నేను భూమికి రాను

కస్తూరి మురళీకృష్ణ

అలారం మ్రోగింది. మెలకువ వచ్చిన ప్రతిసారీ బ్రహ్మబుధకు గమ్మత్తుగా అనిపిస్తుంది. తాను ఎక్కడ ఉన్నాడో గుర్తుకు రాదు. గుర్తుకు వచ్చినా అది ఏ రోజా, ఏ తారీఖో గుర్తుకు రాదు. ఎందుకంటే భూమి వదిలి ఎన్ని ఏళ్ళయినా, ఇంకా బుధ గ్రహంలో జీవనానికి బ్రహ్మబుధ అలవాటు పడలేదు.
భూమి తన చుట్టూ తాను తిరగటానికి 24 గంటలు, సూర్యుడి చుట్టూ తిరగటానికి 365 రోజులు పడుతుంది. అదే బుధగ్రహం సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల, సూర్యుడి చుట్టూ తిరగటానికి భూమి లెక్క ప్రకారం 80 రోజులు పడుతుంది. అదే తన చుట్టూ తాను తిరగటానికి 1408 గంటలు, అంటే 58 రోజుల పదిహేను గంటల ముప్పయి నిమి షాలు పడుతుంది. భూమిపై 365 రోజులకు ఒక పుట్టినరోజు వస్తే , బుధ గ్రహం పై 88 రోజులకొక సంవత్సరం కాబట్టి, 88 రోజుల్లో ఒక పుట్టినరోజు వస్తుంది. ఒక సంవత్సర కాలంలో మూడు నాలుగు పుట్టినరోజులు జరుపుకోవచ్చు.
బుధగ్రహంలో ఒకరోజు నిడివి సంవ త్సరం కన్నా ఎక్కువ. ఇందుకు కారణం బుధ గ్రహం నుంచి సూర్యుడు కనపడటం గమ్మ త్తుగా వుంటుంది సూర్యోదయం నుంచి 44 రోజులయ్యేసరికి సూర్యుడు నడినెత్తిమీదకు
భూమి లెక్క ప్రకారం 88వ రోజుల తరు వాత సూర్యాస్తమయం అవుతుంది. మళ్ళీ 88 రోజుల తరువాత సూర్యోదయం అవుతుంది. కానీ మనిషి 24 గంటలలో కనీసం ఆరు గంటలు నిద్రపోవాలి. అంటే 88 పగళ్లు నిద్ర పోవాలి. 88 రాత్రుళ్లు మేలుకోవాలి. కాబట్టి బయట రాత్రిపగళ్ళతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా రోజు అయ్యే ఏర్పాటు కృత్రి మంగా అయారయింది. దానితో తాను ఏ పగలులో నిద్ర లేచాడో గుర్తించటం బ్రహ్మ బుధకు కష్టంగా ఉంటోంది. నిద్ర లేవగానే, ప్రత్యేకంగా తయారయిన వాష్ రూమ్ లోకి వెళ్ళాడు. మీటలు నొక్కాడు. బుధగ్రహం సూర్యుడికి దగ్గరగా ఉండటంతో అక్కడ జీవం మనగలగటం అసంభవం అని అనుకున్నారు. కానీ ఈ విశ్వంలో ఏదీ అసంభవం కాదు. అసంభవం అన్నదొక్కటే అసంభవం అని నిరూపిస్తూ మనిషి బుధగ్రహంలో నివసిం చేందుకు వీలు కలిగింది. దీనికి దారి చంద్రుడు చూపించాడు.
భారతీయ శాస్త్రవేత్తలు చంద్రమండలం పైని మట్టితో, మానవుడు విసర్జించే మూత్రం లోని బాక్టీరియా ‘స్టోరో సార్సినా పాస్ట్బూరి’
యూరోలైటిక్ సైకిల్ ద్వారా తయారు చేసే కాల్షియమ్ కార్బొనేట్ స్ఫటికాలకు, చిక్కుడు
విత్తనాల నుంచి తయారుచేసిన జిగురు పదార్ధాన్ని కలపటం వల్ల ఇటుకలు,
సిమెంటు లేకుండా, చంద్రమండలంపై గట్టి నిర్మాణాలు చేయవచ్చని నిరూపించారు. ఈలోగా ప్రపంచ శాస్త్రవేత్తలు మరింత విస్తృతమైన పరిశోధనలు చేసి మనిషి చెమట, ఉమ్ము వంటి వాటిలోంచి ఓ పదార్థాన్ని తయారు చేసారు. అది కట్ట డంపై పూస్తే ఆ కట్టడం ఎంతటి వేడినైనా
పీల్చుకుని చల్లదనాన్ని ఇస్తుంది. చంద్రుడు సూర్యకిరణాల వేడిని తీసుకుని చల్లని వెలుగు నిచ్చినట్టు. దాంతో శాస్త్రవేత్తలు చంద్రుడిలా ఉండే బుధగ్రహంలోని మానవ నివాసాలను నిర్మించే ప్రయోగాలు ఆరంభించారు.
రోబోలతో రెండు మూడు స్థలాలలో నిర్మా ణాలు చేయించారు. అయితే బుధగ్రహంపై పగలు రాత్రి ఉష్ణోగ్రతలలో విపరీతమైన తేడా
ఉంటుంది. బుధగ్రహం సూర్యుడికి దగ్గరగా – ఉంటుంది కాబట్టి ఉదయం పూట, అంటే
88 రోజులు 430 డిగ్రీ సెల్సియస్ పైన ఉంటుంది. ఉష్ణోగ్రత. కానీ బుధ గ్రహంపై వాతావరణం లేక పోవటంతో ఈ వేడి అంతా అంతరిక్షంలోకి వెళ్లిపోతుంది. దాంతో రాత్రుళ్ళు, అంటే 88 రోజులు ఉష్ణోగ్రత -180 డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువగా ఉంటుంది. అంటే నిర్మాణం 88 రోజుల పాటు నిరంతరం
మండించే వేడిని – తట్టుకోవాలి. మళ్లీ 88
రోజులపాటు దేన్నయినా మంచులా మార్చగల చల్లదనాన్ని భరించాలి. ఈ సమస్యను అధిగమించేందుకు పాతకాలంలో భూమి మీద వాడిన పద్ధతిని ఉపయోగించారు.
చలికాలం ఒక రాజధాని, ఎండాకాలం ఒక రాజధాని, ఇలా రెండు రాజధానులు
ఉండేవి. అలాగే రెండు రకాల క్యాంపులను నిర్మించారు. పగలు ఒక తొడుగు, రాత్రి దానిపై మరో తొడుగు, ఒకటి వేడిని తట్టుకునేది, మరొకటి చలిని తట్టుకునేది.
అంటే ఈ నిర్మాణాలలో ఉన్నవారు భూమి ప్రకారం రాత్రి పగళ్ళు అనుభవిస్తూ, బుధ గ్రహం ప్రకారం వేడి, చలి తొడుగులను మారుస్తూ ఉండాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, సర్వం నాశనం అవుతుంది.
‘ఇంకా నీరు తాగాలి. సరిపడా మూత్రం రాలేదు’ నిర్బావంగా వచ్చింది రోబో నుండి సందేశం. మౌనంగా వెళ్ళి నీళ్లు తాగాడు బ్రహ్మబుధ.
భూమినుంచి ఇతర గ్రహాలకు వస్తువులు సరఫరా చేసినట్టు బుధ గ్రహానికి వస్తువుల సరఫరా చేయటం కుదరదు. అందుకని భూమినుంచి ఎలాంటి సప్లైలు లేకుండా కూడా బుధ గ్రహంపై మనగలిగే రీతిలో అక్కడి క్యాంపును రూపొందించారు.
మూత్రం నుండి అవసరమయ్యే బాక్టీ రియాలను, యూరియా, క్లోరైడ్, సోడియం, పొటాషియం, ప్రొటీన్లన్నిటినీ వేరు చేసి వాటిని నిర్దిష్టమైన పనులకు వాడతారు. అందుకు తగ్గ సాంకేతికత ఉన్న రోబోలు బుధగ్రహంలో ఏర్పాటు చేసారు. అలాగే మనిషి శరీరంపై పట్టే చెమట, నోట్లో ఊరే లాలాజలం వంటి వాటి నుంచి కూడా రసాయనాలను, మలి నాలను, ఎలక్ట్రోలైట్లను, ప్రొటీన్లు, ఎంజైమ్ లను వేరు చేసి వాడేందుకు రోబో పరికరా లున్నాయి.
ఒక్క ప్రాణం కాపాడితే ఒక విశ్వాన్ని
కాపాడినట్టు అంటారు. అలా ఒకమనిషిలోని ప్రతి అణువునూ జాగ్రత్తగా వాడుకుంటే, బుధ గ్రహంపై ఒక కాలనీని నడపవచ్చు అన్నది ఆధునిక సామెత.
స్నానం చేసాడు బ్రహ్మబుధ. స్నానం నీరు కూడా బుధగ్రహంలో తయారయినవే. స్నానం తరువాత నీటిని శుభ్రపరచి, నీటిలో మనిషి శరీరం నుంచి వచ్చి కలసి బాక్టీరియాలు, మట్టి వంటి వాటిని రకరకాల పనులకు ఉప
యోగిస్తారు. నీటిని శుభ్రపరిచి మళ్లీ వాడేం దుకు తయారు చేస్తాయి రోబోలు. మనిషి ఇంత కష్టపడి బుధ గ్రహంలో నివాసం ఏర్పాటు చెయ్యడానికి కారణం ఏమిటంటే,
మెర్కురీ ఉపరితలంపై అధికంగా ఉండే సిలికా, కేంద్రంలో ద్రవరూపంలో ఉండే ఐరన్. భూగ్రహంపై ఈ మూలకాలు పూర్తిగా అయిపోవటంతో శాస్త్రవేత్తల దృష్టిని అంతరిక్షం వైపు సారించారు.
బుధగ్రహం నుంచి నీటిని బుధగ్రహం చుట్టూ తిరిగే వ్యోమనౌకకు పంపుతాడు బ్రహ్మ బుధ. బ్రహ్మబుధతో పాటూ బుధ గ్రహంపై
మరో ఇద్దరు రెండు కాలనీల్లో ఉన్నారు. బ్రేక్ ఫాస్ట్ చేస్తూ వారితో మాట్లాడటం బ్రహ్మబుధకు అలవాటు. కానీ ఈ మధ్య వాళ్లతో మాట్లాడాలనిపించటం లేదు.
మార్టిన్, యాంగ్ చు లు ‘భూమి సిక్’ అయినట్టున్నారు. వాళ్లు పదేపదే భూమి గురించి మాట్లాడటం బ్రహ్మబుధకు చికాకు కలిగిస్తోంది. అందుకే వారితో అవసరమైనంత వరకే మాట్లాడుతున్నాడు.
బ్రహ్మబుధకు భూమి అంటే చిరాకు. అతడికి భూమికి తిరిగి వెళ్ళాలని లేదు. భూమిమీద రాజకీయాలు, ద్వేషాలు, మోసాలు, హింసలు, కుట్రలు, కుతంత్రతాలతో అతడు విసిగిపోయాడు. అతడు జీవితంలో అనుకున్న దేదీ సాధించలేకపోయాడు. పేదరికం వల్ల అనుకున్నది చదవలేకపోయాడు. నియమాలు, నిబంధనల వల్ల కోరినది పొందలేకపోయాడు. కుట్రలు, కుతంత్రాల వల్ల, సాధించినదంతా పోగొట్టుకున్నాడు. అసూయ, ద్వేషాలవల్ల ఉ న్నదంతా బూడిద అయింది.
తన ఒక్కడి విషయంలోనే కాదు, మిగతా వారి ఆరాటాలు, పోరాటాలు, ఆవేశాలు, వేద నలు, చావులు, ఆశలు, నిరాశలు, దుఃఖాలు చూస్తుంటే అతడికి జీవితంమీద విరక్తి కలిగింది. ఇవన్నీ లేని ప్రదేశాలు వెళ్ళాలన్న కోరిక కలిగింది. మనుషులకు దూరంగా పారిపోవాలనిపించింది. దారిలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.
ఆ సమయంలో బుధ గ్రహానికి వెళ్ళే వాళ్ళు కావాలన్న ప్రకటన చూసాడు. వ్యోమ గాములు ఎవరూ బుధగ్రహంలో ప్రయోగా
లకు సిద్ధంగా లేరు. వారికి అంతరిక్షంలో ఇతర గ్రహాల గురించి తెలుసు. ముఖ్యంగా బుధ గ్రహం గురించి తెలుసు. అన్ని పరి స్థితులు తెలుసు. బుధగ్రహంలో ప్రయోగంలో పాల్గొనటం అంటే ఆత్మహత్యేనని వాళ్లకు తెలుసు.
కానీ ఆత్మహత్య తప్ప మరో మార్గం లేని బ్రహ్మబుధ అందుకు సిద్ధపడ్డాడు. అతని లాంటి వాళ్ళే మరో నలుగురు సిద్ధపడ్డారు.
నలుగురికి శిక్షణ ఇచ్చారు. వారిలో ముగ్గురు ఎంపికయ్యారు. బుధగ్రహం కాలనీ ల్లోకి వచ్చారు. రోబోలను పరిశీలించటం, నిర్దేశిత పని అవి చేస్తున్నట్టు చూడటం పని. అంతకు మించి చేసేదేమీ లేదు. ఎవరి అధికారం లేదు. నీతులు, నియమాలు లేవు. కుట్రలు, కుతంత్రాలు లేవు. దాంతో బ్రహ్మ బుధ సంతోషంగా స్థిరపడిపోయాడు. మిగతా వారు బుధగ్రహం వేడికి, చలికి, పరిస్థితులకు తట్టుకోలేకపోయారు. బ్రహ్మబుధ అలాగే బుధ గ్రహంలో ఉన్నాడు. మిగతా కాలనీల్లో ఇప్పటికి ముగ్గురు మారారు. మార్టిన్, యంగ్ చు లు కూడా ఎక్కువకాలం ఉండేట్టు అని పించటం లేదు బ్రహ్మబుధకి. వాళ్లు త్వరగా చిరాకు పడటం, భూమి గురించి మాటి మాటికీ ప్రస్తావిస్తూండటం, వెళ్లిపోవాలన్న కోరిక పలుమార్లు వ్యక్తం చేయటం వంటి లక్షణాలు ఇంతకు ముందున్న వాళ్లల్లో చూసాడు బ్రహ్మబుధ. ఇప్పుడు వీళ్లలోకీ కూడా చూస్తున్నాడు.
‘మార్టిన్!” పిలిచాడు బ్రహ్మబుధ, రోబోలు అందించిన ఆహారాన్ని నోట్లో వేసుకుంటూ. మొత్తం ఆహారం కూడా కృత్రిమంగా తయా
రవుతుంది. అది కూడా రీసైకిల్డ్ పదార్ధాల తోనే. మార్టిన్ నుండి సమాధానం లేదు. బద్ద కస్తుడు. నిద్రలేచి ఉండడు. అనుకుని, యాంగ్ చుని పిలిచాడు. నీరసంగా బద్దకంగా ఉన్నాడు యంగ్ చు.
ఎప్పుడు విముక్తి దొరుకుతుందో? అన్నాడు యాంగ్ చు.
నాకీ పరాజితవాదం నచ్చదు. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు భావించి బాధపడటం కన్నా మన దగ్గర ఉన్న వాటి ద్వారా ఆనం దించటం నేర్చుకోవాలి’ అన్నాడు బ్రహ్మబుధ. ఎంత వద్దని అనుకున్నా అతని స్వరం చిరాకుగా ధ్వనించింది.
నువ్వు మనిషివి కాదు. ఒంటరిగా ఉండటం నీకు అలవాటు. మేము మను షులం. మాకు మనుషుల సాంగత్యం అవ సరం. మార్టిన్ భూమికి సందేశం పంపిం చాడు. త్వరలో భూమి నుంచి మమ్మల్ని వాపస్ తీసుకెళ్ళే వ్యోమనౌక వస్తుంది. నువ్వు కూడా రావాలంటే రావచ్చు’ చెప్పాడు యంగ్ చు.
భూమి మీదకు నేను రాను. నాకు ఇక్కడే బావుంది. అవును మార్టిన్ పలకటం లేదే మిటి?’
ఆరోగ్యం బాగా లేదన్నాడు. రీసైక్లింగ్ లో ఏదో పొరపాటు జరిగిందట. దాంతో చావా ల్సిన బాక్టీరియా శరీరంలోకి వెళ్ళింది. మందులు తీసుకుంటున్నాడు.
‘అయిష్టంగా నిర్లక్ష్యంగా పనులు చేస్తే ఇలాగే ఉంటుంది. గర్వంగా అన్నాడు బ్రహ్మబుధ. యాంగ్ చుతో మాటలయిపోయిన తరువాత ఒక్కసారి తన సామ్రాజ్యాన్ని కలయ
తిరిగాడు. రోబోట్లన్నీ సరిగ్గానే పనిచేస్తు న్నాయి. రిసైక్లింగ్ లో ఎలాంటి సమస్యా లేదు. ఇవి చూసినప్పుడల్లా అతడికి ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ సృష్టిలో వ్యర్థమన్నది ఏదీ లేదు. ఉపయోగించుకునే తెలివి ఉంటే ప్రతీదీ ఉపయోగపడుతుంది. వ్యర్థమన్నవన్నీ అద్భుతమైన రీతిలో ఉపయోగపడతాయి. అతడికి భూమి గుర్తుకు వచ్చినప్పుడల్లా అందుకే కోపం కలుగుతుంది. భూమి మీద మనుషులు మూర్ఖులు. కొన్ని వస్తువులు నిషిద్ధం. కొన్ని వస్తువులు అంటరానివి. కొందరు మనుషులు అంటరానివారు. కొందరు గొప్పవారు. ఎందరు సామాన్యులు. గొప్పతనం డబ్బుతో ముడిపడి ఉంటుంది. సామాజిక స్థాయితో ముడిపడి ఉంటుంది. దాంతో మిగతా అంతా వ్యర్థం. బ్రతుకులు విలువలేనివి. ఎంత తెలి వయినవాడయినా డబ్బు లేకపోతే వ్యర్థం. అదే ఇక్కడ… గర్వంగా అనిపించింది అతనికి. ఇక్కడ తనే రాజు. తనని అడిగేవాడు లేడు. తనేం చేస్తే అదే సంప్రదాయం. ఇది వదులు కుని మళ్లీ ఒకరి అధికారానికి తలవంచి, నియమాలు నిబంధనలకు లొంగి, కుట్రలు కుతంత్రాలు.. ఛీ.. ఛీ.. బుధగ్రహంపై చచ్చి పోతాడు కానీ మళ్ళా భూమి పైకి వెళ్లడు.
‘మూర్ఖులు మాత్రమే మనుషుల సాంగత్యం కోరి భూమిపైకి వెళ్తారు. అనుభవిస్తారు!’ కసిగా అనుకున్నాడు. అంతలో మార్టిన్ సమాధానం ఇవ్వలేదని గుర్తుకు వచ్చింది. ‘మార్టిన్’ పిలిచాడు సమాధానం లేదు.
‘యాంగ్ చు’ పిలిచాడు సమాధానం లేదు. కాస్సేపాగి మళ్ళీ పిలిచాడు. ఇద్దరి దగ్గర
నుంచి సమాధానం లేదు. ‘మార్టిన్, యాంగ్ చుల నుండి ఎలాంటి సమాధానం రావటం లేదు. పరిశోధించటానికి వెళ్తున్నాను’ బుధ గ్రహం చుట్టూ కక్ష్యలో తిరిగే సమాచార నౌకకు సందేశం పంపాడు. అది భూమిపై ఉన్న కేంద్రాలకి ఈ సంగతి చెప్తుంది. .
చకచకా తయారయ్యాడు. అవసరమయ్యే పరికరాలు తీసుకుని సరిచూసాడు. తాను బయటకు వెళ్తున్నది, బుధ గ్రహంలో రాత్రా? పగలా? మరోసారి నిర్ధారణ చేసుకున్నాడు. రాత్రి వాహనం ఎంచుకున్నాడు.
వాహనం మార్టిన్ ఉండే స్థలం చేరేవరకూ తల పైకి ఎత్తి ఆకాశం వైపు చూడలేదు బ్రహ్మ బుధ. ఉదయం పూట తల ఎత్తి బుధగ్రహం ఆకాశం వైపు చూడటం కూడా కుదరదు. ఎందుకంటే సూర్యుడికి దగ్గరగా ఉండటంతో భూమిపై కన్నా రెండున్నర రెట్లు పెద్దగా కనిపిస్తాడు సూర్యుడు. ఆ వేడి, ఆ వెలుతురు తీక్షణత భరించటం కష్టం.
బుధగ్రహంపై వాతావరణం లేదు. ఉప గ్రహం లేదు. ఆకాశం చిక్కటి నలుపు రంగులో కనిపిస్తుంది, మెరిసే తారకలతో, అది అంతు లేని చీకటి లోయలోకి చూసినట్టుంటుంది. భయం కలిగిస్తుంది.
మార్టిన్ స్థలం చేరేవరకూ ఎదురుగా చూస్తూ కూర్చున్నాడు. మార్టిన్ లేడు. అతని స్థలంలో రోబోట్లు పనిచేయటం లేదు. ‘ఇక్కడ ఉండడం కుదరదని యాంగ్ చు దగ్గరకు వెళ్ళాడేమో!’ అనుకున్నాడు బుధ గ్రహ. అట్నుంచి యాంగ్ చు దగ్గరకు వెళ్ళాడు.
దూరం నుంచే అంతా సవ్యంగా లేదని తెలుస్తోంది.
రోబోట్లు హడావుడిగా పరిగెత్తు తున్నాయి. వాహనం లోంచి దూకి లోపలకు పరుగెత్తాడు బుధగ్రహ. లోపల దృశ్యం చూసి, ఒక్క సెకను ఏం చెయ్యాలో తోచలేదు. వెంటనే తేరుకున్నాడు. నేలపై బడి ఇద్దరూ ఊపిరి
అందక కొట్టుకుంటున్నారు. ఇక్కడ కూడా రోబోట్లు పనిచేయటం లేదు. వాతావరణం కలుషితమైపోయింది. ఇద్దరూ కొన ప్రాణంతో ఉన్నారు. ఆలస్యం చేయలేదు.
‘వీళ్లకి ఆక్సిజన్ పెట్టండి. నా వాహనంలోకి చేర్చండి. వెంటనే’
రోబోలకు ఆర్డరిచ్చి, గబగబా తన వాహనంలోకి దూరాడు.
రోబోలు తెచ్చి వాహనంలో పెట్టగానే వాహనాన్ని ముందుకు దూకించాడు. నేల అంతా చలికి గడ్డకట్టి ఉండటంతో వాహనాన్ని భయం లేకుండా వేగంగా నడిపించగలిగాడు. తనుండే స్థలానికి వస్తూనే రోబోలకు చకచకా
ఆజ్ఞలు జారీ చేసాడు. ఇలాంటి పరిస్థితి కోసమే ప్రత్యేకంగా కట్టిన గదుల్లోకి వారిని
చేర్చాడు. వారికి ఆక్సిజన్ అమర్చాడు. వారి శరీరంలో అవయవాలేవీ దెబ్బతినలేదని నిర్ధారించుకున్నాడు. సమాచార నౌకకు సమాచారం అందించాడు. ‘వీరిద్దరూ బుధ గ్రహంపై ఉండలేరు. వెంటనే తీసుకెళ్లండి. ఈసారి కాస్త ఒంటరి తనాన్ని తట్టుకోగలవారిని ఎన్నుకోండి’ సమా చారం పంపి నిట్టూర్చాడు.
బుధగ్రహం కాబట్టి, తనున్నాడు కాబట్టి వీళ్ళు బ్రతికారు. ఇదే భూగ్రహంలో అయితే మనిషి ప్రాణం పోతూంటే దాన్నుంచి డబ్బులు ఎలా పిండుకోవాలని ఆలోచిస్తారు. శవాలతో వ్యాపారాలు చేస్తారు. ‘మానవత్వం అన్నది మనుషులతో నిండిన భూగ్రహంలో లేదు.

మానవులు లేని బుధగ్రహంలో ఉంది” అనుకున్నాడు. ఇంతలో ఏదో అలికిడి అయితే ఆ వైపు చూసాడు.
ఎవరో ఇద్దరు అపరిచితులు గదిలో ఉ న్నారు. మనకు తెలియకుండా, తన అనుమతి లేకుండా, తన స్థలంలోకి ఎవ్వరూ రాలేరు, వీళ్ళెవరు? ఎలా వచ్చారు? బుధగ్రహంలో మనుషులే లేరు, దొంగలు ఎక్కడినుండి వచ్చారు?” లేక వీళ్ళు మార్టిన్, యాంగ్ చులను తీసుకు లేక వీళ్ళు మార్టిన్, యాంగ్ చు లను తీసుకువెళ్ళేందుకు వచ్చారా?
“ఎవరు మీరు?” కోపంగా అడిగాడు. వాళ్ళి ద్దరూ ఒకరివైపు ఒకరు చూసుకున్నారు. ‘మార్టిన్, యాంగ్ చు యాంగ్లు ప్రమాదంలో ఉన్నారని మెసేజ్ ఇస్తే వచ్చాం. వాళ్లను తీసుకు వెళ్ళడానికి’
‘ఇప్పుడు ప్రమాదం ఏమీ లేదు. వాళ్లకి నేను ఫస్ట్ ఎయిడ్ చేసాను.
కోలుకుంటారు’ ‘ఎక్కడ ఉన్నారో చూపండి’. ‘పదండి.” ఆ వైపు తిరిగాడు బ్రహ్మబుధ. గదికి తీసుకువెళ్ళి గదిలో స్పృహ లేకుండా పడివున్న వారిద్దరినీ చూపించాడు.
వాళ్ళు ఒకరివైపు ఒకరు చూసుకున్నారు. “ఏమిటి అలా చూస్తున్నారు?’ అడిగాడు బ్రహ్మ బుధ.
వెంటనే ఆ ఇద్దరూ బ్రహ్మబుధ పైకి దూకారు. ఒకడు బ్రహ్మబుధను గట్టిగా పట్టుకోగానే మరొ కడు, అతడికి స్పృహ తప్పే ఇంజక్షన్ ఇచ్చాడు. క్షణాలలో వాళ్ళిద్దరి చేతులలో వేలాడిపోయాడు బ్రహ్మబుధ.
‘బ్రహ్మబుధకి మత్తు ఇచ్చాము. స్పృహ కోల్పోయాడు. తీసుకు వస్తున్నాం’ మెసేజి పంపించారు. వేలాడుతున్న బుధ గ్రహ శరీరాన్ని వాహనంలోకి ఎక్కించారు. వారి వాహనం బుధగ్రహం చుట్టు కక్ష్యలో తిరుగు తున్న వ్యోమనౌక వైపు దూసుకుపోయింది.
ఎన్ని మార్లు భూమివారు రమ్మన్నా రాను అని ఇక్కడే వుండిపోయాడు. చివరికి ఒంట రిగా ఉండి స్కిజోఫ్రెనిక్ (స్బిజ్ ఒఫ్రెనిచ్) తయారయ్యాడు. లేనివి ఉన్నట్టు ఊహించు కుని, లేనివారిని ఉన్నట్టుగా ఊహించుకుంటు న్నాడు. పని తీరు దెబ్బ తింటున్నది. ఇతడితో కలిసి పనిచేయటం కష్టంగా ఉందని మార్టిన్, యాంగ్ చులు పదేపదే ఫిర్యాదు చేయటంతో బలవంతాన భూమికి తీసుకు వెళ్ళాల్సి వస్తోంది. లేకపోతే ఇతనిలా ఇన్నేళ్ళు ఒంట రిగా బుధగ్రహంపై ఉండటం సామాన్యం కాదు. ఇలాంటివాడు ఇంకొకడు దొరకడు’ బ్రహ్మబుధ వైపు చూస్తూ అన్నాడు వ్యోమగామి.
అయినా మనం మన కళ్ళతో చూశాము కదా! గదిలో ఎవ్వరూ లేరు. మార్టిన్, యాంగ్ చులు వారి వారి స్థానాల్లో వున్నారు. వారికి ఏదో జరిగిందని, వారిని తాను కాపాడానని బ్రహ్మ బుధ చెప్పినదంతా అతని ఊహ. మనకు అబద్ధం, అతనికి నిజం’ ఇంకో వ్యోమ గామి అన్నాడు.
మత్తులోనే ఏదో కలవరిస్తున్నాడు బ్రహ్మ బుధ. మరో వ్యోమగామి అతడి పెదవుల దగ్గరగా చెవి పెట్టాడు. బ్రహ్మబుధ ఏమంటు న్నాడో వినేందుకు.
భూమి అంటే అసహ్యం. నేను భూమికి రాను. నేను బుధగ్రహంలోనే ఉంటాను’ అస్ప ష్టంగా అంటున్నాడు బ్రహ్మబుధ మత్తులో.
వ్యోమనౌక బుధ గ్రహం దాటి, కక్షలో వున్న సమాచార నౌకవైపు దూసుకుపోతోంది.
బ్రహ్మబుధను భూమికి తీసుకువెళ్ళే నౌక సిద్ధంగా వుంది.

– – కస్తూరి మురళీకృష్ణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *