తెలుగులో కావ్యశిల్ప విమర్శ

మనకు స్వాతంత్య్రం వచ్చిన ఒకటి రెండు సంవత్సరాలలో తెలుగు విమర్శ సాహిత్య వికాసంలో రెండు ప్రధాన సన్నివేశాలు జరిగినాయి. మొదటిది విశ్వనాథ సత్యనారాయణ నన్నయగారి ప్రసన్న కథాకవితార్థయుక్తి భారతిలో ఒక సంవత్సరం పాటు 1949లో ప్రచురింపబడటం, రెండు చెళ్లపిళ్లవారి ఆస్థానకవి సన్మానసభలో అదే సంవత్సరం రాయప్రోలు సుబ్బారావు మాధురీ దర్శనం ప్రకటింపబడటం. ఒకటి కావ్యాన్ని శిల్పభూమిగా చూచింది, రెండవది కావ్యాన్ని సౌందర్య దీప్తిగా భావించింది.

‘జగమంతయు సౌందర్య స్థగితము శివమయము తత్ప్రసాధన రేఖా
నిగరణ రచనా వ్యంజన నగు ఆనందంబు, శాంతి యగు నవల సుధీ’
‘అనవద్య మనుక్షణ నూతన సుందర సుప్రసన్న దైవీ తంత్రా
వనమగు సృష్టిని జీవియు అనువిద్ధానంత కాంక్ష నవతరిలు సుధీ’

ఇది రాయప్రోలువారి సౌందర్య భావం. ఆయన ఉపనిషత్తుల నుండి, రవీంద్రుని నుండి, భారతీయ రసనిద్ధాంత పరంపరనుండి ప్రేరణ పొందినవారు. ఈ జగద్వలయంలో పరిధిలో, పరిమితిలో సౌందర్యమును ధారణ చేేన క్రమంలో అనుక్షణము ఆనందము చిందుతుంది. ఈ లోకం అంతా వ్యక్తావ్యక్త జగత్తుల నడిమి సంధిదశలో ఆనందోర్థ్వ కల్లోల విజృంభణం. అందువల్ల సౌందర్యస్థగితము. ఈ జగత్తును ‘ప్రసాధనం’ చేేన్త అది రచనలో ఆనందంగా వ్యంజింపబడుతున్నది. ఈ ప్రసాధనం రూపాంతరీకరణం, లోకవ్యక్తి, రసవ్యక్తి అవుతుంది. జగత్తు తన పరిణామశీలాన్నీ, మర్త్యత్వాన్ని, దుఃఖ మయత్వాన్నీ పరిత్యజించి ఆనందదేహళిని స్పృశిస్తుంది. ఆనందం చివరకు జీవుని పరమగమ్యమైన శాంతిలోనికి ప్రవేశింపజేస్తుంది. రాయప్రోలు వాడిన ‘ప్రసాధనరేఖా నిగరణము’ కవి ప్రతిభచేత సాధ్యమవుతుంది. వస్తువు దేశకాల పరిమితుల నతిక్రమించి విశ్వజనీనతను పొందటం, సర్వజీవుల అనుభవ పరిమితులలోనికి స్వతంత్రంగా, ఆత్మీయంగా ప్రవేశింపగలుగటం, కవి వక్తవ్యమైన కావ్యరూపమైన వస్తువు తన పరిధులను త్రెంచుకొని సర్వజీవుల అనుభవంగా పరిణామం పొందటం. చివరకు కవి కావ్యంలో, కావ్యం సహృదయుని భావుక చైతన్యంలో సంలీనతను పొందటం. ఈ ప్రక్రమమంతా ప్రసాధనరేఖా నిగరణమన్న మాటలో స్పష్టంగా రూపొందుతున్నది. నిరుపాధికమైన కావ్యానందం ఈ వ్యాఖ్యానంలో విశదమవుతున్నది.
రాయప్రోలువారి ‘మాధురీదర్శనం’ తత్పూర్వకృతి రమ్యాలోకానికి అనుబంధమైన కృతి అనే భావం లోకంలో ఉన్నది. ఐతే వాస్తవానికి రమ్యాలోకంలో ఆయన సూత్రీక రించిన సౌందర్యతత్త్వము కాల్పనిక కవిత్వపు సరిహద్దులలోనే నిలిచింది. మాధురీ దర్శనం వచ్చేప్పటికి కవి అనుభవ ప్రపంచంలో పరిణతి పొంది కావ్యశాస్త్రాన్ని రసోపనిషత్తుగా భావించటం కనిపిస్తుంది. ‘సురుచిర శబ్దములన్ సుందరరూపంబులను ప్రాణి తనియుటెు కళా పరమరహస్యమ’ని సౌందర్యశా సాధన సాధ్యములను పేర్కొన్నారు. శబ్దరూపాలను మాత్రం పేర్కొన్నా, సంగీతాది కళాసాధనలు దీనిలో అధ్యాహారంగా తీసుకోవలని ఉంటుంది.
అమలిన శృంగారం పేర కేవలం నరనారీ సంబంధము ేన్నహ వాత్సల్య రూపంగా రమ్యాలోకం చెప్పితే మాధుర్యదర్శనం దాని విస్తృతమైన న్ర్తీపురుష సంబంధం లోని మాధుర్య ధోరణులను వివేచించింది. జననీ, భగినీ, సహచరీ, కుమారీ క్రమము అది. ఈ చతురమైన వివేచన సార్వకాలికంగా న్ర్తీ పురుష సంబంధాలను విశ్లేషించింది.

‘రమణీయార్థ తరంగిత కమనీయంబయిన కావ్యకంఠధ్వనిలో
సుమమున మకరందమువలె భ్రమించురసము హృదయానురక్తముగ సుధీ’

భరతుని నుంచి జగన్నాథ పండితుని వరకు సాగిన అలంకారశా విచారము దీనిలో సుసూక్ష్మంగా నిక్షిప్తమయింది. రసము వస్తువులో అంతర్లీనంగా ఉంటుంది. కవి ఒక్కరికే అది సాధించటం సాధ్యమవుతుంది. ‘రసమది యథాతథమ్ముగ ప్రసరించును కవుల పాటవముకొలది యనెన్ గ్రనితాఖిల శబ్దబ్రహ్మ సమాజ్ఞాపరుడు నన్నపార్యుండాదిన్’. ఇక్కడ ఆంధ్రశబ్దచింతామణి సూత్రాన్ని స్మరిస్తున్నాడు కవి. గూఢము రసోదయన్థితి అని రసవ్యంజనను విశదీకరించారు రాయప్రోలువారు.
కావ్యనిర్మాణ మూలసూత్రం సౌందర్యస్ఫురణ. మహాకావ్యమైనా, ఇతిహాసమైనా, రూపకమైనా, ఏదైనా నిర్మాణం దాన్ని ఆద్యంతములు ఔచిత్యపూర్ణంగా తీర్చిదిద్దటంలో ఉన్నది. ‘అంగాంగ విలక్షణరుచి సంగత తను సౌష్ఠవంబు సౌందర్యమగున్’ అని సౌందర్యాన్ని నిర్వచించారు కవి. ఒక తాజ్‌మహల్, మీనాక్షి దేవాలయం, ఒక విగ్రహ నిర్మాణం, ఒక బహువర్ణ శబలమైన చిత్రరచన, మనోమోహకమైన స్వరమేళ ఏదైనా కావచ్చు. దాని నిర్మాణంలో మూలసూత్రం అంగాంగముల విలక్షణ రుచి సంగతత్వము, మొత్తం కావ్య ఫలమైన రసాస్వాదనకు ఈ సుష్ఠ నిర్మాణం ప్రధానాంశం. ఈ సుష్ఠ, ఉచిత, సమనునివిష్ట చైతన్యస్ఫురణమే సౌందర్య ప్రకృష్టస్ఫురణకు ప్రధానాధారం.
ఈ ఆకృతి నిర్మించుటకు చేేన ప్రయత్నమే ప్రసాధన ప్రయత్నం. ఈ ప్రయత్నం కవి కౌశలం మీద ఆధారపడి ఉంటుంది. రాయప్రోలువారు చేనిన ఈ సౌందర్యవర్ణనం నాట్యశా కాలంనుంచీ మనకు నిర్వచింపబడుతూ వచ్చిందే.
ఆధునిక కాలంలో కావ్యవస్తువు, ప్రధానంగా శృంగారం పునఃవినూత్నంగా నిర్వచింపబడింది. ఇక్కడ ఔచిత్యపు కుదుళ్లు చైతన్యం పొందాయి. రాయప్రోలు వారంటారు ‘నా భావనలో కామప్రేమలు రెండూ శృంగార సంబంధములుగా భానించినవి. ప్రేమ దైవికంగానూ, కామం మానుషంగానూ సంకేతించుకొన్నాను. అందుకని నా అమలిన శృంగార విషయములో శబ్దౌచిత్యమును పాటిస్తాను. చక్రస్తనీ, రంభోరూ, లలనా ఇత్యాదులు కేవలం న్ర్తీవాచకములుగా వాడక జాగ్రత్తపడ్డాను. ఇది అనుభవమే కదా. కూతుర్నీ, సోదరినీ లలనా అని సంబోధిస్తారా? అందుకని రమ్యాలోకములో ఈ ప్రసక్తి తప్పనిసరియైనప్పుడు సురత సంభోగాదులను వాడలేదు. దీని విషయం పూర్తిగా తెలియనివారు ఆక్షేపించారు. నేడు దీని ఆదిపాదులు ఉపనిషత్తులలో ఉన్నవని బయటపెట్టారు సుప్రసన్నాచారి’ (సాహితీ వైజయంతి పే.8788 2003).
ఇక్కడ వస్తువు అదే. వర్ణ్యమైన జీవితమే చూచే చూపులో మారిపోయింది. బ్రతుకులోకి ప్యూరిటనిస్టు దృక్పథం ప్రవేశించింది. కామక్రీడా పరవశమయిన మార్గం నుంచి శృంగారం ఎదిగివచ్చి జీవితాన్నంతా ఆవరించిన ప్రేమ, వాత్సల్యము, ేన్నహము, సౌదర్యము, భక్తి, విశ్వజీవనంలో ఏకాత్మభావంలో తాదాత్మ్యము ఇలా అనేకాంశాలలోకి వ్యాపించింది. శృంగారరస సామగ్రి విశ్వతోవ్యాప్తమై సహస్రముఖంగా ప్రవ్యక్తమయింది. ఆత్యంతికంగా శృంగారం వ్యక్తిత్వ పరిమితులను, ఇంద్రియాల వలయాన్ని, కాంక్షల ఇంద్రజాలాన్ని దాటటానికి ఉద్దేశింపబడింది.
ఈ అనుభవ విశేషం సంగీతంలో ఎలాంటి అనుభవం కలిగించగలదో రాళ్ళపల్లివారు చెప్పుతున్నారు ‘కనుకనే త్యాగయ్య నాదరచన భాషారచనకు చాలా దూరం మీరిపోయింది. ఆయన నాద జీవనానికి భాష శరీరంగానూ, ఎన్నోచోట్ల వట్టి పరివేషంగానూ పరిణమించి ఒదిగి నిలిచింది. ఇంతేకాదు పరదేవతగా శ్రీరామమూర్తిని ఉపానించే సాధనంగా త్యాగయ్య ఉపయోగించుకొన్న ఈ నాదకళ తుదకు శ్రీరాముడే అయిపోయింది. అధవా రాముడే నాదకళారూపముగా మారిపోయినాడు. అంటే రామమూర్తియం దారోపించిన ధ్యానించిన అఖండత, అమేయత, అనిర్వచనీయత ఈ నాదప్రపంచమంటే త్యాగయ్యకు అనుభవానికి వచ్చింది. ఇంకొక విధంగా చెప్పితే పాట భక్తి ఎల్లలను కూడా దాటిందన్నమాట’ (సాహితీ వైజయంతిపు.117).
సౌందర్యానుభవం సంగీతంలో ఎలా కలుగుతున్నదీ రాళ్లపల్లివారి నిర్వచనాన్ని బట్టి వ్యాఖ్యానించుకోవచ్చును.

1. భాషారచనను నాదకళ దాటిపోవటం.
2. లక్ష్యమైన పరమానుభవంగా ఈ నాదకళ పరిణమించటం. భాష కేవలం పరివేషమై తొలగిపోవటం.
3. లక్ష్యమునకు సాధనకు నాదమునకు పరదేవతానుభవమునకూ అభేదము నిద్ధించటము.
4. ఆత్యంతికంగా ఈ అనుభవము అఖండము, అమేయము, అనిర్వచనీయ ముగా పరిణమించటం.
5. అది వస్తుపరిమితియైన భక్తిభావాన్ని, దాన్ని సరిహద్దులను దాటిపోవటం.
ఈ అంశాలను పరిశీలించితే క్రమంగా త్యాగయ్యకీర్తన భాషను, భక్తిని, ఇతర సరిహద్దులను దాటి చివరకు పరమమైన అనిర్వచనీయమైన ఏకాకారమైన రసానుభూతిగా పరిణమించిందని తెలియవస్తున్నది. ఈ సౌందర్యం ఆస్వాద్యదశలో శ్రోతకు ఆ అఖండత్వ నిద్ధిని కలిగిస్తున్నది.
ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా పాశ్చాత్యుల సౌందర్యశా ప్రాబల్యం రాయప్రోలువారిమీద ఉన్నది. రూపనవనీతంలో ఒక పరిణామాన్ని వ్యాఖ్యానించారు వారు. దాని ప్రకారం శృంగారానుభవం తృప్తిగా అనుభవించిన తరువాత దానిమీద రాగం సడలుతుంది. పాము తన కుబుసాన్ని విడిచిన విధంగా భావుకుడు దానిని విసర్జిస్తాడు.

 

2
ఇంచుమించు ఇదేకాలంలో కావ్యానుభవ దర్శనం విశదంగా విశ్లేషించి దానికొక న్థితినీ, గతినీ కలిపించారు విశ్వనాథ సత్యనారాయణ.
నన్నయ్యగారి ప్రసన్న కథా కవితార్థయుక్తిలో ప్రధానంగా ప్రతిపాదించిన అంశాలు మొత్తంగా చూేన్త కావ్యతత్త్వము సమగ్రంగా అవగాహనకు దోహదం చేస్తుంది.
కావ్యాన్ని ఉపక్రమ ఉపసంహారాల ఆధారంగా దాని తత్త్వాన్ని గ్రహించవలని ఉంటుంది.
‘‘భారతమంతా కర్మప్రాధాన్యాన్ని బోధించే గ్రంథం. కర్మ అంటే నిత్య నైమిత్తికం కాదు. ఆగామి సంచిత ప్రారబ్ధాలు. సృష్ట్యాది నుంచి తనయందు ప్రతిఫలించిన బ్రహ్మ పదార్థం కలిగిన మూలప్రకృతి ెుట్లా పరిణమిస్తుందో అందులో బహుజీవుల కర్మసూత్రం ఎల్లా నడుపుతుందో కర్మకు మొదలూ చివరా ఎక్కడో ఈ విషయాలన్నీ ధ్వనితాలయే సర్పయాగకథను ఈ మహావిషయాలనే బోధించే భారత గ్రంథాదియందు నిక్షేపించారు’’ (కృత్యాద్యవస్థ (వ్యాసం) ప్రతిభ, 1936). ఇది ఇతిహాస ప్రాధాన్యాన్ని, దాని ప్రాణస్థానాన్ని చెప్పే ప్రయత్నం. ఈ మార్గం భారతం వంటి మహాగ్రంథం సృష్టి తత్త్వాన్ని జీవుల పరిణామాన్ని జన్మజన్మల పరంపరను ఎలా వ్యాఖ్యానిస్తున్నదో తెలియజేస్తుంది. భారతం అట్టడుగున నిక్షిప్తమైందీ లక్షణం. ఇది తెలిేన్త తప్ప కావ్యపరమార్థం అవగాహనలోకి రాదు. పాండవులు చివరకు స్వర్గారోహణంలోను ఎవరి కర్మను వారే అనుభవించారు. ఆశ్రమవాస సందర్భంలోనూ ధృతరాష్ర్టడు మృతపుత్రులను మళ్లీ చూడాలని కోరుకున్నాడు. యుద్ధం మొత్తం ప్రత్యక్షప్రాయంగా సంజయునివల్ల వింటూ వచ్చిన ధృతరాష్ర్టడు ఎక్కడా ధర్మానుకూలమైన న్థితిని పొంది యుద్ధవిరమణను శానించలేకపోయినాడు. భీష్మ ద్రోణాదులు తమ కళ్లఎదుట జరుగుతున్న న్ర్తీ అవమానాన్ని ఎదిరించలేకపోయినారు. అభిమన్యు వధయైనా, కర్ణవధయైనా కర్మననుసరించి జరిగినాయి. అంతా ఒక మహావలయం. కర్మసూత్ర గ్రథితమైంది. ఈ వలయంలో జీవులందరూ పరిభ్రమించటం తప్పనిసరైంది. ఈ కావ్యపరమార్థ నిర్దేశం చేనింది తెలుగు విమర్శ సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ.
నన్నయ్య సాహిత్యసూత్రాన్ని అందుకొని విశ్వనాథ రెండంశాలను ముందుకు తెచ్చినారు. తిక్కన మార్గంలో మరొక అంశాన్ని విశదీకరించారు. తానుగా కావ్య హేతువుగా మరొక భావనను కొత్తగా ప్రవేశపెట్టారు. ఆయన నన్నయ్య ననుసరించి ప్రతిపాదించిన నూతనాంశాలు : 1. అక్షరరమ్యత, కావ్యశరీర సౌందర్యము, నాదము, అక్షరముల కూర్పు, ఛందస్సు నిర్వహణ, వర్ణ సమ్మేళనాప్తిచేత స్ఫురించే అనుభవ విస్తారము ఇవన్నీ ఇందులో అంతర్భవిస్తవి. 2. కథాకథన శిల్పము. ఇది వస్తువిన్యాస సౌందర్యమునకు సంబంధించింది. కథాంశాల నిర్వహణలో ఒక పద్ధతి ఉంటుంది. కవి వ్యక్తిచైతన్యాన్ని బట్టి ప్రాధాన్యతల క్రమం మారిపోతుంది. వస్తువులో పాత్రలు, సన్నివేశాలు, వారి ఉద్వేగాలు, ఆంగికములైన వికారాలు అంతర్గతములైన ప్రధాన అంగకథల భేదాలు వీటన్నింటి అల్లిక ఈ కలయికవల్ల అల్లికవల్ల కలిగే ఫలరూపమైన సౌందర్యస్ఫురణ ఇవన్నీ ఈ కథాకథన శిల్పంలో ప్రధానాంశాలు. అందుకే నన్నయ దీనిని ‘లోనారని’ చూడవలనిన అంశంగా విశదం చేశారు. కథాకథనాన్ని విశ్లేషిస్తూ విశ్వనాథ ఇలా అన్నారు

 

1. నన్నయగారు కథెుుక్క ప్రాణమును బట్టికొని నొక్కును కాని కథలోని వివిధాంశములను బెంచడు.
2. కథలను వ్యాఖ్యానము చేయుట. ఆ కథలలోని రహస్యములను బట్టి నిరూపించుట, ఆ కథలట్లెందుకున్నవో వానిలోని మర్మమును చెప్పుట.
3. ప్రతి చిన్నకథయు పెంచి ెుుక స్వతంత్ర కావ్యముగా చేనినచో ప్రధాన కథ దెబ్బతినును.
4. భారతము శాంతరస ప్రధానము. ఆ రసమును దృష్టియందుంచుకొని తిక్కన రసములను సంయోజన పరుపవలయును. ఇతర రసము లీ రసమునకు లొంగి యుండును. రౌద్రాది రసములను పెంచి వ్రానినచో భారతముెుుక్క ప్రధాన రసమైన శాంతము వీగిపోవును. ఇతిహాస న్థితి పోయి కావ్యన్థితి వచ్చును.

అందువల్ల భారతం వంటి కావ్యాన్ని ‘రసదృష్టితో’ కథారహస్య వినిమీలన దృష్టితో చదువుకోవలని ఉంటుంది. ఈ చదువుకొనే న్థితి నన్నయ ప్రతిపాదించిన ‘లోనారయు’ లక్షణం. అందుకే మహాభారత బద్ధనిరూపితార్థమేర్పడ భారత రచన ప్రారంభం అయింది.
ఇతిహాసము ఒక విధముగా సంక్లిష్టమైన ప్రపంచము ెుుక్క సూక్ష్మరూపమే భూత భవిష్యద్వర్తమానములలో దాగియున్న దాని ఆంతర్యమును తెలినికోవటం ఎంతవాడికైనా కష్టసాధ్యమైన అంశమే. ‘ఈ ప్రపంచకము గిజిగాని గూడు. ఆ గూటి లక్షణము తెలినికొని విరచించుట మహాకవి శక్తి’ (శాకుంతలముెుుక్క అభిజ్ఞానతపు.62). ఈ తత్త్వదర్శనము లేకుండ ఇతిహాసమునుగాని, ఇతిహాసప్రాయమైన మహాకావ్యమును గాని నిర్మించటం సామాన్యకవికి సాధ్యం కాదు.
ఈ ప్రపంచ పరమార్థమే రసానుభవరూపంలో కావ్యంలో ప్రతిఫలిస్తుంది. సహృదయుడు తాను ఎదిగిపోయి ఈ ప్రతిఫలించిన పరమార్థాన్ని మనస్సులోనికి తెచ్చుకో గలుగుతాడు. ‘రమణశీలమైన మానవుని బుద్ధి తత్కథాశ్రయమై యుండుచున్నది. ఈ రమణము ెుుక్క ప్రవృద్ధ స్వరూపము రసము’ (శా.అ.పు.46). ఈ రమణశీలము క్రమముగా రమణము పొందుతూవున్న అన్మితలో లీనం కాగా మనకు కలిగే న్థితి- అనుభవానికీ, అనుభవితకు నడుమ భేదం లేకపోవటం జీవుడు నిరుపాధికమైన ఆనందన్థితిని పొందటం.
కథాకథనాన్ని విశ్లేషించుతూ విశ్వనాథ ప్రతిపాదించిన నాల్గు అంశాలు ఈ మహాకావ్య పరమార్థాన్ని వెల్లడిచేస్తున్నవి. ఈ విషయాన్నే ఇంకా స్పష్టంగా అల్లసాని వాని అల్లిక జిగిబిగిలో వెల్లడిచేస్తున్నారు. ‘ఒక కావ్యమునకు పరమమైన విషయము ఏకవాక్యత …. ఈ అంగాంగిభావము సంబాళించుకొనుటలో మహాకవి ెుుక నేర్పు కలిగి యుండును…. పద్యరచన మొదలు తావత్పర్యంతము మహాసామర్థ్యము కల్గి, ఈ ప్రధాన రసము చక్కగా దీర్చి అంగరసములను ప్రధాన రసమునకు పోషకముగా జేని అనౌచిత్యము లను పరిహరించి ప్రతిభాసమున్మేషమున నెవ్వడు తన కావ్యము నాద్యంతము తీర్చి దిద్దుకొనునో అతడే మహాకవి శబ్దవాచ్యుడు (పు.15,16).
నన్నయ సాహిత్యసూత్రం ద్వారా కావ్య బహిరంతర సౌందర్య వ్యంజకత్వాన్ని స్థాపించి తిక్కన సోమయాజి ప్రకటించిన శిల్పతత్త్వాన్ని విపులంగా వ్యాఖ్యానించారు.

 

1. ఒక కథ ఒక పద్ధతిగా జరుగుటకు హేతు నిరూపణము శిల్పములోని భాగము.
2. శిల్పమనగా నొకమాటలో చెప్పినచో బహ్వర్థము లేకత్ర సమావేశపరచి పఠిత మనస్సును భావనామయము చేని, ఉత్పథమునందు సంచరింప జేయుట.
3. తాను న్వీకరించిన వస్తువునకు పరమోచితములైన తత్తన్మహా విషయముల యందలి సామగ్రీ సంపాదనముచేని తన కావ్యము పరమశిల్పఖండముగా చేయుట.
4. ఏ కథను, ఏ భావమునకు నేశయ్య కెట్టి శబ్ద మెట్టి రచన అనుకూలమో నిసర్గపరచితి దక్షమై వెలార్చు శక్తిమత్త్వము.

 

ఈ నాల్గు అంశాలూ కావ్యశిల్పదృష్టితో చూేన్త కీలకాంశాలుగా గోచరిస్తవి. ఈ అంశాలలో ఔచిత్యము, అనుస్యూతి, హేతుబద్ధత, బహ్వర్థ వ్యంజకత్వము, ఉచిత శబ్ద, ఛందోరచనల సమావేశము అన్నీ చెప్పబడ్డాయి. ఇవి ఏ కాలంలోనైనా అంగీకరించ దగిన పరమాంశాలు.
పూర్వ లాక్షణికులచేత ప్రపంచితం కాని కథాకథన శిల్పాన్ని నన్నయ్య అవతారిక నుంచి గ్రహించి విశ్వనాథ ఒక కొత్త దృక్పథాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు శ్రీబిజీజీబిశిళిజిళివీగి అంటున్నారు. అట్లాగే శిల్పధోరణి తిక్కననుంచి గ్రహించి కావ్యశిల్ప మార్గాన్ని అక్షరం నుంచి కావ్య పరమార్థం ద్వారా వ్యాపించి ఉన్న అంశాన్ని వివరించారు.
విశ్వనాథ తననుగూర్చి గ్రంథంలో ‘వ్యాఖ్యాతౄణాం శిరోమణిః’ అని పేర్కొన్నారు. కావ్య గర్భంలోనికి ప్రవేశించి దాని రహస్యములను వివరించటం, అంగాంగ సమన్వయం అన్నీ స్వవ్యాఖ్యానంలో భాగమే. ఒక విధంగా తనది నూతన వ్యాఖ్యాన పద్ధతి అని చెప్పటం ఉద్దేశ్యం కావచ్చు.
కావ్యశిల్పరీతిలో అక్షరరమ్యత గురించి తరువాత తరువాత చర్చింపబడింది చాలా తక్కువ. ‘ఆ శబ్దములెుుక్క సమీచీనత, సాన్నిహిత్యము, సంగీతము కాని సంగీతము సరిపోయినాయా అని చూచుకొనవలయును. యథార్థమైన కవి …….. అప్పుడు శైలియో రీతియో యేర్పడును. వానికి మించిన యిదమిత్థమని చెప్పరాని ెుుక సంగీతమేర్పడును. మనకున్న శబ్దములెుుక్క దారిద్య్రముచేత దానిని సంగీత మనుచున్నాము గాని అది సంగీతము కాదు. సంగీతమువంటిది’ అని ఈ పూర్వాంధ్ర సాహిత్యము విలక్షణమైన ెుుక సంగీత ప్రపంచకము (విశ్వనాథ).
కవిత్వములో అంతర్లీనంగా ఉండే ఒక లయ ఉన్నది. ఇది అక్షరరమ్యత వల్ల సాధింపబడుతున్నది. పాడినప్పుడు దానిలోకి రాగానుసంధానము జరుగుతున్నది. వాల్మీకి తంత్రీలయ సమన్వితమని చెప్పిన దీ విషయమునే. సహృదయుడు అంతరంగంలో దీన్ని అనుభవించేందుకు తన్ను తాను సమర్పించుకుంటున్నాడు. ఆ లయ ప్రవాహంలో సంలీనమై కరగిపోతున్నాడు.
శిల్పమంటే కౌశలమని, నిర్మాణ కౌశలమని తాత్పర్యం. శిల్పంవల్ల ముక్కు మొగం లేని రాయి సుందరవిగ్రహంగా రూపొందుతున్నది. ఈ రూపొందు క్రమంలో శిల్పి ప్రయోగించే ప్రక్రియా సర్వస్వమంతా శిల్పశబ్దవాచ్యమే. వజ్రాన్ని గ్రహించి ఒరిపిడిపెట్టి బహుముఖాలలో ప్రకాశింపజేయటం శిల్పమే. వాచ్యమై సంకేతితార్థ వ్యంజకమైన శబ్దం కావ్యగతమై అనంతభావ వైవిధ్యాన్ని పొందటం కవి శిల్ప నైపుణ్యం.
1958లో నింహబలి కావ్యానికి వ్రానిన ముందుమాటలో శిల్పమును గురించి విశ్వనాథ కొన్ని విలక్షణాంశాలను ప్రతిపాదించారు. 1) వస్తువులనేకములు, శిల్పమార్గము లనేకములు ; 2) చాలామంది కవులను తాము అభ్యనించిన సులువైన శిల్పమార్గములో ప్రవర్తించుతారు ; 3) వస్తువు ననుసరించిన శిల్పమార్గము ఆ వస్తువును ప్రకాశింపజేస్తుంది; 4) కొన్నిచోట్ల వస్తువు సమాకర్షకమై శిల్ప చాతుర్యముండదు. ఇక్కడి వస్తువు సహృదయుని ఆకర్షించవచ్చును. అది రసానుభూతి కాదు ; 5) ఎక్కడనో ఒకచోట శిల్పి వస్తు స్వభావోచిత శిల్పమార్గమును న్వీకరిస్తాడు ; 6) ఒక్కొకచోట వస్తు నిర్వహణముగానీ, శిల్పసంయోజనముకాని ఉండదు. కేవలం ప్రతిభ ఉంటుంది.
ఇంత వివేచన చేని కవి వస్తూచిత శిల్పసహిత కావ్యమునే ముఖ్యమైందిగా న్వీకరించాడు. ఏ కావ్యంలోనైనా శిల్పరహితంగా వస్తువు విన్యనింపబడటం సాధ్యమే. అట్లాగే వస్తువు ప్రదీపింపక కేవలం కవి కౌశలం ప్రకాశింపజేేన పద్ధతీ కనిపిస్తుంది. మహాశిల్పి వస్తు కౌశలముల ఉచిత సంయోజన చేయవలని ఉంటుంది.
‘అల్లసానివాని అల్లిక జిగిబిగి’లో శిల్పమును గూర్చి తొలుత విచారించి అంతిమంగా ఇలా నిర్వచించారు ‘శిల్పమనగా ఒక్కమాటలో చెప్పినచో బహ్వర్థము లేకత్ర సమావేశపరచి పఠితెుుక్క మనస్సును భావనామయము చేని ఉత్పథమునందు సంచరింపజేయుట’.
ఈ ప్రతిభచేత శిల్పవిభ్రమం ఆవరించుకున్న కావ్యం అనంతార్థ ద్యోతకమవు తుందని ఆనందవర్థనుడంటున్నాడు ‘న కావ్యార్థ విరామోన్తి యదిస్యాత్ప్రతిభాగుణా’. నిరంతరం కావ్యం కాలావధులను దాటి సజీవంగా ఉండటానికి ఈ అనవధికమైన అర్థానుసంధాన శక్తి కారణం.
స్వాతంత్య్రానంతరం సాహిత్యరంగాన్ని ఆవరించిన ఈ ఇద్దరు ప్రధాన విమర్శకుల రాయప్రోలు, విశ్వనాథల కళా సృజన వివేచన రీతులు పాశ్చాత్య సౌందర్య విమర్శశా పరిచితినీ, సంభారాన్నీ అవసరమైన దిశగా సంతరించుకున్నవి. తరువాతి విమర్శకులందరూ అంతో ఇంతో ఈ అడుగుజాడలలో నుంచి తమ ప్రయాణాన్ని ప్రారంభించినవారే.

 

 

3
శ్రీశ్రీ ప్రధానంగా మార్క్సీయ సాహిత్య విమర్శకుడుగా వస్తునిర్దేశం విషయంలో పరిగణింపబడుతూ వచ్చినా, కావ్యశిల్ప సంబంధమైన దృష్టి కూడా ప్రధానమని భావించినవాడే.
‘‘కవి తనలో అంతర్లీనమైన రసాన్ని పాఠకునిలో బహిర్గతము చేయగలుగుతున్న కార్యమే సంవిధానము. దీనికి ఆఘాతం కలిగితే రసానికే విప్రతిపత్తి కలిగినట్లు. కావున తుట్టతుదకు రీతి నదాలు రససముద్రంలోనే చేరుకుంటాయి’ అన్న శ్రీశ్రీ ఉత్తమ కవిత్వాన్ని సంవిధానం సమావేశం పొందిన కవిత్వమేనని తేల్చారు. ఈ సంవిధానం కావ్యశిల్పము కవి సజాగ్రత్తుగానో, అజాగ్రద్దశలోనో నిర్వహించేదని తాత్పర్యం. అందుకే శ్రీశ్రీ వస్తువే కవిత్వం కాదనీ, శిల్పమే కవిత్వం కాదనీ స్పష్టంగా పేర్కొంటూ మహత్తరమైన భావాలను మహత్తర విధంగా ప్రతిపాదించినదే ఉత్తమ కవిత్వం అన్నారు.
అందుకే శ్రీశ్రీ కవిత్వం ‘‘ఛందస్సుకీ, వ్యాకరణానికీ, అలంకారాలకీ అన్నింటికీ అవతల స్వచ్ఛందమూ, నీరవమూ, నీరూపమూ అయిన కవిత్వ పదార్థం ఒకటి ఉన్నది’ అంటున్నాడు. కవిత్వం అన్నింటిని కలిగివుండీ అతీతంగా ప్రవర్తించేది ప్రకాశించేది. విశ్వనాథ మరొక సందర్భంలో నా కవితన్ విశాల జఘనా, ఒక ఔచితి లేదు, భాష లే దాకృతిలేద ఊరక రసాత్మతనే ప్రవహించి పోదు, నీవాకృతి అందమాచిన రసాత్మపు నీకును నా కభిన్నతాశ్రీకత కల్గెనా పులకరించెను పొమ్ము రసప్రపంచముల్’’ అన్నాడు. ఈ సంవాదం కవికీ కవిత్వానికీ నడుమ. కవిత రూపాద్యలంకారాదులను తనలో పొదువు కుంటుంది. వాటికి అతీతంగా రసమై ప్రకాశిస్తుంది. కవి కవిత్వమై రూపొందినప్పుడు రసప్రపంచాదులన్నీ పులకరిస్తున్నవి. శ్రీశ్రీ నిర్వచించిన స్వచ్ఛందమైన కవిత్వం, రస సముద్రంలో అన్నీ లీనం కావటం ఇదే అంశం.
ఈ కారణంవల్లనే శ్రీశ్రీ శుద్ధకవిత్వం, ఉపయోగ్య కవిత్వం అని రెండు విభాగాలు చేని వస్తుప్రాధాన్యం గల కవిత్వాన్ని రెండవ తరగతిలోకి చేర్చటం జరిగింది. శ్రీశ్రీ ప్రనిద్ధమైన ‘కవితా ఓ కవితా’ గేయంలో ఈ కవిత్వం స్వరూపం విస్పష్టంగా ఆవిష్కృతం అయింది. ఈ కావ్యశిల్పదృష్టి ఇంత గాఢంగా శ్రీశ్రీ భావించినా ప్రగతివాదోద్యమంలోని తరువాతి కవి విమర్శకులు, వస్తువుకే పట్టంగట్టి కావ్యశిల్పాన్ని వెనక్కి నెట్టి అప్రధానమూ, అపరిగ్రాహ్యమూ అన్నట్లుగా దారి తీర్చారు.
స్పష్టమైన దృష్టిలో కావ్యశిల్పరీతిని నిర్దిష్టంగా భావించిన విమర్శకులలో వడలి మందేశ్వరరావు ముఖ్యులు. ‘‘సాహిత్యం మనస్సును స్పందింపజేస్తుంది. దానికి తూర్పు పడమరలు లేవు. ఆ స్పందనలను కొలిచే సాధనమే కాదు. ఆ స్పందనలు కల్గటానికి కారణమేమిటని ఆలోచిస్తుంది సాహిత్యవిమర్శ’’ అని విమర్శ మూలాల్లోకి వెళ్ళి ఆలోచించారు మందేశ్వరరావు.
కావ్యరహస్యమంతా జాతి, పర్యావరణం, కావ్యోత్పన్న క్షణంమీద ఆధారపడు తుదని ఊబిరిదీలి ప్రతిపాదింపగా వడలి మందేశ్వరరావు మరొక అంశాన్ని ప్రతిపాదించారు, అది కావ్యం పఠింపబడుతూ వున్న క్షణం అని. కావ్యం పఠింపబడుతూవున్న క్షణం కావ్యానుశీలనకు కొత్త పరిమితులను నిర్ణయిస్తుంది. ఆనాటికి పెంపొందిన మానవుని కొత్త విజ్ఞానం అవగాహనలు ఈ నూతన పార్శ్వాన్ని ఆవిష్కరించేందుకు కారణం అవుతాయి.
మందేశ్వరరావు ప్రతిపాదించిన మరొక అంశం కావ్యం ధ్వని ప్రతిధ్వనుల సంపుటి. ఉదాహరణగా ‘కల్పవృక్షంలో శూర్ఫణఖ కథకు ప్రతిధ్వని అయోముఖి సంఘటన. రామునితో ఖరుని యుద్ధానికి ప్రతిధ్వని మకరాక్షుని యుద్ధం. భారతంలో లాక్షాగృహదహనం నుంచి ద్రౌపదీ స్వయంవరం వరకూ జరిగిన కథ అజ్ఞాతవాస కథకు ప్రతిధ్వని. ద్రౌపదిని ెనైంధవుడు అపహరించడం కీచకుని కథకు ప్రతిధ్వని. అసలు కీచకకథే ఊరుభంగ కథకు ప్రతిధ్వని’ అని వివరించి ఈ ప్రతిధ్వనిని పంచసంధులలోని ‘పతాక’ కావచ్చునని సూచించారు. ఈ ప్రతిధ్వని భావం సృషిె్టుుక్క అఖండత్వాన్ని, అనంతత్వాన్ని ప్రకటిస్తున్నది.
ఇంకా మందేశ్వరరావు రెండు పాయలుగా కథను నడుపుతూ, వానినన్నింటికీ ఏకోన్ముఖం చేస్తూ సాంద్రతరమొనరించడం కూడా శిల్పమేనన్నారు. ఇంకా ఏకకాలికంగా భిన్నస్థలాలలో జరిగిన సంఘటనలను నినిమాటోగ్రాఫిక్‌గా ప్రదర్శించటమూ, కావ్యం చదువుతున్నప్పుడు క్రమక్రమంగా శిల్పం కవిత్వాన్ని రాపిడి పెట్టి కవిత్వానికి అన్తిత్వాన్ని కలిగిస్తుందనీ ప్రతిపాదించారు.
మందేశ్వరరావు మరొక వివేచన క్లానిక్ రొమాంటిక్ భావనల గురించింది. ఏ మహాకవియైనా తొలుదొలుత రొమాంటిక్. ఆ అద్భుత దర్శనం కావ్యరూపాన వెలువడి కాలాంతరంలో దాని స్వరూపస్వభావాలు అంగీకృతమై అది క్లానిక్ అవుతుంది. వాల్మీకి కాళిదాసుల విషయంలో ఈ విషయం ఆయన నిశ్చయించారు. ‘‘తొలిసారిగా సృష్టింపబడిన మంచి కావ్యం రొమాంటిక్ సృష్టే. ఆనాటికది నవ్యమైనది. నాటి సౌందర్యనీమల నది విస్తృతపరచేది ; ఆ సౌందర్యానికొక వింతను కూర్చేది. కాని కావ్యం మాగగా, మాగగా అదే తరువాతి యుగాలకు క్లానిక్ అవుతుంది. వాల్మీకి ఆనాడు రొమాంటిక్ కవే. కాళిదాసు కూడా అట్టివాడే. కాని నేడు క్లానిక్‌లు అవుతున్నారు. మనకు పెద్దన క్లానిక్. ఆనాడు ఆయన రొమాంటిక్. క్లానిక్‌లో సర్వేసర్వత్రా అంగీకరింపబడే ఒక లక్షణమేమంటే బాహ్యస్వరూపంలో ఒక క్రమబద్ధమైన విన్యాసం గోచరించడం … అప్పుడు …. ఆ కావ్యం క్లానిక్ అవుతుంది. (సాహిత్య ప్రస్థానంలో కొన్ని మజిలీలు మందేశ్వరరావు 2002). ఈ విచారణ సాహిత్య పరిశీలనలోని ఆధారభూమికలను స్పృశిస్తున్నది.
సాహిత్యవిమర్శన రంగంలో అవిరతంగా కృషిచేస్తూ సృజనాత్మకంగా నూతనాంశ ప్రతిపాదనలు చేస్తూ సాగిపోతున్నవారు జి.వి. సుబ్రహ్మణ్యం (జీ.వి.యన్.). ‘ఆంధ్ర సాహిత్యంలో వీరరసపోషణం’ అన్న గ్రంథంలో రసవిమర్శకు అన్వయపరంగా ఒక వ్యవస్థను ఏర్పరచారు. రసానికి నిత్యలక్షణం ధర్మమౌతుందని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన కావ్య ప్రపంచానికీ పురుషార్థ ప్రపంచానికీ ఒక ేనతువు లాంటిది. ధర్మ విరుద్ధమైన కావ్యం విశ్వజనీనమైన ప్రీతిని కలిగించలేదు. ప్రతిభావం మూలంలో ‘సర్వేభద్రాణి పశ్యంతు మా కశ్చి ద్దుఖభా గ్భవేత్’ అన్న అంశం ఉంటుంది కనుక.
తననాటి సాహిత్యవిమర్శలో రసవిమర్శ కొన్ని ప్రక్రియలకు వర్తించదనీ, కొన్నింటికే తగునన్న భావం ఉండేది. జీవియన్ రసవిమర్శ అన్ని ప్రక్రియలకూ అన్వయిస్తుందని స్పష్టంగానే పేర్కొన్నారు. స్వాతంత్య్రవీరం, యశోవీరం, మతవీరం వంటి నూతన ప్రతిపాదనలు నేటి స్వాతంత్య్రోద్యమానికీ, జాతీయోద్యమానికీ, విప్లవోద్య మానికీ, ఆధ్యాత్మిక ప్రస్థానానికి అన్వయించటం ఆయన ప్రతిభకు నిదర్శనాలు.
బసవపురాణం మీద జైనపురాణ ప్రభావాన్ని అంతర్నిర్మాణపరంగా విశ్లేషించి నిరూపించారు. మహాపురాణ స్వరూప వివేచనం క్రమ పరిణామం ఆయన విచారణ చేశారు. బసవపురాణంవల్ల ఒక దేశి పురాణం రూపొందిన అంశం వెల్లడైంది. నన్నయ రచనలోని నాటకీయతను ప్రకటించడం అభినవ ప్రతిపాదనమే. సంభాషణలే కాక నిర్మాణ మర్మాలను ఈ అంశం విపులీకరించింది.
జీవియన్ ప్రతిపాదించిన నూత్నాంశాలలో ఒకటి వంశకథాకావ్యం. హరివంశానికి ఈ ప్రతిపాదన అన్వయించింది. కళాపూర్ణోదయంలోని కథామూలాల్లోకి ప్రవేశించి గూఢకథానిర్మాణశిల్పాన్ని ప్రకటించారు. శ్రీశ్రీ ప్రతీకల ప్రయోగాన్ని విశ్లేషించి జీవియన్ ‘ప్రాచీన ప్రతీకల సంప్రదాయార్థాలను ప్రక్షాళనం చేని, మార్క్సిస్టు తొడుగులు వాటికి అలవరచాడనీ, ఉద్యమారంభంలో ఆ కవితాపద్ధతి బలంగా పనిచేనిందనీ, ఆ పద్ధతిలో ఆయన్ను మించిన మహాకవి లేడని’ ఆయన నిరూపించారు. ప్రతీకల వివేచనం కావ్య పరమార్థయుగం మీది తాత్పర్యంతో జరుగవలనిన అవసరం ఉందని ఆయన నిర్ధారణ చేనినారు.
కావ్యవివేచనకు ప్రక్రియాస్వరూప విజ్ఞానం ప్రధానాధారం. సాహిత్యవికాసం రచయితల సాహితీ దర్శనాలలో ఏర్పడే అంతస్సూత్రం మీద ఆధారపడి ఉన్నది అని ఆయన ప్రతిపాదన. తెలుగు రచయితలు ప్రయోగించిన ప్రతి ప్రక్రియ కూడా మౌలికమైన మాదిరి (ళీళిఖిలిజి) నుండి విభేదించేది. ఇతర ప్రక్రియా లక్షణాలను తనలో అంతర్భవించు కునేది. ఈ విచారణనుంచి ఆయన అనేక ప్రక్రియా భేదాలను ప్రతిపాదించారు. ఇంతకు పూర్వం చెప్పిన దేశి పురాణం, వంశకథాకావ్యం, వస్తుకావ్యం, ఆధునిక కావ్యేతిహాసం ఇలా ఎన్నో ప్రక్రియలు గుర్తించి లక్షణచర్చ చేశారు.
జీవియన్ విమర్శప్రస్థానంలో మౌలికమైన రసచర్చ ప్రక్రియాపరంగా సాహిత్య పరిణామాన్ని నిర్దేశించటం, ప్రబంధాలలో ప్రతీకాత్మకరీతిని పరిశీలించటం ప్రధానాంశాలు.
మాదిరాజు రంగారావు విమర్శలో కావ్యశిల్పదృష్టితో చేనిన విశ్లేషణలో ఆంతరిక సంభాషణాత్మకశైలిని ప్రస్తావించారు. 1) అధివాస్తవిక ధోరణిని గుర్తింప జేయటం ; 2) మనస్సులోని తమఃప్రదేశాలపై వెలుగులు ప్రసరింపజేని అక్కడ సుప్తంగా ఉన్న ఆలోచనా రూపాలను ఆవిష్కరింపజేయటం ; 3) మనస్సును లౌకికమైన అదుపుల నుండి విముక్తం చేని ేన్వచ్ఛగా సంచరింపజేని బహిర్ వాస్తవికతను అంతర్ వాస్తవికతను సమైక్యపరచిన అనుభవదశను చిత్రించటం. ఇది కవి మనస్సులోని చిత్రార్పితమైన కవిత్వలక్షణం. సృజన మూలాలను స్పృశింపజేేన అంశం ఇది.
ముదిగొండ వీరభద్రయ్య సౌందర్యశాస్త్రాన్ని, అలంకారశా ప్రమాణాలని తులనాత్మకంగా పరిశీలించి సమన్వయం చేయటమే కాకుండా ఆధునిక కవిత్వానికీ నవలలకూ అన్వయించి విశ్లేషించారు. ‘వస్తురూపాలని రెండుగా విభజించటం పొరపాటు నిద్ధాంతాలకు దారితీస్తుంది. కవిత్వంలో లోకవస్తువన్నది లేనేలేదు. వస్తువు కవితా రూపంగా ఎలా మారి నిద్ధమయిందో అదే కవి కావ్యంలో ఉన్నది. అభివ్యక్తి సంతరించు కొనని వస్తువుకు సాహిత్యవిలువగానీ, గౌరవంగానీ లేనట్లే. అలాంటివాటికి గౌరవం ఇవ్వడమన్న అసాహితీపరుల పనివల్లనే తెలుగు సాహిత్యలోకంలో ఇన్నాళ్లు ఈ చేటు (వస్తువునే ప్రధానం చేయటం) దాపురించింది’. (ఆధునిక సాహిత్యం వస్తురూప వివేచనపు.13). ఈ పరిశీలన కవిత్వకరణంెుుక్క ప్రాధాన్యాన్ని తెలియజేనింది.
కవిత్వంలో భాష సంపూర్ణంగా పరివర్తనం చెందుతుంది. కావ్యభాష సాంకేతికార్థ పరిమితులను అతిక్రమించి బహ్వర్థసుందరమై ఇంద్రధనుస్సువలె రమణీయార్థ ప్రతిపాదక మవుతుంది. ‘అభివ్యక్తులన్నీ వాచ్యాభివ్యకిె్తుుక్క నగ్నతను పోగొట్టి ప్రకృతిగతమైన సహజసౌందర్యాన్ని స్వభావోక్తులలో కాక కవితోక్తులతో వర్ణించి రాయప్రోలు నవ్యకవితా భాషకు ఈ శతాబ్దాన (20శ.) అంకురార్పణ చేశారు…. మృదుకావ్యభాషకు ఆయన వేనిన మార్గం దారితప్పిన తెలుగు కవిత్వాన్ని సరియైన దారిలోకి తెచ్చింది’. (పైదేపు.24).
భావచిత్రాలను విశ్లేషించి మూడువిధాలుగా వింగడించారు. ఆలంకారిక భావచిత్రం. ఇది ప్రాచీన అలంకారాల చిత్రణల పరిమితులలోనిది. రెండవది రూపకాత్మక భావచిత్రం. మూడవది ప్రతీకాత్మక భావచిత్రం. రూపకాలంకార విశేషమే రెండవది. ‘రెండు భావచిత్రాలను ఒకచోట చేర్చి లక్షణాశక్తిచేత రూపకాన్ని నిద్ధం చేయడం అన్న ఒక శిల్పరీతికి వీరు ప్రాణంపోశారు. అంటే కవిత మొత్తము (ఆసాంతమూ) మరొక వస్తువుతో జోడింపబడుతుంది’ (పైదేపు.61) అని నిర్వచించి ఉపమానోపమేయాలను వ్యత్యస్తం చేస్తూ, కీలకాన్ని ఇమిడించి రూపకభావచిత్ర నిర్మాణం జరుగుతుందని సుసూక్ష్మంగా వివేచించారు ముదొగొండ వీరభద్రయ్య.
‘మట్టీ మనిషి ఆకాశం – వస్తుసంవిధానం’ అన్న గ్రంథంలో ‘కళాత్మకత పొందిన వస్తువు పాఠకుణ్ణి ఒప్పించడం, లొంగదీసుకోవడం, అతణ్ణి తనలో లీనం చేనికొని అతని వ్యక్తిత్వంలో తానొక ముఖ్యాంశం కావడం ఇవన్నీ కావ్యపరమార్థం, కావ్య సందేశం (లక్ష్యం) పఠిత జీవధాతువుగా మారిన న్థితే కావ్యపరమార్థ నిద్ధి’ (పే.19) అని కావ్య పరమార్థాన్ని చేరుకునే ప్రక్రియను సోపానపరంపరా పద్ధతిలో వ్యాఖ్యానించారు. పాఠకుణ్ణి తనకు అభిముఖుడుగా చేనికోవటం, తన కళానిద్ధిచేత తనకు వివశుణ్ణి చేసుకోవడం, కావ్యచైతన్య సముద్రంలో అతడు లీనమై తాదాత్మ్యాన్ని పొందటం అనే విలక్షణమైన నిర్వచనం చేశారు. మహాకావ్యాల చైతన్యంలో మనం లీనమవుతున్నాం. ఇది కొత్త ప్రతిపాదన. కళాశిల్పం సాధించే మహాకార్యం.
కావ్యకళాసౌందర్య దృష్టితో విమర్శను కొనసాగించినవారిలో శేషేంద్రశర్మ ప్రముఖులే. రామాయణ రహస్యాలను, శ్రీహర్షుని నైషధీయ చరిత్ర తాత్పర్యాన్ని వివేచించిన సందర్భంలో శేషేంద్రశర్మలోని అపూర్వ కావ్యరహస్యవేది మనకు దర్శనమిస్తారు. కావ్యగర్భంలోనికి ప్రవేశించి దానిలో నిహితములైన అద్భుతాంశాలను వెల్లడించారు. రామాయణం ముఖ్యంగా సుందరకాండలో శ్రీవిద్యా సంప్రదాయం గర్భితమైన వృత్తాంతం త్రిజాటాస్వప్నంలో గాయత్రీ మంత్రం గర్భితమైన ఉన్న అంశం వెల్లడించటం ద్వారా దానిలోని రహస్యమార్గాలను విశదం చేశారు. మంత్రశాపరంగా, యోగశా పరంగా కావ్యాన్ని అధ్యయనం చేేన ధోరణిని ఆయన విస్తృతం చేశారు. నైషధీయ చరితంలో హంస అజపా మంత్రసూచకంగా ఎలా విస్తరించిందీ సవ్యాఖ్యగా నిరూపించారు. నన్నయ కవిత్వ విచారణలో విశ్వనాథ నలోపాఖ్యానంలో శివపురాణ రహస్యాన్ని వెల్లడించినట్లు, శేషేంద్రశర్మ వాల్మీకి శ్రీహర్షుల విషయంలో చేనిన విచారణ మన సాంస్కృతిక మూలాలను కావ్యంలో నిర్ణయించేందుకు దారిచూపింది.
శేషేంద్ర చేనిన మరొక కృషి సమకాలీన పరిన్థితుల దృష్ట్యా అతి విశిష్టమైంది. ఆధునిక కవిత్వాన్ని రాజకీయ నియంతృత్వ పరిధులనుంచి విముక్తం చేని కళాశిల్ప మార్గాల వైశిష్ట్యాన్ని నిరూపించిన మహాయోద్ధ. కావ్యాన్ని సాహిత్యస్పృహతో చూడటం, ఇతరేతరాంశాలన్నీ అప్రధానాలని నిర్ణయించటం ఈ కాలంలో ఆయన చేనిన గొప్ప ఉపకారం. డెబ్భైల చివర కవిేనన మానిఫెస్టో సాహిత్యరంగంలో గొప్ప అలజడి రేపింది.
కవిేనన మానిఫెస్టో ప్రధానంగా వస్తువే కవిత్వమనీ, కళాసౌందర్యశిల్పాలు ముఖ్యం కానేకాదనీ, కవిత్వంవల్ల కలిగే మెటమార్ఫనిన్‌ను అంగీకరించని నిద్ధాంత కారులను తిరస్కరించింది. సాహిత్యం ఆత్మకళాభ్యాసమనీ, వాల్మీకి నుంచి వచ్చిన కవి పరంపర, భామహునివద్దనుంచి వచ్చిన ఆలంకారిక పరంపర శిరోధార్యమనీ ఆధునిక ప్రతీక బింబవాదాలు కూడా మన కవితను పరిగ్రహించి సంపన్నం చేసుకోవలని ఉంటుందని విశ్లేషించి చెప్పింది. దీన్ని గురించి మందేశ్వరరావు అన్న మాట గమనార్హ మైంది ‘కవిేనన తిరుగుబాటు అంతా అకవిత్వం మీదనే. ఆయన (శేషేంద్ర) మార్క్సిజానికి నిబద్ధుడనని చెప్పుకున్న రొమాంటిక్ తిరుగుబాటుదారు’.
కవిేనన మానిఫెస్టోలో పూర్వకాలంలోనూ, ఆధునిక కాలంలోనూ కావ్య శాంలో అధికార పురుషలైన పెద్దల నిద్ధాంతాలే ఆధారం చేసుకుని కవిత్వం తత్త్వ వివరణ చేయబడింది. శాంలో అధికార గ్రంథాలలో లేనిది ఇందులో లేదు’ (పే.161) అని రచయితయే దాని ప్రామాణ్యాన్ని, శాబద్ధతను వివరించారు.
కోవెల సంపత్కుమారాచార్య ప్రాచ్యవిద్యాలవాలం నుంచి ఎదిగివచ్చిన ఆధునిక విమర్శకులు. సాహిత్యచరిత్రను, వికాసాన్ని పరిశీలించి అన్వయించడంలో జాతీయవాద మార్గం వీరిది. జాతీయోద్యమచైతన్యానికి ప్రతిద్వంద్విగా వచ్చిన ప్రగతివాదోద్యమం పరిసమాప్తిని గురించి వీరు ఆలోచించారు. సరిగ్గా అప్పుడే మొలకెత్తిన నవ్యసంప్రదాయ సాహిత్యమును విశదంగా వ్యాఖ్యానించారు. వారు కొత్తగా ప్రతిపాదించింది ‘దేశీయతా’ లక్షణం. ఇది ఒకవిధంగా జాతీయతా లక్షణం, సర్వస్థానవేష భాషాభిమతము, భావుకత్వ ముల సమావేశం. ఆధునిక కవిత్వాన్ని ఈ నేపథ్యంలో పరిశీలించి ఒక నూతన పార్శ్వాన్ని ఆవిష్కరించారు. వారు ప్రతిపాదించిన నూతనాంశాలు కొన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.
1. సహజశక్తి గల దేశీయత స్వప్రయత్నంగానే ఉబికి వస్తుంది. ఏ ఇనుపచేయి ఆ ఉబుకును ఆపజాలదు. కారణం నిజమయిన కవి దేశీయ చైతన్యపు మొన (కావ్యంకవిస్వామ్యంపే.34).
2. రసముల ఉదాత్తత్వానుదాత్తత్వములకు ప్రధానమైన విభేదక లక్షణము ఉదాత్తభావోన్మీలనము కలిగించుట కలిగించకపోవుట యన్నది. వస్తువు జీవన ధర్మమూలకమయినప్పుడే ఉదాత్తన్థితి కలుగుతుంది, ధర్మేతర వస్తువు రసానుభావానికి దూరం చేస్తుంది.
సంపత్కుమార తన నిద్ధాంతగ్రంథంలో ప్రతిపాదించిన అంశాలు పూర్వ పూర్వ విమర్శకుల కృషినీ, పరిశీలనలనూ ప్రకాశింపజేనినవి. రాళ్ళపల్లి అనంత రసభావన, భరతుడినీ, జగన్నాథునీ కలిపి ముడివేనిన దువ్వూరివారి రసరామణీయకత, ఉమాకాంతం గారి ఉదాత్తరసభావన, బంగారయ్యగారి స్ఫుట అస్ఫుట రస వివేచన, రాయప్రోలువారి రసత్రయ మౌలికతా ప్రతిపాదన, విశ్వనాథవారి కావ్య పరమార్థ దర్శనంగా ఒక స్థాయిలో రసాన్ని, రెండవస్థాయిలో వస్తువును దర్శించటం, శ్రీశ్రీ సంవిధాన వివేచనలో రస ప్రాధాన్యం ఇవన్నీ ఆయన వెతికి వెలుగులోనికి తెచ్చిన అంశాలు.
పూర్వకవుల కావ్య దృక్పథాలను పరిశీలించినప్పుడు నన్నయాదుల నుండి ప్రతిపాదింపబడిన కథాకథన శిల్పం, అక్షరరమ్యత, వస్తుకవిత, ఉభయకావ్యశిల్పము మొదలైనవి భారతీయాలంకార శాస్త్రానికి తెలుగువారి అనుదానంగా ఆయన నిరూపించారు.
చలం ‘పురూరవ’ను గురించిన వ్యాసంలో ఆధ్యాత్మిక సౌందర్య అనుభూతుల సమన్వయాన్ని, విశ్వనాథ యుద్ధకాండను అనుశీలించిన వ్యాసంలో కావ్యం ఆకృతి నుండి ఛందోరూపం వరకు ఉన్న వివిధాంశాల సందర్భంలో వాటివాటిని విశ్లేషించి వ్యాఖ్యా నించటం కావ్యకళాశిల్ప దృష్టికి నూతన ద్వారాలు తెరిచాయి.

 

 

4
మరొక భావుక విమర్శకుడు తుమ్మపూడి కోటీశ్వరరావు తన చైతన్యంలో భారతీయ అలంకారశాస్త్రాన్నీ, పాశ్చాత్య సౌందర్యశా దర్శనాన్నీ ఇమిడించుకొన్నవారు. వేదాంతము, యోగశాము, శిల్పచిత్రకళలు వాటి మూలాలనెరిగిననారు. సాహిత్య విశ్లేషణకు మానవ విజ్ఞానమంతా ఉపకరణమేననీ, ఆయాశాస్త్రాదుల ఒరిపిడివల్ల సాహిత్యం కామధేనువై నూతనాంశాలను వెలికితీస్తుందనీ విశ్వనించినవారు. నిర్మాణ మార్మికతనెరిగిన మేటి. ఆయన విమర్శలో ఇతఃపూర్వం స్పృష్టంగాని నూతన ప్రమాణాలు దర్శనమిస్తాయి. అనేక శాస్త్రాల జమిలి కలయికతో నూతనమూల్యాల ఆవిష్కరణ జరుగుతుంది. సర్వ జీవనానుభవమూ కళాపరిమితులలోనికి, ఆస్వాదనీమలలోనికి ఒదిగిపోయింది.
తుమ్మపూడి వ్యాఖ్యానాలు అన్నీ విలక్షణంగా ఉంటాయి. మన అలంకారశాం కాశ్మీర శివాదె్వైత దర్శనం మీద ఆధారపడిందనీ, అందుకే ఉన్మేష ఉద్యోతశబ్దాలు అధ్యాయాలుగా ఈ శాం ప్రవర్తించిందనీ ఆయన అంటారు. విమర్శ అంటే తీర్పు కాదు. కావ్యానుభవ వ్యాఖ్యానం అది చైతన్యం విస్తరిస్తూ పోవటం. మన అంతఃకరణంలోని లోతులలో శబ్దార్థ ద్వంద్వం చేేన ప్రయాణమే రసయానమని ఆయన పేర్కొన్నారు. ఈ రసచక్రమొక పద్మం. అష్టదళాలూ అష్టరసాలు. కర్ణిక పేరు శాంతరసం. ఈ నిరూపణ శాంతరసమును రసమూలముగా అనుభవాలకు కేంద్రంగా నిరూపిస్తుంది.
తుమ్మపూడి కోటీశ్వరరావు దృష్టిలో ఆత్మవిద్యోపాసనం, రసవిద్యోపాసనం రెండూ సమన్వయం పొందవలనినవి. ఆధ్యాత్మిక భౌతిక జీవనాలు రెండూ రసవిద్యలో సంగమిస్తవి. రసవిద్య మన జీవన సౌందర్యరహస్యాన్ని వ్యాఖ్యానం చేస్తున్నది. సోమన్న ఉత్తర హరివంశంలో ఇతిహాసవిద్యను కావ్యవిద్యవైపుగా మళ్ళించినవాడు. వేదము శబ్ద ప్రధానమనీ, పురాణం అర్థ ప్రధానమనీ, కావ్యం రెంటినీ తనలో సమన్వయించుకొని రస ప్రపంచాన్ని సృష్టించిందనీ ఆయన వివరించారు.
కోటీశ్వరరావు పురాణవిద్యా రహస్యాలను మనస్తత్వ శా ప్రకారం, పాశ్చాత్యుల ఆధునిక శిల్పాలు పురాణప్రతిమలు విశ్వాంతరాళంలో భావాలుగా ఉండి కళాకారుల చైతన్యప్రపంచంలోకి ప్రవేశించి మూర్తులు కట్టుకొంటున్నాయని మనోజగతుె్తుుక్క అనేక స్తరాల సంవిత్తు వీటిలో మూలమై ప్రకాశిస్తున్నదని వెల్లడించారు. ఉత్తర హరివంశంలో హరి వంశమంటే పాంచరాత్రం చెప్పిన వ్యూహమని వ్యాఖ్యానించారు.
ఆధునిక జీవనంలో లుప్తమైన సమతౌల్యం ప్రాచీన జీవనంలో మూలసూత్రం. ‘వేయిపడగల’లో ప్రకృతి పాత్రలు పసరిక, వృషన్నిధి, ఆదివటము సంకేతాలే. వ్యావసాయికమైన దేశంలోని ప్రకృతిలోని భద్రత, సామరస్యం యంత్ర నాగరికతలో నశించిపోవటాన్ని ఎలా సూచించినదీ పాత్రలు వెల్లడించాయి తుమ్మపూడి తన విమర్శ సారమంతా ఒకచోట ఇలా చెప్పారు ‘గతిన్థితులకు ఒక కేంద్రబిందువున్నది. దానిచుట్టూ విశ్వచక్రం పరిభ్రమిస్తున్నది. ఈ న్థిరకేంద్రంలోనే నిత్యమున్నది. అక్కడే భూత భవిష్యత్తులు లీనమౌతున్నాయి’. భారతీయ తాత్త్విక చింతనలోనున్న విశ్వదైవ మానవసమన్వయమే వారి విమర్శకంతటికీ మూలసూత్రం.
చేకూరి రామారావు మార్క్సిస్టు. అయినా అచ్చమైన కవితా స్పృహ కలవాడు. కవిత్వం ఉంటే అది ఏ వస్తువైనా, రూపమైనా పరవశించిపోతాడు. శబ్దార్థాల సమతౌల్యం గురించి ఇలా వ్యాఖ్యానిస్తాడు తిలక్ గోరువంక అనే కవితలో ‘అందపు లేతనిగ్గు’ అన్న పద్యాన్ని విశ్లేషిస్తూ ‘సంధ్యాకాలపు ఆకాశం ప్రేయని కపోలాల కుంకుమ కాంతులవలె కనిపిస్తున్నది. తడియారని అనే పదంలో ఆర్ద్రత స్ఫురిస్తున్నది. వంపుల ఆకసం అనే ప్రయోగం ప్రేయని కపోలాల వంపులను వ్యంజిస్తున్నది’ – ఇలా సాగిన వివరణ కావ్యవివేచనలో వ్యంజకత్వం అన్న లక్షణం ప్రధానంగా కొనసాగింది. తిలక్‌ను గూర్చే ఇంకా వివరిస్తూ 1961 నుంచి రానిన తిలక్ పద్యాలలో శబ్దలౌల్యం తగ్గి భావ గాంభీర్యం పెరిగినట్టు కనిపిస్తుంది (కవిత్వానుభవంపే.3637).
మరొకచోట పారదర్శకత అనే కవితాగుణాన్ని కొత్తగా ప్రయోగిస్తున్నాడు. ‘పాఠకుల హృదయాలను సున్నితంగా స్పృశించే పారదర్శక కవిత్వం గోపీది. పారదర్శకత అంటే సాంద్రత లేకపోవటం కాదు. కవితాస్వాదనకు ఆటంకం కలిగించే ఒపేనిటీ లేకపోవటం. అందరికీ అర్థమయ్యే భాషలో చెపితే అస్పష్టతను కలిగించే భాషాప్రయోగ నిర్మాణ సంబంధమైన ప్రయత్నాప్రయత్న పూర్వకాంశాలు లేకపోవటం’ (అదే. పే.89). ఇంకో సందర్భంలో ధ్వనిని సాగకుండా వాచ్యం చేేన కవి బలహీనతను ఆక్షేపిస్తారు. ‘కవి ధ్వనిని ధ్వనిగా ఎక్కువేనపు నిలువనీయకుండా అనతికాలంలోనే వాచ్యం చేని ధ్వంసం చేస్తాడు. ధ్వని నిద్ధాంతం మీద చేరాకు ఉన్న ప్రత్యయం అది.
కవిత్వంలో ఉండవలనిన సామగ్రిని గురించి చెపుతూ ‘ఇతని కవిత్వంలో వివేకం ఉంది, విషాదం ఉంది, ఆలోచన ఉంది, ఆవేదన ఉంది. అంతకంటే ఎక్కువగా అంతరంగస్పర్శ ఉంది. అయితే అన్నీ సున్నితంగా ఉంటాయి. మౌనంగా చేేన చిరు దరహాసమంత సున్నితంగా ఉంటాయి’ (అదే. పే.146). పైన చెప్పిన అంశాలు మెట్లుగా పేర్చుకొంటూ పోతే కవిత్వానుభవ సోపాన పరంపర మనకు కానవస్తుంది. ఇది సహృదయానుభవమును వివరించే మంచి ప్రయత్నం.
కావ్య శిల్పధోరణిలో ఉన్నతీకరణ, న్యూనీకరణ వ్యూహాలని కొత్త పరిభాషను ఆయన ప్రయోగించారు. కావాలని శబ్దం ప్రయోగం ద్వారా ఒక అంశాన్ని గొప్పగా చెప్పడం, మరొకదాన్ని అల్పంగా చెప్పడం ఈ వ్యూహలక్షణాలు (స్మృతికిణాంకం పే.109). ఈ సందర్భంలో సుప్రసన్న కవిత్వంలో అర్థాన్నాశ్రయించిన చమత్కృతి తరచు కనిపిస్తుంది. ఇది భాషను సాధారణన్థితినుంచి కవిత్వన్థితికి చేరుస్తుంది అని అదే సందర్భంలో అంటారు. మరొక సందర్భంలో ‘సందర్భోచిత శైలీ భేదాలు వాడటం ఆయన కవితా విజయరహస్యం’ అని రామబ్రహ్మంగారి కవితను ఉగ్గడిస్తారు. మొత్తం మీద లోతుగా పైపై పరివేషాలు తీని పరిశీలించే ఆలంకారిక మార్గాన్ని ఈనాటి కవిత్వానికి అన్వయించిన ఉత్తమ విమర్శకుణ్ణి చేరాలో మనం చూడవచ్చు.
భాషావిషయకంగా చలం, విశ్వనాథ శైలులను విశ్లేషించడం, ‘అంధభిక్షువు’ వంటి ఖండికలను వ్యాఖ్యానించడం, ఖండకావ్యంకంటే మహాకావ్యం సమగ్ర అనుభవానికి వేదిక కాగలదని వెల్లడించడం, ఖండకావ్యాలను విశ్లేషించే ధోరణిని ప్రవేశపెట్టడం వంటివి చేరా ప్రవేశపెట్టిన నూతనాంశాలు.
వినయ లక్షణాన్ని ప్రక్కనబెడితే ప్రస్తుత వ్యాసకర్త సుప్రసన్న కూడా విమర్శన రంగంలో తన విశిష్టకృషి కొనసాగించినవాడే.
సుప్రసన్న సాహిత్యవివేచన ప్రధానంగా తాత్త్వికభూమికమీద నిలచి కొనసాగింది. సంస్కృతి మూలాలను, మనస్తత్త్వశాస్త్రాన్నీ, ప్రాగ్రూప పరంపరనూ, శ్రీ అరవిందుల తత్త్వదర్శనాన్నీ తన సాహిత్య విచారణకు మూలాంశాలుగా గ్రహించటం జరిగింది. ‘సాహిత్యానికి ఒక అంచు కవీ వేరొక అంచు సహృదయుడూ. ఈ రెండు బిందువులు ఒకచోటికి వచ్చినప్పుడు సహృదయ చక్రమేర్పడుతుంది’ (సహృదయ చక్రము 1983). ఈ సమన్వయం వల్ల కవి సహృదయుల నడిమి సామరస్యమే అన్వేషింపదగిందిగా తోచింది. ‘భావయిత్రీశక్తి యిరువురిలోనూ సమానమై కారయిత్రివల్ల రచయిత కవి రూపొందుతున్నాడు. అనుభవం కవిలో మథనం జరిగి శబ్దరూపం గ్రహించితే ఆ శబ్దం సహృదయునిలో అనుభవంగా రూపాంతరం చెందుతున్నది. ఇరువురు అనుసంధించేది శబ్దమే అవుతున్నది’ (భావుకనీమపే.25).
ఈ విధంగా విచారణ సాగించి కవిత్వ సృజన మూలాల గురించి అవి ఎలా పాఠకులకు ఆస్వాద్యమయ్యే రీతీ విపులంగా చర్చించటం జరిగింది. సృజన మూలాలను ఇట్లా తరుముకుంటూ పోగా ప్రతీకల ప్రపంచం, బింబాల జగత్తు, ప్రాగ్రూపాల లోకం ఇత్యాదులన్నీ సాక్షాత్కరించాయి. సుప్రసన్న విమర్శలో ప్రాగ్రూపాల వివేచన అత్యంతము కొత్తది. ప్రతీకల వ్యాఖ్యానము నూతనమైంది.
ప్రతీకల వ్యాఖ్యాన సందర్భంగా వేదార్థ విచారణ చేనిన నిరుక్తం చెప్పిన మూడంచుల విచారణ మార్గం చూపింది. వసుచరిత్రను పరిశీలింపగా క్రింది పొరలో ఋగ్వేదం చెప్పిన వృత్రగాథ, దాని క్రిందిపొరలో మబ్బులలో దాగివున్న వర్షజలం భూమి మీదకు ప్రసరించటం, ప్రకటంగా ఉన్న ఉపరిచర వృత్తాంతం సరేసరి. ఇందుకోసమే రామరాజభూషణుడు కావ్యనిర్మాణానికి బహ్వర్థసంధాయకమైన రచనాశైలిని ఎన్నుకొన్నాడని కావ్యపక్షంలో వ్యాఖ్యానించటం జరిగింది.
తరువాత ఈ ప్రతీకాధ్యయనం కొనసాగి మహాభారతంలోని గరుడోపాఖ్యానము, ఆంధ్రమహాభాగవతంలోని రుక్మిణీకల్యాణంలోని రహస్యతంత్రయోగశాస్త్రాలను వెలికి తీయటం జరిగింది. ఈ కావ్యగర్భంలోనికి ప్రవేశించే వ్యవహారం వలన అనేక కావ్యాలు తమ ఆంతర్యాన్ని వెలికి తెచ్చినవి. కుందుర్తి ‘నగరంలో వాన’లో ‘అముద్రిత కావ్యం’ అన్న వచన కవితలోనూ, గురజాడ పూర్ణమ్మకథలోనూ ఇలా అంతరార్థాన్ని వ్యాఖ్యానించటం జరిగింది. ఇదంతా రహస్యకథన సంప్రదాయంగా విమర్శకులు భావించారు.
సుప్రసన్న ప్రతిపాదించిన మరొక అంశం ‘విశ్వలయ’. ఇది తన చైతన్య పరిధులతో సామరస్యం కలిగించుకోవటం, చుట్టూ ఉన్న సమాజములో సామరస్యం కలిగించుకోవటము, ప్రకృతిలోని సామరస్యము, జగత్తులోని ఏకాత్మభావంతో సమన్వయం పొందటం ఈ సమన్వయం ఉన్నచోట ఆ కావ్యానికి, మహాగ్రంథానికి విశ్వలయ నిద్ధిస్తుంది.
సాహిత్యజగత్తులో కాలం గడిచేకొద్దీ రచనలు మహాగ్రంథాలుగా రూపొందుతవి. వీటికి ప్రధాన లక్షణాలు కవి ప్రతిభా వ్యుత్పత్తులు శిల్పనైపుణి, సమకాలీన చైతన్యముతో సంబంధము, సార్వకాలీన లక్షణనిద్ధి, ఈ సంనిద్ధి కోసం ఆ మహాగ్రంథం తనలో నిక్షిప్తం చేసుకోవలనిన మూడంశాలు – మానవుని మౌలిక ఇంద్రియానుభవాలు, మాననిక భౌతిక సంఘర్షణలు, సృష్టిలోని వైరుధ్యాన్ని వైచిత్రినీ మానవశక్తికి అతీతంగా నిలచివున్న ప్రకృతి దైవీశక్తులు. వీటి సమావేశం వల్ల ఇతివృత్తం ెుుక్క సర్వ అనుభవ సముద్రాన్నీ ఆవరించ గలుగుతుంది.
సాహిత్య పరిణామంలోని విశిష్టాంశాలను వెల్లడించే సందర్భంలో సుప్రసన్న ప్రతిపాదించింది ఆధునిక తెలుగు సాహిత్యంలో నవ్యసంప్రదాయము అనేది. దీనిని పనిగట్టి తొలుత ప్రతిపాదించిన విమర్శకుడు సుప్రసన్నయే. ‘నేటి కవిత అభివ్యక్తి’ అన్న వ్యాసంలో ఈ విమర్శకుడు ఆధునిక కవులు ప్రయోగిస్తున్న అభివ్యక్తి వ్యూహాలను చర్చించాడు.
ఇటీవల వెలుగులోనికి వచ్చిన విమర్శకులలో బహువిధములైన అంశములను రూప ప్రక్రియలను లక్ష్యంగా చేనికొని కావ్యభూమికలను పరిశీలస్తున్న మరొక విమర్శకుడు యు.ఏ. నరనింహమూర్తి. కవిత్వాధ్యయనంలో మార్పును గురించి ఆయన ఇలా అంటారు ‘నేటి కాలపు కవిత్వంలో రెండు మార్పులు కనిపిస్తాయి. కవితార్కిక సంబంధాన్ని వదలి తక్షణానుభూతిని అందినదానిని అందినట్లుగా వ్యక్తం చేయటం ఒకటి. కవి మనస్తత్వాన్ని అధ్యయనం చేయటంలో వచ్చిన మార్పు మరొకటి. ఇందువల్ల కవిత్వాధ్యయనంలో మార్పు వచ్చింది. ఒక పద్యంలోని పరమార్థాన్ని విస్తారమైన వివరణ చేయగలదని ఊహించవలనిన పనిలేదు. మనలోని అజ్ఞాతము, నిబిడము అయిన అనుభూతి ఒకానొక స్వప్నలిపిని వెలుగుతో నింపగలదు. ఒకప్పుడు అది పద్యంలో ఉండదు. మనలో ఉంటుంది. మనం కలగనకపోతే ఆ కవిత్వాన్ని మనం కనుక్కోలేము. ఈ దశలోనే అభినవగుప్తుడు రసాన్ని ‘కలలోపలి కల’ అన్నాడు (కవిత్వదర్శనముపే.194).
కలలోపలి కల అని కొత్త పరిభాషతో అభినవగుప్తుని అనుసంధించటం నరనింహమూర్తి వైశిష్ట్యం. కావ్యార్థం మనలో ఉన్న అంశం – దానిలో ప్రతిఫలిస్తుందనే విషయం చాలామందికి అనుభవంలోనికి వచ్చే న్థితి.
‘కవిెుుక్క భావనకు కవితాసృష్టికి మధ్య ఇతరులకు తెలియని వ్యవధానం ఎంపిక కొంత వుంటుంది. మనస్సులో సజాతీయ విజాతీయ భావాలెన్నో పుడ్తూ వుంటాయి’ అని చెప్పి ఈ సందర్భంలో ఆత్మసంయమనాన్ని కోరని లేదా లోపించిన కవి తన భావధారను నిర్విరోధంగా విడిచిపెట్టడం జరుగుతుంది. ఆ ఆసక్తి ఎక్కడో ఒకచోటనైనా వ్యకిె్తుుక్క మననశీలాన్ని వెనక్కునెట్టి, బుదిె్ధుుక్క ధారాపూర్వక ప్రవృత్తిని పరిపూర్ణ స్పృహతో న్వీకరించేలా ఒత్తిడి చేస్తుంది’ (అదే. పే.120121). ఈ వివేచన వల్ల కావ్యంలో కవి తాత్త్విక దృష్టికి భిన్నమైన అంశాలు ఎలా చోటు చేసుకుంటాయో వివరించారీ విమర్శకులు. పెద్దన మనుచరిత్రలో సాయంకాల వర్ణనలో ‘మహీసురాధము’ డన్న ప్రవర విషయక భావం గురించిన విశ్లేషణ ఇది.
నరనింహమూర్తి మరొక విశ్లేషణ మరీ ముఖ్యమైంది. ‘నేటి కవిత్వానికి ప్రాచీన ప్రమాణాలకు అసలు పొత్తు కుదరదనడం పూర్తిగా నిజం కాదు …. ఆధునిక కవిత్వాని కంతకూ ప్రాచీన ప్రమాణాలే చాలునని ప్రాచీనులు ెనైతం అనరు. ఎందుకంటే అపూర్వత కవితకు ప్రాణమని వారికి తెలుసు కనుక’ (అదే. పే.158). ఆధునిక విమర్శకులలో కొందరి ‘తీవ్ర’ లక్షణాన్ని ఆయన సమర్థంగా విపులంగా ఆక్షేపించారు. అందుకే వీరు ప్రాచీన ప్రమాణాలకు జోడింపుగా ఆధునిక ప్రమాణాలలో కొత్త విలువలను రూపొందించు కోవాలని ప్రతిపాదించారు.
ఇలా ఎంతోమంది విమర్వకులను పేర్కొనవలని ఉన్నది. రాయప్రోలు విశ్వ నాథల నుంచి ఈనాటి వరకూ ఈ కళాసౌందర్య శిల్పభూమికల పునరన్వయం, వ్యాఖ్యానం, సమన్వయం కొనసాగుతున్నాయి. రాయప్రోలు, విశ్వనాథ, వడలి మందేశ్వర రావులను వదిలేేన్త, పేర్కొన్న మిగతా విమర్శకులందరూ ఇంచుమించుగా ఒకేతరానికి చెందినవాళ్లు. అందరిలోనూ సమదృష్టి సామరస్యమూ స్పష్టంగా గోచరిస్తున్నాయి.

ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య

(8,9,10 అక్టోబర్, 2004లలో మచిలీపట్నంలో కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహించిన ‘స్వాతంత్య్రోత్తర కాలాన కావ్యశిల్ప విమర్శ’ సంగోష్ఠిలో సమర్పింపబడిన పత్రం)
వాఙ్మయి (రాజమండ్రి) లో ప్రకటితము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *