరూసలెంకు ఇబ్రహిం చేరుకున్నాడు.. ఇబ్రహిం దేవుడిని చూశాడు.. దేవుడితో మాట్లాడాడు.. దేవుడి ఆదేశం ప్రకారమే ఇరాక్‌నుంచి బయలు దేరాడు.. దూరతీరాలకు చేరుకున్నాడు..
జెరూసలేం నిర్మాణం పూర్తిగా దేవుడు చేసిందేనని చెప్తారు.. ఇబ్రహిం జెరూసలేం చేరుకునే నాటికి అదొక చిన్న గ్రామం.. కొన్ని ఇళ్లు.. కొన్ని పశువులు.. కొందరు మనుషులు నివసిస్తుండేవారు.. ఆ గ్రామాన్ని నగరంగా ఇబ్రహిం పునర్మిర్మాణం చేశాడు.. నీరు వంటి సహజవనరులను నగరానికి అండర్‌గ్రౌండ్ ద్వారా సప్లైచేయటానికి ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పాడు.. ప్రజలను భక్తిమార్గంలో నడిపించేందుకు ప్రార్థనామందిరాల్ని నిర్మించాడు.
ఏడవ శతాబ్దపు తొలినాళ్లు.. పవిత్రమైన ఇస్లాం మతం ఆవిర్భవించిన సందర్భం.. మహమ్మద్ ప్రవక్త జెరూసలేంకు సుమారు ఎనిమిది వందల మైళ్ల దూరంలో మక్కాలో జన్మించాడు. ఇతను ఇబ్రహింకు ప్రత్యక్ష వారసుడు. ఇబ్రహిం కుమారుడు ఇస్మాయిల్ సంతానంగా దాదాపు క్రీస్తు శకం 570లో మహమ్మద్ ప్రవక్త జన్మించాడు.
ఇస్లాం అంటే భగవంతుడికి ఆత్మ సమర్పణం చేసుకోవటం.. మహమ్మద్ ప్రవక్త ద్వారా లోకానికి దేవుడు తనను చేరుకోవటానికి చూపించిన మార్గం. మక్కాలో ఒకరోజున మహమ్మద్ ప్రవక్త ధ్యానంలో ఉండగా దేవుడు ఆయనతో మాట్లాడాడని పవిత్ర ఖురాన్ చెప్తోంది. ఆయన ఆదేశాలను అక్షర రూపంలో కూర్చి ఖురాన్‌గా మహమ్మద్ ప్రవక్త తీర్చి దిద్దాడు.. ఇస్లామ్ మతంలో అత్యున్నతమైన స్థానం ఖురాన్‌దే.
ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం దేవదూతగా భూమ్మీద మానవ ప్రపంచానికి సందేశం తీసుకువచ్చినవాడు.. మహమ్మద్ మాత్రమే దేవుడి కుమారుడు.. ఆయన మక్కా కేంద్రంగానే మత ప్రచారాన్ని చేశాడు.. ఆయన అనుచరులంతా వందల మైళ్ల దూరంలోని మక్కానుంచే మత విస్తరణ సాగించారు.. అయినప్పటికీ వీరందరికీ జెరూసలెం ఒక పవిత్రప్రదేశమే.
జెరూసలెంకు మహమ్మద్ ప్రవక్త రాత్రి పూట ప్రయాణం చేసి అల్ మస్జీద్ అల్ అక్సా అనే ప్రాంతానికి వచ్చాడట.. ఇక్కడికి వచ్చిన తరువాత ఆయన స్వర్గంతో ఏడు దశల్లో జెరూసలేంను అనుసంధానం చేశాడట. ఈ ప్రాంతంలోనే అనేక ప్రవక్తలను పిలిచి వాళ్లకు జ్ఞానోదయం కల్పించాడు…
మహమ్మద్ ప్రవక్త ఎంత గొప్పవాడంటే.. ఆయన్ను సమకాలంలో నడిచే దేవుడని పిలిచేవారు.. ఆయన పలుకులు వినిపించేవి.. ఆయన శరీరం కనిపించేది.. ఆయన నడక తెలిసి వచ్చేది.. కానీ, ఆయన ముఖం మాత్రం ఎవరికీ కనిపించేది కాదు.. ఆయన ముఖం మాత్రం అదృశ్యంగా ఉండేది.. ఏమిటో అర్థం కాదు.. జెరూసలేంలో ఆయన బోధనలు విన్న ప్రవక్తలందరికీ ఆశ్చర్యమేసిందిట.. అంత గొప్పవాడు మహమ్మద్…
ఇస్లామ్ సంప్రదాయం ప్రకారం ముస్లింలకు మక్కా, మదీనాలతో పాటు జెరూసలేం కూడా చాలా ముఖ్యమైంది.. సున్నీ తెగ ముస్లింలకు ఇది చాలా కీలకమైన ఆధ్యాత్మిక ప్రదేశం.. క్రీస్తు పూర్వం 620లో మహమ్మద్ ప్రవక్త తాను మస్జీద్ అల్ అక్సాకు వచ్చినప్పుడు మొట్టమొదట ప్రార్థనా పద్ధతిని ఉపదేశించాడు.. అల్‌అక్సాను యాత్రాస్థలంగా, పవిత్రమైన భక్తి ప్రదేశంగా ఆయన ప్రకటించాడు.
జెరూసలెం వచ్చేప్పుడు ఆయన అద్భుతమైన బురాక్ అనే వాహనంపై వచ్చాడట.. ఆయన ప్రయాణించినప్పుడు రెక్కలు ధరించి ఉన్నాడని ఇస్లాం చెప్తుంది. అల్ అక్సాకు మరో ప్రత్యేకత కూడా ఉంది.. ఇది ఆధ్యాత్మిక ప్రపంచంలో అత్యున్నతమైందని ఖురాన్ చెప్తుంది. మహమ్మద్ ప్రవక్త అల్‌అక్సాలోనే అబ్రహం, మోసెస్, జీసస్ వంటి ఇతర మత ప్రవక్తలను ఇక్కడే కలుసుకున్నాడని ఖురాన్ చెప్తుంది.
అబ్రహం, డేవిడ్, సాలమన్‌లతో పాటు జీసస్‌ను కూడా ఇస్లాం ప్రవక్తగానే భావిస్తుంది.. వాళ్లకు సంబంధించిన కథనాలు కూడా ఖురాన్‌లో ఉన్నాయి. అల్‌అక్సా మసీదును సరిగ్గా ఎప్పుడు ఎవరు నిర్మించారనేది స్పష్టంగా తెలియకపోయినా.. ఒకే సారి దాదాపు మూడు వేల మంది ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు వీలైనంత విశాలంగా ఉంటుంది. అద్భుతమైన నిర్మాణ శైలి దీని సొంతం..
క్రీస్తు శకం 632 నాటికి ఆరేబియన్ దేశాల్లో ఇస్లాం సంపూర్ణంగా విస్తరించింది. ఇస్లాం రాజులు 638 నాటికి జెరూసలేం చేరుకున్నారు.. జెరూసలెంపై ఆధిపత్యం సంపాదించారు.. అక్కడి నుంచి ధార్మిక ప్రచారం, మత విస్తరణ జరిగింది.. ఘర్షణలు జరిగినప్పటికీ, టెంపుల్‌మౌంట్ కానీ, క్రీస్తు పుట్టిన ప్రాంతాల్లో మత విశ్వాసాలపై దాడి జరగలేదు. ఇస్లామిక్ నేతలు 70 యూదు కుటుంబాలను జెరూసలేంలో ఉండేందుకు అనుమతించారు.. దక్షిణ జెరూసలేంలో అద్భుతమైన మసీదును నిర్మించారు.. రంగు రంగుల అంద్దాలు, స్తంభాలు.. కుడ్యాలు, తోరణాలతో ఈ మసీదు ఒక అత్యద్భుతం.
టెంపుల్‌మౌంట్‌లోని అల్ అక్సా మసీదు చాలా సార్లు నిర్మాణం చేసుకుంది.. యుద్ధాలు.. ఘర్షణల్లో విధ్వంసం కావటం.. తిరిగి నిర్మాణం చేసుకుంది.. అల్ అక్సా.. ఇస్లాం మతానికి సంబంధించి అత్యంత పవిత్రమైన ప్రార్థనామందిరం ఇది.. దీని పై ఉన్న డోమ్ రాక్ ఒక్కటే అపురూప నిర్మాణం.
అల్ అక్సా మసీదులో ఒకేసారి వేల మంది ప్రార్థన చేసుకునే వీలు మాత్రమే కాదు.. ఇది మిగతా మతాల వారికీ ఒక వండర్ ఆఫ్‌ది వరల్డ్. విశాలమైన భవంతి.. అందమైన పాలరాతి స్తంభాలు… పధ్నాలుగు తోరణ ద్వారాలు.. వందకు పైగా రంగు రంగుల అద్దాల కిటికీలు.. చూస్తున్న కొద్దీ చూడాలనిపించే అపురూప నిర్మాణం ఇది.
మధ్య హాల్ ఏ దిశలో ప్రార్థన చేసుకోవాలో సంకేత ప్రాయంగా నిర్మించారు.. క్రీస్తు శకం 692లో ఖలీఫ్ అబీదా మాలిక్ ఈ మసీదుపై మరో అద్భుత నిర్మాణం చేశాడు.. అద్భుతమైన రాతి గుమ్మటాన్ని నిర్మించాడు..ప్రపంచంలో బహుశా ఏ భవనంలోనూ ఇన్ని రకాల రంగులను ఉపయోగించలేదేమో.. అల్యూమినియం అల్లాయ్‌తో పాటు బంగారు తాపడాన్ని చేసిన ఈ గుమ్మటం ప్రపంచంలోని ఇస్లాం ప్రార్థనామందిరాల్లోకెల్లా అందమైందనే చెప్పాలి.
ఈ గుమ్మటం లోపలి వైపు గోడలను మొజాయిక్‌లతో.. మంచి డిజైనింగ్‌తో ఇస్లామిక్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్‌ను కనీవినీ ఎరుగని రీతిలో ప్రతిబింబించాడు. ఎనిమిది మూలలు నాలుగు ప్రధాన ద్వారాలు.. 16 కిటికీలతో అపూర్వంగా నిర్మించారు. ఇది రిమార్కబుల్ కన్‌స్ట్రక్షన్ ఇన్‌ది ఇస్లామిక్ వరల్డ్.
ఇందులో మధ్యలో ఉన్న అతి పెద్ద రాయే దేవుడితో సమానంగా భావిస్తారు.. ఈ రాతిపైనే మహమ్మద్ ప్రవక్త మొట్టమొదటి ప్రార్థనా విధానాన్ని ప్రబోధించాడు.. ఇక్కడ ఆయన పదహారు మాసాలు ఉన్నాడు.. ఆయన తరువాత ఆయన అనుచరులు చాలామంది ఇక్కడి నుంచి ఇస్లాంను విస్తరించారు.. ఇక్కడే సమాధి పొందారు.. వీళ్ల సమాధులను మనం చూడవచ్చు.
తరువాత శతాబ్దాల పాటు జెరూసలేం రకరకాల ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారుతూనే ఉంది. కానీ, అయినా జెరూసలేం ఇస్లాంతో పాటు మిగతా మతాలకు ఏకైక ఆధ్యాత్మిక క్షేత్రంగా చెక్కుచెదరని విశ్వాసంతో కొనసాగుతోంది. కాలం మారవచ్చు.. చరిత్ర మారవచ్చు.. మనుషులు మారవచ్చు.. సమాజం మారవచ్చు.. కానీ, ఒక్కటి మాత్రం మారలేదు.. 21శతాబ్దంలో ఆధునిక జీవితం రకరకాల మార్పులు చోటుచేసుకోవచ్చు. కానీ, ఈ ఒక్క ప్రదేశం.. జెరూసలేం ఎప్పుడూ దేవుడి గురించి మాట్లాడుతూనే ఉంటుంది.. ఇక్కడి ప్రతి మట్టి కణంలోనూ దేవుడి కోసం అన్వేషణ సాగుతూనే ఉంటుంది. ప్రతి రోజూ.. ప్రతి గంటా.. ప్రతి క్షణం ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి లక్షల మంది ప్రజలు జెరూసలేంను తమ ఆధ్యాత్మిక గమ్యంగా భావిస్తారు.

కోవెల సంతోష్ కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *