ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ = అక్కినేని బ్యానర్

రంగావఝల భరద్వాజ

ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అంటే అక్కినేని బ్యానర్. అక్కినేనితో మాత్రమే సినిమాలు తీసిన కంపెనీ. పిఎపి అధినేత ఎ.వి.సుబ్బారావు మొదటి సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చిన హీరో అక్కినేనే. చాలా వరకు ఆ బ్యానర్ లో వచ్చిన సినిమాల్లో అక్కినేనే హీరో. కృష్ణా జిల్లా పునాదిపాడుకు చెందిన సుబ్బారావు సినిమాల్లోకి ప్రవేశించడానికి కారణం ఎన్.టి.ఆర్. తను చిత్రాలు తీసింది మాత్రం ఎఎన్నార్ తో. అలాగని ఎన్.టి.ఆర్ తో సాన్నిహిత్యం వదులుకోలేదు. పిఎపి బ్యానర్ రెండు విషయాల్లో రికార్టు నెలకొల్పింది. ఒకటి అక్కినేనితోనే సినిమాలు తీయడం..అయితే రెండోది ఒకే డిస్ట్రిబ్యూటర్ తో తన సినిమాలన్నీ పంపిణీ చేయించడం. ఇల్లరికం నుంచి నాయకుడు వినాయకుడు వరకు పిఎపి సినిమాల్లో అక్కినేనే హీరో. నవయుగ వారే పంపిణీదారులు. తాతినేని ప్రకాశరావు…ఆయన శిష్యులే దర్శకులు. ఎక్కువ శాతం తాతినేని చలపతిరావే సంగీత దర్శకుడు. ఇంత గొప్ప కమిట్ మెంట్ మరే సినిమా కంపెనీలోనూ కనిపించదు. అదీ పిఎపి స్పెషాల్టీ.
కృష్ణా జిల్లా పునాదిపాడు రైతు కుటుంబానికి చెందిన సుబ్బారావు తన బావమరిది ఇంజనీరింగ్ సీటు కోసం మొదటిసారి మద్రాసు వెళ్లారు. చిన్నప్పట్నించి పరిచయం ఉన్న తాతినేని ప్రకాశరావు తో కలసి చెన్నై రిపబ్లిక్ గార్టెన్స్ లోనే ఉన్నారు. అన్న ఎన్.టి.ఆర్ కూడా అక్కడే ఉండేవారు. అలా ఎన్.టి.ఆర్ తల్లి చేతి వంట తిన్నారు సుబ్బారావు. ఎన్టీఆర్, తాతినేని ప్రకాశరావుల ప్రోత్సాహంతోనే చిత్ర నిర్మాణంలోకి వచ్చారు. లక్షన్నర మూలధనం పెట్టుబడిగా ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ప్రారంభించారు.
తాతినేని ప్రకాశరావు సలహ మేరకు ఎల్.వి. ప్రసాద్ తో సినిమా చేయడానికి రంగం సిద్దం చేసుకున్నారు సుబ్బారావు. పెంపుడు కొడుకు పేరుతో బైలింగ్వల్ మూవీకి స్క్రిప్ట్ రడీ అయింది. తెలుగులో అక్కినేని నాగేశ్వర్రావు తమిళ్ లో శివాజీ గణేషన్ అనుకున్నారు. తీరా అడ్వాన్స్ పుచ్చుకున్న తర్వాత అక్కినేని కథ నచ్చలేదని చెప్పి తప్పుకున్నారు. దీంతో తెలుగులోనూ శివాజీతోనే కానిచ్చేశారు. పిఎపి తీసిన సెకండ్ స్ట్రెయిట్ మూవీ ఇల్లరికం. ఆ సినిమాతో పిఎపి తో అక్కినేని ప్రస్తానం కొనసాగింది.
ఇల్లరికం సినిమాకు తాతినేని ప్రకాశరావే దర్శకత్వం వహించారు. ఇది అక్కినేనికి 74వ సినిమా. తర్వాత రోజుల్లో పాపులర్ డైరక్టర్లు అయిన కె. ప్రత్యగాత్మ, కోగంటి గోపాలకృష్ణ, తాతినేని రామారావులు ఇల్లరికం సినిమాకు సహాయ దర్శకులుగా పని చేశారు. మూల కథ ప్రత్యగాత్మ, సదాశివబ్రహ్మం తయారు చేస్తే …డైలాగ్స్ సదాశివ బ్రహ్మం, ఆరుద్ర కలసిరాశారు. ఇల్లరికం సక్సస్ తో డైలాగ్స్ ది మేజర్ షేర్. కొసరాజు రాసిన ఇల్లరికంలో ఉన్న మజా పాట ఎవర్ గ్రీన్ హిట్. మొత్తం 23 కేంద్రాల్లో ఇల్లరికం శతదినోత్సవం జరుపుకుంది.
ల్లరికం కథారచనలో భాగం పంచుకున్న కోటయ్య ప్రత్యగాత్మతో ఎ.వి.సుబ్బారావు అనుబంధం బలపడింది. తన మూడో సినిమా దర్శకత్వ బాధ్యతలు ప్రత్యగాత్మ భుజాల మీద పెట్టారు. డాక్టర్. కె.త్రిపురసుందరి రాసిన కథకు మహాకవి శ్రీశ్రీ, అట్లూరి పిచ్చేశ్వర్రావులు ట్రీట్మెంట్, డైలాగ్స్ రాసారు. భార్యాభర్తలు సినిమా రికార్టులు బద్దలు కొట్టే వసూళ్లు సాధించింది. పెళ్లికి పునాది ప్రేమ, నమ్మకం, గౌరవం అనే కాన్సెప్ట్ తో సాగే ఈ చిత్రం మ్యూజికల్ గానూ గొప్ప విజయం సాధించింది.
భార్యాభర్తలు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ప్రతిష్టను పెంచిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. వామపక్ష ఉద్యమాలలో పనిచేసి తర్వాత తాతినేని ప్రకాశరావు దగ్గర కథకుడుగా సహాయ దర్వకుడుగా వ్యవహరిస్తున్న ప్రత్యగాత్మ దర్శకత్వం వహించిన తొలిచిత్రం కూడా ఇదే. సంగీత దర్శకుడు రాజేశ్వర్రావు ప్రైవేటు గీతం షికారు పోయి చూతమా స్టైల్ లో శ్రీశ్రీ జోరుగా హుషారుగా షికారు పోదమా అని రాసి అదరగొట్టారు. ఈ పాటలో ఓ స్పెషాల్టీ ఏంటంటే…అక్కినేని లవర్స్ గా కనిపించిన వాళ్లల్లో శ్రీదేవి తల్లి రాజేశ్వరి కూడా ఉండడం.
పి.ఎ.పితో ప్రత్యగాత్మ ప్రయాణం సక్సస్ ఫుల్ గా కొనసాగింది. భార్యాభర్తలు తర్వాత సినిమా కులగోత్రాలకు కూడా ప్రత్యగాత్మే డైరక్ట్ చేశారు. కులగోత్రాలు,కట్టుబాట్లకు విలువనిచ్చే తండ్రి…కట్టుబాట్లను గుడ్డిగా అనుకరించకుండా మానవీయకోణంలో అర్ధం చేసుకుని ముందుకు పోవాలనే కొడుకు మధ్య ఘర్షణే సినిమా. ఆత్రేయ కేవలం మాటలు మాత్రమే రాసిన కులగోత్రాలు ఆరోజుల్లో అపురూప విజయం సాధించింది. సూపర్ స్టార్ కృష్ణ హీరో మిత్రబృందంలో ఒకడుగా కనిపించడం ఒక విశేషమైతే…అక్కినేని సినిమాకు నారాయణరెడ్డి పాట రాయడం కూడా కులగోత్రాలుతోనే ప్రారంభం.
విశాఖలో మొదటి సారి షూటింగ్ జరుపుకున్న చిత్రంగా కూడా కులగోత్రాలు చరిత్రలో నిల్చిపోతుంది. అంతే కాదు ఉత్తమ ద్వితీయ ప్రాంతీయ భాషా చిత్రంగా జాతీయ స్థాయిలో అవార్టు గెల్చుకుంది. వెండితెర నవల సంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ… అప్పటికి జర్నలిస్ట్ గా ఉన్న ముళ్లపూడి వెంకటరమణతో వెండితెర నవల రాయించారు.
భార్యాభర్తలు, కులగోత్రాలు చిత్రాలకు ఎస్.రాజేశ్వర్రావు సంగీతం అందించారు. అయితే పిఎపి వారి తదుపరి చిత్రం పునర్జన్మకు మాత్రం తాతినేని చలపతిరావు మ్యూజిక్ చేయడం విశేషం. అక్కినేని నాగేశ్వర్రావు, కృష్ణకుమారి కాంబినేషన్ మరోసారి రిపీట్ అయినా ఆడియన్స్ నుంచి మాత్రం అద్భుతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా చలపతిరావు మ్యూజిక్ లో వచ్చిన శ్రీశ్రీ రచన ఎవరివో నీవెవరివో పాట సూపర్ హిట్ .
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మించిన చిత్రాలు వరసగా రాష్ట్రపతి ప్రసంశాపత్రాలు పుచ్చుకోవడం విశేషం. భార్యాభర్తలు, కులగోత్రాలు, మనుషులు మమతలు చిత్రాలు జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రాలుగా పురస్కారాలు అందుకున్నాయి. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ చిత్రాలు డైరక్ట్ చేసిన వారందరూ ఆ కాంపౌండ్ లో అసిస్టెంట్స్ గా జీవితాన్ని ప్రారంభించినవారే కావడం మరో విశేషం.
పునర్జన్మ తర్వాత ప్రసాద్ బ్యానర్ లో ప్రత్యగాత్మ డైరక్షన్ లోనే మనుషులు మమతలు చిత్రం వచ్చింది. జయలలితను హీరోయిన్ గా పరిచయం చేస్తూ తీసిన ఆ చిత్రంలో జయలలితతో బికినీ కట్టించారు ప్రత్యగాత్మ. తెలుగులో మొదటిసారి ఎ సర్టిఫికెట్ పొందిన పాపులర్ స్టార్ మూవీ కూడా అదే. ఇంతకీ ఈ సినిమాకు కథ సమకూర్చినది యద్దనపూడి సులోచనారాణి.
ప్రత్యగాత్మ దగ్గర అసిస్టెంట్ గా జీవితాన్ని ప్రారంభించిన తాతినేని రామారావును దర్శకుడ్ని చేస్తూ నవరాత్రి చిత్రం నిర్మించారు సుబ్బారావు. తాతినేని రామారావుతోనే బ్రహ్మచారి తీశారు. నవరాత్రి ఓ ప్రయోగాత్మక చిత్రం. అందులో తొమ్మిది రకాల వేషాల్లో కనిపించి అక్కినేని ఒక రికార్టు సృష్టించారు.
ఏడాదికి ఓ సినిమా అదీ ఓ సూపర్ హిట్ తీయడం మాటలు కాదు. అది పిఎపి సుబ్బారావుగారికే చెల్లింది. బ్రహ్మచారి తర్వాత మళ్లీ ప్రత్యగాత్మ దర్శకత్వంలో ఆదర్శకుటుంబం తీశారు. ఆ విజయం రుచి చూస్తూనే జయలలిత , ఎఎన్నార్ కాంబినేషన్ లో తాతినేని రామారావు డైరక్షన్ లో భార్యా బిడ్డలు తీశారు. కలర్ లో తీసిన భార్యాబిడ్డలు ప్రసాద్ ఆర్ట్స్ లో కె.వి.మహదేవన్ మ్యూజిక్ చేసిన ఒకే ఒక చిత్రం.
భార్యా బిడ్డలు తర్వాత మళ్లీ బ్లాక్ అండ్ వైట్ లో ప్రత్యగాత్మ డైరక్షన్ లోనే బాలమురుగన్ కథ తో పల్లెటూరి బావ తీశారు సుబ్బారావు. అందులోనూ అక్కినేనే హీరో. ఆ తర్వాత అక్కినేనిని కాకుండా అప్పటికి కొత్త కుర్ర హీరో నరసింహరాజు తో అత్తవారిల్లు తీశారు. రామకృష్ణ , జయసుధలతో అల్లుడొచ్చాడు తీశారు. ఈ రెండు చిత్రాలకూ ప్రత్యగాత్మే డైరక్టరు. తాతినేని రామారావు, ప్రత్యగాత్మల దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన ఎ.మోహనగాంధీని డైరక్టర్ ని చేస్తూ అర్ధాంగి తీశారు. వీటిలో అల్లుడొచ్చాడులో ఆత్రేయ రాసిన లేత కొబ్బరి నీళ్లల్లే అంటూ ఆత్రేయ పాట సూపర్ హిట్ అయ్యింది.
ఈ చిన్న సినిమాల మధ్యే ప్రత్యగాత్మ కృష్ణంరాజు కాంబినేషన్ లో కమలమ్మకమతం సినిమా తీశారు సుబ్బారావుగారు. సినిమా పెద్దగా ఆడలేదు. దానికి ముందే అక్కినేని తాతినేని రామారావులతో తీసిన ఆలుమగలు పిఎపి వారి రజతోత్సవ కానుకగా విడుదలై అద్భుతమైన విజయం సాధించింది. భార్యాభర్తలు తరహా కథే అయినా ట్రీట్మెంటు కొత్తగా ఉండడంతో సినిమా పెద్ద హిట్ కొట్టింది. ఎరక్కపోయి వచ్చాను….ఇరుక్కు పోయాను పాట భార్యాభర్తలులో జోరుగా హుషారుగా రేంజ్ లో సక్సస్ అయింది.
పిఎపి బ్యానర్ లో అక్కినేని నటించిన చివరి చిత్రం నాయకుడు వినాయకుడు ఫ్లాప్ కావడం ఓ విషాదం. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని రెండు మూడు సినిమాలు చేశారు అనుమోలు వెంకట సుబ్బారావు. 1994లో వచ్చిన పోలీస్ బ్రదర్స్ సుబ్బారావు చివరి చిత్రం. ఒక స్వర్ణయుగం నాటి నిర్మాణసంస్ధ అలా చరిత్రలో మిగిలిపోయింది.
ప్రత్యగాత్మ , అక్కినేని కాంబినేషన్ లో వచ్చిన పి.ఎ.పి వారి చిత్రం నాయకుడు వినాయకుడు. ఈ సినిమాకు కథ మాటలు సి.ఎస్.రావు. దీనికి ముందు అనుకున్న టైటిల్ నరుడా ఏమి నీ కోరిక. పొలిటికల్ సెటైర్ గా రూపొందిన ఈ చిత్రం అనుకున్న లక్ష్యాన్ని చేరలేదు. పైగా జయలలిత హీరోయిన్ను కావడం కూడా సినిమా దెబ్బతినడానికి కారణమైంది. జయసుద, ప్రదలు రాజ్యం చేస్తున్న టైమ్ లో జయలలితను పెట్టడం పొరపాటే అయింది.
నాయకుడు వినాయకుడు డిజాస్టర్ తర్వాత అంతా కొత్తవాళ్లలో సినిమా తీయాలని సంకల్పించారు ఎ.వి.సుబ్బారావు. కథ రెడీ అయింది. ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తితో రాయించారు. వేటూరితో పాటరాయించి చక్రవర్తితో రికార్టు చేయించారు. ఓ వారం రోజుల్లో షెడ్యూల్ అనగా ఏ కారణం చేతో ఎ.వి.సుబ్బారావు చిత్రనిర్మాణం వద్దనేశారు. దీంతో కోపం వచ్చిన ప్రత్యగాత్మ స్క్రిప్ట్ ఫైల్ పి.ఎ.పి. కార్యాలయంలో విసిరికొట్టి ఇక చాలు అని వెళ్లిపోయారు. అంతే ఇక ఆయన సినిమాలు చేయలేదు. రికార్టు చేసిన పాటను మాత్రం అక్కినేని జంధ్యాల కాంబినేషన్ లో వచ్చిన అమరజీవి చిత్రంలో వాడుకున్నారు.
ప్రత్యగాత్మతో సినిమా ఆపేసిన తర్వాత సుబ్బారావుగారు బాలయ్యతో రెండు సినిమాలు రూపొందించారు. రెండు చిత్రాలకూ తాతినేని రామారావే దర్శకుడు. ఒకటి ప్రెసిడెంట్ గారి అబ్బాయి. రెండోది తల్లిదండ్రులు. అదే సమయంలో రాజేంద్రప్రసాద్ హీరోగా తాతినేని రామారావుతోనే గోల్ మాల్ గోవిందం సినిమా తీశారు. ఆ సినిమా పెద్దగా పే చేయలేదు. దాని తర్వాత మోహన్ గాంధీతో తీసిన పోలీస్ బ్రదర్స్ మాత్రం మాటదక్కించింది.
అన్ని భాషల్లోనూ కలిపి ముప్పై ఐదు చిత్రాలు నిర్మించారు పిఎపి సుబ్బారావుగారు. పిఎపి పర్మినెంట్ కథానాయకుడు అక్కినేని నాగేశ్వర్రావు కుమార్తె నాగ సుశీలను తన ఇంటి కోడలిని చేసుకున్నారు. తనకిష్టమైన నటుడు నాయకుడు నందమూరి తారక రామారావుతోనూ సన్నిహితంగా మెలిగారు. ప్రస్తుతం సుబ్బారావుగారి మనవడు సుశాంత్ హీరోగా చేస్తున్నాడు. ఇవీ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మించిన చిత్రాల విశేషాలు. నెక్ట్స్ టైమ్ మరో స్పెషల్ టాపిక్ తో మళ్లీ కలుద్దాం. అంటిల్ దేన్ బైబై…..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *