కాళోజి నారాయణరావు

మూడు భాషల మధ్య పుట్టి పెరిగిన జీవితం నాది. తెలుగయినా, ఉర్దూ అయినా, ఇంగ్లీషయినా అన్నిటికన్నా ఎక్కువ చదువుకుంది ఉర్దూ – పదివాచకాలు. తెలుగు చదువుకున్నది నాలుగు వాచకాలు. అప్పటి రాజ్యం నైజాము

నవాబుది. దీనికి సంబంధించిన భాష – సర్కారు భాష విద్యాభాష అంతా ఉర్దూ.  ఇంట్లో పరిస్థితి ఎటువంటిది? నాయనగారు కాళోజీ రంగారావుగారు ఉర్దూ, పారసీలలో పండితులు, ఇంగ్లీషులో కూడా. ఆయనకు అన్నిటికంటే తక్కువ వచ్చింది తెలుగే. ఆయన పెళ్లి చేసుకున్నది మహారాష్ట్ర, కర్ణాటక వాళ్లని. నాకు ఎనభై, మా అన్నకు ఎనభై ఏడంటే, పెళ్లయిన పధ్నాలుగు సంవత్సరాల తర్వాత మా అన్న పుట్టాడంటే ఆ పెళ్లి ఎప్పుడు జరిగిందో తెలుస్తుంది. మహారాష్ట్ర కర్ణాటకకు సంబంధించినవారు, హనుమకొండకు సంబంధించినటువంటి తెలుగువారు, ఉర్దూ

ఫారసీ పండితుడు వీరితో వివాహం. అ కుటుంబంలోకి ఈ భాషలన్నీ ఎట్లా వచ్చినై అని చెప్పడావికీ ఈ సంగతులన్నీ చెప్పువలసి వచ్చింది.  పెల్లి పిల్లవైపు వాళ్ళు – ముఖ్యంగా ముసలివాళ్లకు – కన్నడం తప్పు మరో భాష రాదు. పెళ్లి కొడుకు వైపు నుంచి వచ్చిన ముసలి వాళ్లకు తెలుగు తప్పు ఇంకో భాష రాదు. ఏదన్నా పురుషులకు కొద్దిగా వస్తే

ఉర్దూ వస్తుంది. అటు మహారాష్ట్ర కర్ణాటక వాళ్లకు కూడా ఉర్దూ కొంతవచ్చు. పురుషులు మాట్లాడుకోవడానికి ఉర్దూ ఉంది. ఆడవాళ్ళు ఆడవాళ్ళు మాట్లాడు కోవడానికి భాషలేదు. పెళ్లి జరిగిందెక్కడా? తిరుపతిలో. కాపురానికి వచ్చింతర్వాత మరి ఏం మాట్లాడుకోవాలి వీళ్లిద్దరూ! ఆమెకు ఉర్దూ రాదాయె, తెలుగు రాదాయె.

ఈయనకు మరాఠి రాదాయె, కన్నడం రాదాయె. కొద్దిగా ఉర్దూ మాట్టాడితే తెలిసేదామెకు. మా తల్లితండ్రిగారు ఆర్య సమాజస్థులు. మా మేనమామలంతా ఆర్యసమాజ్‌కు సంబంధించినవాళ్ళు. కాబట్టి ఆమెకు హిందీ తెలుసు. ఈయన

ఉర్దూవాడేకాబట్టి ఉర్దూలో మాట్లాడేవాడు. ఆమె మరాఠీలో మాట్టాడేది. ఈయన కూడా మరాఠి ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు. అది వారి సంసారం ఆరంభం. అయితే చచ్చిపోయే వరకు కూడా నాయన ఉర్దూయే మాట్లాడేవాడు; అమ్మ మరాఠియే మాట్టాడేది. తరువాత ఆయన మరాఠి నేర్చుకున్నాడు. ఆమె తెలుగు

నేర్చుకున్నది. చచ్చేనాటికి కూడా ఆమె లేవలేని స్థితిలో కూడా కోడళ్లైవరన్నా ఆంధ్రప్రభో ఏదో ఇట్లా పట్టుకురావాలి – ఆమెకు కళ్లజోడు పెట్టి ఆమె చదువుకునేది. అంతవచ్చినా కానీ మొదటి అలవాటు మాత్రం పోలేదు. ఇది వారిద్దరి సంగతి.

మరి మాగతి ఏవిటి? అయ్యుతోటి ఉర్దూ, అమ్మతోటి మరాఠి, ఇరుగుపారుగులతోటి తెలుగు, కాని ఎంతలాభం కలిగింది. మూడు భాషలు మాతృభాషలుగా మాకు వచ్చేశాయి. ఎప్పుడైనా మేనమామ వచ్చేవారు. ఆయన సంస్కృతంలో మహా

పండితుడు, శాస్త్రి, వేదతీర్థ,. గంగ ఒడ్డున ఒక గురుకులం పెట్టాడు. 14వ ఏటనో 16వ ఏటనో వెళ్ళిపోయినవాడు 87వ ఏట మరణించాడు. ఆయన సంస్కృతం నేర్చుకోండిరా అంటే మేం వినలా ఆయనమాట. ఇటు నాయనగారు ఫారసీ

వేర్చుకోండిరా అంటే ఈయన మాటావినలేదు. ఏదో ఉర్దూ ఎటూ వచ్చేసింది. ఈ విధంగా మేం పెరిగిన వాళ్లం,

సంఘ సేవ చేసే మహానుభావులంతా మాయింటికి రావటం, చారిత్రకంగా ఏదన్నా పరిశోధన చేసేవారంతా రావడం, ఆర్య సమాజికులందరూ రావడం, పండితులు రావడం, రాజకీయవాదులందరు రావడం, ఉండడం, అందువల్లని

మా ఇంట్లో అన్నిటితోను పరిచయం. ఈ మడికొండ ఎటువంటి గ్రామం? నేను పుట్టుడానికి ఒక సంవత్సరం ముందు 1913 లో శ్రీపాద కృష్టమూర్తి శాస్త్రి మడికొండకు వచ్చాడు. ఆ ఊళ్లో తవుటింటి గోపాలరెడ్డి అని ఒక పెద్దాయన

చదువుకున్న వాడుండేవాడు. ఆయనతో సన్మానం పొందాడు. బ్రాహ్మణులు,  పండితులు వచ్చినట్లయితే ఉండడానికి ఆయన తన బంగళాలోనే ధర్మశాల నొకదాన్ని కట్టించాడు. ఒక పుస్తకం 1913లో గోపాలరెడ్డి గారి కంకితం ఇచ్చాడు. ఆ ఊళ్ళో పండితులు అనుముల కృష్ణమూర్తి తండ్రి అనుముల పండరి శాస్త్రి. ఆయన 14 సంవత్సరాలు బెనారస్ లో ఉండి విద్వాంసుడై వచ్చినాడు. కృష్ణమూర్తి పెదనాయన పెద్దయ్య శాస్త్రిగారు వేదాంతి. వారి తండ్రిగారు 115 సంవత్సరాలు బ్రతికాడు. గురుస్థానంలో ఉండేవాడు. సంవత్సరానికోసారి 15 రోజులేవో ఉత్సవాలు జరిగేవి. కృష్ణమూర్తికి పెంపకం పోయిన విశ్వనాథశాస్త్రిగారు వైయాకరణి. ఇది ఆ వూళ్ళో సంగతి.

శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారు ప్రతి సంవత్సరం వచ్చేవారు. గోపాల్‌రెడ్డి గారింట్లో ఈ పండితులంతా ఏవో చర్చలు చేసేవారు. ఇంకా వానమామలై వరదాచార్యులగారి పెద్దన్నగారు వెంకటాచార్యులుగారు – ఈ పేర్లన్నీ రావండి; ఎక్కడా సాహిత్య చరిత్రల్లో రావు – వానమామలై వరదాచార్యులుగారు ఆయన తమ్ముడు లక్ష్మణాచార్యులుగారు. వరదాచార్యులుగారికి చాలా సంతానం. అ కుటుంబంలో రెండో పూటకు భోజనం ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఇంకా రెండో వారు మానాయనగారు. వారుకూడా అంతే మహానుభావులు. రెండో పూట ఉన్నది అనేది లేదు. 1916 నుండి 24 వరకు మడికొండలో ఉన్నాం. 1920లో గ్రంథాలయం స్థాపింపబడ్డ దక్కడ. మేం ఆరేళ్ల వాళ్లం. ఆ గ్రంథాలయం నైజాం రాష్ట్రంలోనే

తెలుగువారి గ్రంథాలయాళ్లో నాలుగవది. 1901లో కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, 1904లో హనుమకొండలో రాజరాజనరేంద్ర భాషానిలయం, 1913 మట్టెవాడలో శబ్దానుశాసన గ్రంథాలయం, 1920లో ప్రతాపరుద్రాంధ్ర

భాషానిలయం మడికొండలో వచ్చినది. ఆ భాషానిలయాన్ని స్థాపించకముందే రామలక్ష్మణ విద్యాలయం అని ఒక విద్యాలయం ఉందక్కడ ప్రయివేటుది. దానికి గస్తినిశాన్‌ తిర్చున్‌ అనేది వచ్చి ప్రైవేట్‌ స్కూళ్ళు రద్దు చేసేదాంట్లో అది కూడా రద్దయి పోయింది, విద్యాలయాలు ఉండవద్దని. లైబ్రరీ పెట్టడం అంటే పెద్ద టెర్రరిస్టు మూమెంట్‌చేసి ఏదో ఉద్యమం సాధించినట్టు. పత్రిక చదవడం అంటే సర్కారుకు ప్రమాదం చేసినట్టు, ఖాదీ తొడగడం అంటే ఇంకేమీలేదు అంతే.

అటువంటి పరిస్టితుల్లో వెంకటాచార్యులుగారు, రంగారావుగారు వీరిద్దరు ఇంగ్లీషు, ఉర్దూ, ఫారసీ-ఎవరన్నా “లా”కు పోదలచుకున్నారంటే ‘కానూన్‌’ పాఠాలు చెప్పేవాళ్ళు. వాళ్లు హిస్టరీ జాగ్రఫీ సంస్కృతం చెప్పేవాళ్లు. తెలుగు

వెంకటాచార్యులు గారు చెప్పేవారు. రమాబాయమ్మగారని ఉండేవారు. ఆమె ఇంట్లోనే ఉండేవారు. అక్కడకు వచ్చి పాఠాలు చెప్పేవారు. రంగారావు ఉదయం నాలుగు గంటలకే లేచి ఈ 29, 30. మంది విద్యార్దులను తీసికొని ఊరు బయటకు వెళ్లి అక్కడ వ్యాయామం చేయించి, కుస్తీ నేర్చి, మళ్లీ ఊళ్లోకొచ్చేవారు. ప్రతి శుక్రవారం అప్పుడు సెలవు. ఆదివారం కాదు. ప్రతి శుక్రవారం వక్తృత్వ పోటీలు. పద్యాలు చదివించే పోటీలు. 1924 వరకు మా మడికొండలో ఈ విద్యాలయంలో చదువుకున్నవారు ఒక పదివుంది ఉర్దూ కవులు, ఒక ఇరవైవుంది తెలుగు కవులుండేవారు. మోత్కూరు వారని వారి భవనంలో నాటకం అడుతూఉంటే ఒక వెయ్యిమంది కూర్చునే స్టలం ఉండేది. అక్కడ వానమామలై వరదాచారి, జగన్నాధాచారి, కాళోజీ రామేశ్వరరావు, సాంబ సిద్దయ్య, వీరయ్య, పొన్నాయిల వెంకటి, వీళ్లంతా డ్రామాలాడేది – గయోపాఖ్యానం మొదలైనవి. అటువంటి వాతావరణంలో పెరిగిన వాళ్లో నేను.

పదేళ్లకో ఎనిమిదేళ్లకో దక్షిణాదిలో కాంగ్రెస్‌ మహాసభలు జరిగితే మామగారు ఏ.ఐ.సి.సి. సభ్యులుకాబట్టి హాజరయ్యేవారు. 1923లో కాకినాడలో జరిగాయి సభలు, మా మామగారు మహా సభలకు హాజరయి తిరుగు ‘ప్రయాణంలో హైదరాబాదుకు వస్తే ఆయనను కలవడానికి మా అన్నయ్యగారు, నాన్న, నేను హైదరాబాదుకు వచ్చి, రెండు మూడు రోజులున్నాము. వారిద్వారా కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ రాజకీయాలు తెలుసుకోవడం. ఆయనెవరో కాంగ్రెసవాడట, 17 సార్లు జైలుకు పోయాడట అని మా వెనుక సి.ఐ.డీ.లు. మా అమ్మ చదువుకున్నది. ఆర్య సమాజస్థులు కాబట్టీ మా మేనమామగారిని హరిద్వార్‌ పంపారు చదువుకోడానికి, ఆనాడు మహాపండితులు, మహాత్యాగులు ఎంతో మంది. ఉత్తర దేశంలో కానీయండి, దక్షిణ దేశంలో కానీయండి అనాడు కాంగ్రెస్‌ నాయకుల్లో 60 శాతం మంది ఆర్య సమాజీయులే. ఇక్కడ హైదరాబాదు సంస్థానంలో కూడా ప్రజల్లో చైతన్యం తెచ్చిన ఉద్యమం నిర్వహించిన సంస్థ ఏదీ అంటే మొట్టమొదటిది ఆర్య సమాజ్‌ సంస్థయే. ఆర్య సమాజ్‌ స్థాపింపబడే ఇప్పుటికి 150 ఏళ్లు కావచ్చు. ఆర్యసమాజ్‌ సంస్థ, బ్రహ్మ సమాజ్‌ భవనం, థియోసోఫికల్‌ సొసైటీ, కృష్ట్ణదేవరాయాంధ్ర భాషానిలయం, ఇవన్నీ ఎక్కడున్నయో చూడండి. ఇప్పుటి ఉమెన్స్‌ కాలేజి.. నాడు రెసిడెంట్స్‌ కోర్ట్.  అటు చాదర్‌ఘాట్‌ నుంచి ఇటు ట్రూప్‌బజార్‌ దాకా రెసిడెన్సీ ఏరియా. చాదర్‌ఘాట్‌ దగ్గర భాగ్యరెడ్డి వర్మగారి ఆది హిందూ స్కూలు, కృష్ణదేవరాయాం[ధ భాషానిలయం, ఆర్య సమాజ్‌, మాడపాటి హనుమంతరావుగారి నివాసము- ఇవన్నీ ఈ ఏరియాలోనే ఉండేవి. ఇక్కడ కొంత స్వేచ్చ ఉండేది. పబ్లిక్‌ యాక్టివిటీ ఉండేది. ఊపిరి తీసుకోవటానికి వీలుండేటటువంటిది రెసిడెన్సీ ఏరియా. బ్రిటిషిండియాలో మొదలయ్యే టటువంటివి ఏ ఉద్యమాలయినా, ఏ కొద్దిగానయినా. హనుమంతరావు పంతులు గారు ప్రభుత్వోద్యోగి. వరంగల్లులో ఎడ్యుకేషన్‌ డిపార్టుమెంట్‌లో పనిచేశారు. తరువాత నిజాం ప్రభుత్వంలో తాలీమాత్‌ ( విద్యాశాఖ) లో పనిచేశారు. పరీక్ష పాసైన తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన ఆంధ్రోద్యమానికి పితామహుడు.

ప్రతాపరెడ్డి పండితుడు, దేనికయినా మొదటి అధ్యక్షుడాయన. ఆయుర్వేద కాన్ఫరెన్సు జరిగితే అధ్యక్షుడు ప్రతాపరెడ్డి. గ్రంథాలయోద్యమ ప్రారంభానికి సభ జరిగితే ఆయనె ఆధ్యక్షుడు ‘ప్రతాపరెడ్డీ. ఆంధ్ర మహాసభకు మొదటి అధ్యక్షు డెవరయ్యా అంటే ప్రతాపరెడ్డి. పదమూడు నుహాసభలు జరిగాయి. ప్రతాపరెడ్డి, రామకృష్ణుడు, రంగారాయుడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడింతర్వాత మొదటి మహాసభ జరిగింది వరంగల్లులో. అదొక చరిత్ర. రాజేశ్వరరావు గారి భవనం అవరణలోపట ఒక పదిహేను, ఇరవయి వేల మంది కూర్చునేటునంటి పందిరి వేయించారు. అక్కడ పుస్తక ప్రదర్శన. ఆ ప్రదర్శనలో ముద్రిత, అముద్రిత గ్రంథాలు తీసికొనివచ్చి పెట్టి, ఆదిరాజు వీరభద్రరావు గారితో ఆ ప్రదర్శన ప్రారంభించారు.

దాని ఆహ్వన సంఘానికి కార్యదర్శి కాళోజీ. అధ్యక్షుడు ఒద్దిరాజు రాజేశ్వరరావు. రెండున్నర రోజులు సభ జరిగింది. వారి యిల్లు వరంగల్లుకు హనుమకొండకు మధ్య ఉంది. తెలంగాణ జిల్లాల నుంచే 300 మంది వచ్చారు. వచ్చినవాళ్లంతా హనుమకొండ – వరంగల్లు వాళ్లతో సహా అక్కడే భోంచేసారు. 3000 మందికి మూడు రోజులు భోజనం. ఆ పందిళ్లు వేయించిన, అంతా ఖర్చు వారిదే. కవి సమ్మేళనం పెట్టాం. ఆ “కవి సమ్మేళనం కోటలో ఎందుకు పెట్టుకోకూడదని ఆలోచన వచ్చింది కాళోజీకి, కలెక్టర్ కు  చెప్తే అది ఆర్కియాలజీ డిపార్టుమెంటుకు సంబంధించింది, అది ఎవరికి ఇవ్వరు, వీల్లేదు అన్నాడు. సరే అని కోట భవనాల శిథిలాల పక్కకు ఒకరి పాలంలో పందిళ్లు వేయించాం. రేపు ఒంటి గంట నుంచో రెండ గంటల నుంచో ప్రారంభం -ఈ కవి సమ్మేళనం. ఇవాళ సాయం త్రం వచ్చి పందిళ్లు కాలబెట్టారు. ఉర్దూ లేకుంటే అది ఉర్దూకు వ్యతిరేకమన్నమాట, non urdu is anti urdu.. anti urdu is anti state. ఉర్దూ కానిది ఉర్దూకు శత్రువు. ఉర్దూకు శత్రువువైంది సంస్థానానికి, రాజ్యానికి  శత్రువు. తురకవాడు- లేకపోతే తురకవాడికి విరోధి. తురకవాడికి విరోధి కాబట్టి రాజ్యానికి విరోధి. ఈ విధంగా పందిళ్లు కాలబెట్టారు. తెలుగు అభిమానులంతా కాపాడడానికి పోయారు. వాళ్లతో దెబ్బలాడారు. దెబ్బలాట జరిగింది. కొట్టాడుకోవద్దు అని చెప్పాం మేం కాంగ్రెస్‌ వాళ్లం కదా! వీళ్లని వాళ్లని ఆపాలని పోయి ఆడవాల సత్యనారాయణ అనే యువకుడు, ఎం. ఎస్‌. రాజయ్య అనేవాడు అప్పుడు బి.ఏ., చదువుతున్నవాడు వాళ్ల వీళ్ల లాఠీ దెబ్బలకు మూర్చపోయి ఆస్పత్రి పాలయ్యారు. కాళోజీ పంతమేమిటంటే అక్కడే ఆ శిధిలాలలోనే జరగాలి.

హనుమంతరావుగారున్నారు, ప్రతాపరెడ్డిగారున్నారు, రామకృష్ణరావుగారున్నారు. ముసుపట్టు పట్టాభిరామారావు గారనే వారు కవిసమ్మెళనానికి అధ్యక్షులు. మూడురోజుల మహా సభలకు ప్రతాపరెడ్డిగారు అధ్యక్షులు. ప్రాచీనమయిన శిథిలాలే కాకుండా ప్రత్యేకించి ఆనాడు వేసుకున్న పందిళ్ల శిథిలాలలో కూడా కవిసమ్మేళనం జరిగింది. దాశరథి మొదలయిన 60 మంది కవులు ఇత్తెహాదుల్‌ ముసల్మీన్‌ వారిని కూడా పిలిపించుకొని కూర్చుండ బెట్టుకొని చూడండి, ఏం జరుగుతుందోనని చూపించాం. దాశరథి, వరదాచార్యులు మొదలుయిన వాళ్లంతా ఏమికోట అది! ఏమీ శిల్పాలవి అని! కవిత్వం చదివారు. ‘శిల్పి’ అన్న కవిత దాశరథి రాసిందక్కడ. అనాడు గాయపడి దెబ్బతిన్న నంది ఈనాడు కూడా గడ్డికరవడంలేదన్నాడు తన పద్యాలలో వానమామలై వరదాచార్యులు. తక్కినవాళ్ళు కూడా చదివారు ఇదే విధంగా. ఈ ధోరణి చూసి నేను ఈ పూర్వ వైభవమూ అదీ అని అంతా రాస్తున్నారు కదా! సంపూర్ణంగా anti కవిత నాది ‘కూలిపోయిన కోట గోడలను చూపే, శిథిలమయిన గుళ్ల శిల్పములు జూపి, తుప్పుబట్టిన కత్తి తురకలకు జూపీ పురుగుబట్టిన తాటి పొత్తాలను జూపి, ఏమేమో జూపి పూర్వవైభవము తలచి పాంగేటి నీకు ప్రస్తుతావస్థ ఏ పగిడి నున్నదో’ అని. సంపూర్ణంగా యాంటీ కవిత నాది. చాలా వైభవంగా జరిగింది కవి సమ్మేళనం.

ఇక కాంగ్రెస్‌ వాళ్ల ఉద్యమాన్ని తీసికొన్నట్టయితే హయ[గీవాచారి ఉన్నారు. 1946లో వరంగల్లు కోటలో రామస్వామి, మొగిలయ్య అని అన్నదమ్ములు వారి ఇంటి ముందు జండా ఎగరవేశారు. జండా వందనం జరిగింది. ఇంట్లో నాయకులకు టీ, బిస్కట్టు ఏవో ఏర్పాటు చేసారు. ఎట్లుగో వెనుక ద్వారం గుండా నాయకులను తప్పించి మొగిలయ్య లాఠీ తీసుకొని రజాకార్లను ఎదుర్కొన్నాడు. ఓ ఇద్దరి తలకాయలు పగులగొట్టి పడిపోయాడు. అతని రక్తసిక్తమయిన శరీరాన్ని తీసుకొని నినాదాలుచేస్తూ మూడు నాలుగు మైళ్ళు వరంగల్‌ కోటనుంచి ఊరుదాకా ఊరేగింపుగా వెళుతూ ఉంటే అడిగేవాళ్లు లేరు. ‘పట్టుపగలే పట్టణములో పట్టి పౌరుల కొట్టి చంపినా దుష్టకూటమితో ప్రభుత్వము దొంగ బేరము చేసిన … అని కాళోజీ చెప్పాడు. అట్టు ఊరేగింపుగా వస్తూవుంటే శబ్దానుశాసన గ్రంథాలయం దగ్గర – ఆ గ్రంథాలయానికి రామానుజరావు కార్యదర్శి యాభై ఏళ్ళపాటు – ఒక రెండు మూడేళ్ల పిల్లవాడు అరుగు మీద నిలబడి ఉన్నాడు. వాణ్ణి పొడిచి మోరీలో పడవేసారు.

ఇట్లానే ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రారంభోత్సవం. జండా వందనం మొదలయిన సంఘటనలతో ఒక రన్నింగ్‌ కామెంటరీగా, వాఖ్యానంగా నా కవిత్వం సాగింది. ‘ ప్రజలను హింసించు ప్రభువు మాకేలా’ అని.

మహబూబ్‌ బాద్షా చచ్చిపోతే రాజ్యం ఆయన కొడుకు ఉస్మానలీఖాన్‌కు వచ్చింది. ఉస్మాన్‌ ఆలీఖాన్‌కు వస్తుంది నిజాం నిరంకుశ పాలన, ఈ పదిహేడు జిల్లా లలో వాని ఇష్టారాజ్యం. వానికి హైకోర్టు, వానికి సైన్యం వానికి టప్పా, వానికి సిక్కా, బ్రిటిష్‌, ప్రభుత్వానికి వాడు “యూరెవఫాదార్‌ faithful servent రెండవ ప్రపంచయుద్ధంలో ఎంతో సహాయ పడ్డవాడు, మొదటే ప్రపంచయుద్దంలో కూడా సహాయ పడ్డాడు. అన్ని సంస్థానాల వాళ్లకూ హెచ్‌.హెచ్‌. యే. హిజ్‌ హ్లైనస్సే. కాని మనవాడికీ హెచ్‌.ఇ. హెచ్‌. మహాఘనత వహించిన నిజాం ప్రభువు. మూడునెలల కోసం కాళోజీ వరంగల్లు జిల్లు నుండి బహిష్కృతుడు. నాకు హిందువులు ఒక కన్నైతే, ముస్లింలు ఒక కన్ను. ఇద్దరూ నాకు సమానం అని చేప్పేవాడు నిజాం. దీనిమీద కాళోజీ వ్యాఖ్యానం నాగొడవలో, ‘నేటి (వారము) రెండు కళ్ల వేటి మాటలెందుకు…” అని, ‘ ప్రజలను హింసించు ప్రభువులు మాకేల వధియింప భక్షింప…? అని నా ప్రశ్న “రాణి వాసములో రంజిల్లు రాజా- రైతు బాధలు తీర్చి రక్షింపలేవా? పట్టణపు సాగసులకు పాటుపడు రాజా? అని ప్రశ్నలు. నా గొడవలో సాంతం ప్రశ్నలే ప్రశ్నలు. “అడుగు తున్నాడు కాళోజీ ‘ప్రథమ పారుని.. అని వరాహగిరి వెంకటగిరి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ప్రశ్నించాను.

సాహిత్యంతోపాటు నాకు శేషగిరిరావు గారికి అయిదారు భాషలలో పండితులు. కొత్త పట్నం రాధాకృష్ణగారు, ముసుపట్ట పట్టాభిరామారామారావు గారు, ‘గార్లపాటి రాఘవరెడ్డిగార్ల దగ్గర వారు. మా యింట్లో జరిగిన విషయం.., విశ్వనాథ  సత్యనారాయణగారు మొదటిసారి వచ్చినప్పుడు- విశ్వనాధ సత్యనారాయణ గారేమిటి? ఎవరు వచ్చినా కాళోజీ  రామేశ్వరావుగారి ఇంటికి రావలసిందే – రాఘవరెడ్డి గారు పద్యాలు చదివారు. వేల పద్యాలు రాశారు. రామేశ్వరరావుగారి ఇంటికి పండితులు మహానుభావులు, రాజకీయవేత్తలు అందరూ వచ్చేవారే. అదొక వాతావరణం, సాయంకాలం భాగవతమో, తులసీదాసు రామాయణమో, సంత్‌ జ్ఞానేశ్వర్‌ రచనలో చదివేవారు. అటువంటి సాహిత్య వాతావరణం అక్కడ. అనాడు తెలంగాణాలో ప్రత్యేక పరిస్థితి భయం, అనుమానం. ప్రతి దాన్నీ అనుమానించేవారు. అప్పుడు ఢిల్లీ నుంచి అయినా, మద్రాసు నుంచి అయినా ఇటు కృష్ణా, గుంటూరు, గోదావరుల నుంచైనా ఎవరు వచ్చినా కాళోజీ రామేశ్వరరావు గారి ఇంటికి రావలసిందే. మద్రాసు నుంచి ఢిల్లీ పోవాలంటే కాజీపేట మీదుగా పోవలసిందే. రైలు నైజాములో ప్రవేశించిందగ్గరి నుండి కిటికీలు మూసుకొని పడుకొనేవారు. ఏమి జరుగుతుందోనని భయం, సభలు సమావేశాలు ఏమి జరిగినా రెసిడెన్సీ ఏరియాలో జరగవలసిందే. ఆర్య సమాజ మహాసభలు అక్కడే జరిగేవి. కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావుగార్జు కార్యదర్శులు, అధ్యక్షులుగా పనిచేశారు. రెసిడెన్సీ ఏరియాలోనే ఈ అవకాశం.

తెలంగాణా ప్రాంత పరిస్థితి వెనుకబడిన పరిస్థితి. కులాలు పట్టించుకోకపోవడం, బాల్య వివాహాలు వదిలి పెద్దయిన పిల్లలకు పెళ్ళిళ్లు చేయడం, కులాంతర వివాహాలూ ఇవన్నీ మనకంటే ముందు మహారాష్ట్రలో మొదలయ్యాయి. సంఘ సంస్కరణ అక్కడే ముందు జరిగింది. మన దగ్గర పరిస్థితి ఏమిటంటే శారదా బిల్లు మరో మూడునెలల్లోఅమల్లోకి వస్తుంది అంటే కృష్టా జిల్లాకు మా నైజాం జిల్లాల సరిహద్దు ప్రాంతంలో సుమారు లక్ష వివాహాలు జరిగాయి.’ మాడపాటి హనుమంతరావుగారి జన్మస్థలం ఎర్రుపాలెంలో యాభైవేల పెళ్ళిళ్ళు జరిగాయి. నా పెళ్ళి కూడా చాలా చిన్నప్పుడే జరిగింది.

ఇక సాహిత్యాలలోకి వస్తే గరిమెళ్ల సత్యానారాయణ, తుమ్మల సీతారామమూర్తి చౌదరి, ఇలా రాజకీయ ఉద్యమాల గురించి రాసినవాళ్లు అయిదుగురు, ఆరుగురు కంటే ఉండరు. అయ్యదేవర కాళేశ్వరరావుగారు చెప్పిన కథ. రాయప్రోలు సుబ్బారావుగారు  ‘ఎక్కడనో పలు శస్త్రశాలలు నిలుపువాడు….! అని ఏదో పద్యంలో రాస్తే కృష్ణాజిల్హా నుంచి ఎవరో రెసిడెన్సీకి రాస్తే, రెసిడెన్సీవారు ఎంక్వయిరీ జరిపారు. అప్పుడు ఆర్మ్స్ యాక్ట్ ఉండేది. కాళేశ్వరరావు పంతులుగారికి రాయప్రోలు సుబ్బారావు గారంటే గౌరవం. ఆ సంగతంతా తెలుసుకొని వాళ్లో దగ్గరకుపోయి. రామ రామ.. బ్రాహ్మడు శస్త్రశాలలు అని రాయలేదు సత్రశాలలు అని రాశాడు అని బొంకారు. నిర్భయంగా చెప్పిన చిలకమర్తి  లక్ష్మీనరసింహంగారు “తెల్లవారను గడుసరి గొల్లవారు” అని చెప్పారు. ఈ విధంగా ప్రభుత్వ వ్యతిరేకంగా నేరుగా చెప్పినటువంటి సాహిత్యాన్ని చూడండి. ఆధునిక మహా కవుల్ని కూడా తీసుకోండి. నేరుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినటువంటి కవులను చూపించండి. సిద్ధాంతంగా సిద్ధాంతపరంగా లేకపోతే విశ్వాసపరంగా అన్యాయం చేయడం తప్పు అని చెప్పి రాయవచ్చు. దోపిడీ చేయడం తప్పు అని ఎవరైనా రాయవచ్చు. మనకిక అన్నాడుకదా ‘ దౌర్జన్యాలు దోపిడీలు ఇంకానా ఇక సాగవు! అని. దీనిమీద నా ప్రశ్న “ఏమైందని ఎందుకు సాగవు?” అని. సాగుతూనే ఉన్నాయి కదా.

అయోధ్య రామయ్య అని ఒకాయన నూరు బుర్రకథలు రాశాడు. తెలుగు పత్రిక తీశాడు. మొదలు మాసపత్రిక, తరువాత పక్షపత్రిక, తర్వాత వార పత్రిక తర్వాత వారానికి రెండు సార్లు తర్వాత భాగ్యనగర్‌ అని తెలుగు డైలీ పెట్టి మూడు సంవత్సరాలు నడిపాడు. సుబ్బరాజు, బుర్రకథ రాజు అని ఆయనకు పేరు. ప్రత్యక్షంగా పాడేవారు రజాకార్లకు, నైజాంకు వ్యతిరేకంగా. దాశరథి ఏమిటి. అతను పెద్ద ఉద్యమాలు నడిపించింది. లేదు. పెద్ద ఉపన్యాసాలిచ్చింది లేదు. సభల్లోకి పోయి ఆ పద్యాలు చదివేవాడు. అదే పెద్ద ఉపన్యాసం. ఒక రెండు వేల ఉసన్యాసాల ప్రభావం కలిగించాడు ఆ పద్యాలతోటి.

వందే మాతరం పాడడం ఇక్కడ నిషిద్ధం 1938 – 39లో. ఉస్మానియా విశ్వవిద్యాలయం కాలేజీల లోపట, హాస్టళ్ల లోపట వందే మాతరం పాడతామని విద్యార్థులు ముస్లిమేతర విద్యార్థులు, ప్రభుత్వం పాడవద్దని – హాస్టల్స్‌కు తాళాలు పడ్డాయి. వెళ్లగొట్టబడ్డారు. -అప్పుడు ఇంటర్మీడియెట్‌ చదువుకొనేటటువంటి కాలేజీలు నాలుగు. ఒకటి ఔరంగాబాదుల మహారాష్ట్ర, ఒకటి గుల్బర్డా, కర్ణాటకలో మెదక్‌ సుబాకు సంబంధించి ఇక్కడ ప్రారంభించిన సిటీ కాలేజీ, వరంగల్‌లో ఒకటి. ఇవన్నీ నైజాం పాలనలోని 17 జిల్లాలలోవి. తర్వాత యూనివర్శిటీ. అయితే 600 మంది స్టూడంట్సు వందేమాతరం పాడడానికి ముందుకు వచ్చారు. వీళ్లను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బహిష్కరిస్తే ఆంధ్ర విశ్వవిద్యాలయం వాళ్లు రానివ్వలేదు. మద్రాసు విశ్వవిద్యాలయం అసలే అంగీకరించలేదు. నాగపూర్‌, విశ్వ విద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ కేదార్‌ అని ఆయన అందరికీ నాగపూర్‌, వార్ధా మొదలయిన ప్రదేశాల్లో అవకాశాలు కల్పించారు. వరంగల్‌లో ఇంటర్‌లో 49 మంది ముస్లిమేతర విద్యార్థులముండేవాళ్ళం. అందులో మొదటి సంవత్సరం విద్యార్ది రాజాగౌడు, రెండవ సంవత్సరం విద్యార్థి సుదర్శన్‌రావు అనే విద్యార్దులు తప్పు తక్కిన 47 మంది వందే మాతరం పాడడానికి వచ్చారు. నాగపూర్‌కు పంపించిన ఈ 47 మందిలో అందరికంటే చిన్నవాణ్ణయినా పెద్దవాణ్ణి నేను. హయగ్రీవాచారి కూడా ఉన్నాడు. వాళ్లలో నేటి ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు, ఇక్కడ అచ్యుతరెడ్డి, పద్మనాభం వాళ్ళలో పెద్దవాళ్లు. ఒక మేలు మాత్రం జరిగింది. అట్టా వెళ్లిన 600 మందిలో 400 మంది దాకా ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు అయి పెద్ద పెద్ద చదువులు చదివి నాయకులయ్యారు.

వందేమాతరం పాడ వద్దంటే తెలుగు, పార్సీ ఇంగ్లీషు పదాలు కలిపే కాళోజీ దాన్ని ఒక వ్యంగ్య గేయం రాశాడు. మా పి.వి. నరసింహారావు మాటల్లో చెప్పాలంటే, “లక్ష ఉపన్యాసాల కంటే ఎక్కువ పని మా కాళోజీ గేయం చేసింది. మచిలీపట్నం కూడా నాదే, రాయలసీమ అంతా నాదే. నాకు సముద్రపు ఒడ్డు కావాలి. అందుకని మచిలీపట్నం నాకు కావాలీ అటా బేరాలు. అదికూడా. నాదే మీ బకాయి వసూలుకని ఇచ్చాను. ఇంకా వసూలు కాలేదా అది కూడా నాదే అన్నాడు నిజాము. నిజాంరాజు గారి బావ అయిన షాహె మసూద్, షాహెబెరాయి. అంటే మచిలీపట్నం రాజు. ఇవన్నీ తనవేనని నిజాం క్లెయిమ్‌ చేశాడు. ఖమ్మం దాటితే కృష్ణాజిల్లా. అప్పుడు ఖమ్మం మా వరంగల్‌ జిల్లాలోనే ఉండేది. ఖమ్మం దాటితే మిమ్మల్నెవరూ అడగరు. కాని మేం మాత్రం మసూలా రాజులం. మేము షాహెబా రాజు. ఇదంతా చాలా వ్యంగ్యం.

ఇక్కడ ముప్పయి సంవత్సరాలు నలభై సంవత్సరాలు పెద్ద పెద్ద ఉద్యమాలలో ఉండి మహాపండితులు మహాకవులు అయినవాళ్ళు మా హైదరాబాదు రాష్ట్రంలో ఉండేటటువంటి వంటి ఇద్దరు. ఆలిండియా ‘ప్రఖ్యాతిగాంచినటువంటి సరోజినీనాయుడు ఒకామె. ఆమె మా హైదరాబాదు కోడలు. మేజర్‌ నాయుడు భార్య. ఆయన మిలిటరీ డాక్టర్లు . ఈమె ఆ రోజుల్లో బెంగాల్‌నుంచి వచ్చినటువంటి ఒక హెడ్మాస్టరు గారి బిడ్డ. ఈమె మా హైదరాబాదు నివాసి. రెండో వారు రాయప్రోలు సుబ్బారావుగారు. మహానుభావుడు. ఈయన కృష్ణదాటితే జాతీయ కవి.  ఇక్కడెక్కడ ఉండేవాడో ఏమిటో మాకెవరికీ తెలియదు. వేమెవరమో ఆయనకు తెలియదు.

ఒక సంఘటన చెప్తా. మన రామానుజరావు శబ్దాను శాసన గ్రంథాలయ కార్యదర్శి. గ్రంథాలయ రజతోత్సవం చేస్తూ దానికి మహామహులనందరిని పిలిచాడు. 1944-45 ‘ప్రాంతం-రాయప్రోలు సుబ్బారావుగారు, తల్లా వఝ్ఝల శివశంకర శాస్త్రిగారు, గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారు, ‘విజయ అనే పత్రిక తీస్తూ ఉండిన పల్లెల శ్రీరామమూర్తిగారు ఈ అయిదారుగురు మహానుభావులు వచ్చారు, వీరందరిదీ కూడా వరంగల్‌ స్టేషన్‌ దగ్గర ఒక సత్రంలో బస. నేను వీళ్లంతా అక్కడ ఉన్నారు కాబట్టీ వెళ్ళాను. ఆ హోటల్ళో జంపఖానా పరిచిఉంది. అతిథులందరూ కూర్చుని ఉన్నారు. ఒక పక్క ఈజీచైరులో రాయప్రోలు సుబ్బారావు గారు కూర్చున్నారు. నేనుపోయే సరికి వీళ్లందరూ మా హరిసర్వోత్తమరావుగారూ, తక్కిన వాళ్ళూ కాళోజీ రా రా అని చనువుగా పిల్చి కూర్చోపెట్టుకొని వాళ్లందరూ మాట్లాడుతూ ఉన్నారు. రాయప్రోలు వుహానుభావుడు నన్నేదో వింతగా చూస్తున్నాడు. హరి సర్వోత్తమరావుగారు చూసి. ఏమోయ్‌ సుబ్బారావు అట్లా చూస్తున్నావ్‌ కాళోజీ నెరుగరా” అన్నాడు. తెలవదు అనవచ్చుగదా. కాని హరిసర్వోత్తమరావుగారు అంత ఇదిగా మాట్టాడుతున్నారు. తల్లావజ్జలస్వామి వారు మాట్టాడుతున్నారు. ఎక్కడనో చూసినట్టే ఉంది అన్నాడు. ఎందుకనాలి? హరి సర్వోత్తమరావుగారు పదిపదిహేను నిమిషాలపాటు ‘ ఏమిటిది? నీవు 30, 35 సంవత్సరాలు హైదరాబాదులో ఉండడ మేమిటి? కాళోజీని ఎక్కడో చూసినట్టుందనడమేమిటి? ఎవరితోనూ కలవవా? ఇక్కడి ప్రజలతోటీ, ప్రజల ఉద్యమాలతోటీ ఏమీ సంబంధం లేదా నీకు? అని ప్రశ్నించారు. అది వసంత రుతువు. సాయంత్రం సభలు. కవి సమ్మేళనం రాయప్రోలువారు. అధ్యక్షులు. కవి సమ్మేళనంలో కవిత్వం చదవ వలసినవారిలో ‘మొట్టుమొదటి పేరు కాళోజీ నారాయణరావుది. వసంత రుతువు, పౌర్ణిమ, కవిసమ్మేళనం, కాళోజీగారు ‘కోకిల’ అని కవిత వినిపిస్తారు అని పరిచయం చేశారు. నేను కోకిల అని రాశాను. దాంట్లో అన్యాపదేశంగా రాయప్రోలు వారిని తిడుతూ రాశాను. ఆ తర్వాత మాత్రం ఆయన వరంగల్లుకు వస్తే మా ఇంట్లేనే దిగేవారు.

“లేమావి చిగురులను లెస్సగా మేసెదవు, రుతురాజు వచ్చెననె అతి సంభ్రమముతోడ, మావి కొమ్మల మీడ మైమరచి పాడెదవు, తిన్నతిండెవరిదే కోకిలా – పాడుపాటెవరిదే! ఏనాటి సుకృతమో, ఏ విశ్వకవి చలవో ఈ నాడు నిన్నింత దానిగా చేసినది…” అంతేకాదు రాయప్రోలు ప్రసిద్ద గీతం “ఏ పీఠమెక్కినా ఎందుకాలిడినా  ఏ దేశమేగినా…” అనే దానికి మొట్టమొదట పేరడీ చేసింది కాళోజీ. ఆ పాదాలట్టునే ఉంచి  “పొగడరా నీతల్లి భూమిభారతిని? అన్నదాన్ని ‘చూడరా నీ బొజ్జ పూడు మార్గము’ అని మార్చి రాశాను. ‘నరులు ప్రాణాలతో నడచుదాకా…? చూడరా నీ బొజ్జ నిండు మార్గము.” అని సభలో నేనే అధ్యక్షుణ్ణి. రాయప్రోలు వారు ముఖ్య అతిథి అనుకుంటాను. రాయప్రోలు వారు ఇంత గొప్పు దేశభక్తి గీతం రాసి ప్రభావం వేస్తే నేను ఈ పేరడీ రాసి ప్రభావం వేశాను. “చూడరా నీ బొజ్జ పూడు మార్గము” అన్న నామాటే అందరూ పాటిస్తారు కాబట్టి నా ప్రభావమే ఎక్కువ అన్నాను.

వరంగల్లులో సుప్రసన్న, సంపత్కుమార, జగన్నాథం వీళ్లు సాహితీ బంధుబృందం అని సంస్థ పెట్టారు. ప్రారంభోత్సవానికి రాయప్రోలు అధ్యక్షులు, విశ్వనాథ ముఖ్య అతిథి. విశ్వనాథ సంస్కృతం లేకపోతే తెలుగు లేదు, సంస్కృతం లేకపోతే దేవుడే లేడు అన్నాడు. దేవుడు లేకపోతే మాకు దయ్యం లేదు పొమ్మన్నాను.

అరవవాళ్లతో బాధలుపడి విడిపోయి ప్రత్యేక రాష్ట్రం కావాలని అంతకాలం ఉద్యమాలు నడిపే 1913లో ఆంధ్ర మహాసభ మొదలు 1953లో కర్నూలు రాజధానిగా ఆం(ధరాష్ట్రం ఏర్పుడేదాకా రాసిన కవితలన్నిటిలో చేసిన ప్రసంగాలన్నిటిలో అరవల దగ్గర ఆంధ్ర అనీ, ఆంధ్రల దగ్గర తెలంగాణులనీ పెడితే సరిగ్గా సరిపోతాయి ఆ బాధలన్నీ. మరి అన్ని బాధలు పడ్డవాళ్ళు మమ్మల్నింకా బాధలెందుకు పెడుతున్నారో నా కర్థం కావడంలేదు. మొదట్నుంచీ ఢిల్లీ నుంచి, లక్నో నుంచి వచ్చినవాడు మాకు ఉర్దూరాదనీ, మద్రాసు నుంచి వచ్చిన పెద్ద పెద్ద ఇంగ్లీషు పండితులు మాకు ఇంగ్లీషు రాదనీ, హిందీ వాళ్లు వచ్చి మాకు హిందీ రాదనీ అన్నారు. కాని మాకు తెలుగు రాదన్న వాళ్లులేరు. కాని ఈ మహానుభావులొచ్చి మాకు తెలుగు రాదన్నారు.

ఇది చూడండి మీరు. 1913 లోపల శ్రీ పాదకృష్ణమూర్తి శాస్త్రి వంటి పండితులు కూడా మడికొండకు వచ్చి రెండేసి నెలలు, మూడేసి నెలలు ఉండి పోయినారు. ఇల్లెందులో 25వ గ్రంథాలయ మహాసభలు జరిగితే ఈ మహానునుభావులందరూ వచ్చారు. గుజరాతులో కాంగ్రెసు మహాసభలకు రావినారాయణ రెడ్డిగారు ఆంధ్ర నుండి వెళ్లిన సభ్యులతో ఉంటే ఎన్‌.జి. రంగానో మరెవరో రెడ్డిగారిని ‘ ఏ రెడ్డిగారూ మీరు తెలుగు చదువుతారా, మీ నైజాములో తెలుగు చదువుతారా?” అని అడిగారు. ఆయనేమంటారు. నవ్వారు. జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి అని ఒక మహానుభావుడు వచ్చేవాడు. మా వరంగల్లులో కూడా ఎన్నో నెలలు ఉండేవాడు. మాయింట్లో కూడా ఉండేవాడు. మహావక్త. నా మహారాష్ట్ర యాత్ర, నా బెంగాల్‌ యాత్ర అని రాయటమే నా సంగతి మా సంగతి రాయకపోతివంటే తంతా” అన్నాను. ఎందుకోసం అంబే ‘అరే కాళోజీ నీవు తెలుగు బాగానే మాట్లాడతావే’ “అంటే మరేం మాట్టాడతరా?” అన్నాను. వావిలాల గోపాలకృష్ణయ్యగారు, లక్ష్మీనరసింహం పంతులుగారు సభలకు వస్తే నేను, కోదాటి నారాయణరావుగారు, తెలుగులో మాట్లాడితో వారికి ఆశ్చర్యమాయె. వీరు నైజాం వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు. మీరు ప్రపంచమంతా తిరిగి వచ్చినారె, అమెరికా గిమెరికా గురించి జ్ఞానమున్నుదే, మా తెలంగాణీ అంటే తెలియకుండా పోయింది మీకు. బోయిభీమన్న, బుచ్చిబాబు, గోపీచంద్‌ 1956 తర్వాత ఇక్కడికి వచ్చారు. తెలంగాణా రచయితలు ఒక సభపెట్టి ఈ ముగ్గురికీ చిన్న సన్మాన కార్యక్రమం చేస్తే మేం ఏదో ఎడారికో, అరబ్‌ దేశానికో పోతున్నామనీ మాతో తెలుగు మాటాడే వాళ్లెవరన్నా ఉంటారా అని అనుకున్నామని ఆ ముగ్గురూ మాట్టాడారు. 1956లో 1945లో కథకుల సమ్మేళనం చేసుకున్నాం మేమిక్కడ. కవి సమ్మేళనాలయితే తెలంగాణా రచయితల సంఘం, ఆంధ్ర సారస్వత పరిషత్తులో అంతకుముందే జరుగుతూ ఉండేవి.

కాళోజీని మూడునెలలు వరంగల్లు జిల్లా నుంచి వెడలగొడితే చందూరు అనే కుగ్రామంలో “సాహితి మేఖల వార్షికోత్సవం జరిగితే రామానుజరావుగారు అధ్యక్షత వహిస్తే 60 మంది కవులు దాంట్లో పాల్గొంటే, మూడువేల మంది గ్రామస్థులు కూర్చుని వింటే 12 గంటలు జరిగింది – ఆ కవి సమ్మేళనం. జనగాంలో గురజాడ జయంతి రోజు కన్యాశుల్కం మీద సభ జరిగితే నాలుగు అయిదు వందల మంది వచ్చారు. దానికి బోయి భీమన్న, గోరా శాస్త్రి ముఖ్య అతిథులుగా వచ్చారు. వారిద్దరి గుసగుస, మనం ఏం చెపితే వాళ్లికేం తెలుస్తది?” అని అంటే.. వాళ్లు ‘మీ యిద్దరి ఉపన్యాసాలు వినడం కోసం రాలేదు నాయనా, గురజాడ వారి కోసం వారి కన్యాశుల్బం కోసం వచ్చారు. అన్నారు.” ఎట్లా ఇంటిగ్రేషన్‌ జరుగుతుంది, ఎట్లా సాధ్యం? ఈ దేశం అందరిదని, అంతా భారతీయులమని అంటేనే అయిపోతదా, అనిపించాలి కూడా కదా. ఫస్టయినా పండగయినా అందరిదీ అయినప్పుడు, అప్పుయినా ఆస్తయినా అందరిదీ అయినప్పుడు, నాకనిపిస్తుంది “నేనింకా నానుండీ మా వరకు రాలేదు. మనమంటే కదా ముందడుగు! అని రెండున్నర జిల్లాలది దండీబాస అయినప్పుడు, తక్కినవాళ్ల యాస తొక్కిపట్టుబడినప్పుడు ప్రత్యేకంగా రాజ్యం పాలడగక తప్పుదు.

కూలివాళ్లకోసం ఎంతో శ్రమ పడ్డవాడు, ఆరణాల కూలీ నుండి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయినవాడు, మహానుభావుడు అంజయ్య రవీంద్రభారతిలో మాట్లాడుతూ ఉంటే గోల, హేళన. అది మా హైదరాబాదు, సికిందరాబాదు భాష అని దాశరథి సమర్థిస్తే అంజయ్యగారి భాషే అసలైన తెలుగంటు దాశరథి గారన్నారని ఆరునెలల వరకు పండితులు విమర్శించారు. ఎవని యాస ఎవని భాష వానికి సిసలైన భాష ఆ గురజాడ వారి పుణ్యం, ఆ గిడుగువారి పుణ్యం వల్ల ఇంతమంది కవులు, ఇంతమంది కథకులు ఇవాళ రాస్తున్నారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి తన అనుభవాలలో రాసుకున్నాడు- చిన్నప్పుడు ఆయన ఒక తెలుగు పద్యం రాసుకొని ‘మెత్తకింద పెట్టుకుంటే ఆయన అన్నచూసి చెంపమీద ఒక దెబ్బకొట్టి తీసుకొనిపోయి తండ్రికి చూపిస్తే ఆయన కర్ర తీసుకొని చేతిమీద కొట్దాడట. ఆంధ్రలో గాని మహారాష్ట్ర, మద్రాసులలోగాని ఉన్న ఆంధ్రేతర ఉద్యోగులు భాషాభిమానం ఆసక్తి ఉన్నవారు అటు ఉర్దూనయినా, మరాఠీనయినా, తెలుగయినా ఉద్ధరించారు. లేకపోతే మన-ఈ మహాకవులందరూ దేశ భాషలనేవి లేకుండా చేసేవారు. ఇది మన భాషాసేవ.

“ఏ భాషరా నీది ఏమి వేసమురా?…” అక్కడగాని ఇక్కడగాని మొన్న మొన్నటిదాకా “తెలంగీమే బాతకర్‌నా నహీ ఆతా అనో ‘ఐడోంట్‌ నో, హౌటు స్పీక్‌ తెలుగు’ అనో అనేవాళ్లు. ధోవతి కట్టుకోవడం అవమానం, పంట్లూం వేసుకొని టై కట్టుకోవడం వానికి, ఇక్కడ పైజామా లాల్చీ వేసుకోవడం వీనికి, వాడు వీళ్లో ఆక్షేపించడం. ఎట్టున్నది చూడండి. వానిది రోడ్డు తెలుగు, వీనిది సడకు తెలుగు, మాకు ‘చాయ్‌’ తెలుగు, మీకు “టీ తెలుగు. ‘అన్యభాషలు నేర్చి  ఆంధ్రమ్మురాదనుచు సకిలించు ఆంధ్రుడా చావవేమిటికిరా…* అని రాయవలసి వచ్చింది కాళోజీ. ఒకని అలవాట్లను ఒకడు సహించాలి. సహృదయం ఉండాలి. మైత్రి ఉండాలి. వ్యసనమున్నవాడు తనకు స్నేహితుడయితే వ్రతం చేసేవాడు వానికి తన యింట్లో ఏర్పాటుచేస్తాడు. వ్రతము, వ్యసనము కలిసి వల్లించు పాఠాలు, పండితుడు పామరుడు పలికించి మాటాడు, కలిమిలే ములు కలిసి సయ్యాటలాడు!

మా రాఘవరెడ్డి ఎంత పండితుడు! మా గురువుగారు మహాదేవ వర్మ కవితలన్ని తెలుగులో రాసీనవాడు. అటువంటి మహానుభావుడు. ఇంకో మహానుభావుడు పిళ్లా వెంకటరత్నం (విజయవాడ) నాలుగు వేలో పదివేలో పద్యాలు రాశాడు. క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని వర్ణిస్తూ ఆయన రాసిన పద్యాలు రాఘవరెడ్డిగారు, పి.వి. నరసింహారావు గారు పాములపాటి సదాశివరావుగారు మేం అందరం విన్నాం.

పసిపాపలు బుసకొట్టిరి

కసవూడ్చెడి ముసలి యవ్వ కను లెళ్లబడెన్‌

అసువుల కన్నను స్వేచ్చా

మసలుండే మేలటన్న మత్సరమొదవెన్‌

అన్న పద్యం నాకింకా గుర్తు ఉంది. బెజవాడకు పోతే ఆ పిళ్లా వెంకట రత్నం ఇంటికిపోయే వాళ్లలో నేనొకణ్ణి, పువ్వాడ శేషగిరిరావొకడు. పువ్వాడ శేషగిరి రావు ఆయన శిష్యుడు. ‘వినయకుమారము’ అని వెంకటరత్నంగారు రాసిన చిన్న కావ్యం ఆవిష్కరణ సభలో చెళ్లపిళ్ల వేంకట శాస్త్రిగారు అధ్యక్షత వహించి చెప్పిన పద్యం పంక్తులలోని భావం. నాశిష్యుడు లక్ష్మీకాంతం, అతని శిష్యుడు పువ్వాడకవి, అతని శిష్యుడు వెంకట రత్నం ఈ విధంగా ఈ కవితా శిష్యవంశం దినదినాభివృద్ధి పొందుతూంది అని. ఆ పిళ్లా వెంకటరత్నం గురించి ఇప్పుడెవరికీ ఏమీ తెలియదు. ఎవరన్నా చదువుతున్నారో లేరో.

16,17 సంవత్సరాల వయస్సు నుంచీ ఉపన్యాసాలే ఉపన్యాలిచ్చేవాడిని, కాళోజీ, కోదాటి, కొమనగిరి మేం ముగ్గురం 20 ఏళ్ళు లోపటనే ఈ ప్రజాఉద్యమాల లోకి దిగిన వాళ్లం. ఉపన్యాసాలిస్తూ తిరుగుతూ ఉంటే వీటి బదులు ఏమైనా కథలు రాస్తే బాగుంటుంది అని కథలు రాశాను. ఏం రాసినా కాని ఏదో పేరు తెచ్చుకోవాలని గాని, కవిగా పేరు పొదాలనిగాని రాయలేదు. అందుకే అది కవిత అని కూడా అనలేదు. ‘నాగొడవ అన్నా. 1930 ఉప్పు సత్యాగ్రహం నుంచి 1940 దాకా భారతదేశమంతా తిరిగి గాంధీగారితో ఉండి మాంఛెస్టర్‌ గార్జియన్‌ అనే పత్రికలో హెచ్‌.ఎం. గ్రేట్‌ ఫర్ట్‌ అనే పత్రికా ప్రతినిధి రాసిన వ్యాసాలన్నీ “రెబెల్‌ ఇండియా” అనేపేరుతో పుస్తకంగా ప్రచురితమయింది. దాన్ని ట్రాన్స్‌లేట్‌ చెయ్యాలి. తిరగబడ్డ భారతం అంటే నైజాం రాష్ట్రంలో తిరుగబడు అనే మాట ఉంటే ఇంకేమైనా ఉందా. దాన్ని క్లుప్తంగా “నా భారత దేశ యాత్ర” అని అనువదించాను. మహానుభావుడు వట్టికోట ఆళ్వారుస్వామి కాశీనాథుని నాగేశ్వరరావు చనిపోయిన సంవత్సరంలో దేశోద్ధారక గ్రంథమాల స్టాపించి 38 పుస్తకాలు అచ్చువేశాడు. వాటిలో 1940లో అచ్చైన పుస్తకం ‘నా భారతదేశ యాత్ర.

అంతకుముందే కె.సి. గుప్తా, వెల్దుర్తి మాణిక్యరావు కలిసి అణా గ్రంథమాల పెట్టారు. అణాకు పుస్తకం. పదహారు పేజీలు ఇరవై పేజీలు చిన్నవి. సుభాష్‌ చరిత్ర, గాంధీ చరిత్ర, వీర్‌సావర్కార్‌ చరిత్ర, ఆర్య సమాజ్‌ దయానంద సరస్వతి చరిత్ర మొదలైనవి. ఆ కే.సి.గుప్తాగారి మీద ప్రభుత్వం 12 సంవత్సరాలు శిక్ష పడే కేసు పెట్టినారు. అప్పా కోర్టులో బూర్గుల రామకృష్ణారావు మొదలయిన వాళ్ళు – చాలా మితవాదులని వారిపైన ఆక్షేపణ. ఆరు పుస్తకాలో, ఎనిమిది పుస్తకాలో నిషేధింపబడ్డాయి. దాంట్లో కాళోజీ కథలు అని, వాదించి తప్పించారు.

ఉపన్యాసాల కంటే ఉద్యమాలలో ఈ కథలు  గేయాలు కవితలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఉద్యమాన్ని ప్రజలలోకి తీసుకు వెళ్తాయి అని ప్రహ్లాదుని చరిత్ర. పురాణ కథలు కొన్ని తీసుకొన్నాను. ప్రహ్లాద చరిత్ర తీసుకొని యాదగిరిగుట్ట నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో ఆ నరసింహస్వామిని సంబోధించి ఆనాడు హిరణ్యకశిపుని చంపిన నాటి నీ కోపం లక్ష్మీదేవి స్వయంగా వచ్చి ప్రారించినా చల్లారని కోపం నాకు మళ్ళీ చూడాలని ఉంది అని రాశాను. అనాడు రుద్రుడు ఇంద్రుడు ఎవరువచ్చి ప్రార్థించినా ఆయన కోపం చల్లారలేదు. వేయి యుగాలలో ఎన్నడూ చూడనంత కోపం ఆయనకు వచ్చింది. అంతవరకు హిరణ్యకశిపునికి జేజేలు పలికినవారంతా వాణ్ణి నృసింహస్వామి చంపేటప్పుటికి నృసింహస్వామికీ జై అన్నారు. అయినా ఆయన కోపం చల్లారలేదు. అనాడు నిన్నుజేరగ భయకంపితగు లచ్చియే ఈనాడు నీతొడపై హాయిగ కూర్చుని యున్నది లక్ష్మి, అటువంటి నీ కోపము దితి పుత్రుడు ప్రహ్లాదుడు చేరి మైన చప్పున చల్లారెన్‌, మా కొంపలు ఆరెన్‌. నా గొడవలో నా సాహిత్యంలో ఉండే విశేషం ఇటువంటిది. ఎందుకు? మన కొంపలెందుకు ఆరినయి. ఇక ఆనాటి గోల ఎందుకు? ప్రహ్లాదుల మాట ఎందుకు? వాని అయ్యతల దన్నినవాళ్ళు, వాని బంట్లు, ఏజంట్లు ప్రహ్లాదుని పేరుతోడ నీ కడకు ఏతెంచుట లేదా మరి కొంపలారి నట్లే కదా. నీకు తెలస్తలేదురా బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు, దద్దోజనాలు పెడుతున్నారు పులిహోరల నైవేద్యం పెడుతుంటే నీకు తెలుస్తలేదు. మా బాధలు. నీవెవడవురా నీ వా అసలు నరసింహం? నేను నీకు మొండెం ఇచ్చాను సింహం తన తలిచ్చింది. సింహపు తల నా మొండెం. నీకు తల ఇచ్చిన ఆ సింహం సంతానం, నీకు మొండెమిచ్చిన నా సంతానం ఏ పరిస్థితిలో ఉంది? ఆనాడు నా మొండెం నీకిస్తి, నా తలకాయ ఎక్కడో పారేసుకున్నాను. ఇంకా దొరకలేదు. నేను తల లేకుండానే ఉన్నాయింకా. సింహాలెకడున్నాయి సర్కసులోనన్నా ఉన్నాయి, లేకపోతే జూలో ఉన్నాయి. అందుకోసం అనాటి నీరూపం ప్రళయ భయంకర రూపం చూడాలని ఉంది నాకు. నీ ఈ రూపంతో నాకు తృప్తి లేదు. ఆ బ్రహ్మోత్సవాలకు 20, 30 వేల జనం వచ్చారు. నా గొడవ విన్నారు. వరాహావతారం.. వరాహావతారం సందేశం ఏమిటి? ‘ జనహంతకుని ఎదిరి చంపు పందయిన పరమాత్ముడు” అనేకదా!

(10-8-1994), పరిణతవాణి ప్రసంగం.. ఆంధ్ర సారస్వత పరిషత్

One thought on “కాళోజి నారాయణరావు”

  1. చాలా అద్భుతమైన సాహితీ సేవ చేస్తున్న స్వాధ్యాయ ఛానెల్ వారికి సునమస్సులు ….

    మువ్వల రాంబాబు
    అనకాపల్లి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *