శ్రీమద్రామాయణారంభం కావ్యతత్త్వ ప్రకాశనం

ఆది కావ్యమైన వాల్మీకి రామాయణం ఆరంభంలో బాలకాండలోని నాల్గు సర్గలు కావ్యప్రాదుర్భావాన్ని వివరంగా తెలియజేేనవి. ధ్వన్యాలోకంలో ఆనందవర్థనులు కవిత్వ మూలాలను అన్వేషించుతూ ఈ రామాయణారంభాన్ని విశ్లేషించారు. అయితే నాల్గు సర్గలు మొత్తంగాసమగ్రంగా కావ్యతత్త్వాన్ని, అలంకారశాస్త్ర రహస్యాలను కావ్యరూపతపస్సును, దాని ద్వారా చేరదగిన పరమ ప్రాప్యమును విశదంగా వెల్లడించాయి. కావ్యారంభం ‘తపస్స్వాధ్యాయనిరతం’ అని అవుతుంది. అయితే ఇది వాల్మీకికి రామగాథా వ్యాఖ్యానం చేనిన గురుస్థానీయుడైన నారదుని గురించింది. వాల్మీకికి మాత్రమే కాక వ్యాసునికీ భాగవత రచనకు ప్రేరణ నిచ్చిన గురువు నారదుడే. నారదుడు అనే మాటకు నారం బ్రహ్మజ్ఞానం దదాతి ఇచ్చువాడని వ్యాఖ్యాతలు అర్థం చెప్పారు. ఈ నారదుడు త్రిలోక సంచారి. వాల్మీకి వ్యాసులకే అంతః ప్రజ్ఞను మేల్కొల్పినవాడు. నారదుడు తపస్సులోను, స్వాధ్యాయంలోను నిరంతరం నిమగ్నమైనవాడు. తపస్సు అంతర్ముఖంగా ఆత్మదర్శనం చేేన మార్గం. ఒక్క వ్యక్తి క్రమంగా బహిర్వాసనల నుండి విముక్తుడై, అంతస్సులో ఆత్మజ్యోతిని దర్శించటం ఇక్కడి లక్షణం. వ్యక్తి విశ్వజనీనత పొంది సూత్రాత్మగా పరిణమించుతాడు. స్వాధ్యాయము తపస్సమాధిలో దర్శింపబడిన వాక్కు. ఆ విషయంలో తన్మయుడై నిత్యము ఊర్థ్వముఖ చైతన్యంతో సంవదించుతూ ఉండేవాడు. అందువల్లనే నారదుడు త్రిలోక సంచారి. అవిద్యా సంపర్కం వల్ల కలిగిన అంధకారాన్ని తమస్సును తొలగించేవాడు. నిత్య ప్రకాశమానుడు.
యోగమార్గంలో త్రిలోక సంచారం అంటే త్రిఖండాత్మకమైన షట్చక్రములతో సంపుటియైన సుషమ్నయందు కుండలినీ రూపంలో సంచరించుట అని అర్థం. ఈ సుషమ్న మూడు స్థాయిలలో మూడులోకాలుగా మూడు గ్రంథులతో కూడి ఉంటుంది. అన్ని లోకాలకు అనుసంధానభూతమైంది. అందువల్లనే నారదుణ్ణి వాల్మీకి ‘వాగ్విదాంవరు’డన్నాడు. సాధారణంగా లోకంలో వైఖరీ వాక్కు మాత్రమే తెలియవస్తుంది. అది ఎదిగిన శబ్దశాస్త్ర రహస్య మెరిగినవారు వాగ్విదులు. వారిలో శ్రేష్ఠడు. వైఖరికన్న పూర్వపూర్వాలైన పరా పశ్యంతి మధ్యమల తత్త్వం ఎరిగినవాడు
‘చత్వారి వాక్పరిమితా పదాని
తాని విదుర్బాహ్మణా యే మనీషిణః
గుహాత్రీణి నిహితా నేఙ్ఞయంతి
తురీయం వాచో మనుష్యా వదంతి’ (ఋ. 116445)
పరాది వాక్కులను తెలుసుకోవటం కేవలం యోగులకే సాధ్యం. నాదమూలాల రహస్యం ఎరిగినతనం అది. అందుకే ప్రతీకగా నారదుని చేతిలో ‘మహతి’ అనే వీణ ఉంటుంది. అది తంత్రీ వాద్యం. ‘వాగ్విదాం వరు’డన్న ప్రశంస ఈ సుషమ్నాస్థానీయుడైన నారదుని ఉద్దేశించిందే. మహతిశతంచైకానాడ్యః అని కంఠంలో వర్ణింపబడిన శరీరానికి ప్రతీక. వాల్మీకి ఈయన మనన శీలాన్ని వివరిస్తూ మునిపుంగవుడన్నాడు మునిశ్రేష్ఠడు. నిరంతరం ప్రణవోపాసన చేస్తూ ఆ నాదమూలంలో రమిస్తూ వుంటాడు.పుంగవం అంటే వృషభం. వేదంలో ‘‘చత్వారి శృంగాః త్రయో అస్యపాదాః’’ అన్న మంత్రంలో ప్రణవం వృషభమని చెప్పబడింది. నారదుణ్ణి త్రిలోకజ్ఞుడని కూడా వాల్మీకి వర్ణించాడు. మూడు గ్రంథులు గల అంతర్లోకాలను ఎరిగిన వాడు మాత్రమే కాక వాక్కును మంత్రంగా మార్చగలిగినవాడు. మంత్రమయ చిత్తకాంతితో ప్రకాశించేవాడు. కావ్యాభివ్యక్తి దివ్య స్పృష్టికలిగి వుండి మంత్రంగా మారటానికి మూడు గాఢతలు కావాలని శ్రీ అరవిందులు పేర్కొన్నారు. 1. లయాత్మకమైన ఉన్నతోన్నత గతి, 2. శబ్దరూపము, భావ విస్తృతుల తో కూడిన శైలిెుుక్క ఉన్నతోన్నత సమన్వయము, 3. ఉచ్ఛతమమైన పరమ సత్యమును గురించిన ఆత్మ దర్శనము ఈ మూడు గాఢతలు సమన్వయం పొందిన చోట శబ్దం ఎన్నో అవర స్తరాలను అతిక్రమించి మంత్ర న్థితికి చేరుతుంది. (ఊనీలి ఓతిశిజీతిలి ఆళిలిశిజీగి ఆబివీలి 17) అందువల్లనే నారదుని త్రిలోకజ్ఞుడని వర్ణించటం జరిగింది. రామాయణం మహామాలామంత్ర మయింది. ఇటువంటి గురూపదేశంతో వాల్మీకి రామాయణ రచనకు ఉపక్రమించాడు. వాల్మీకి భృగు వంశానికి చెందినవాడు. ప్రచేతుసుని కుమారుడు. ఇతని పేరు ఋక్షుడు. తపోవేళ ఈయన చుట్టూ పుట్ట పెరుగటం వలన ఈయనకు వాల్మీకి అనే పేరు వచ్చింది. ఉపనిషత్తులలో భృగుమహర్షి ప్రసక్తి వస్తుంది. ఈ వంశంలోనివాడే విష్ణ అవతారమైన పరశురాముడు. మహాలక్ష్మికి భార్గవి అని పేరు. ఈ వైదిక వంశంలో మంత్రవేత్తల వరుసలోని వాడు వాల్మీకి మహర్షి. ఈయన తండ్రి పేరు విచిత్రమైందిప్రచేతుడని. ప్రచేతశ్శబ్దానికి చేతస్సు కంటే ఉన్నతమైన మనోభూమిక అన్న అర్థం స్ఫురిస్తుంది. తంత్రశాస్త్ర మార్గంలో ఉన్మని అన్నభావన (బీళిదీబీలిచీశి) ఉన్నది. ఈ ఉన్మనీదశ మనోమయ న్థితికీ అధి మనస్సునకూ (సూపర్ మైండ్‌కు) నడిమి నాల్గు అంతస్థులను సూచిస్తుంది. శ్రీ అరవింద దర్శనంలో ఈ న్థితులు ఎరిగినంతలో నాల్గు. ఉన్నత మనస్సు, ప్రదీప్త మనస్సు, సంబుద్ధమనస్సు, అతీత మనస్సు వీటన్నింటికీ అతీతంగా మానవజాతి ఆంత్యంతికంగా చేరదగిన అధిమనస్సు నెలకొని ఉన్నది. ఉదాత్తజీవనంలో ఈ ఉన్మనీ మనోభూమికల కాంతులు ప్రసరిస్తూ వుంటాయి. అదీ అంతర్ముఖమైనప్పుడు, ఒకానొక సమాధివంటి న్థితిని పొందినపుడు. వాల్మీకి ప్రచేతసుని పుత్రుడు. ప్రాచేతసుడని అంటే ఈ ఉన్నత మనస్సోపానపు వెలుగులను ప్రోది చేసుకున్న కవి అని అర్థం.
వాల్మీకి తపన్వియే కాదు. వాక్య విశారదుడు. వేదములలోని మహావాక్యాలు ‘తత్త్వమనీ’త్యాదులు బ్రహ్మతత్త్వాన్ని వెల్లడించేవి. వాటి తాత్పర్యం ఆయన చిత్తంలో విశదంగా నిలచి ఉన్నది. శబ్దం అనేక స్తరాలలో అనేక భావనలను నిక్షేపించుకొని ఉంటుంది. అందుకే అది కాలాంతరాలలో నూత్నార్థాలను ప్రసరిస్తూవుంటుంది. ఈ రహస్యం ఎరిగినవాడు వాక్య విశారదుడు. ఈయన మహాముని. మననశీలం గురువునకు వలె ఈయనకు సహజ స్వభావం.
ఒకనాడు ఉషః కాలంలో వాల్మీకి స్నానం చేయటానికి తమసానదీ తీరం వెళ్ళాడు శిష్యడైన భరద్వాజునితో. ఆ ఉషోవేళ ఆ నది స్వచ్ఛంగా అకర్దమంగా ఉన్నది. దాన్ని చూడమన్నాడు తన శిష్యని. అది గంగకు సమీపంలోనే ఉన్నది. ఈ సంబంధం తమసకు గంగకు గల పావిత్య్రాన్ని ఆపాదిస్తున్నది. గంగానదికి అవిదూరంగా ఉన్నదని పేర్కొని ఆ సాన్నిధ్య లక్షణం వల్ల గంగానదికీ తమసకు నడిమి సామాన్య లక్షణం కనిపిస్తుంది. ఇది బ్రహ్మనందానికీ కావ్యానందానికీ గల సహోదర సంబంధంగా చెప్పవచ్చు. ఆయన మనస్సు ఈ సన్నివేశంలో అకర్దమంగా మాలిన్యరహితంగా ఉండగా క్రౌంచ ద్వంద్వంలోని ఒకానొక పక్షిని కిరాతుడొకడు క్రూరంగా సంహరించటం, ఆడపక్షి దుఃఖించటం, మగపక్షి రక్తపు మడుగులో పడి మృత్యువేదన పొందటం మహర్షి చూచినప్పుడు విశ్వవేదన సంచలించింది. కావ్యశాస్త్రం చెప్పిన ‘విశదీభూతే మనో ముకురే’ అన్నప్పటి న్థితి అది. సహృదయుని న్థితి. విశ్వవేదనను స్వాయత్తం చేసుకోగల న్థితి అది. అందువల్లనే మహర్షి వ్యక్తిత్వ పరిమితులను దాటిన జగద్వేదనను అనుభవింపగల న్థితికి చేరుకున్నాడు. అప్పుడు చిత్తాన్ని న్థితిని ్టరుణ ఆవరించింది. కవి కరుణ వేదియైనాడు. అందుకే తమసా నదిని వర్ణిస్తూ అది రమణీయము, ప్రసన్నాంబువని విశదం చేని, అది సన్మనుష్యమనో యథా అని ఉపమించాడు.
తమస అస్వాద్యమైన కావ్యమే. లోకగత వాసనల నుంచి విముక్తమయింది. అకర్దమం. మనస్సుకు ప్రీతి కలిగిస్తున్నది. రమణీయమై రసానుభవం కలిగిస్తున్నది. ప్రసన్నాంబువే అయినా కావ్యం లోకచరిత్ర పరిమితులు దాటింది. దేశకాలాల పరిమితులను అతీతమైంది. అందువల్లనే సర్వచేతస్సుగా మారిపోతుంది. అదే సహృదయ చిత్తము ప్రతిఫలించే న్థితి. తమస వాస్తవ జగత్తుకు కావ్య జగత్తుకు నడిమితెర. నదీ వర్ణనం కావ్యతత్త్వ వివేచనయే. క్రౌంచవధ చూచేప్పటికి కవి మనస్సు ఉన్న న్థితి అది. అది కరుణవేదిత్వము. లోకంలోని ఆత్యంతికమైన దుఃఖం, జరారోగభయ మృత్యువుల వల్ల కలిగేది, అనుభవం లోనికి వచ్చింది. ‘కారుణ్యం సమపద్యత’. అందువల్ల శోకార్తుడైనాడు. మహాత్ముడైన బుద్ధునికి కలిగింది ఇలాంటి శోకమే. విశ్వనాథ సత్యనారాయణ చెప్పిన ‘జీవుని వేదన’ ఇలాంటి న్థితియే.
ఆ విశ్వచైతన్య దశ నుండి అవిదితంగా వాల్మీకి నోట కావ్యవాక్కు వెలువడింది.
‘మానిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః
యత్‌క్రౌంచ మిధునాదేక మవధీః కామోహితమ్’
మామూలుగా అది క్రోధ వాక్కు అయితే పక్షి పొందిన మృత్యువేదనలో, ఆడపక్షి పొందిన వియోగ దుఃఖంతో మాత్రమే అది తాదాత్మ్యం పొందటం సాధ్యం కాదు. ఈ వియోగము పరమేశ్వరుని నుండి జీవుడు పొందింది. ఈ మృత్యువు ఆనందమయన్థితి నుండి అవిద్యామయన్థితికి దిగజారటం. ఈ రెండూ క్రౌంచవధ ప్రేరణతో జాగృతాలైనవి. ఈ వాగ్దేవతా స్వయంనిద్ధి సాక్షాత్కారం అప్పటి విలక్షణమైన న్థితిలో నుండి నిర్గమించింది. వాల్మీకి ధ్యానమగ్నుడైనాడు. తను వెలువరించిన శ్లోకాన్ని మరల మరల మననం చేనినాడు. అప్పుడు ఆ ప్రేరణ ద్రవ్యమంతా మహాబుద్ధి అహంకారచిత్తరూపమైన అంతరంగంలోనికి దిగి వచ్చింది. ‘చతుర్ముఖో ఆజగామ’, ఆ బ్రహ్మదేవుడన్నాడు నా ఆదేశం వల్లనే నీ ముఖం నుండి సరస్వతి బయలు వెడలింది అని. వేదమంత్రావిర్భావం వంటి న్థితి అది. అప్పటికి వస్తువు. రచనా ప్రణాళికా, కావ్యాభివ్యక్తి విశేషాలు అన్నీ ముందుకు త్రోసుకువస్తున్నవి. నారదుడు పూర్వమే చెప్పిన రామకథను భావిస్తూ మరల మరల ధ్యానంలోకి వెళ్లి దాని లోలోతులను దర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆదికవి.
రవి గాంచనిచో కవి గాంచునన్న మాటను యిక్కడ స్మరించుకోవాలి. వస్తువు కేవలం ముడిసరుకే. అది దాని మీది పొరలను తొలగిేన్త దేశకాల పరిమితులను దాటుతుంది. బహిరంగముఖం దాటి అంతరంగముఖం ముందుకు వస్తుంది. జగజ్జీవన రహస్యాలను వెల్లడిస్తుంది. అందువల్లనే ‘అవిదితం సర్వం విదితం భవిష్యతి’ కవి చిత్త సమాధిలోని వెళ్ళినప్పుడు చరాచర జగత్తు, మూడు కాలాలు అతనిలో జాగృతమౌతాయి. కావ్యం అనేక స్తరాలలో సాక్షాత్కరిస్తుంది. ఒక న్థితిలో మానవ జీవన పక్షం. రెండవ న్థితిలో శాస్త్ర వ్యాఖ్యాన పక్షం లేదా సౌందర్యశాస్త్ర పక్షం. మూడవదశలో ఆధ్యాత్మ సాధన పక్షం. ఇలా ఎన్నో స్తరాలు గర్భితం చేసుకొని ఉంటుంది కావ్యవాక్కు. ఈ రహస్యం కావ్య ‘ప్రకాశ’పక్షానికి ఆవలిది. అందువల్ల కావ్యంలో ఈ స్థాయిలో పలికే కవి వాక్కులో అసత్యం అనృతం ఉండదు. ‘అనృతం తవకావ్యే న భవిష్యతి’. అందువల్లనే ప్రభుస్థానీయులైన మహర్షి కల్పులైన మహాకవుల కావ్యాలలో ఎప్పటికప్పుడు నూతనార్థాలు, వ్యాఖ్యానాలు సాధ్యమవుతున్నాయి. విశ్వచేతనలో ఉన్న కవి వాక్కులో, లౌకిక న్థితిలో ఉన్నప్పటి వలె కవి అనృతం పలుకదు. ఋతం అంటే విశ్వమును ప్రసరింపజేేన దివ్యభావ సూత్రం. విశ్వపురోగతికి, వికాసానికి భంగం కలిగించేది అనృతం. అందువల్ల కావ్యం విశ్వశ్రేయస్సుకు ఆధారమవుతున్నది. అనువ్యాహరణం వల్ల మరల మరల చెప్పుట, చదువుట వల్ల అది ప్రశన్తిని పొందుతున్నది. ‘శోకఃశ్లోకత్వమాగత’ ఇలాంటి కావ్యం మన చిత్తంలో ఉత్తమ సంస్కారాలను కలిగించి పుణ్యహేతువవుతుంది. పరిమితులను దాటినందువల్ల మనోరమము అవుతుంది. అపౌరుషేయమైన ఇదీ అవిదితంగా వెలువడటం వల్ల, మనః పరిమితులను దాటటం వల్ల వేదమైన అపౌరుషేయమే అవుతుంది. అందువల్లనే ఇది వేదోపబృంహణం కొరకు వచ్చింది. ‘వేదః ప్రాచేతసాదానీత్ సాక్షా ద్రామాయణాత్మనా’ ‘పలికెడిది భాగవత’మట. పలికించెడువాడు రామభద్రుండట అన్న పోతన ఈ చిత్త న్థితిని పొందినవాడే. కావ్యం చదివినా పాడినా మనోహరంగా ఉండాలని వాల్మీకి భావించాడు. పాడినప్పుడు కావ్యం నాదమార్గంలో చిత్తపులోలోతుల్లోనికి చొచ్చుకుని పోతుంది. చదివిన వేళ బుద్ధిలోకి ప్రసరిస్తుంది.
భావుకుల కొలది కావ్యం నూతనార్థానుసంధానం చేస్తుంది. అందువల్ల విచిత్రార్థయుక్తం అని చెప్పబడింది.
‘హ్లాదయత్సర్వగాత్రాణి మనాంని హృదయానిచ
శ్రోత్రాశ్రయసుఖం గేయం తద్బభౌ జనసంనది’
గొప్ప కావ్యం విన్నప్పుడు మనోహృదయాలే కాదు శరీరమూ సంతోషాన్ని పొందుతున్నది. ఈ అనుభవం విలక్షణమైంది. ఇది శ్రోత్రాశ్రయమైన సుఖమే అయినా శరీరం అంతా తేలిపోతుంది. ఒక సౌకుమార్యం వస్తుంది. ఇంత సమగ్రమైన అనుభవం పొందేందుకు మనం భావితాత్ములం కావాలి. కావ్య నాయకుడు లోకాభిరాముడైనాడు ‘అభిరామస్య రామస్య’ ఇతివృత్తంలో, ఉదాత్తత తాదాత్మ్యానికి కారణం అవుతుంది. తెలినినా తెలియకపోయినా అందరి మనస్సులలోనూ ధర్మాభిముఖంగా ఒక మూలవస్తువు వుంటుంది – వికృత చిత్తులైతే తప్ప. ఇతివృత్తము వల్ల కావ్యం కూడా లోకాభిరామమవుతుంది. కావ్యంలో ఒక సమత్వం ఉండాలి. శబ్ద సంయోజన దగ్గర నుంచి కావ్య నిర్వహణం దాకా ఈ లక్షణం వ్యాప్తమై ఉంటుంది. దీన్నే సామరస్యం అంటారు. దీని మరొక పేరు ఔచిత్యం. కవి ముఖవాక్కు పాదబద్ధమైంది. మనస్సులోని ఒక లయతో సంగమిస్తుంది. అపలయ అపశ్రుతి చెదరిస్తుంది. తంత్రీలయ ఏ కావ్యశబ్దమైనా దాని వెనుక దాగి వుంటుంది. కుశలవులు రామాయణ గానం చేస్తుండగా శ్రోతలు నాగర జానపదులు, ఋషలు సామాన్యులు. వీరు పొందిన అనుభవం విచిత్రమైంది. సర్వజన సామాన్యమైంది. సౌందర్యశాస్త్ర రహస్యాన్ని వెల్లడించింది.

‘అహో గీతస్య మాధుర్యం శ్లోకానాంచ విశేషతః
చిర నిర్వృత్త మప్యేతత్ ప్రత్యక్షమివ దర్శితమ్’
వస్తువు ఎప్పుడో కాలానిదో అయినా గీతమాధుర్యం మనస్సులను ఆహరిస్తున్నది. కావ్యం వింటూన్నప్పుడు అది ప్రత్యక్షంగా చూస్తున్నట్లు ఉన్నది. మనోముకురంలో ప్రత్యక్షంగా దర్శనం కాగల్గటం ఆ కావ్యానికి సార్థకత చేకూరుస్తుంది. కావ్య సన్నివేశాలలో శ్రోతలు లీనం అవుతారు. దానిలోని సుఖదుఃఖాలను ప్రీతితో అనుభవిస్తారు. అదే రసం. ఇది శ్రీమద్రామాయణారంభంలో కావ్యతత్త్వ ప్రకాశన లక్షణానికి సంక్షిప్త వ్యాఖ్యానం.
శ్రీరామో జయతు.

ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య
(భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ & పి.జి. కళాశాల తెలుగుశాఖ 13,14,15 నవంబర్ 07లలో
నిర్వహించిన శ్రీరామాయణ సదస్సులోని ఉపన్యాసం)
(‘కౌసల్యా సుప్రజారామం’ డా॥ కోడూరి ప్రభాకరరెడ్డి అభినందన సంచిక, 2008)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *