వాహినీ కీర్తి పతాకం

రంగావఝల భరద్వాజ

తెలుగువారు మా క్లాసిక్కులని చెప్పుకునే అనేక చిత్రాలు ఆ బ్యానర్ కింద నిర్మాణమైనవే. రాసిలో ఎక్కువ చిత్రాలు తీయలేకపోయినా…వాసికల చిత్రాలు తీసి చలన చిత్ర చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది వాహినీ సంస్ధ. వాహినీ వారి చిత్రం అంటేనే సమగ్రమైన ఆరోగ్యకరమైన సినిమా అని అర్ధం. ఆ ప్రత్యేకతను కడ దాకా నిలుపుకోవడం నిలుపుకోగలగడం వాహినీ స్పెషాల్టీ. బి.ఎన్.రెడ్డి గా పాపులర్ అయిన ఆయన అసలు పేరు బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి. కడప జిల్లా పులివెందుల తాలూకా కొత్తపల్లి గ్రామంలోని ఒక రైతు కుటుంబంలో నవంబర్ 16, 1908న జన్మించారు. స్వతహాగా కళాభిమానియైన బి.ఎన్.రెడ్డి కి రంగస్థలం మీద నటించిన అనుభవం కూడా ఉంది. వరవిక్రయం నాటకంలో ఆయన పాత్రధారణ మహాత్మ గాంధీ గారి ప్రశంస పొందిందని చెబుతారు. బెంగాలీ డైరక్టర్ దేవకీబోస్ తీసిన సీత చిత్రం బిఎన్ ని సినిమాల వైపు లాక్కెళ్లింది. రంగూన్ వెళ్లి వ్యాపారం లో స్థిరపడాలనుకున్న బి.ఎన్ దేశ స్వతంత్ర పోరాటం కారణంగా ఆ ఆలోచన మార్చుకున్నారు. కలకత్తా వెళ్లి శాంతినికేతన్ లో చేరారు. అలా ఆయనకి కళల పట్ల అనురక్తితో పాటు వాటి అవసరమూ తెలిసి వచ్చింది. అప్పుడప్పుడే వేళ్లూనుకుంటున్న సినిమా రంగంలో ప్రవేశించాలనే తపన కలిగించింది మాత్రం దేవకీ బోసే. హెచ్.ఎమ్.రెడ్డి దగ్గర సహాయ దర్శకపదవిలో చేరిపోయారు. అలా ఆయన పనిచేసిన తొలి చిత్రం గృహలక్ష్మి. హెచ్.ఎమ్.రెడ్డి, నటి కన్నాంబ ల భాగస్వామ్యంతో 1938 లో రోహిణి పిక్చర్స్ స్థాపించారు బి. ఎన్. రంగూన్ రౌడీ అనే స్టేజి నాటకం ఆధారంగా గృహలక్ష్మి సినిమా తెరకెక్కించే పని పెట్టుకున్నారు. గృహలక్ష్మికి హెచ్. ఎం. రెడ్డి దర్శక నిర్మాత కాగా, బి.ఎన్.రెడ్డి సహాయ దర్శక నిర్మాత. ఒక ముఖ్యమైన సన్నివేశం చిత్రీకరించే సమయంలో హెచ్.ఎమ్ రెడ్డితో విబేధించారు బిఎన్. ఆ సీన్ లో అశ్లీలత ధ్వనిస్తోందనేది బిఎన్ అభియోగం. అంతే రోహిణీ పిక్చర్స్ కు గుడ్ బై కొట్టేశారు. అలా బయటకు వచ్చిన వెంటనే సొంత కంపెనీ పెట్టే పనిలో పడ్డారు బి.ఎన్.
అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన మూలా లక్ష్మినారాయణ స్వామి భాగస్వామ్యంలో వాహినీ సంస్ధ ఏర్పాటు చేశారు. రాయలసీమ బిర్లాగా జనం పిల్చుకునే మూలా నారాయణస్వామికి క్లాస్ మేట్ కె.వి.రెడ్డి. కె.వికి కూడా సినిమా అంటే చాలా ఇష్టం. మూలా పిలుపు మేరకు వాహినీలో ప్రొడక్షన్ పనులు చూడ్డం మొదలుపెట్టారు. బి.ఎన్. అముద్రిత నవల మంగళ సూత్రం ఆధారం గా ఆయన తీసిన తొలి చిత్రం వందేమాతరం 1939లో విడుదలైంది.
నిరుద్యోగ, వరకట్న సమస్యలను తీసుకొని, వాటికి చక్కటి పరిష్కారాన్ని చూపిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. తర్వాత 1940లో బాల్యవివాహాలను నిరసిస్తూ, వితంతు పునర్వివాహాన్ని ప్రోత్సహిస్తూ సుమంగళి తీశారు బిఎన్ రెడ్డి. ఈ విప్లవాత్మక భావాలను అంగీకరించే స్థితిలో ప్రేక్షకులు లేకపోవడంతో సినిమా పెద్దగా ఆడలేదు.
బిఎన్ లో మొదటి నుంచి సంఘసంస్కరణాభిలాష ఎక్కువ. ఏ విలువల కోసం హెచ్.ఎమ్.రెడ్డి నుంచి విడిపోయారో అదే విలువలకు చివరి వరకు కట్టుబడి ఉన్నారు. వాహినీ చిత్రాలంటే ఆలోచింపచేసే సినిమాలే తప్ప బలహీనతలను రెచ్చగొట్టేవి కావు అని ప్రూవ్ చేసుకున్నారు. సుమంగళి తర్వాత బి.ఎన్ తీసిన సినిమా దేవత. పెళ్లి కాని తల్లులు ఎదుర్కొనే సమస్యలను ఆనాడే బిఎన్ చర్చించారు తన దేవత సినిమాలో.
వాహినీ బ్యానర్ ప్రొడక్షన్ పనులు చూస్తూ ఉన్నా…కె.విరెడ్డి మనసు డైరక్షన్ మీదే ఉండేది. కె.వి ది బిఎన్ కు భిన్నమైన శైలి. ఆలోచన. జనం కోరేది మనం చేయాలా…మనం చేసేది జనం చూడాలా లాంటి మీమాంసలు కె.వి.రెడ్డికి లేవు. జనమే మనమూ మనమే జనమూ అనే స్పష్టతతో సినిమాలు తీశారు. వాహినీ బ్యానర్ లో బి.ఎన్ తర్వాత కె.వి రెడ్డే దర్శకుడు.
వాహినీ బ్యానర్ లో కె.వి.రెడ్డి డైరక్ట్ చేసిన తొలి చిత్రం భక్త పోతన. 1942లో విడుదలైన ఆ సినిమాకు అపూర్వ ప్రేక్షకాదరణ దక్కింది. వాహినీ సంస్ధ విలువలకు కట్టుబడే విస్తృత ప్రజలు చూసే కథాంశాలను సెలక్ట్ చేసుకుని సినిమాలు తీశారు కె.వి. వాహినీ వారి పరిమనెంట్ హీరో…నాగయ్యే పోతనగా నటించి మెప్పించారు. గౌరినాథశాస్త్రి అనే న్యాయవాదిని శ్రీనాధుడుగా చూపించి ఆడియన్స్ తో శభాష్ అనిపించుకున్నారు శాస్త్రిగారు.
నాటి సూపర్ స్టార్ నాగయ్య కూడా సుమంగళి, పోతన సినిమాలను మొదట అంగీకరించలేదు. ఈ రెండు సినిమాల్లోనూ హీరో కారక్టర్ డీ గ్లామరైజ్డ్ గా ఉంటుందనేది నాగయ్యగారి ఆరోపణ. అయితే పోతన సక్సస్ ప్రేరణతోనే 1946లో త్యాగయ్య తీసి ఏడు జన్మలకు చాలిన కీర్తి గడించారు నాగయ్య. నిజానికి బిఎన్ అంటే నాగయ్యకు చాలా అభిమానం. బిఎన్ చూపిన మార్గంలోనే చిత్రనిర్మాణం సాగిస్తానని ప్రతిజ్న చేసి పాటించిన నట దర్శకుడాయన.
భక్త పోతన తర్వాత వాహినీలో బిఎన్ రెడ్డి, కె.వి.రెడ్డి ఆల్ట్రర్ నేటివ్ గా సినిమాలు తీయాలని నిర్ణయించారు. నిజానికి కథ మీద ఎక్కువ కసరత్తు చేయడం వల్లే వాహినీ వారు ఎక్కువ చిత్రాలు తీయలేకపోయారు. ఎక్కువ కాలం రంగంలో నిలబడలేకపోయారు. వాహినీ వారు మారుతున్న ప్రజాభిప్రాయలకు అనుగుణమైన చిత్రాలు తీసే ప్రయత్నం ఏనాడూ చేయలేదు. తాము నమ్మిన విలువల మేరకే సినిమాలు తీశారు. అందుకే…అన్నీ కలిపి పద్నాలుగు సినిమాలు మాత్రమే తీయగలిగారు.
కె.వి.రెడ్డి భక్తపోతన తర్వాత బి.ఎన్ రెడ్డి డైరక్షన్ లో స్వర్గసీమ తీశారు. బి.ఎన్ ఎక్కువగా సోషల్ కాన్ ఫ్లిక్ట్ సినిమాలే తీశారు. వాస్తవికత, కళాత్మకత మిస్ కాకుండా చూసుకునేవారు. అదే ఆయన సినిమాలను ప్రత్యేకంగా నిలబెట్టింది. స్వర్గసీమ సినిమా నటిగా, గాయనిగా భానుమతిని పాపులర్ చేసింది. ఈ చిత్రానికి సంబంధించి మరో విశేషం ఏమిటంటే…అమరగాయకుడు ఘంటసాల తొలిసారి గళం విప్పింది స్వర్గసీమ కోసమే…అలాగే చక్రపాణి సంభాషణలు రాసిన రెండో సినిమా స్వర్గసీమ.
స్వర్గసీమ తర్వాత మళ్లీ కె.వి వంతు వచ్చింది. కె.వి.రెడ్డి తన రెండో సినిమాగా యోగి వేమన చరితాన్ని ఎంచుకున్నారు. హీరో నాగయ్యే. వేమన కీర్తిని సంపాదించింది కానీ పోతన రేంజ్ లో డబ్బులు వసూలు చేయలేకపోయింది. తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరం బాలయోగి ఈ చిత్రం చూసే యోగిగా మారారని అంటారు.
నెక్ట్స్ పిక్చర్ కూడా కె.వి డైరక్షన్ లోనే తీయాలని నిర్ణయించారు బి.ఎన్. అప్పటికి ఆయన వాహినీ స్టూడియో నిర్మాణానికి పూనుకున్నారు. కె.వి రెడ్డిగారికి మాంత్రికుల కథల మీద మోజు. రంగస్థలం మీద సూపర్ హిట్ అయిన బాలనాగమ్మకథను తీద్దామని బోర్టు ఆఫ్ డైరక్టర్స్ మీటింగులో ప్రతిపాదించారు కె.వి. అయితే బి.ఎన్ ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. సవతి తల్లిని క్రూరంగా చూపించడం అంత మంచిది కాదంటూనే వేరే సినిమా చేయమన్నారు. అప్పుడొచ్చిందే గుణసుందరికథ.
షేక్స్ పియర్ విశాదాంత నాటిక కింగ్ లియర్ ఆధారంగా పింగళి నాగేంద్రరావుతో స్క్రిప్ట్ రాయించారు కె.వి.రెడ్డి. చందమామలో గుణసుందరి టైటిల్ తో అచ్చు వేశారు. రచయిత పేరు నాగేంద్ర అని ఉంటుంది. ఆ కథ పాఠకులకు విపరీతంగా నచ్చేయడంతో సినిమా స్టార్ట్ చేశారు. కస్తూరి శివరావు హీరోగా చేసిన ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. పింగళి నాగేంద్రరావు ఈ సినిమాతోనే తొలి విజయాన్ని అందుకున్నారు. అయితే నాగేంద్రరావు గారు వాడిన భాష బి.ఎన్ కు బొత్తిగా నచ్చలేదు. గిడిగిడి అంటూ ఏమిటా భాష అని చిరాకు పడ్డారు.
గుణసుందరి కథ 1949లో విడుదలైంది. విజయం సాధించింది. తర్వాత సినిమా దర్శకత్వ బాధ్యత తనే స్వీకరించారు బిఎన్.రెడ్డి. తెలుగు సినిమా చరిత్రలో అపూర్వమైన ప్రేమకావ్యంగా నిలచిపోయిందా సినిమా. టైటిల్ మల్లీశ్వరి. వాహినీ బ్యానర్ లోనే కాదు…తెలుగు లో వచ్చిన ఉత్తమ చిత్రాల్లో అగ్రభాగాన నిలిచే చిత్రం మల్లీశ్వరి.
వందేమాతరం’ షూటింగు కోసం హంపి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణదేవరాయల పై ఒక సినిమా తీయాలని కోరిక కలిగింది ఆయనకు.. అందుకు తగిన కథ కోసం వెదుకుతూనే వున్నారు. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చిన ఒక కథను, బుచ్చిబాబు ఎల్లోరాలో ఏకాంత సేవను కలిపి మల్లీశ్వరి కథను రూపొందించారు. ఈ చిత్రం ద్వారా దేవులపల్లి కృష్ణశాస్త్రి రచయితగా పరిచయమయ్యారు. ఆయన చేత మల్లీశ్వరికి మాటలు, పాటలు వ్రాయించారు.
తెలుగు చలనచిత్ర చరిత్రలో సాటిలేని మేటి కళాఖండంగానూ, అపురూప దృశ్యకావ్యంగానూ మల్లీశ్వరి ఖ్యాతిగాంచింది. ఆ సినిమా ఎన్నిదేశాలు తిరిగిందో లెక్క లేదు. చైనాలో కూడా వందరోజులకు పైగా ఆడేసింది. ఆ సినిమాకు మాటలు, పాటలు, కళ, నటన, సంగీతం, ఛాయాగ్రహణం, ఎడిటింగులతో సహా అంతా తానై బి.ఎన్. నడిపించినవే. అందుకే కృష్ణశాస్త్రి “మల్లీశ్వరి సృష్టిలో మేమంతా నిమిత్తమాత్రులం. బి.ఎన్.రెడ్డి గారు దీనికి సర్వస్వం.” అన్నారు.
మల్లీశ్వరి తర్వాత వాహినీ సంస్ధ నుంచి కె.వి.రెడ్డి దర్శకత్వంలో రాజకీయ వ్యంగ్య చిత్రం పెద్దమనుషులు విడుదలైంది. స్వతంత్రం వచ్చాక ఎన్నికల రాజకీయాల వాతావరణంలో జరుగుతున్న దుర్మార్గాలను…ప్రజాస్వామ్యాన్ని పెత్తందార్లు వాడుకుంటున్న విధానాన్ని తెరమీద చూపించిన చిత్రం పెద్దమనుషులు.
పెద్దమనుషులు చిత్రంతో రచయిత డి.వి.నరసరాజు చిత్ర రంగంలో ప్రవేశించారు. పెద్దమనుషులు తర్వాత బిఎన్ నిర్మించిన చిత్రం బంగారు పాప. జార్జ్ ఇలియట్ ‘ది సైలాస్ మార్నర్’ నవలను మన నేటివిటీకి తగ్గట్లు మలచి వెండితెర మీదకెక్కించారు బి.ఎన్. జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి నార్జించిన పథేర్ పాంచాలి చిత్రానికి దీటుగా నిలించింది ఈ చిత్రం..పాలగుమ్మి పద్మరాజు ఈ చిత్రం ద్వారా రచయితగా పరిచయమయ్యారు.
బి.ఎన్ కెరీర్ లోనే కాదు… యావద్భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే ఎన్నదగిన మాస్టర్ పీస్ ‘బంగారుపాప’. తాను తీసిన చిత్రాల్లోకెల్లా బంగారు పాప ది బెస్ట్ అనేవారు బి.ఎన్. బి.ఎన్.కు గురుతుల్యులైన దేవకీబోస్ బంగారుపాపను చూసి ముచ్చటపడి ఈ సినిమాను బెంగాలీలో తీశారు. ఐతే ఆయన అంత అపురూపంగా అద్భుతంగా తీర్చిదిద్దిన బంగారుపాప ఆర్ధికంగా విజయవంతం కాలేదు.
షేక్స్పియర్ వ్రాసిన హామ్లెట్ నాటకం ఆధారంగా బిఎన్ తీసిన చిత్రం రాజమకుటం. రాచరికం, వారసత్వం, దాయ పోరు ల తో సాగే కథ. తను కూడా ఒక మంచి ఫోక్ లోర్ మూవీ తీయగలనని ప్రూవ్ చేసుకోడానికి రాజమకుటం తీశారనే టాక్ ఇండస్ట్రీలో వినిపించేది. అయితే బి.ఎన్ ముద్ర ఈ సినిమాలో కనబడుతుంది.. సడిచేయకే గాలి పాట చిత్రీకరణ అమోఘం.
తెలుగు సినిమాల్లో హీరోవర్షిప్ డామినేషన్ ప్రారంభమై వెలుగుతున్న రోజుల్లో కూడా వాహినీ సంస్ద నుంచి కళాత్మక విలువలతో కూడిన చిత్రాలను జనరంజకంగా రూపొందించింది. తన చిత్రాల ద్వారా మంచి చెప్పకపోయినా పర్లేదుగానీ…చెడును నాటకుండా ఉంటే చాలు అనుకునేవారు బిఎన్. దీన్ని తాను పాటించడమే కాదు. తన మాట వింటారనుకున్న ప్రతి ఒక్కరితోనూ ఇదే మాట చెప్పేవారు. మాట తీసుకునేవారు.
చంద్రమోహన్ తొలి చిత్రం రంగులరాట్నం రాజమకుటం తర్వాత వాహినీ బ్యానర్ లో వచ్చిన చిత్రం. అన్నదమ్ముల మధ్య సయోధ్య తగ్గితే ఆ తల్లి పడే వేదనే రంగులరాట్నం. ఎస్వీ భుజంగరాయశర్మ రాసిన ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నం జీవన వేదంలా వినిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాలోనే దాశరధి రచన నడిరేయి ఏ ఝాములో…పాట కూడా సూపర్ హిట్ అయ్యింది.
బిఎన్ నిర్మించి, దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘బంగారుపంజరం. 1969 లో విడుదలైన ఈ చిత్రం నేపధ్యం శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణం. స్వేఛ్చగా తిరిగే ఒక పల్లె యువతిని చదువుకున్న యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు.. ఐతే, నియమాల శృంఖలాలలో ఆమె ఇమడ లేకపోతుంది. ఆ వైరుధ్యం బ్యాక్ డ్రాప్ లో సినిమా నడుస్తుంది. బిఎన్ స్టైల్ లోనే సంగీత సాహిత్యాలకు పెద్ద పీట వేస్తూ సాగే ఈ చిత్రంలో పాటలు కూడా పెద్ద సక్సస్ సాధించాయి. పగలైతే దొరవేరా…రాత్రికి నా రాజువురా పాట జానకి గాత్రంలో అద్భుతంగా ఉంటుంది.
విలువలకు బిఎన్ ఎంత ప్రాముఖ్యత ఇస్తారో చూపే మరో సంఘటన ఈ చిత్రం స్క్రిప్ట్ రచనా సందర్భంలో జరిగింది.ఒక సన్నివేశంలో ఏం చేస్తున్నావన్న నాయకుని ప్రశ్న కు చీరమార్చుకుంటున్నానని బదులు ఇస్తుంది హీరోయిన్. బి.ఎన్ ఈ డైలాగ్ మార్చాలన్నారు. ఎందుకు అని అడిగితే…ఈ మాట అంటే ప్రేక్షకుడికి కలిగే ఊహ ఆరోగ్యకరమైనది కాదన్నారట బిఎన్. అదీ ఆయన వ్యక్తిత్వం. విలువలకు, నైతికతకు పెద్దపీట వేస్తూ సినిమాలు తీసిన బిఎన్ విజయా నాగిరెడ్డికి స్వయాన అన్నగారు. అన్నగారి దర్శకత్వంలో తన బ్యానర్ లో ఒక సినిమా చేయించుకోవాలనేది నాగిరెడ్డి కోరిక. ఆ కోరిక నెరవేరకుండానే బిఎన్ వెళ్లిపోయారు. ఒక టైమ్ లో లవకుశ కథను బిఎన్ డైరక్షన్ లో తీయాలని ప్రయత్నించారు నాగిరెడ్డి. కానీ అది స్క్రిప్ట్ దశలోనే ఆగిపోవడం విషాదం. సినిమా ప్రారంభం…రాముడి వీపు మీద కెమేరా ఉంటుంది. వీపు కదిలిపోతూ ఉంటుంది. రాముడు ఏడుస్తూ ఉంటాడన్నమాట..ఇలా స్క్రిప్ట్ చదువుతున్నారు బిఎన్. రాముడు ఏడిస్తే ఎవడు చూస్తాడు? పైగా రామారావు ఏడవడమా? అని చక్రపాణి కామెంట్ విసిరారు. అంతే లవకుశ ఆగిపోయింది. ఆ తర్వాతెప్పుడో లలితా శివజ్యోతి శంకరరెడ్డి లవకుశ సినిమా తీసి అద్భుత విజయం సాధించారు. తెలుగులో కళాఖండాలు తీర్చిన నిర్మాత సంస్ధ గా వాహినీ కీర్తి పతాకం ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *