నాందీ వాణి

శ్రీ కొర్ల పాటి శ్రీరామమూర్తి

నీవక్రోక్తి విలోకనమ్ముల సమున్మేషమ్ములో నేను చే
తో వీథిన్ పులకోద్గమస్రకరమై, తోడ్తో రసానంద మై
సేవింతున్ కమనీయకజ్జలకళాశ్రీ రేఖలే తీర్చి- కా
నీ, వేర్పాటుగ కంటి వెంట్రుకలు లెక్కింపన్ జుమీ భారతీ!

నీలావణ్యధగధ్ధగాయిత హిమానీ హేమసౌదామనీ
హేలా కాంతిధునీరసోర్మికలలో ఈడోలికామాలికా
లీలా ఖేలనతన్మయీభవన మే రేకెత్తు నేనాడు, కా
నీ, లెక్కింపగలేను ర క్తవహతంత్రీరాశి వాగీశ్వరీ!

జీవత్ స్నిగ్ధకపోలముగ్ధ మధుర శ్రీ వైఖరీహాసరే
ఖావైదగ్ధ్యకళాత్వదీయ హృదయాఖ్యానమ్ములో నేను వ
ల్లీ వేల్లన్మధురోహ వైభవము నుల్లేఖింతునే గాని, వా
గ్దేవీ: లేదు త్వదస్థిత త్త్వకథనోద్దేశమ్ము లేశమ్మునున్

లాక్షారూక్షకటాక్షవీక్షణ విధా గ్రై వేయమంటాగవా
ధ్యక్షుల్ మెచ్చరుగాక, చై త్రవనరథ్యా జై త్రయాత్రాచణో
ర్వీక్షేమంకరకాకలీక లగళ శ్రీమాధవస్వామి, తా
దీక్షాకంకణ సూత్రధారి! అదె నాందీవాణి నాపాలిటన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *