వసుచరిత్ర- ఉద్దీపన

వసుచరిత్రము రాయలయుగమున నాంధ్రవాఙ్మయమున వెలనిన మహా కావ్యము. ఆంధ్రపంచకావ్యములలో ప్రౌఢిమలో ఆముక్త మొకవైపు, వసుచరిత్రము వేరొకవైపు. ఆంధ్ర మహాకావ్యరచనా ప్రక్రియెుుక్క శిఖరాయమాణన్థితి ఈ కావ్యము. మనుచరిత్రము, ఆముక్తమాల్యద, పారిజాతాపహరణము, కళాపూర్ణోదయము, పాండురంగ మాహాత్మ్యము ఈ కావ్యములన్నియు ఒక యుగములోనివేయైనను, ఒక్కొక్కదాని వ్యక్తిత్వము ఒక్కొక్కటి. రసనిబంధనముచేత, ఊహశక్తి భావముల కుదించెడి నేర్పుచేత, ఆపాతమధురమైన రచనచేత, ప్రౌఢోక్తి నైపుణ్యముచేత ఒక్కొక్క కావ్యమున కొక్కొక్క వైలక్షణ్యమున్నది. వసుచరిత్రము తత్కాలమందలి సర్వేతరాంధ్ర మహాకావ్య విలక్షణముగా సంతరించుటకు ప్రయత్నింపబడినది.
ఈ కావ్యమునందు తెలుగు పద్యరచన పరాకాష్ఠ పొందినది. నన్నయ్యగారు తెలుగు పద్యమునకు సంగీత సౌందర్య పరిమళము కూర్చగా, శ్రీనాథుడు దాని నూయలలూపగా, వసుచరిత్రకర్త తెలుగు పద్యమును వినూత్న గేయప్రబంధముగా నిబంధించినాడు. అల్పమైన ఇతివృత్తమాధారముగా ఈ కవీశ్వరుడు ఒక ‘మయసభ’ను నిర్మించినాడు. ఇదిెుుక అద్దాల మేడ వంటిది. ఒక బింబమే వేయి ప్రతిబింబముల కల్పించి భ్రాంతి గొల్పును.
రామరాజ భూషణుడు ఈ మహాకావ్యకర్త. ఈతడు 16వ శతాబ్దము లోనివాడు. కావ్యాలంకార సంగ్రహము రచించిన భట్టూమూర్తియు, నీ రామరాజభూషణుడును ఒకడే. ఈయన రచించిన గ్రంథములు మూడు మాత్రమే లభ్యమగుచున్నవి. కావ్యాలంకార సంగ్రహము (సరస భూపాలీయము), వసుచరిత్రము హరిశ్చంద్రనలోపాఖ్యానము.
కావ్యాలంకార సంగ్రహములోని కవిెుుక్క స్వవృత్తాంతమునకు, మిగిలిన గ్రంథములలోని వృత్తాంతమునకు భేదముండుటవలన కొందరు భట్టుమూర్తి వేరనియు, రామరాజభూషణుడు వేరనియు తలంచిరి. ఏబది యేండ్లకు పూర్వము వసుచరిత్ర విమర్శనమునందు శ్రీ వజరల చిన్న నీతారామశాన్ర్తిగారు వీరిరువు రొకరేయని నిరూపించిరి. ఆ విషయమును సంగ్రహముగా పరిశీలింతము.
వసుచరిత్రము గద్యమున ‘‘శ్రీరామచంద్ర చరణారవిందవందన పవననందన ప్రసాద సమాసాదిత సంస్కృతాంధ్రభాషా సామ్రాజ్యసర్వంకష సాహిత్య రసపోషణ రామరాజుభూషణ ప్రణీతంబైన’’ అని కలదు. హరిశ్చంద్ర నలోపాఖ్యాన గద్యలో కూడా మార్పు లేదు. కాని నరసభూపాలీయమున ‘‘శ్రీ హనుమత్ప్రసాదలబ్ధ సారసారస్వతాలంకార, నిరంకుశ ప్రతిభాబంధుర, ప్రబంధపఠన రచనాదురంధర, వేంకటరాయభూషణసుపుత్ర, తిమ్మరసుపౌత్ర, సకలభాషావిశేష నిరుపమావధాన శారదామూర్తి ప్రణీతంబైన’’ అని గద్యము కలదు. ఈ రెంటియందును నామభేదము కలదు. తన తల్లిదండ్రులను గూర్చి హరిశ్చంద్ర నలోపాఖ్యానమున ‘‘శ్రీకర మహాప్రబంధాంక తిమ్మరాయ ప్రియతనూజ ధీర సూరపాత్మజుడ రామనృపభూషణాఖ్య సుకవి నంకిత మొనర్తు నీ కావ్యమధికభక్తి (హ.న.1అ.46), నరసభూపాలీయములో ‘‘ప్రబంధాంక నింగరాజసుత తిమ్మరాజపుత్ర ప్రనిద్ధ సరస వేంకటరాయభూషణ సుపుత్రు నను బుధవిధేయు శుభ మూర్తినామధేయు’’ (113) అని గలదు.
హరిశ్చంద్రనలోపాఖ్యానమున ‘‘వసుచరిత్రాది కావ్యప్రీత …..’’ ఇత్యాదిగా వసుచరిత్ర పేర్కొనబడుట ఈ రెండు నేకకర్తృకములే. దీనియందు ‘రామనృపభూషణ’ ‘రామరాజభూషణ’ అని ఈతని పేరు రెండు విధముల గలదు. అట్లే వసుచరిత్రమున ‘రామరాజభూషణ’, ‘రామభూషణ’ అని పేర్కొనబడినది.
ఇప్పుడు వీరి వంశవృక్షమిట్లుండును
ప్రబంధాంకము నింగరాజు

తిమ్మరాజు

సూరపరాజు వేంకటరాయ భూషణుడు

రామరాజ భూషణుడు మూర్తికవి

రామరాజభూషణుని పేరు రెండు కావ్యములయందు మూడు విధములుగా నున్నది. అది నిజనామమేయైన నట్లు మార్చుట యసమంజసము. రామరాజభూషణ, రామనృపభూషణ అని మార్చుటవలన నది నిజనామము కాదనియు బిరుదనామమే యనియు తోచును. ఈతడు అళియ రామరాయల యాస్థానములోనున్నాడు. ‘‘శ్రీరామక్షితిపున్ మదగ్రజు జయశ్రీలోలు నానాకళాపారీణున్ బహు సంస్కృతాంధ్ర కృతులం బల్మారు మెప్పించి తత్కారుణ్యంబున రత్నహార హయవేదండాగ్రహారాది సత్కారం బందితి’’ అని కలదు. ఈ రామరాయలే ఆదరించుటచేత యాతడు తత్సభాస్థానమున కలంకారమగుటవలన రామరాజభూషణ నామము కల్గియుండవచ్చుననియు నది నిజనామము కాదనియు చెప్పవచ్చును. ‘రామవిభుదత్తశుభచిహ్నవిభవయుతుడ’ అని హరిశ్చంద్రనలోపాఖ్యానమున కలదు. చిహ్నమనగా గుర్తు, బిరుదు అని యర్థము.
ఆ కాలముననిట్టి బిరుదులున్నట్లు ఆధారములున్నవి. చంద్రాంగద చరిత్రము వ్రానిన పైడిమఱ్ఱి వేంకటకవి పూర్వులలో నొకనికి కృష్ణరాయ భూషణుడని పేరున్నట్లు చెప్పబడినది. చింతలపూడి ెుల్లనార్యుడు రాధామాధవము వ్రాయుటచేత రాధామాధవకవి యైనాడు. ఇది ఆనాటి కవుల వృత్తాంతము.
దీనినిబట్టి మూర్తికవియే నరసభూపాలీయ రచన తరువాత రామరాయల యాశ్రయమున రామరాజభూషణుడె్యునని యూహింపవచ్చును. కాని వీరి తండ్రుల పేరులలో తారతమ్యము గలదు. వేంకటరాయభూషణుడు, సూరపరాజు అని రెండు పేర్లు గలవు. కొందరు ఒకరు జనకపితయనియు, రెండవవారు దత్తత తీసుకొనియుండు ననియు చెప్పుచున్నారు. కాని పైన చెప్పినట్లు భూషణ శబ్దము బిరుదమే యైనచో సూరపరాజు కూడ వేంకటరాయల యాస్థానమున నుండి యుండవచ్చును. ఈ వేంకటరాయలు అచ్యుతరాయని కుమారుడు కావచ్చును. ఈతడు విద్వన్నిధియని శాసనములయందు పేర్కొనబడెను. అయినచో సూరపరాజు వేంకటరాయభూషణు డనియు, రామరాజభూషణుడు మూర్తికవియనియు భావించుటకు సందేహము లేదు.
ఇట్లు భావించుటకు మరికొన్ని కారణములు కలవు. 1. సంప్రదాయముగా వచ్చు చాటువులయందు కవుల వృత్తాంతములయందు భట్టుమూర్తి వసుచరిత్రము రచించినట్లు చెప్పుట కలదు. 2. సమీపకాలమువాడైన వసుచరిత్ర వ్యాఖ్యాత సోమకవి ‘‘కారణజన్ముడై …’’ యన్న పద్యమున వసుచరిత్రకారుడు భట్టుమూర్తియని వాచ్యముగా బేర్కొనెను. 3. మరిెుుక సమీపకాలమునాటిదైన ‘లక్షణదీపిక’యందు భట్టుమూర్తి వసుచరిత్రములోనిదని ‘శ్రీభూపుత్రి వివాహవేళ’ యన్న పద్య ముదాహరింపబడినది. 4. నాటి వేంకటపతిరాయల విద్యాగురువైన మండ రామానుజాచార్యుల మునిమనుమడు మండ లక్ష్మీనరనింహాచార్యులు తన యాంధ్రకౌముదియందు ‘‘ముప్రత్యయాభావస్య అల్లసాని పెద్దనార్య శిష్యేణ భట్టుమూర్తి మహాకవినా విరచితే వసుచరిత్రే’’ అని ‘‘రాజహంసులు గాని రాజహంసులుగారు’’ అని ఉదాహరించినాడు. ఇన్ని సమీప సమకాలికములైన ఆధారములు భట్టుమూర్తియే వసుచరిత్రకారుడని చెప్పుచున్నవి.
ఇవికాక పై మూడు గ్రంథములు ఒకసారి శ్రద్ధగా పరిశీలించినచో అనేకములైన సామ్యములు అవి ఏకకర్తృకములనుటకు సాక్ష్యము నీయగలవు. భట్టుమూర్తియే రాజ సత్కృతుడై రామరాజభూషణుడె్యునన్నది పండితలోకమంగీకరించిన నేటి నిద్ధాంతము.
రామరాజ భూషణుని నివాసస్థానము విషయమున గూడ ఒక నిర్ణయము చేయబడలేదు. ఈతడు బట్టుపల్లెకు చెందినవాడని కొందరు చెప్పుచున్నారు. ‘‘కృష్ణదేవ రాయలవారు సుఖసంకథావినోదాలలో విద్యానగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న చల్లని రోజులలో భట్టుపల్లె అనే గ్రామాన్ని ప్రబంధాంకంవారికి ఇచ్చారట’’ (సమగ్ర ఆంధ్ర సాహిత్యంఆరుద్ర8సం. 220పు.). ఈ గ్రామము గుంటూరు జిల్లాలోనిదని కొందరు, నెల్లూరు జిల్లాలోనిదని మరికొందరు, కర్నూలు జిల్లాలోనిదని మరికొందరు భావించుచున్నారు.
రామరాజభూషణుని తండ్రి వేంకటరాయభూషణుడు విద్వత్కవితా శక్తులు కలవాడనుటలో సందియము లేదు. ఈయన విద్యానగర కవితా సరస్వతీ మహోత్సవము లలో పాల్గొనుటకు వచ్చిన రాజుల యనుగ్రహముచేత నచ్చటనే న్థిరపడి యుండును. రామరాజభూషణుడు అల్లసాని పెద్దనగారి శిష్యడని పండితలోకమున ప్రతీతియున్నది. చారిత్రకముగా నీ విషయమునకు విరోధమేమియు లేదు. రామరాజభూషణుడు క్రీ.శ. 15101560 మధ్యలో జన్మించియుండును. ఆనాటికే పెద్దనగారు మధ్యవయస్సును దాటిరి. శ్రీకృష్ణదేవరాయలవారు కర్ణాటక సామ్రాజ్య నింహాసనము నధిష్ఠించిరి.
ఈ కవి బాల్యమున నింటివద్ద సంప్రదాయముగా వచ్చు నాంధ్రభాషయును, కవిత్వమేగాక, అనేకమంది పండితుల శుశ్రూష ెుునర్చి సంస్కృత సాహిత్యమును మథించి యుండెను. వ్యాకరణాలంకారములే గాక నిఘంటువుల పారము జూచి యుండును. ఆంధ్రకవితా పితామహుడు ఈయన కవితా గురువు కావచ్చును. అందువలననే వసుచరిత్రమున సర్వవిధముల గురువుల రచనను మించు ప్రయత్నము చేయబడినది. బాల్యమునందే ఈతడు శ్రీకృష్ణదేవరాయల కవితాగోష్ఠలలో పాల్గొనకపోయినను వానిని చూచి యుండవచ్చును.
ఇది యాధారముగా అష్టదిగ్గజములలో భట్టుమూర్తి పేరు చేర్చబడుటకు సామంజస్య మూహింపవచ్చును. తదాస్థాన సంబంధముండుటవలన తరువాతి కాలమువారు ఈతనిని రాయల యాస్థానకవిగ నొనర్చిరి.
ఈతని ప్రజ్ఞ చిన్నతనమునందే ప్రకాన్తి పొందినది. చతుర్విధ కవితలు చెప్ప నేర్చినాడు. చరిగొండ ధర్మన్న చెప్పిన ‘శతలేఖిన్యవధాన పద్యరచనా సంధానము’ ఈయనయందు విస్తరించినది.
నీ. ‘‘శతలేఖినీ పద్య సంధాన ధీరేయు,
ఘటికా శతగ్రంథ కరణధుర్యు,
నాశు ప్రబంధ బంధాభిజ్ఞు, నోష్ఠ్య ని
రోష్ఠ్యజ్ఞు, నచల జిహ్వోక్తి నిపుణుఁ,
దత్సమ భాషా వితానజ్ఞు, బహుపద్య
సాధిత వ్యస్తాక్షరీ ధురీణు,
నేకసంధోదిత శ్లోక భాషాకృత్య
చతురు, నోష్ఠ్యనిరోష్ఠ్యసంకరజ్ఞు,
అమితయమకాశుధీ ప్రబంధాంక ……..’’ (కావ్యా.113)
ఇవి నా డసాధారణప్రజ్ఞలు. రాజసభామండపములయందు మూర్తికవి తేజస్వంతుడుగా విరాజిల్లి యుండెను. సంస్కృతాంధ్రభాషలయం దసమాన పాండిత్యమే కాక, ఆశుకవితాశక్తి, సద్యఃస్ఫూర్తి, ధారణాశక్తి ఇవన్నియు నున్ననేగాని పైన చెప్పిన ప్రజ్ఞలు సాధించుట సాధ్యము కాదు. ఇంతేకాక ఈతడు శ్రావ్యమైన కంఠము కలవాడు. సంగీతకళయం దభినివేశము కలవాడు. అందువలన ప్రబంధపఠనరచనా ధురంధరుడు. పూర్వకాలమున ప్రబంధములు శ్రావ్యముగా, అర్థవంతముగా చదువుట కూడ ెుుక విద్యయే. ఈ ప్రతిభ వంశానుగతము కావచ్చును. అందువలననే వారి యింటిపేరు ప్రబంధాంకమువారు.
ఈతడు ఆంజనేయోపాసకుడు. శ్రీ హనుమత్ప్రసాదలబ్ధసార సారస్వతాలం కారుడు. ఈయన మంత్రోపాసన చేనియుండును. ఈ ఆంజనేయభక్తి తరువాత రామోపాసనగా మారినది. తరువాతి రెండు కావ్యములయందును కవి శ్రీరామస్తుతి తోడనే కావ్యారంభము చేనినాడు. హరిశ్చంద్రనలోపాఖ్యానావతారిక ఈతని రామభక్తికి మణిదర్పణము వంటిది. వసుచరిత్రమున ‘‘నను శ్రీరామ పదారవింద భజనానందున్’’ అని జెప్పికొన్నాడు. హరిశ్చంద్రనలోపాఖ్యానమున కావ్యారంభమున ఇతరదేవతాస్తుతులు మాని రామపంచాయతనమును స్తుతించియున్నాడు.
ఈ రామభక్తి వైయక్తికముగా నీతని జీవితమునం దెల్ల యలముకొన్నది. జీవితమున చివరిదశలో రాజసన్మానములచేత తృప్తుడై దానినంతయు లోకముకొరకు వెచ్చించెను. తన కుమారులకు రామనామముంచినాడు. రామచంద్రపురమను నగ్రహారము నిర్మించినాడు. ఒక దేవాలయమున శ్రీరామప్రతిష్ఠ చేనినాడు. ఒక తటాకమును నిర్మించినాడు. ఈ విధముగా తాను చేయదగిన సత్కార్యములు చేని జీవనమును ఫలవంతముగా చేనికొన్నవాడు రామరాజభూషణుడు.
ఈతడు ‘‘శతలేఖినీ పద్యసంధాన ధౌరేయుడు’’గా సర్వప్రజ్ఞలు విస్తరించిన నాటికి మహాప్రభువైన రాయలవారు జీవించలేదు. విజయనగరము శాంతముగా లేదు. నాడు ఈతనికి ఒక ఆశ్రయము కావలనియుండెను. అందువలన రాయల మేనల్లుడయిన తొఱగంటి నరసరాజు నాశ్రయించెను. ఆతని యాస్థానముననే కావ్యాలంకార సంగ్రహము రచించెను. ఇది ఆ ప్రభువు యశోదర్పణమగుటవలన నిది నరసభూపాలీయమ్యొను.
ఈ గ్రంథమున గల చారిత్రకాంశములబట్టి చూచినచో నిది క్రీ.శ. 155657 ప్రాంతములయందు రచింపబడి యుండవచ్చును. ఈ గ్రంథరచన తరువాత ఈతనికి విద్వత్కవులలో స్థానము లభించెను. ఈనాటికి విజయనగరము నేలుచున్న అళియ రామరాయల యాస్థానమున నీతనికి ప్రవేశము లభించెను.
అళియరామరాయల యాస్థానమున నున్నప్పు డీత డే గ్రంథముల రచించెనో చెప్పలేము. ఆయనను ‘‘బహుసంస్కృతాంధ్రకృతులన్ బల్మాఱు మెప్పించి’’నట్లు వసుచరిత్రము చెప్పును. ఈ గ్రంథములు మనకు లభించుటలేదు. అళియ రామరాయలు బహుకళావేత్త, నానాకళాపారీణుడు. ఈతని యాస్థానమున రామయామాత్యుడు ‘స్వరమేళకళానిధి’ యన్న గ్రంథము రచించెను. ఇది పదునారవ శతాబ్దినాటి సంగీత విద్యావిశేషములను తెలియజేయుచున్నది. ఈతడు రామరాయల మెప్పించిన కృతులు సంగీత ప్రబంధములు కావచ్చును. అందువలననే కావ్యాలంకార సంగ్రహములో చెప్పుకొనని ‘సంగీతకళారహస్యనిధి’యన్న బిరుదము వసుచరిత్రలో నున్నది.
రామరాయలచే ‘హయవేదండాగ్రహారాది సత్కారం బందియు’ ఈ కవి యాతని కే గ్రంథమును సమర్పించియుండలేదు. క్రీ.శ. 1565లో రక్షసతంగడి యుద్ధమున విజయనగరము పతనమగుటయే గాక రామరాయలు స్వర్గస్థుడె్యును. తిరుమలరాయలు విజయనగరమునుండి పెనుగొండకు పారిపోయి యచట రాజ్యము చేయుచుండెను. అతనితోపాటు రామరాజభూషణుడు కూడ పెనుగొండకు చేరినట్లున్నది. తిరుమలరాయలు క్రీ.శ. 1567లోను, 1568లోను ఆదిల్షాతో యుద్ధముచేని జయము పొందెను. అనంతరము రాజ్యమును మూడు భాగములు చేని తన కుమారుల పర్యవేక్షకులుగా నియమించెను. పెనుగొండ రాజధానిగా తెలుగుదేశమును శ్రీరంగరాయలును, శ్రీరంగ పట్టణము రాజధానిగా కన్నడ దేశమును రామరాయలును, చంద్రగిరి రాజధానిగా తమిళ దేశమును వేంకటపతిరాయలును పరిపాలించుచుండగా క్రీ.శ. 1570 సంవత్సరాన జీర్ణకర్ణాట నింహాసన స్థాపనాచార్యుడై పట్టాభిషేకము చేసుకొనెను. కాని తిరుమలరాయ లప్పటికే వృద్ధుడగుటవలన 1572లో శ్రీరంగరాయల యౌవరాజ్యపట్టాభిషేకమొనర్చెను. తరువాత దాదాపు ఆరు సంవత్సరములు ఈతడు జీవించెను.
వసుచరిత్రమునందు పేర్కొనబడిన చారిత్రికాంశములనుబట్టి చూచినచో నా గ్రంథము నిస్సందేహముగా క్రీ.శ. 15721573 నాటి గ్రంథము. ఈ గ్రంథమున శ్రీరంగరాయల యౌవరాజ్యపట్టాభిషేకము పేర్కొనబడినది (వసు71). దీనియందింకను తిరుమలరాయలు పరిపాలించుచున్నట్లే యుండుటవలన ఈ గ్రంథము క్రీ.శ. 1572 1573 నాటిదని చెప్పుటకు విప్రతిపత్తి యుండదు.
హరిశ్చంద్రనలోపాఖ్యానము దీని తరువాత రచింపబడిన గ్రంథము. దీనియందు ‘‘వసుచరిత్రాది కావ్యప్రీత బహునృప ….’’ అని చెప్పుటచేత ఇది క్రీ.శ. 157580 నడుమ రచింపబడి యుండవచ్చును. అందువలన క్రీ.శ. 1510 నుండి 1580 వరకు రామరాజభూషణుడు జీవించిన కాలమని దాదాపు మనము నిశ్చయింపవచ్చును.
నరసభూపాలీయములో తననుగూర్చి స్పష్టముగా చెప్పుకొన్న యీ కవి వసుచరిత్రములో దానిని స్వల్పముగనే చెప్పెను. హరిశ్చంద్రనలోపాఖ్యానము నాటి కా యాస్థకూడ తగ్గినది. మనస్సంతయు శ్రీరామచంద్ర చరణారవింద వందన తత్పరమైనది.
రామరాజభూషణుడు నాడు వృద్ధి పొందించిన విద్యలలో అవధానవిద్య ెుుకటి. శతలేఖిన్యవధానము. ఇది ఈ కాలమున శతావధానముగా విఖ్యాతమైనది. ఇదికాక ఈతడు చిత్రకవితానిపుణుడు కూడ. అష్టావధానమునకు కూడ రామరాజభూషణుడే మూలపురుషడని సంప్రదాయము వచ్చుచున్నది. వేదపండితులు పదము, క్రమము, ఘన, జట మొదలుగా నష్టవిధములచే వేదావధానము చేయుదురు. తానును అట్టి ప్రజ్ఞ చూపదలచి, ద్విజుడు కాకపోవుటచే సాహిత్యపరముగా నా ప్రక్రియ నవలంబించి ఈ విద్యను చూపించినాడట.
రామరాజభూషణుని మూడుకృతులు మూడుత్రోవలవి. ఒకటి కావ్యశాము, వేరొకటి కావ్యము. మూడవది ద్వ్యర్థికావ్యము. దేనికది తన శ్రేణికి చెందిన కావ్యరాశిలో నుత్తమమైనదిగా నిలుచును. కావ్యాలంకార సంగ్రహము ప్రతాపరుద్ర యశోభూషణము నకు అనుకృతి. దానియందు ప్రతాపరుద్రుడు లక్ష్యము కాగా దీనియందు తొఱగంటి నరసరాజు లక్ష్యమైనాడు. భట్టుమూర్తి దీనియందు నాటక ప్రకరణము స్పృశింపనే లేదు. ఇది అయిదాశ్వాసముల గ్రంథము. ఈ గ్రంథమందు కవినిగూర్చి కృతిపతి యిట్లు పేర్కొనినాడు.
నీ. ‘‘బాణువేగంబును, భవభూతి సుకుమార
తయు, మాఘు శైత్యంబు దండి సమత,
యల మయూరు సువర్ణకలన, చోరుని యర్థ
సంగ్రహమ్ము, మురారి శయ్యనేర్పు,
సోము ప్రసాదంబు, సోమయాజుల నియ
మంబు, భాస్కరుని సన్మార్గఘటన,
శ్రీనాథుని పదప్రనిద్ధి ధారాశుద్ధి,
యమరేశ్వరుని సహస్రముఖ దృష్టి,
తే. నీక కల దటు గాన ననేకవదన
సదన సంచారఖేదంబు సడలు పరచి
భారతీదేవి నీ జిహ్వఁ బాదుకొనిెు
మూర్తి కవిచంద్ర! విఖ్యాత కీర్తిసాంద్ర!’’ (కావ్యా.125)
పై పద్యములో చెప్పిన సంస్కృతాంధ్రకవుల గుణములన్నియు తనలో ఉన్నట్లు ఆత్మప్రత్యయము గోచరించుచున్నది. ఇది నిరంతరసాధన, మహాకవులలోని గుణములు గుర్తించుట, వానిని తన కవిత్వమునందు సంక్రమించునట్లు ేనయుట. ఇది సాధారణమైన విషయము కాదు.
కావ్యాలంకార సంగ్రహములో లక్ష్యములున్నచోట్ల నెల్ల కవిెుుక్క కవితాశక్తి చక్కగా బహిర్గత మగుచున్నది.
హరిశ్చంద్రనలోపాఖ్యానము ఆంధ్ర ద్వ్యర్థికావ్యములలో నగ్రగణ్యమైనది. పింగళి సూరన్నగారి రాఘవపాండవీయమున కించుక తరువాతది కావచ్చును. సూరన్న రామాయణ భారత కథలు జోడింపగా, నీతడు హరిశ్చంద్ర నల కథలను జోడించెను. రామాయణ మహాభారత గాథలకు, హరిశ్చంద్ర నలకథలకన్న సామ్యమెక్కువ. భాషపై తనకుగల మహాధికారముచేత ఏ మాత్రమును సామ్యములేని ఘట్టముల జోడించి సమర్థముగా నిర్వహించినాడు. శృంగారనైషధములో శ్రీనాథుడు వదలిన శ్రీహర్షుని శ్లోకాలను రామరాజభూషణుడు మిక్కిలి సమర్థతతో నిర్వహించినాడు. ఈ గ్రంథావతారిక యందు రామాయణ కథను ఇరువదియేడు పద్యములలో బహుచమత్కారములతో నిర్మించి తన భక్తిని వెల్లడించియున్నాడు.
రామరాజభూషణుని గ్రంథములలో వసుచరిత్రము ఒక శిఖరము.
నాడు తెలుగు సాహిత్యమున మహాకావ్యరచనము విరివిగా వ్యాపించుచున్నది. తత్పూర్వము రామాయణ మహాభారతాదులు పురాణముల యనువాదమునుండి శ్రీనాథుని నైషధము ఆంధ్రకావ్య ప్రక్రియకు మార్గదర్శియైనది. పెద్దన, తిమ్మన, ధూర్జటి మొదలైన మహానుభావు లీ మార్గమున పూర్వ గ్రంథములనుండి కించిత్కథ యాధారముగా న్వీకరించి స్వతంత్రముగా కావ్యరచనము సాగించుచుండిరి. క్షేత్రమాహాత్మ్యములు కూడ రచింపబడు చుండెను. సూరన్నగారు స్వకపోల కల్పితమైన కథను న్వీకరించి కళాపూర్ణోదయము రచించిరి. సూరన్న రచన నాడు పెద్ద విప్లవము దెచ్చినది. మహాకావ్యమునకు ప్రఖ్యాతేతి వృత్తముండవలయునని సంప్రదాయనిష్ఠలు భావించిరి. ప్రఖ్యాతేతివృత్తమున రస నిర్వహణము సుఖసాధ్యమైనది. కాని ఉత్పాద్యేతివృత్తమున నిది యంత సాధ్యము కాదు. అందువలననే రామరాజభూషణుడు తన కావ్యమునకు మహాభారతమునుండి ెుుక చిన్న యాధారము న్వీకరించెను. ఆ ఆధారముమీద ఒక మహాభవనము నాతడు నిర్మించెను.
మహాకావ్యములోని కథాస్వరూపమునుగూర్చి యాతని యభిప్రాయమిది
‘‘కేవల కల్పనాకథలు కృత్రిమ రత్నము లాద్య సత్కథల్
వావిరి పుట్టు రత్నము లవారిత సత్కవికల్పనా విభూ
షావహ పూర్వ వృత్తములు సానలు తీరిన జాతి రత్నముల్’’
అని కథా స్వరూపమును గూర్చి తన యభిప్రాయమును స్పష్టముగా చెప్పి యున్నాడు. అందువలన వసుచరిత్రమందలి కథామూలము మహాభారతములోనిది. ఆదిపర్వమున వంశావతరణ పర్వమున ఉపరిచరవసు వృత్తాంతము కలదు. ఈ ఉపరిచరుడు సత్యవతి తండ్రి. అందువలన ఈ కథ భారతమున చాలా ముఖ్యమైనది. ‘‘ఉపరిచరవసువు తపము చేయుచుండగా ఇంద్రుడు వచ్చి ఆతని చేది రాజ్యమును పాలించుమని చెప్పెను. ఆతనికొక దివ్య విమానమును, వేణుయష్టిని ప్రసాదించెను. వసురాజు కృతజ్ఞతాపూర్వకముగా ఇంద్రపూజను తన రాజ్యమున ప్రతిష్ఠింపజేెనను. ఆతని పురోపవాహినియైన శుక్తిమతిని కోలాహలుడను నొక్క పర్వత మడ్డగించెను. ఆతడు దానిని పాదతాడనమున నిగ్రహింపగా, ఆ నది దాని రంధ్రమునుండి నిర్గమించెను. ఆ నది రాజువలన కలిగిన విమోక్షణమునకు సంతోషించి, గిరికయను తన కన్యను ఆతని భార్యగా, తన కుమారుని ఆతని ేననానిగా సమర్పించెను’’. ఇది భారతమందున్న కథ. దీనిని వసుచరిత్రమునకు మూలముగా రామరాజభూషణుడు న్వీకరించి మహాకావ్యముగ దిద్ది తీర్చెను.
సాధారణముగా ఇతిహాసములం దున్నట్లు కావ్యములయందు కథాప్రాధాన్య ముండదు. అందుకు నాటకములయందు కవికి ఇతివృత్త నిర్వహణమునందున్న శ్రద్ధ మహాకావ్య నిర్వహణమునం దుండదు. కావ్యమునందు రస నిర్వహణము ముఖ్యమైనది. ఈ రసోత్పాదనము కథను పూర్తిగా దాని దారిన దానిని వదలివైచిన సాధ్యమ్యొడిది కాదు. కాని వాతావరణము కల్పించుట, వాక్యోపవాక్యములదీర్చుట, పాత్రల ఆకారవిశేషాదుల, మనోభావముల వర్ణించుట ఇత్యాదులు మాత్రమే కాక పద్యరచన, అలంకారములు, కల్పనలు, వర్ణనలు మొదలైనవి కావ్యముెుుక్క సమగ్రతాపాదకములుగా కవిెుుక్క సర్వప్రతిభకు దర్పణములుగా, పాఠకునకు పరిపూర్ణ తుష్టి కల్గించునట్లుగా తీర్చబడును. ఆధునిక కాలమందు తెలుగు విమర్శ ముఖ్యముగా ఈ కథాప్రాధాన్యము మీద నాధారపడి మిగిలిన సర్వ విషయమున ప్రాధాన్యము పరిహరింపబడినది. ఈ సర్వ విషయమును కథాపుష్టికి, రససమగ్రత్వనిద్ధికి తోడ్పడుటయన్నచో మేలేయగును.
వసుచరిత్రములో కవి ఈ కథను తన ప్రబంధమునకు అనుకూలముగా మార్చు కొని ఆరాశ్వాసములలో సమకూర్చినాడు. కావ్యముెుుక్క ప్రధానేతివృత్తము గిరికను వసురాజు వివాహమాడుట. సర్వమైన కథయు దీనికి అభిముఖముగా తీర్చబడినది.
వసుమహారాజు అధిష్ఠానపురమును పరిపాలించుచున్నాడు. ఇంతలో వసంతము వచ్చినది. వనపాలకులు వనములు చూచుటకు రమ్మని మహారాజును ప్రార్థింపగా నాతడు బయలుదేరి ఉద్యానమును చూచినాడు. ఆ ప్రాంతమునందే ఆయన క్రీడాశైలమున్నది. నర్మసచివునితో కూడా అతడా క్రీడాశైలము నెక్కినాడు. అచ్చట వారికొక మధురసంగీతము వినవచ్చినది. రాజు ఈ సంగీతమెచ్చటినుండి వచ్చుచున్నదో చూచిరమ్మని నర్మసఖుని కోరినాడు. ఆతడు చూచి యచట ఒకానొక సుందరి చెలికత్తెలతో నున్నదనియు ఆమెను వర్ణించి చెప్పెను. అంత మహారాజు చూతమని వారున్న భవన ప్రాంతమున చెట్లవెనుక దాగి నర్మసఖుని మాయావేషమున వారి వృత్తాంతము తెలిని రమ్మని పంపెను.
నర్మసఖుడు మునివేషమున నచ్చటికేగి వారిచే సత్కృతుడై యా సుందరి వృత్తాంతమడుగగా, యచట మంజువాణియను చెలి యామె వృత్తాంతము చెప్పెను. వసుమహారాజు రాజ్యమున శుక్తిమతియన్న నది కలదు. ఆమె రోజును చెలులతో కలని బ్రహ్మకొలువున కేగుచుండును. ఆమెనొకనాడు హిమవత్పుత్రుడైన కోలాహలుడు చూచెను. అతడు కాముకుడై ఆమెవద్దకు వచ్చి ఆమెను కోరగా శుక్తిమతి యంగీకరించ లేదు. అప్పుడు అతడు బలాత్కరింపగా జలోపప్లవంబయి వాసములు కోల్పోయిన ప్రజలు మహారాజునకు ఒక కొండ వచ్చి నదిని నిరోధించిన విషయము తెల్పగా నాతడు దానిని పాదనఖమున మీటగా నది దూరమున నెగిరి దానితీరముననే బడిెును.
వసురాజు చేనిన ఈ శైల మథనమునకు ఇంద్రుడు సంతోషించి అష్టదిక్పాలురతో వచ్చి యాతనికి విమానమిచ్చి ‘మా పురమునకు వచ్చి పోవుచుండు’మని ప్రార్థించెను. కోలాహలుని వలన శుక్తిమతికి గర్భమై ఒక శుభముహూర్తమున గిరికయను బాలికయు, వసుప్రదుడను కుమారుడును కలిగిరి. ఆ గిరిక అల్లారుముద్దుగా సకలవిద్యలు నేర్చినది. ఆమెయే ఈమె అని మంజువాణి గిరికా వృత్తాంతము చెప్పగా నర్మసచివుడు నే నీమె భవిష్యము చెప్పగలను. ‘ఈమె వసురాజును పెండ్లాడగలదు’ అని చెప్పి అతని నిప్పుడు మంత్రబలముచే రప్పింతునని ‘మజార’యన లతికల చాటుననున్న యా రాజు అచ్చటకు వచ్చెను. రాజును గిరికయు పరస్పరము గాఢానురాగము పొందిరి. గిరిక యచ్చట నుండి తల్లి పిలుచుటవలన వెడలిపోెును. మహారాజు కూడ అనంతరము గిరికావిరహాతురుడై ఆ వనమున కొంత చరించి నిజరాజధాని కరిగెను. గిరిక యంత విరహతాపము చెంది తీవ్రముగా తాపము నొందుచుండగా మంజువాణి యీ వృత్తాంతము మహారాజునకు తెల్పివచ్చెదనని యాకాశగమనమున నేగి యంతటి విరహమున నున్న మహారాజునకు గిరికా మౌక్తికాహారమున తృప్తి కల్గించి యాతని ప్రేమ వృత్తాంతము గిరికకు మరల వచ్చి తెలుపును.
తరువాత ఇంద్రుడు వసురాజు వద్దకు వచ్చి యాతనికి వివాహప్రయత్నము చేయుదునని చెప్పి కోలాహలుని చేరవచ్చి వివాహము నిశ్చయము చేయును. ఇంద్రుని అనుగ్రహమున కోలాహల పర్వతమున నేర్పడిన దివ్యపట్టణమున గిరికా వసురాజుల వివాహము అనేక నదుల, పర్వతముల బంధుసమూహముల నడుమ జరుగును. వివాహమున దేవతలు వసురాజున కనేక వరము లొసగిరి. ఇంద్రుడు వేణుయష్టి నిచ్చి దీనిని ప్రతిసమయమున భజింపవలెనని చెప్పెను. గిరికా వసురాజు లిరువురు రాజధానికి చేరి యచ్చట సుఖముగా నుండిరి.
ఇది ఈ కావ్యమందలి ప్రధాన కథ, మహాభారతమునందలి కథలో నీతడెక్కువ మార్పులు చేయలేదు. రెండు కథలలోను ఇంద్రుడు ప్రాధాన్యము వహించును. సాధారణముగా చూచినచో నీ కథయందు బలము లేదు. ఏలననగా ప్రేమించుట వివాహము చేసుకొనుట ఈ రెంటి నడుమ వ్యవధానము లేదు. సంఘర్షణ లేదు. కథయం దుత్కంఠ పెంచెడి లక్షణము లేదు. పాత్ర ప్రవృత్తియందు వైశిష్ట్యము గోచరించు వ్యక్తిత్వ వికాసమున కవసరమైన సన్నివేశములే లేవు. అందువలన ఈ కావ్యమునందు కథాసూత్రము మిక్కిలి బలహీనముగా నున్నదని విమర్శకులు భావించిరి.
కాని ఈ కావ్యమునందలి కథ ెుుక విచిత్ర మణిమంటపము. ఒక్కొక్క దృష్టితో చూచినపు డొక్కొక్క కాంతిచక్రము గోచరించును.
కవి ఈ కథను ఒక నాటకమువలె తీర్చినాడు. శ్రవ్యకావ్యముల నిర్వహణమునం దింతజాగ్రత చూపుట యపూర్వమైనది. కథ యంతయు మూడు దినములలో జరిగినది. అందువలననే మొదలే చెప్పవలనిన శుక్తిమతీ కోలాహల వృత్తాంతము మంజువాణిచేత చెప్పించినాడు. కథ యంతయు కోలాహల పర్వతముమీదనే జరిగినది. ప్రథమాశ్వాస మున వసురాజు బయలుదేరినది మొదలు మరల వివాహానంతరము నగరమునకు వచ్చుట నడుమ రాజు నగరమునకు వచ్చిన ప్రసక్తి ెుుకసారి వచ్చును కథ యంతయు నదీతీరముననే కోలాహల పర్వతము మీదనే. అందువలననే అధిష్ఠాన నగరమునకు మంజువాణి పోయివచ్చిన విషయము కూడ కవి చెప్పక తిరిగి వచ్చిన యనంతరము కవి యామెచేతనే చెప్పించును. అందువలన కథా నిర్వహణములో మాంద్య మెచ్చటను లేదు.
కథయందు శృంగారము ప్రధానరసము, అంగిరసము, వీరము శృంగారము. ఈ కావ్యమునందు ప్రతిపద్యస్పర్శిగా నున్నది. ఈ వీరముెుుక్క స్పర్శ కోలాహల మథనమునందే. వసురాజు రాజ్యమం దప్రమత్తుడు. వీరుడు కావున ధీరోదాత్తుడు. నాయిక ముగ్ధ. మనుచరిత్రాది ప్రబంధములయందు శృంగారము ప్రధానమే యయ్యు నా రసము నింత ప్రత్యగ్రముగ నిర్వహించవలనిన పనిలేదు. ఆ కావ్యములయందు మిగిలిన రసములకు కూడ నవకాశమున్నది. ఇచ్చట శుక్తిమతీ ఘట్టమున వసురాజు నందున్న వీరము చాల అల్పమైన అవకాశము కలది. అచ్చట కోలాహలగతమైన శృంగార రసాభాసము ఈ ఘట్టమునకు కూడ శృంగార రసచ్ఛాయను సమకూర్చుచున్నది. అందువలన వసుచరిత్రమంతయు శృంగార రసమునకు ద్రాక్షపందిరి వంటి కావ్యము.
శృంగారమెంత మధురమైన రసమో యంత క్లిష్టమైన రసము. సర్వమానవ హృదయాకర్షకమైనట్లే నించుక దారితప్పినచో ననౌచిత్యదోష మాపాదించును. ఇది కత్తిమీద నడకవంటిది. భట్టుమూర్తి దీనిని మిక్కిలి సమర్థతతో నిర్వహించినాడు.
రామరాజభూషణుని కావ్యములలో కథాకాలపరిధి చిన్నదగుటవలన నష్టాదశ వర్ణనలకు స్థానము లేదు. ఉన్న కొలది వర్ణనలు కూడ కావ్య గుణోత్పాదకములే యగుచున్నవి. కథయందు ప్రతిచోటను భావి కథానిర్మాణమందలి జాగ్రత్త గోచరించును.
కథాప్రారంభమందలి వసంతవర్ణన చాల చిత్రముగా నున్నది. ‘‘ఏ పారు పొదరిండ్ల నాపాటలాశోకదీపార్చి కనకకలాప …’’ (134) అన్న పద్యమున గంధవహుని ధౌర్త్యములు వర్ణింపబడినవి. ఇచ్చట నీ పద్యము నాచన సోమన్న హరివంశములోని హంసడిభకుల ధౌర్త్యమును శ్రీకృష్ణనితో వర్ణించుచు మునులు తమ విరిగిన దండ కమండలువులు మున్నగువానిని చూపుచు వర్ణించిన ఘట్టమును స్ఫురింపజేయును. ‘‘ఆ గంధవహుని ధౌర్త్యములు దెలుపు లీల విరినిన విరులు, రాలిన రజంబు, లొలికిన రసంబు, లురలిన ఫలములు’’ ఇవన్నియు రాజు నెదుట నుంచిరట. అందువలననే వసంతవర్ణనము చేయుచు వనపాలురు స్వామీ యేమని చెప్పెదమని యారంభించిరి.
కథా ప్రరోచన చాల చిత్రముగా నున్నది. సామాన్య ప్రబంధములయందు హింస్ర మృగముల బాధవలన వనచరులు వచ్చి మొరలిడగా రాజు వేటకు బయలుదేరును. అచ్చట నొక కన్యను చూచుట మొదలైనవి. తరువాత ఇచ్చట కథారంభము వేరొక విధముగా నున్నది. వేట లేదు, క్రూరమృగముల బాధ లేదు, ఉద్యానమే, అచ్చటనే విహారము. ఆ విహారమునకు కల్పింపబడిన కారణము వసంతమునందు గంధవహుని ధౌర్త్యము. దుష్టశిక్షణము రాజధర్మము. రాజు భోగిగా కాక దుష్టశిక్షకుడుగా బయలుదేరుటలో నొక యౌచిత్యమున్నది. ప్రథమాశ్వాసము చివర నొక పద్యమున్నది.
‘‘నృపు నెదుట తేనెవాకలో నిబిడవిచల
దతనుపత్రాళిఫలసాంద్ర మగుచు నొక్క
నగము కైవ్రాలి యేటిలో నాటియున్న
నాటి యున్నతనగరాజు నలువుఁ దెలిపె’’. (వసు.1161)
ఇచ్చట కవి శిల్పమున సంస్కృత రూపక సంప్రదాయమున భావికథా సూచనముండును. తేనెవాకలో ఫలవృక్షసాంద్రమయిన ెుుక్క వృక్షము నాడు శుక్తిమతిలో నిలిచియున్న కోలాహలుని స్ఫురింపజేనినదట. రెండవ యాశ్వాసములో కోలాహలుని వృత్తాంతము కవి చెప్పబోవుచున్నాడు. ఆ వృత్తాంతమున కిది సూచన.
గిరికా విరహవర్ణనములోనిదీ పద్యము.
‘‘అనిలకుమారకుండు మరుదధ్వనిరోధిఫలాశిమండలీ
ఘనవనరాశిలో పుడమిగానుపు పద్మిని చిక్కి స్రుక్కఁగా
నినకరముద్రఁ జూపి వెలయించి తదంబుజరాగపాళి గై
కొనుచు ప్రవాళ తేజమునుగూరిచెఁ గంటె పలాశవీధులన్’’ (3139)
మందవాయువు పద్మమును వికనింపజేని పలాశవీధుల తదంబుజరాగపాళి కూర్చినది ఇది ప్రకృతమైన వర్ణన. ఇచ్చట శబ్దశక్తివలన వేరొక యర్థము స్ఫురించు చున్నది. అనిలకుమారకుడు (ఆంజనేయుడు) రాక్షసులమధ్య నీతాదేవి (పద్మిని) చిక్కి స్రుక్కగా నినకరముద్ర (పతిెుుక్క అంగుళీయకమును) చూపి సంతోషింపజేెనను. ఈ విరహఘట్టమున ఈ రామాయణ కథాప్రసక్తి యేల? ఊరకే కవిెుుక్క చమత్కార కల్పనా నైపుణ్యముకొరకేనా? కాదు. ఇచ్చట మరికొంత లోతుగా ఊహ చేయవలయును. నీతాదేవి విరహిణి, ఆంజనేయుడు ప్రియునినుండి వచ్చిన దూత. ఆతడు ముద్రచూపి ఆమెను సంతోషింపజేెనను. గిరికయు నట్టిన్థితిలోనే యున్నది. ఆమెయు విరహిణి. వనగత మలయాదులైన మన్మథపరివార మామెను నీతను రాక్షనీగణమువలె వేధించు చున్నారు. ఈ సందర్భమున మంజువాణి యాకాశగమనమున వసురాజుకడ కేగి ఆతని కరాంగుళీయకము దెచ్చి యామె నోదార్చును. ఈ భావికథ యంతయు దీనియందు స్ఫురించుటకు ఈ రెండవకథను జోడింపవలని వచ్చినది. కవి శబ్దశక్తి నాశ్రయించి ఈ కావ్యమం దెలె్లుడల ప్రకృతి కథార్థమే కాక యన్యభావస్ఫూర్తి కల్గించుట భావుకుల పరమ భావనాశక్తికి మరింత లోతుగా క్రొత్త సౌందర్యములు స్ఫురింపజేయుటకే. ఇట్లే మరిెుుక ప్రకృతివర్ణనము చూడవచ్చును.
‘‘చలితలతాంతకాంతి యను చందిరకావిచెఱంగుదాఁటి స
మ్మిళిత వయోవిలాసముల మీటిన విచ్చు ఫలస్తనాగ్రముల్
వెలువడ, గప్పె దత్‌క్షణము వేల్లితదోహదధూపధూమకుం
తలములు విప్పి దాడిమలతాలలితాంగి నృపాలుచెంగటన్’’. (1157)
ఈ పద్యము ప్రథమాశ్వాసములోనిది. ఇందు దాడిమీ లత లతాంగిగా వర్ణింపబడినది. చెందిరకావిచెరంగు దాటి యౌవనవిలాసముగా ఫలస్తనాగ్రములు వెలువడగా దోహదధూపధూమకుంతలముచేత వానిని కప్పుకొన్నది. ఈ దాడిమిని రాజు చూచుట ప్రస్తుతవిషయము. అప్రస్తుతమైనది దీనియందు గల శృంగార వృత్తాంతము. ఒక నాయిక నాయకు డెదుటపడగా, ఆమె వక్షస్థలమును తన కేశములచేత కప్పుకొన్న దృశ్యము మనకు స్ఫురించును. రెండవ యాశ్వాసమున హఠాత్తుగా నాయకు నెదుటపడిన గిరిక లజ్జావిభ్రమము పొందిన ఘట్టమున్నది. ఆమె తలవంచి కుచాంచల హారధారలో ప్రియుని చూచుటయు, తరువాత నిగ్గున తెరవెనుకకు పోవుటయు నున్నవి. ఈ ఘట్టములోని గిరికాస్వభావము ఇచ్చట ప్రకృతివర్ణనలో స్ఫురించుచున్నది.
రామరాజభూషణుని రచనలో ప్రకృతార్థమువెంట నెన్ని యర్థములున్నవో యని పొరలువిప్పి జాగ్రత్తగా పరిశీలింపవలయును. దానివలన కవి యా పద్యము నేల వ్రాెననో తెలియును. లేకున్నచో వట్టి శబ్దచమత్కారము మాత్రమే గోచరించును.
శుక్తిమతీ కోలాహల ఘట్టములోనిదీ పద్యము
‘‘ఆతులశైవలవతీశతము లీనెడు మీకు
నా యిచ్చు విమలార్ఘ్యతోయ మెంత,
ప్రాలేయనిలయసంభవము గాంచిన మీకుఁ
బన్నీట నొనరించుఁ బాద్య మెంత,
సరసమందార మంజరుల రంజిలు మీకు
బెనచి పూదండ లర్పించు టెంత,
గోరత్నదోహన గురులక్ష్మి గల మీకు
నుపదగా మణివర్గ మొసగు టెంత,
అనఘ! ఎవ్వార లైనఁ గొండంతవారి
కవనిఁ గొండంతపూజ ేనయంగఁ గలరె
భక్తి నే నిచ్చు నీ పుష్పపత్రతోయ
మాత్రములు గైకొనుటెకాక గోత్రతిలక!’’ (2122)
ఈ పద్యము శుక్తిమతి కోలాహలుడు రాగా నాతనికి నర్ఘ్యపాద్యాదులిచ్చుచు నన్న మాటలు. ఆతడు హిమాచలుని కుమారుడు. ఒక విధముగా రాజకుమారు డన్నమాట. కాని ఆమె మనస్సులో నాతనిమీద గౌరవము లేదు.
కాని ఆతని చూడగానే ఆమెకొక యనాదరము కలిగినది. పెద్ద యింటివాడు హద్దులులేక పెరిగినట్లున్నది. బండవంటివాడు. సౌకుమార్యమన్నది యాతడెరుగడు. మోటువాడు ఇది ఆమె మనస్సు. తాను పరమసుకుమారమైనది. తాను నది, పైగా శుక్తిమతి, అతడు కోలాహలుడు ఉద్ధతుడు. ఆమె మనస్సులో నున్న ఈ ఏవగింపు ఏ విధముగ చెప్పవలయును. సంస్కృత నాటకములలో ఇట్టి సందర్భములయందు అక్కడి పాత్రల కొక విధముగను, ప్రేక్షకులకొక విధముగను అర్థమగు సన్నివేశము లుండును. అది ‘డ్రామటిక్ అయిరనీ’ అందురు. ఇచ్చట నా శిల్పమే కవి ప్రయోగించినాడు. నూర్లనదులు గల మీకు నే నిచ్చు నీ రెంతయన్న చోట ప్రకృతార్థముతోబాటు శైవలవతీశతములు, విమలార్ఘ్యతోయము అన్నమాటలు విచారింపవలయును. శైవలవతి నాచుకలది. తానిచ్చు నీరు విమలమైనది. అతనివద్దనున్న నదులయందు స్వచ్ఛమైన నీరు లేదు. దాని మొగ మాతడెరుగడు. ఇది ఆమె మనస్సులో నున్న ఊహ. అతడు ప్రాలేయనిలయ సంభవుడు. హిమవత్పుత్రుడు, మంచులో పుట్టినవాడు. అతనికి పన్నీటియందు గల భోగ్యత్వము స్ఫురించదు. అతడు మందారమంజరుల రంజిలువాడు. పూలగుత్తులు ధరించుట అనాగరక సంప్రదాయము. నాగరకలు పూలుగ్రుచ్చి దండలుగా జేని ధరింతురు. లలితకళలలో మాలాకరణమొక విద్య. తానిచ్చునవి గ్రుచ్చిన పూలదండలు. వీని సొగసాతడెరుగడు. చివరిపాదము నాతని సంపదను వెక్కిరించు చున్నది. అదిగో రత్నదోహన గురులక్ష్మి. భూమిని పిదికి సంపాదించినది. అనగా భూమిని కొల్లగొట్టినదని భావము. తానును సంపన్నయే. అది సహజమైనది.
ఈ విధముగా నీ పద్యమంతట కవి తన రమణీయరచనచేత శుక్తిమతి లక్షణమును, కోలాహలుని లక్షణమును స్ఫురింపజేెనను. మహాకావ్యములు చదువునపుడు కొంత జాగ్రత్త యుండినచోగాని యభిప్రాయముల వెంట కొట్టుకొనిపోవుట యుండదు.
కావ్యమంతయు వర్ణనలయందు, సంభాషణములయందు నెచ్చట చూచినను కథానుకూలమైన రచనాజాగ్రత్త కానవచ్చును.
ఈ కావ్యమునందంత కథ స్వల్పముగా కన్పించి ప్రకృతి సౌందర్య స్ఫోరకములైన వర్ణనలు పెరుగుటకు వేరొక కారణమున్నది. ఈ కథ ప్రకృతి సంబంధమైన కథయే. ఆధునిక కాలమున కావ్యములయందు, కథాగ్రంథములయందు కొన్నింట వాతావరణము కల్పించి దాని విస్తారమైన పరిధియందు స్వల్పమైన కథను చెప్పి సమగ్రత్వమును సాధించుట ెుుక శిల్పవిశేషముతో నున్నది. వసుచరిత్రమున ఈ ప్రక్రియ కానవచ్చును.
కావ్యము ప్రధానముగా ప్రకృతి మధ్యమున జరిగినది. ఇది యా వాతావరణము కల్పించుటలో సహాయపడును. కథలో నదులు పర్వతములు వనదేవతలు పాత్రలు. అందువలన వానికి చైతన్యమాపాదింపబడినట్లే, ఆ ప్రాంతమున నున్న వనలతాదులు కూడా వర్ణనములయందు చైతన్యారోపము పొంది కావ్యకల్పనకొక సౌందర్యమును సమకూర్చినవి.
ఈ కావ్యమును శ్లేష ప్రధానమైన కావ్యముగా చాలమంది భావింతురు. దీనియందు చాల పద్యములయందు ప్రకృతార్థము కూడ కల్పింపబడుటవలన నదిెుుక్క చమత్కారహేతువై యానందము కల్గించుచున్నది. ఈ అన్యార్థము శబ్దశక్తిచేత ననేక స్థలముల యందు కల్పింపబడినది. ఇందువలన దీనికి కొందరాధునిక విమర్శకులు శ్లేష కావ్యముగా, అనుత్తమ కావ్యముగా భావించిరి. ఇది సరియైన పద్ధతి కాదు.
వసుచరిత్రమందు కల్పింపబడు అన్యార్థములు సర్వకావ్యమున ధారా వాహికముగా లేకున్నను ఆయాచోట్లనున్న యన్యార్థములు కావ్యరసధారనుండి పాఠకుని చిత్తవృత్తిని మరల్చుటకు సమర్థములా యన్నట్లున్నవి. పద్యమునందలి ప్రకృతార్థము పద్యమునందు గల్గిన వేరొక యర్థమును భావించుటలో భంగమగుచున్నది. ఇది క్వాచిత్కమైనప్పుడు పాఠకుని మనస్సున కది విశ్రమస్థానము లేకున్నచో నది పరిశ్రమ స్థానము. ఇన్ని వందలయేండ్లుగా వసుచరిత్రమును పండితులీ దృష్టితో చూచిరి, వ్యాఖ్యానించిరి. అందువలన కావ్యమునందలి యేకదేశమునందే గాని సమగ్రస్వరూపము నందు పాఠకుని దృష్టి యుండదు. ఎంతేనపును, ‘‘వేణి చలింప….’’ ‘‘ఇమ్ములై మరుహజారమ్ములై ….’’ ‘‘లలనాజనాపాంగ ….’’ ‘‘మోహాపదేశ …..’’ ‘‘కొడట విల్లు….’’ ఇట్లు పద్యములు చదివి వాని చమత్కారము భావించుటయే కాని వసుచరిత్రమునందు కావ్యసమష్టిగా భావించి చర్చించుట లేదు.
వసుచరిత్రమునందు కథ కేవలము కథ మాత్రమే కాదు. మిగిలిన కవులు తమ కావ్యరచన కాధారముగా నొక కథను న్వీకరించిరి. రామరాజభూషణుడట్లు చేయలేదు. లోకములో నెన్నియో శృంగారగాథలున్నవి. పట్టుగలవి. కాని ఆతడు జాగ్రత్తగా ఊహించి ఈ ఇతివృత్తమును న్వీకరించెను. మహాభారతమునందలి ఉపరిచర వృత్తాంతమునకు మూలము ఋగ్వేదమందలి వృత్రాసుర వధ. ఈ వృత్తాంతము మన పురాణములయందు ఎన్నో కథలకు మూలమైనది. వృత్రాసురుడు ఆకాశమున మేఘరూపమున జలమును, లేదా వెలుగును బంధించగా జగత్ప్రభువైన ఇంద్రుడు తన వజ్రముతో దానిని భేదించి లోకమునకు జలమును ప్రసాదించెను, వెలుగును ప్రసాదించెను. ఈ కథయే మరిెుుక రూపముపొంది ఉపరిచరవసు వృత్తాంతమైనది. ఉపరిచరుడు ఇంద్రస్థానీయుడు. కోలాహలుడు వృత్రస్థానీయుడు. జలము శుక్తిమతి. ఇంద్రుడు లోకమునకు ప్రసాదించిన ఈ జలమే గిరిక. ఈ కథెుుక్క లోపొర యది. ఈ పొరయున్నట్లు తెలినినచో కథలోని ఎన్నియో ముడులు విడిపోవును.
కావ్యము పేరు వసుచరిత్రము. అనగా వసుమహారాజు కథయని. ఇందు గిరికాచరిత్రమునకున్న ప్రాధాన్యము వసుమహారాజు కథకు లేదు. అతని పేరు పెట్టుటకు కారణమేమి? మనుచరిత్రమన్న పేరునకు పోటీగా వసుచరిత్రమని పేరు పెట్టెననుట సామాన్యమైన కారణము. రామరాజభూషణుడు ఈ ప్రధానమైన కథ వెనుక నున్న ఈ ఋగ్వేదవృత్తాంతము నెరిగియుండెను. అచ్చట విముక్తమైన జలము, లేదా వెలుగు లోకమునకు వచ్చినది. ఫలస్వరూపమైనది. తత్పూర్వమా జలమే ఆకాశమున వృత్ర రూపమైన చీకటిచేత, లేదా మేఘముచేత నిబద్ధమైనది. ఈ జలము లేదా వెలుగుెుుక్క వృత్తాంతమే వృత్రాసుర కథ. ‘వసు’ శబ్దమునకు జలమని, వెలుగని యర్థములున్నవి. అందువలన వసువనుటచేత జలముెుుక్క చరిత్ర చెప్పుచున్నానని కవిెుుక్క ఉద్దేశ్యము.
కథయందు మూడు పొరలున్నవి. ఒకటి ఉపరిచరవసు వృత్తాంతము. రెండవది ఇంద్ర వృత్రాసురుల కథ, మూడవది జలముెుుక్క కథ. మూడవకథ సామాన్యమైన ప్రకృతిలోని ఒకానొక సన్నివేశము. ఆకాశమున మేఘములు కప్పుకొని మెరుపులు మెరని, మొరని, జలము కురియగా మేఘుడు రాక్షసుడనియు, వానిని ఇంద్రుడు సంహరించెననియు, ఆతని ఆయుధము మెరుపు, అశని, వజ్రము అనియు, ఆతడే జలమును ప్రసాదించెననియు ఆదిమకాలమున భావించిరి. సాధారణమైన వర్షపాత వృత్తాంతము ఋగ్వేదములో వృత్రకథయైనది.
కవి తన కావ్యమును ఈ మూడు కథల ెురుకలో రచించెను. కావ్యమును సాధారణమైన శృంగార ప్రబంధముగా దీర్చుట ెుుక విశేషము. రెండవది ఇంద్ర వృత్రాసురకథను స్ఫురింపజేయుట, మూడవది ప్రకృతిెుుక్క ఒక వికాసమైన జలకథను చెప్పుచు సర్వప్రకృతిశోభా వైభవము విస్తరించుట.
ఇంత చిక్కుండుటవలన కవి తన రచనకు సాధారణమైన కథన పద్ధతిని అవలంబించుట చాలదు. ప్రబోధచంద్రోదయాదులవలె ఛాయారోపణము చేనినచో ప్రకృతమైన కథ కథగా నిల్వదు. గిరికా వసురాజులు కేవలము బొమ్మలవలె నుందురు. అందువలన ఇచ్చట ప్రతీకలను కల్పించెను.
ఈ కావ్యమునందున్న పాత్రలే కొద్ది. ఇంద్రుడు, వసురాజు, నర్మసఖుడు, కోలాహలుడు, శుక్తిమతి, గిరిక, మంజువాణి. ఇవి ఈ కావ్యమందలి పాత్రలు. ఇంద్రుడు దివ్యుడు, కోలాహలుడు పర్వతము, శుక్తిమతి నది, మంజువాణి వనదేవత. ఇక మిగిలినది గిరిక, వసురాజు, నర్మసఖుడు ఈ మువ్వురు మానుషపాత్రలు. గిరిక పర్వతమందలి ఒక కొండమల్లె కావచ్చును. ఒక చిన్న ెనలయేరు కావచ్చును. భారతమందు కొండలో నుండి శుక్తిమతి పాయ ప్రవహించినదని చెప్పుటవలన నది ెనలయేరగుటకే ెుక్కువ యవకాశమున్నది. వసుచరిత్రములో నొక కీలకమైన పద్యము కలదు.
‘‘ఆ కోలాహలశైలసంభవ, రసవ్యాకృద్ఘనాళి ప్రయ
త్నైకప్రన్థితయై ప్రతిక్షణసభంగారాళసంచార యై
వ్యాకీర్ణాంబర ఫేనయై పిహితవక్త్రాబ్జస్ఫురద్వేణియై
శ్రీకల్యాణగుణార్ణవుం డలర వచ్చె న్నూత్నరాగంబునన్’’ (675)
ఈ పద్యమునందు గిరిక ెనలయేరుగా వర్ణింపబడినది. ఇది కావ్యాంతమున వివాహానంతరము గిరికా వసురాజుల సమాగమము నందలి పద్యము. కావ్యఫలము వేళ ఆమెను నదిగా వర్ణించుటలో కవి తన ప్రతీకను రూపకముగా చెప్పివైచినాడు.
ఇక మిగిలినది వసురాజును నర్మసఖుడును. వసురాజును గూర్చి యడిగిన నా మహర్షులకు సూతుడు కథ యారంభించుచు ‘శక్రాపాదిత దివ్యచిహ్నధరుడు, చంచద్విమానాధిరాజ క్రీడాపరుడు, అమానుష మహాసత్త్వాఢ్యుడు’ అని చెప్పును. ఈతడు దివ్యచిహ్నధరుడు. ఏ మహారాజు విషయములోనను పురాణములలో తీసుకొనని శ్రద్ధ ఈతని విషయమున ఇంద్రుడు తీసుకొని వివాహము కూడ నిర్వహించినాడు. ఈతడు తపన్వి. భూలోకమున ఇంద్రుని ప్రతినిధి. కవి ఎచ్చటనైనను ఈతని గూర్చి చెప్పినప్పుడు ఇంద్రుడన్న విశేషణము తప్పక వాడును. ఇంద్రుడే ఆతని సంబోధించుచు ‘వసుక్ష్మా మండలాఖండలా!’ అని సంబోధించును. కోలాహలుడు తన్ను నిరోధింపగా శుక్తిమతి చేనిన యార్తనాదము కూడా ‘ఓ వసుధా మహేంద్ర! కరుణోదధి! యీ తడ వేల ప్రోవరావే’ అని ెులుగెత్తినది. మంజువాణి వసురాజును గూర్చి వర్ణించునపుడు ‘కల డుల్లోల …..’ మొదలైన పద్యమున ఆతని భేరీభాంకారముచేత మైనాకుడు పక్షశూన్యుడగు చున్నాడని చెప్పినది. ‘స్వారాజ్యంబును బోలె నింద్రుని కధిష్ఠానం బధిష్ఠానమై’ అని ఆమెయే పోల్చినది. ‘అవ్వనాభ్యంతరరోధకంబగు మహాద్రి నఖంబున మీటె’ అన్నచోట కూడ అద్రిభేదనము చెప్పబడినది. ఇంకను కావ్యమున నగభేరి మొదలైన విశేషణములు వాడబడినవి. ఈ విశేషణములన్నియు ఆతడు ఇంద్రునకు ప్రతీక యనునది సూచించును. ఇంకను మూడవ యాశ్వాసమున ఇంద్రుడు వచ్చినప్పుడు వర్ణించిన గోత్రవర్ణనము పాదుకొల్పిన నయశాలి’ అన్న పద్యము ఇంద్రునకు సంబంధించిన ఎనిమిది విశేషణములు వసురాజునకు కూడా సమన్వయము చెందుచున్నవి. ఈ పద్యమున పై విశేషణములు ఇరువురి యందు చెందుటతో ఇది లోకోత్తరమైన రచనాశిల్పము. ఇది అద్దమువంటి పద్యము. ఇచ్చట వసురాజు ఇంద్రునకు ప్రతిబింబమని తాత్పర్యము. కావ్యముెుుక్క చివరి పద్యమున ‘అమ్మహాశైలదమను రాజ్యమ్మునందు’ అని చెప్పబడినది. ఇచ్చట వసురాజు శైలదమను డనుటలో ఈ విశేషణము సార్థకముగనే వేయబడినదని ఊహించ వచ్చును.
కావ్యమున ఇంద్రుడు దివ్యుడు. కోలాహలుడు, శుక్తిమతి జడులు. జడము దివ్యమున కధిరోహింపవలయును. ఇచ్చట చైతన్యరంగస్థలమున్నది. గిరిక శుక్తిమతీ కోలాహల పర్వతములకు ప్రతినిధి. ఆమె చైతన్య రంగమునకు మంజువాణివలన చేరినది. అట్లే నర్మసఖునివలన ఇంద్రుడు వసురాజై చైతన్యరంగమున చేరినాడు. జడముెుుక్క అధిరోహణము, దివ్యముెుుక్క అవరోహణము చైతన్యరంగమున నూతనసృష్టికి కారణమైనది. దివ్యావరోహణమునకు నిచ్చెనవంటివాడు నర్మసఖుడు. జడాధిరోహణము నకు నిచ్చెనవంటిది మంజువాణి. ఈ ెుల్ల ప్రకృతిెుుక్క విలాసము. పరస్పరాకర్షణ శక్తివలన జడ దివ్యశక్తులు చైతన్యరంగముల ప్రవర్తింపజేనిన ెుుక రూపకమిది.
కావ్యమున కథలో మూడు పొరలున్నవి. ఇవికాక పునాదిలో దివ్యజడములు చైతన్యరంగములో కలనికొనెడు పరిణామవివృతి యున్నది. ఈ రెండును స్ఫురించవలయు నన్న కథన పద్ధతియందు క్రొత్తత్రోవ త్రొక్కవలనియుండును.
అందువలననే ఈ కావ్యము మయసభ వంటిదని చెప్పబడినది. దానిలోని భ్రాంతి కల్గుట ెుట్టిదో కవి వసురాజు భవనమును చూచిన మంజువాణిచేత యిట్లు చెప్పించెను
‘‘ఒకవంక నిర్మలోదకశంక సంకుచ
త్పరిధాననై రిత్తఁ బాఱఁ దలఁతు
నొకచోట విఘటితోరుకవాట గృహవాట
మని మిన్నకయ తూఱి చనఁ దలంతు
నొకయిక్క నిది వితర్దిక నిక్క మని పదా
గ్రము నిక్క రహి నెక్కఁగాఁ దలంతు
నొకచాయఁ జిత్రభిత్తికగా యనుచు సోయ
గమునఁ బాయక డాయఁగాఁ దలంతు
నిట్లు గృహరాజకీలితానేకరత్న
వివిధరుచివైభవంబులు వెగడు పఱుప
నిదియ కాఁబోలు నృపుకేళిసదన మనుచు
నచట మాయాబలతిరోహితాంగి నగుచు’’ (473)
ఇది వసురాజు భవనములోనే కాదు, వసుచరిత్రమంతటను కల్గుచున్నది. కాని కథాగతమైన ఈ రహస్యము తెలినినప్పుడు దీనిని సమన్వయము చేనికొన్నచో ఈ మహాకావ్యముెుుక్క మణిభంగ దీప్తి తెలియవచ్చును.
కావ్యములోని యప్రకృతార్థదీప్తి యున్నచోట నది దాని క్రింద గల పొరలతో సంబంధించి యుండును. జలముెుుక్క వృత్తాంత మనుటవలన నిది నదీనదసుందరమైన ప్రకృతిని స్ఫురింపజేయుచునే యుండును. ప్రకృతిలోని ెుుక విశేషమును చెప్పుటకు కవి ప్రకృతినే ెుుక వాతావరణ సామగ్రిగా న్వీకరించెను. ప్రకృత కథతోబాటు ప్రకృతి కథ కూడ చెప్పును.
‘‘ప్రకటితోన్మేష కీపద్మిని కినకర
కౌతుకావాప్తి వేగమె ఘటించుఁ
దతవయోవిభవ కీలతకూన కాసన్న
పున్నాగవిహృతి గొబ్బుననె యుబ్బు,
విలనితామోద కీకలికికొమ్మకు రాజ
సారంగయోగ మీక్షణమ కల్గు,
భువనాభినంద్య కీనవరససరనికి
మానసప్రియలీలతోన దొరకు
ననుచుఁ దమలోన లేఁదోట లరయు మగువ
లాడు నుడువులు విననె్యునని ెుఱింగి’’ (259)
ఈ పద్యములో ఉద్యానపాలికలు తమ కొమ్మల లతల పెంపును గూర్చి చెప్పుకొనుచున్నారు. దీనివెనుక ఒక కన్యకు త్వరలో భర్తృసమాగమము కల్గబోవుచున్న దను భావము స్ఫురించుచున్నది. రాజు దీనికి ఉపశ్రుతిగా న్వీకరించినాడు. ఇక్కడ ప్రకృతివర్ణనమను పొర వెనుక ప్రకృత కథానుసంధానము చేనినాడు.
చెలులు మేల మాడుచుండగా గిరిక కోపించి తెర వెనుకకు పోయినది.
‘‘సొలని తటిల్లతాంగి జిగిచూపు వెలుంగులచే కల ధ్వనుల్
గల కలకంఠులం గదిమి, గాటపునెమ్మి నటింప, హంసకం
బుల జడియం బయోధరసమున్నతి భంగురమధ్యపుష్కరాం
చల మరదోఁపఁగా నరిగెఁ జారుఘనప్రతినీర చెంతకున్’’ (367)
ఈ పద్యమున గిరిక తెరవెన్కకుబోయినదని చెప్పి యూరుకొనలేదు. దానితో పాటు మెరపుతీవె మేఘము వెనుక దాగినది అన్న వృత్తాంతముగూడ చెప్పబడినది. ఈ పద్యమునందువలె గాక దీనియందు ప్రకృతము వెనుక నప్రకృతము దాగియున్నది. గిరికాకథతోపాటు తటిల్లతావృత్తాంతము జతపరుపబడినది. ఈ తటిల్లత కూడ వేదకథ లోనిదే, ఆ పొరలోని కథను సమన్వయము చేనికొనవలయును. ఇంతేకాక గిరికాదేవి శరీరసౌందర్యమునకు తటిల్లతాంగియన్నది రూపకము కూడ కావచ్చును. ఇది కావ్య సౌందర్యాపాదకము. ఇది బహుముఖ శిల్పము కదా!
ఈ శిల్పము శుక్తిమతీ కోలాహల ఘట్టమున పరాకాష్ఠ నందినది. అచ్చట ప్రకృతార్థమును ఆ రెండు విధముల అనుసంధింపవలని వచ్చినది. ఒకటి శుక్తిమతిని కోలాహలుడు బలాత్కారము చేయుట మొదలైన వృత్తాంతము. వేరొకటి శుక్తిమతీనదిని కోలాహలపర్వత మడ్డగించుట. ఈ రెండు సన్నివేశములు నిచ్చట ఏకరచనలో సమకూర్చ వలనియున్నది. నదికిని, నాయికకును, పర్వతమునకు ప్రౌఢోద్ధతుడైన నాయకునకు సమయస్ఫోరకముగా నీ రచన సాగినది. ఆంధ్రవాఙ్మయమున యపూర్వమైన ఘట్టము.
కోలాహలుడు శుక్తిమతిని తనను చేపట్టుమని ప్రార్థించుచు
‘‘పరమామోదముతో విశేష తటినీపద్మాస్యలం గూడి నీ
పరవిందోద్భవు నోలగంబునకు నీయచ్ఛాచ్ఛభావంబు, నీ
సరసత్వంబును నీ గభీరతయు నీసర్వంకష ప్రౌఢి నీ
పరిపూర్ణత్వము గాంచి మెచ్చి మదిలో భావింతు నిన్నెప్పుడున్’’.
‘‘ఆ పద్మోద్భవు నోలగంబునకు దివ్యద్వీపిను ల్నిచ్చ రా
రో పోరో మఱిెుంద ఱేనియును వారున్ మేము సంధింపమో
యే పద్మాసనఁ జూచినం జెలియ ని న్నీక్షించినట్లుండ దే
లా పల్మాటలు పూర్వజన్మకృతముల్ గాఁబోలు నీనెయ్యముల్’’.
(2126,127)
మొదటి పద్యములో శుక్తిమతిెుుక్క యచ్ఛాచ్ఛభావాదిలక్షణము లామెవే కాక నదిెుడకూడ ననువర్తించుచున్నవి. ఇవి ఒక నాయికెుుక్క ఉదార లక్షణము చెప్పుటతో బాటు నదీసౌందర్యము కూడ చెప్పినట్లయినది. ఆమెయందు నదీత్వభావన నిత్యముగా నుండవలయునన్న నిట్లు శబ్దశక్తి నాశ్రయించవలనినదే. ఈ ఘట్టమునందు రచన మంతయు నిట్లే యున్నది.
శుక్తిమతికి గర్భము కలిగిన ఘట్టము కూడా చాల మనోహరముగ కవి వర్ణించియున్నాడు.
‘‘నాళీకముఖికి నెన్నడుము గానఁగ నె్యుఁ
దనరు నెత్తఱుల బిత్తరము దరలె
శఫరాక్షి కున్నతస్థలు లగమ్యము లె్యు
బడిబడి నడ లెల్ల జడను పడిెుఁ
జారువేణికి వింతచవుల నింపులు మీఱెఁ
గనుపట్టె విశద మై గండరేఖ
కంబుకంఠికి సాంద్రకంకణంబులు జారె
నాదంబు మందమందత వహించె
హంసయానకు నలిమేచకాంచలముల
గుబ్బపొందమ్మి మొగ్గలు కొమరు మిగిలెఁ
బ్రకటితావర్తనాభి కేర్పడిెు నంత
రుచిరతర శైవలశ్యామరోమరాజి’’ (220)
ఈ పద్యము గర్భిణీ న్ర్తీ పరముగను, శరత్కాలమందలి శుక్తిమతీనదీ పరమునకు సమన్వయము పొందుచున్నది. నాళీకముఖి, శఫరాక్షి మొదలైన విశేషణములు నదియందును, నాయికయందును సమన్వయమగుటయే కాక తరువాత పేర్కొనబడిన గర్భిణీ న్ర్తీ లక్షణములు కూడ నదియందు సమన్వయము పొందుచున్నవి. ఇట్టి యద్భుతశక్తి కావ్యమునందంతయు పరచియున్నాడీ కవి. ప్రకృతమైన శుక్తిమతీ కోలాహల ఘట్టముతో బాటు అంతర్వాహినిగా నదీపర్వతముల గాథ కూడ అడుగున ప్రవహించుచుండును. ఒక విధముగా దీనిని పారదర్శక (ట్రాన్స్‌పరెంట్) కవిత్వ మనవచ్చునేమో?
రామరాజభూషణుడు తెలుగుభాషమీద సంపూర్ణమైన యధికారము కలవాడు. మిక్కిలి సాధారణములైన శబ్దములను కూడ వాని యంతరమున గల యర్థముతోబాటు వెలికిదీయువాడు.
‘‘ఆపన్నసత్త్వయాపగ యాపగిదిన్ నీరుమోని’’ అన్నచోట నీరుమోయు అన్న పదమును గర్భముదాల్చు నన్న రూఢార్థమే కాక శబ్దమునందు గల నీరు మోయు అన్న అర్థమును కూడ నదీపరముగా వాడియున్నాడు.
‘‘తన యిల్లు తామరతంపరై వెలయ సంపన్నలినాక్షి కాపున్నచోటు’’ ఇచ్చట తామరతంపరయనగా నిరంతర సమృద్ధియన్నది ప్రనిద్ధార్థము. కవి యింతతో నాగడు. సంపన్నలినాక్షికి యిల్లు తామరలే కదా! అందువలన తామరతంపరగా తన యిల్లు. అచ్చట కాపురమున్నది. వసురాజు విరహియై శుక్తిమతియందలి ముక్తావళులన్నను, నవాబ్జములన్నను గోరంత నంటును, ముఖానురాగమును పూనును అని చెప్పినాడు. ఇచ్చట ‘గోరంత నంటు, ముఖానురాగము పూను’ననుటలో గిరికా సంబంధముచేత వానియం దించుక యాదరము చూపునను భావము స్ఫురించుచున్నది. ముక్తావళులను గోరంత నంటుట, నవాబ్జములయందు ముఖానురాగము పూనుట యన్నవి అదినదియందు జనించినవానియందు తత్సహోదరియైన గిరికా నఖముఖసామ్యము నూహించుచున్నాడు. ఈ యర్థము కల్పించుటకు సామాన్యమైన శబ్దములను న్వీకరించి వాని గుండెలను వెలికిదీనినాడు. ‘‘రెండంట జేయు నీ కాండ చాతురికి నాద్య నిదర్శనంబు వామార్థజాని’’. ఇది మన్మథబాణప్రయోగచాతుర్యము తెలుపుచు చెప్పిన మాట. రెండంటచేయుట లోకోత్తరమైన కార్యము. లోకమున శరసంధాతలు ఒకటిని రెండుగా చేయగలరు. మన్మథుడు ఇర్వురి మనస్సుల నొకటిగా చేయును. అందువలన ఆతడు రెండంట చేయువాడు. ఇంతతో నిచ్చట నాగడు. ఆతడు శివపార్వతులనేకము చేెనను. అది కేవలము మాననికముగనే కాదు. శారీరకముగ గూడ చేెనను అర్థనారీశ్వర రూపమున. ఈ భావము రెండంటజేయు అన్న శబ్దములో కవి కల్పించినాడు. ‘‘బైటి పల్లియలు దున్నిన వాడట, ఒండు రెండు భర్గుండు’’ ఇచ్చట శివుడు త్రిపురాసుర సంహారము చేనిన ఘట్టము చెప్పబడినది. అతడు మన్మథునికన్న గొప్పవాడు కాదనుట ప్రస్తుతము బైటిపల్లియలు ఒకటియో రెండో నశింపచేనినాడు శివుడు. ఇదియేమి గొప్ప నీవు మూడు లోకములు జయించితివి కాని. ఆ మాటలయందే శివుడు చేనిన మహాకార్యము కూడ చెప్పబడినది. బైటిపల్లియలనగా ఆకాశమునందు నిర్మింపబడిన పురములు. అవి ఒండు, రెండు, అనగా మూడు ఈ త్రిపురములను శివుడు దహించినాడు.
మనకు పరమ సామాన్యముగా గోచరించు శబ్దములు భట్టుమూర్తి చేతిలో ఎన్ని యర్థములు చెప్పుమన్న యన్ని యర్థములు చెప్పును. శబ్దముెుుక్క మూల లోణము నాతడట్లు పరిశీలించి యున్నాడు.
ఈ కావ్యమునందు మనము పరిశీలింపవలనిన యనేక విషయములు సంపూర్ణమైన కావ్యమును పలుమారులు మననము చేయుచు చదివిననేగాని భానింపవు.
ఈ కావ్యమునందు మనల తొలుదొల్త సమాకర్షించునది పద్యరచన.
‘‘వీనుల విందై అమృతపు
సోనలపొందై యమందసుమచలదళినీ
గానము క్రందై యాస్వన
మానందబ్రహ్మమైన నధిపతి పలికెన్’’ (214)
రామరాజభూషణుని పద్యరచన కూడ వసురాజునకు వినిపించి ధ్వనివలె పై మాధుర్యమును సంపూర్ణముగ సంతరించుకొన్నది. ఈ కావ్యమునందు దాదాపు నూట యరువది నీసపద్యములలో యేెుుకటియో, రెండో తొలగించినచో మిగిలిన పద్యము లన్నియు పద్యములచేత నూెుల లూగించినవే ‘‘ఎదలపైఁ బొదలు పె్యుదలు జాఱఁగఁ బారు బిబ్బీలకు ముసుంగు లబ్బఁజేెన’’ ‘‘లలనాజనాపాంగ వలనావసదనంగతుల నాభికాభంగ దోఃప్రసంగ’’ ‘‘ఈఱాలఁ బోరాదు హేరాళము జవాఁది ఈ రాలనడుచక్కి నేఁగ వలయు’’ ‘‘సుమనోధివాస భాసురశిఖోన్నతి వాఁడు ఘనసారతిలకవాసనలవాఁడు’’ ‘‘నారంగములు వాసనారంగములు కొన్ని యళినాద మంత్రముల్ దెలుపుచోట’’ ఇత్యాదిగా కావ్యమునం దెన్నియో పద్యములు పేర్కొనుచు పోవచ్చును. ఒక్క నీసపద్యములే కాదు ఏ పద్యమైనను అట్లు సంగీత లయానుబద్ధమై సాగవలనినదే. ఇది రామరాజ భూషణుని శక్తి.
‘‘తమ్ములఁ బంపుదున్ మణిశతమ్ములఁ బంపుదు రాజహంస పో
తమ్ములఁ బంపుదున్ బరిచితమ్ములఁ గానన దేవతాళి జా
తమ్ములఁ బంపుదున్ ద్రుతగతమ్ముల నేనును సారణీ ప్రపా
తమ్ముల వత్తు విశ్వవిదితా ముదితా మది తాప మేటికిన్’’. (660)
పద్యము నదీ ప్రవాహమువలె సాగినది. గణములు పదములు కవి ఇష్టము ననుసరించి ెుచ్చట కోరిన నచ్చట విరిగిపోవుచున్నవి. రామరాజభూషణుడు తెలుగు పద్యముచేత రాగములు పాడించినాడు, మృదంగవాద్యము వేయించినాడు.
‘‘ఉద్ధతరిపువిద్ధ తపన
పద్ధతి కరిభవనదవనిపటదంబుధిసం
పద్ధరణసముద్ధరణస
మిద్ధరణరజో వ్రజోద్యదిభమదసృతికిన్’’. (189)
ఇచ్చట కందపద్యము మృదంగముెుుక్క ధ్వనులు అనుకరించినది.
ఈ కవి పరమభావుకుడు. సాధారణముగా కావ్యమునందు మనల నాకర్షించు నీ పద్యరచనావైభవము, శబ్దాలంకారసమృద్ధి, అర్థాలంకార ప్రౌఢిమ దానివెనుక నున్న భావసంపద వైపు మనలను చూడనీయదు.
‘‘సూనశరాస నీశరము సొచ్చిన ధాతకు, నీ మహోభరం
బానక రౌప్యభూధరగుహాగృహ మీఁగిన శూలికిం, ద్వదీ
యానఘశౌర్యశక్తి హృదయంబునఁ బూను రమావిలానికిన్
మానదువో రజంబును దమంబును సాత్త్వికముం గ్రమంబునన్’’.
(3175)
బ్రహ్మ విష్ణ మహేశ్వరులు కూడ మన్మథునకు లోబడినవారే యని భావము. బ్రహ్మాదులు త్రిగుణ ప్రధానులు. సత్త్వరజస్తమము లొక్కొక్కరి యందొక్కటిగా వారియందు ప్రాధాన్యము వహించును. బ్రహ్మయందు రజమును, విష్ణవునందు సత్త్వమును, శివుని యందు తమము ప్రధానగుణములు. మన్మథునికి లోబడుటవలననే వారియందీ గుణములు గలవని కవి కల్పించినాడు. మన్మథునివలన రజము అనగా అనురాగము బ్రహ్మకును, శివునకు తమమనగా మోహమును, విష్ణవునకు సత్త్వమనగా ేన్వద రోమాంచాది సాత్త్వికభావమును తొలగిపోవుటలేదు. వారియందు వారి గుణములట్లే యున్నవి. కాని కవి వానికి వేరొక యర్థముచెప్పి మన్మథుని యాధిక్యము స్థాపించియున్నాడు.
‘‘హరిదంభోరుహలోచనల్ గగన రంగాభోగరంగత్తమో
భర నేపథ్యము నొయ్యనొయ్య సడలింపన్ రాత్రి శైలూషికిన్
వరుసన్ మౌక్తికపట్టమున్ నిటలమున్ వక్త్రంబునుం దోఁచె నా
హరిణాంకాకృతి వోల్చె రేకయి సగంబై బింబమై తూర్పునన్’’. (417)
కవి యిచ్చట చంద్రోదయము వర్ణించినాడు. నాట్యరంగస్థలము మీద రాత్రి శైలూషి నిలిచినది. నేపథ్యము కొంచెము కొంచెము తొలగించినపుడాపె ఫాలమందలి మౌక్తికపట్టము, ఫాలము తరువాత ముఖము కన్పించినది. అన్నట్లుగా చంద్రబింబము రేకయి, అర్ధబింబమై, బింబమై ఉదయించినది. చంద్రోదయము వర్ణించిన వారెందరున్నను ఈ పరిణామమింత మనోహరముగా వర్ణించినవారు కానరారు. గిరికావివాహమునకు మేరుమందరములు వచ్చిరి. ఇర్వురు పెద్దలు. అందువలన కవి వారిర్వురిగూర్చి ెుుక పద్యము ‘‘ఇరువురు దేవసంభరణులు…… ’’ ఇత్యాదిగా వారి గొప్పతనమును చెప్పుచు నొక పదముల కూర్పుననే ఇరువురి వైలక్షణ్యమును వెల్లడించుచు రచించినాడు.
ఈ కవి తన కావ్య నిర్మాణమునందు నాటకీయ పద్ధతి నెక్కువ యవలంబించినా డని చెప్పబడినది. ఈత డాదర్శముగా చేనికొన్నది శాకుంతలము. ఆ కావ్యమునకు దీనికిని చాలచోట్ల పోలికలు కానవచ్చుచున్నవి.
వసుచరిత్రములోని ప్రథమాశ్వాసమున నాయకుడు ఉద్యానవనమునకు బయలుదేరును. శాకుంతలమున దుష్యంతుడు మృగయారతుడై బయలుదేరును. నర్మసచివుడు శాకుంతలములోని సూతస్థానీయుడు మాత్రమే కాక విదూషక స్థానీయుడు కూడ నగుచున్నాడు. వసురాజు గిరిక సంగీతము విని యామెను చూడగోరి యా ప్రదేశమున కేగినాడు. శాకుంతలమున ఒక సారంగమాతని కణ్వాశ్రమము దరికి చేర్చును. శాకుంతలములోని సారంగమే ఇచ్చట సంగీతమైనది. సూత్రధారుడు నటితో ‘‘తవాన్మి గీతరాగేణ హారిణా ప్రసభం హృతః, ఏష రాజేవ దుష్యంతః సారంగే నాతి రంహసా’’ యనును. రాజు సారంగముచేవలె తాను ఆమె సంగీతముచే నాకర్షింప బడినాడు. ఈ శ్లోకము ఆధారముగా భట్టుమూర్తి ఈ ఘట్టమున వసురాజు సంగీత సమాకృష్ణడయినట్లు చేెనను. ‘‘సంగీత కలస్వనంబు మనమున నొకానొక యనురాగభరంబు బెనుప’’ యన్నచోట పంచమాంకములోని ‘‘రమ్యాణి వీక్ష్య …’’ యన్న ప్రనిద్ధశ్లోకముెుుక్క తాత్పర్యము మనసున బెట్టుకొని వ్రానినట్లున్నది. దుష్యంతు డాతరుచ్ఛాయల దాగినట్లే వసురాజు కూడా తరుచ్ఛాయల దాగును. దుష్యంతుడు తన స్వరూపము బయలు పడనీయలేదు. ఇచ్చట ఆ పని మారువేషము వేని నర్మసచివుడు చేనినాడు. ఈ విధముగా పరిశీలించుచు పోయినచో ఈ రెండు గ్రంథములకు చాల పోలికలు కన్పించును. దీనిలోని మంజువాణి అనసూయా ప్రియంవదల స్థానము నందలిది. అంతేకాక సానుమతిెుుక్క స్థానము కూడ ఆమెదే. అచ్చట కణ్వుడు చెప్పినట్లు ‘‘శుశ్రూషస్వగురూన్’’ ఇత్యాదులిందు ‘‘పతిహిత ధర్మకౌశలము …’’ ఇత్యాదుల యందు కోలాహలుడు చెప్పెను.
శాకుంతలమే కాక ఈ కావ్యమునకు ప్రేరకమైన మరొక గ్రంథము మను చరిత్రము. ఆ కాలమందు ఆంధ్రకవితా పితామహుడని సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయలచేత ప్రశంనింపబడిన పెద్దనగారి గ్రంథము సర్వాంధ్రకవులకు ఆదరణీయమైన గ్రంథము. భట్టుమూర్తి తన గురువుగారి గ్రంథమును కూడ మించునట్లు రచన చేయవలయునని భావించి అంతకన్న లోతైన కథను ప్రౌఢసుందరమైన కవితా మార్గమును న్వీకరించి దానిని నిర్వహించెను. పెద్దనగారియందలి భక్తి ెుంతయో అపారమగుటచేత దానిలోని ఎన్నియో ఘట్టములను సంవదించు ఘట్టములేకాక ఎన్నియో పద్యములను పోలిన పద్యములు కూడ కానవచ్చును. అయినను ఈతడు కేవలము అనుకరణచేనినవాడు కాదు. వారి దారియందు తానుకూడ నడచి వారికన్న మిన్న యనిపించుకొనెడు స్పర్థ కలవాడు.
ఈతని ఉక్తి చమత్కారము చాల గొప్పది. వ్యాజోక్తి ఇతని సొమ్ము. మన్మథ పూజా సందర్భమున గిరిక మూర్ఛపోగా అప్పుడు వ్రానిన పద్యమిది
‘‘మోహాపదేశతమోముద్రితములైన
కనుదమ్ముల హిమాంబు లునుప రాదు,
శ్రమబిందుతారకాగమఖిన్న కుచకోక
ములఁ జంద్రనామంబు దలఁప రాదు,
శీర్యదాశావృంతశిథిలితాసులతాంత
మనియాడ దీవనల్ విసర రాదు
పటుతాప పుటపాక పరిహీనతను హేమ
మింకఁ బల్లవపు టా ర్చిడఁగ రాదు
లలన కానంగ కీలికీలాకలాప
సంతతాలీఢ హృదయపాత్రాంతరాళ
పూరితేన్నహపూరంబు పొంగి పొరలఁ
జల్లనిపటీర సలిలంబుఁ జల్లరాదు’’ (3160)
ఈ పద్యము వసుచరిత్రములోని పద్యములలో రత్నమువంటిది. మోహ వ్యాజమయిన అంధకారముచేత ముకుళించినవి కనుదమ్ములు. వీనిపై హిమాంబు లునుపరాదు. మంచుబిందువులు పద్మములను హరించును. శీతలోపచారము వలదని భావము. అట్లే మిగిలిన మూడుపాదములయందును గీతమునందును శీతలోపచారము వలదని చెప్పినట్లున్నది. కాని తరువాత చెలికత్తెలు శీతలోపచారము చేనిరి. ఇది యేమి? ఉక్తి విరోధముగా కానవచ్చును. కాని మోహాపదేశాది పద్యమున శీతలోపచారము వద్దనినట్లు కానవచ్చినను తాత్పర్యతః లేదని యర్థము. విరహతాపమునకు శీతలోప చారమునకు ఒక విరోధముకాని విరోధము. ఆ ఉపచారములు మాననికముగ విరహ తాపము వృద్ధిపొందించును. కాని శారీరకముగా అవి తాపాపనోదకములు. శరీరమునకు మనస్సునకు విరోధమున్నది. అట్లే ఈ పద్యమునందు కూడ వాచ్యమున నిషేధముగ చెప్పినదానినే వ్యంగ్యముగ విధించినట్లున్నది. ఇది ఒక విధమైన రచనా చమత్కారము.
ఈ మహాకావ్యమును వర్ణించుచు బోయినచో నిట్లే ెుంతయో వర్ణించి చెప్పవచ్చును. ఈ కావ్యమునందు కవిెుుక్క బహుశా పరిచయము భానించుచుండును. ఈతడు సంగీతశామందే కాక వ్యాకరణమున, జ్యోతిషమున, యోగశామున కూడ విద్వాంసుడు. ‘‘సారసకైరవంబులకు చంద్రదినేంద్ర విరోధ’’ మిత్యాది పద్యమున నీతని జ్యోతిశ్శా పరిచయము తెటతెల్లమగుచున్నది.
‘‘అరిగాఁ బంచమ మేవగించి నవలా లవ్వేళ హిందోళవై
ఖరి సూపన్ బికజాత మాత్మరవభంగవ్యాకులం బై వనీ
ధర నాలంబితపల్లవవ్రతవిధుల్ దాల్పన్ దదీయధ్వనిన్
సరిగా గైకొనిెున్ వసంతము మహాసంపూర్ణ భావోన్నతిన్’’ (1130)
పంచమస్వరమును వలదని న్ర్తీలు హిందోళమును పాడగా తమ స్వరము లేనందున విచారించి కోకిలలు తపముచేయగా వారి భావమును వసంతము న్వీకరించినది. అనగా ఆ వసంతరాగము పాడిరని తాత్పర్యము. ఇచ్చట సరి, అరి అన్నవి సామాన్య శబ్దములు. కవి అరిగా అనగా ఋషభస్వరము లేకుండననియు, సరిగా అన్నచోట ఋషభస్వరముతోననియు తాత్పర్యము. పంచమస్వరములో నున్నచో మాత్రమే సంపూర్ణ రాగము. అందువలన వసంతము సంపూర్ణ భావోన్నతి న్వీకరించినది. ఆనాడు సంగీతమున వసంతము సంపూర్ణరాగముగ నుండెడిది. ఈ కావ్యమునందు సంగీత ప్రసక్తి గల ఘట్టములు దాదాపు యిరువదిచోట్ల నుండును. అన్నిచోట్లను ఆతడు దానియందలి తన గాఢ పాండిత్యమును, అభినివేశమును వెల్లడించినాడు. గిరికను చూచిన నర్మసచివు డామె వీణ వాయించిన దృశ్యమును వర్ణించును. కోలాహలుడు తన బిడ్డకు కట్టిన రత్నభవనము ‘వీణావాదన వేళలన్ ఘుమఘుమావిర్భూతి నింపన్’ కట్టించినాడట.
అందులకే కవి ప్రారంభమున సరస్వతీదేవి వర్ణనములో
‘‘రమణీయాక్షసరాకృతిన్ బొలుచు వర్ణ శ్రేణి వీణానులా
పము చేతం గరఁగించి యందు నిజబింబం బొప్ప యచ్ఛామృత
త్వము నాత్మ ప్రతిపాదకత్వమును దద్వర్ణాళి యం దెల్లఁ బూ
ర్ణము గావించిన వాణి తిర్మల మహారాయోక్తిఁ బొల్చుం గృపన్’’ (14)
అని వర్ణించినాడు. సరస్వతీదేవి తన యక్షసర మందలి సర్వవర్ణములను వీణాలాపముచే కరగించి వానియందు స్వచ్ఛమైన యమృతత్వమును, ఆత్మ ప్రతిపాదకత్వమును పూర్ణము గావించుచున్నది. ఈ పద్యమునందు కవి సంగీత సాహిత్యముల యవినాభావన్థితిని వాని సమ్మేళనమువలన కలుగు అమృత సౌందర్యమును గూర్చియు చెప్పుచున్నాడు. వర్ణశ్రేణి భాషాసాహిత్య సంబంధి. అది సంగీతముచేత కూడినప్పుడు దానియందు సరస్వతీ సాక్షాత్కారము జరుగునని యాతని తాత్పర్యము. అది అమృతత్వము నొందును.
సాహిత్య రసపోషణుడైన రామరాజభూషణుని రచనా వైభవము నెంత చెప్పినను చాలదు. అతడు చిన్నచిన్న చమత్కారములనుండి మహాకావ్య నిర్వహణము వరకు అన్ని విషయములందును జాగ్రత్త వహించియుండును.
అందువలననే ఈ గ్రంథము ఆంధ్రసాహిత్యలోకమున మణిభూషణమైనది. తరువాత నలుబది యేండ్లకే సంస్కృతమున కాళహన్తి కవియను మహాపండితుడు దీనిని సంస్కృత భాషలోని కనువదించినాడు. ఈతడు అప్పయదీక్షితులవారి శిష్యడు. ఈ గ్రంథమును డాక్టర్ బి. రామరాజుగారు ఇటీవలనే సంపాదించి ప్రకటించినారు. అట్లే అంబలత్తాడుమయ్యన్ అను తమిళకవి దీనిని తమిళములో ననువదించినాడు. దీనిని మద్రాసు ప్రాచ్యలిఖిత భాండాగారమువారు ప్రకటించినారు.
తెలుగు భాషలో వసుచరిత్రమునకు ఎన్నియో వ్యాఖ్యలున్నవి. వీనిలో సోమకవి వ్యాఖ్య సుప్రనిద్ధమైనది. ఈతడు కరీంనగరము మండలములోని వేములవాడ వాస్తవ్యుడు.
వసుచరిత్రములోని పద్యములను అనువదింపుమని పండిత సభలలో పరీక్షకు లడిగెడివారు. వానిని వీణపైన వాయించుట కూడ మొన్నమొన్నటివరకున్న సంప్ర దాయము. ప్రబంధపఠనమనెడు ఒక విద్య మనకు పోయినది. అది కొంత ప్రవర్తించినచో తెలుగు ప్రబంధములు ముఖ్యముగా వసుచరిత్రాదుల సౌందర్యము చప్పున నెల్లరకు స్ఫురించును.
ఈ మహాకావ్యము తెలుగు కావ్య ప్రపంచమును దాదాపు మూడువందల సంవత్సరములు పరిపాలించినది. ఎన్నియో వందల కావ్యములు దీనిననుసరించి రచించిరి. చంద్రికా పరిణయము, కవిరాజమనోరంజనము, కవిజనరంజనము ఇత్యాదిగా నెన్నియో రచనలు దీనికి ప్రతిబింబభావమును పొందినవి. అందువలననే వీనికి పిల్లవసుచరిత్రలని పేరు కూడ వచ్చినది.
ఆధునిక కాలమున మహాకావ్యములు చదివెడు యలవాటు తగ్గిపోవుచున్నది. అందును వ్యాఖ్యాగమ్యములైన ఆముక్తమాల్యద, వసుచరిత్రాది గ్రంథములు చదువుట మరియు తక్కువ. వానిని మరల చదివించుటకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు ఈ ప్రచుర ప్రకాశన కార్యక్రమము (పాపులర్ ఎడిషన్) చేపట్టిరి. ఇది ఆంధ్ర సాహిత్య పిపాసువులకు మిక్కిలి యానంద దాయకమైన కార్యము.
ఈ పీఠికయం దీ కావ్యమును చదువుటలో నొక క్రొత్తమార్గము చూపుటకు ప్రయత్నము చేయబడినది. ఈ అవకాశము గల్గించినందులకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారికి కృతజ్ఞతలు వెల్లడించుచున్నాను.

ఆచార్య సుప్రసన్నాచార్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *