జీవుడి యిష్టము

 

 

 

 

 

 

 

విశ్వనాథ సత్యనారాయణ

ఒక మారుమూల సముద్రంలో ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపం కూడా యెక్కడో మారుమూల ఉంది. ఓడలమీద సముద్రాలను నాగర కులు గాలించారు. అంత గాలించిన ఆ ద్వీపం ఒక పట్టాన కనిపించ లేదు. నాగరకులు సర్వ ప్రపంచము, సముద్రపు నీళ్ళలో తేలిన ప్రతిమంటిగడ్డ తాము సాధించామని అనుకొన్న తరువాత ఆ ద్వీపం ఉన్న దని తెలుసుకునేందుకే కొన్ని వేల యేండ్లు పట్టినవి. తెలుసుకోటమే ఆలస్యము. మతాలు, వర్తకులు, తుపాకులు అక్కడికి చేరినవి. ఆ ద్వీపంగూడా డిటో ప్రకారం ఆయింది.

అయితే ఆ ద్వీపంలో వాళ్ళు ఇతర ప్రపంచంలో లొంగిపోయిన యితర ద్వీప నివాసులకంటే కొన్ని వేల సంవత్సరాలు ఎక్కువ స్వాతంత్ర్యం అనుభవించారు. అందుచేత వాళ్ళు బానిసతనం అంత తేలికగా అలవాటు చేసికోలేక పోయినారు. ఇతరచోట్లకు మల్లేనే అక్కడా తిరుగుబాట్లు, మరఫిరంగులు, కాల్పులు.

ఒక నాగరకజాతి సేనా నాయకుడుఆ ద్వీపానికి సైనిక నియంత. అతడు బ్రహ్మచారి. అనగా అవివాహితుడన్న మాట. ఆ ద్వీపము శీతమండలాల్లో ఉండటం మూలంగా అక్కడి జనులు తెల్లని వాళ్ళు. చర్మము తెల్లన. ఇతర ఖండములలోని అనాగరకుల వంటి వారు. అనగా కోట్లకొలది సంవత్సరాలు బ్రతికిన జాతి అన్న మాట చెట్టులో – పుట్టలో, సూర్యునిలో – చంద్రునిలో, కాలువలో – కొండలో,

మెరుపులో – మేఘములో నేదో దివ్యశక్తి యున్నదని దాని నారాధించిన వాళ్లు. మెరుమునుచూస్తే జేజేలు పెడతారు. మిణుగురు పురుగులను చూచి తొలగిపోతారు. ప్రాణశ క్తివంటిది వాళ్లకు మహా గౌరవము. ప్రాణాన్ని

నేల క్రింద పడవేసి రాయరు. జీవుణ్ణి కాలి క్రిందబెట్టి తొక్కరు. బంగా రము నాణెముగా వాడుకోరు. దాసెయందు తేజశ్శక్తి ఉన్నదని ఆరా ధిస్తారు. కుండ పెంకులలో వండుకొని తింటారు. లోహపాత్రలు నాగరికత అని యెరుగరు. శరీరావయవములు కావలసినంత మాత్రము కప్పుగొంటారు. నాగరకులై ఒళ్ళంతయు కప్పుకోరు. ఈ యనాగర కులు నాగరకులయ్యే రోజులు వచ్చి ఆ ద్వీపం నాగరకుల కంటబడ్డది.

సైనిక నియంత ఒక స్త్రీని చూచాడు. ఆమె అందం అతని కళ్ళు పట్టరాకండా ఉండిపోయింది. ఆ సాయంత్రం ఆవిడ మొగుడికి కబురు పంపించాడు – నీ భార్యని నాకు తోలి పెట్టమని. ఆ జీవుడు యేమి చేసాడూ.? ఇంతవరకే తమ ద్వీపంలో జరిగిన ఘోరాలు అతనికి తెలుసు. అయినా జీవుడు పెనగులాడడం స్వభావం. అది అన్యాయ మనీ, తన ప్రాణము పోయినా తాను తన భార్యను వదలి పెట్టనని కబు రంపించాడు.

నియంతకు కోపం వచ్చింది. పదిమంది సైనికులు, తుపా కులతో వాని యింటికి వెళ్ళాడు. అతడు వీళ్లు వస్తారని తెలిసి పొయ్యిలో పెట్టుకొనే పొడుగాటి పుల్లలు తానొకటి, తన పెద్దకొడు కొకటి చేతులలో పుచ్చుకొని, తమ గుడి సెముందర నిల్చున్నారు. వారి యాయుధాలను, వాళ్ళను చూస్తే నియంతకు నవ్వు వచ్చింది.

ఆతడుఎందుకు నవ్వుతావు ?” అని యడిగాడు.

నియంత ఇట్లా అన్నాడు : ఓరి మూర్ఖుడా | మా తుపాకులముందు నీ కట్టెపుల్లలు నిలు స్తవా ?” అని. అతడన్నాడుకదా –నా కట్టెపుల్లలు నీ తుపాకులకు సమా ధానము చెపుతవనిగాదు నేనీ కర్రలు పుచ్చుకొన్నది. నా మనస్సు

నీ మనస్సుకు సమాధానం చెప్పవలెననికాని మతొక దానికి గాదుఅని.

నియంతకు కోపము వచ్చింది. ఒక్క కత్తి విసరుతో తండ్రి కొడుకుల తలలు తెగిపోయినవి. నియంత ఆ గుడిసెలో ప్రవేశించి అతని భార్యను తీసుకు రాబోయినాడు. ఆరేండ్ల మొదలు చనుబాలు త్రాగే శిశువువరకు నలుగురు పిల్లలు గుడి నెలో ఏడవ మొదలు పెట్టారు. ఆ స్త్రీ తన పిల్లలను వదలి రాలేకపోయింది. భర్త శవం, కొడుకు శవం మీదబడి యేడవడం మొదలు పెట్టింది. సైనికులు శవాలను తీసి కొని పోయారు. సముద్రంలో పారవేశారు. ఆమె యిక పిల్లలను పట్టు కొని యేడవటం మొదలు పెట్టండి. సైనికులు నియంత ఆజ్ఞతో పెద్ద పిల్లలను ముగ్గురినీ తల్లి చేతులలోంచి లాక్కుని పది పదకొండుసార్లు విదలించివేయగా వేయగా వాళ్ళు దెబ్బలు తగిలి, ఉస్సురని ప్రాణాలు కడవట్టి చనిపోయినారు. ఆ స్త్రీ పాలు త్రావు పిల్లతో నియంత యింటికి వెళ్ళింది.

ఈ కథ జరిగి అయిదేళ్ళయింది. పాలుత్రాగే పిల్లకు అయి దేండ్లు వచ్చినవి. ఆ స్త్రీ ఆ పిల్లతో కాలం పుచ్చుతోంది. ఒక రోజున నియంత వచ్చాడు.

నియంత  – ఆ పిల్లకూడ పోతేగాని నీవు నాతో సరిగా ఉండవు.

స్త్రీ       – నీకన్న కర్కోటకుడవు నీవే ! నీవు మనుష్యుడవు కావు. ఈ పనిపిల్ల ప్రాణములు కూడా తీస్తావా ? ,

నియంత-        నిన్ను తీసుకువచ్చినప్పుడు ఇది పసిపిల్ల. ఇప్పుడు పసిపిల్ల కాదే ! దీని యీడు పిల్లలను అప్పుడు నీ దగ్గర నుండి లాగి వేయలేదా ? అట్లాగే ఇప్పుడూనూ.

ఆ స్త్రీకి అతనితో అయిదేండ్లున్న తరువాత అతని యే మాటకు ఎంత అర్థమో తెలిసినది. తనబిడ్డ తనకు మిగులదని ఆమెకు తెలిసింది. ఆ పిల్లను తీసుకువెళ్లి ఆతని చేతిలో పెట్టియిదిగో, పిల్లను చంపివేయి. ఈ పిల్ల ఉన్నన్నాళ్లు నేను దానిని వదలి పెట్టలేనుఅన్నది. అతడు ఆ పిల్లను ఆమెయెడుటనే కత్తితో రెండుగా నరికాడు. ఆమె యేడుస్తూ వెళ్లిపోయింది.

ఆమె కొన్ని రాత్రులు ఉరిపోసుకొందామనుకుంది. పోసికోలేదు. ఆమె కొన్ని రాత్రులు సముద్రములో బడి చద్దామనుకుంది. చావలేదు.

ఆమె కొన్ని రాత్రులు కిరసనాయిలు మీదపోసికొని నిప్పు ముట్టించుకుందా మనుకుంది. ముట్టించుకోలేదు.

ఇల్లా యెన్నో అనుకుంది. ఏమీచేయలేదు. తరువాత కొన్నాళ్లకు ఒక రాత్రి నియంత తప్పతాగి మదించిన కళ్లతో ఆమెవున్న గది లోనికి వచ్చాడు.తనకు దుఃఖానికి భేదములేదుఅన్నట్లుగా ఉన్న ఆమెను చూచాడు. ఇట్లా అన్నాడు :

నీ మగడు, నీ పిల్లలుపోయి పదేళ్లయింది. నీ పసిపిల్ల పోయి. అయిదేళ్ళయింది

స్త్రీ –     నా ద్వీపపు స్వాతంత్ర్యంపోయి పాతిక యేండ్లయింది. నియంత – (వెటకారముగానవ్వి) ఇంకా యెన్నాళ్లీ దుఃఖం ? స్త్రీ- ఈ శరీరం వున్న న్నాళ్లు.

నియంత_    నీకు ఏమి తక్కుగా ఉంది ? పూర్వంకన్న మంచి దుస్తులు ధరిస్తున్నావు. పూర్వంకన్న మంచి ఇంట్లో నివసిస్తున్నావు.

పూర్వంకన్న మంచి భోజనం చేస్తున్నావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ జాతికన్నా నా జాతి గొప్పది. నీ భర్తకన్న నేను గొప్పవాడను.

స్త్రీ – నీవు నా భర్తకన్న గొప్పవాడవు కావు.

నియంత – (కోపముతో) కానా ! ఎట్లు కానో చెప్పుము.

స్త్రీ –మీకు తుపాకులున్నవి. కత్తులున్నవి, అతనికి యేమీ లేవు. అయినా తన భార్యను, పిల్లలను రక్షించుకునేందుకు కర్రపుచ్చు కొని నిలబడ్డారు. రక్షించలేనని తనకు తెలుసు. అయినా తన ధర్మం తాను చేశాడు. తాను చచ్చిన తరువాతగాని నిన్ను నా దగ్గరకు రానీయ లేదు. నేను నిజముగా నీ భార్యనై ఉంటే నీకన్న బలవంతుడు నాకోసం వస్తే, నీవు పారిపోయేవాడవు. నీవు – వట్టి పిరికిపందవు.

నియంత – (కోపముతో) నేను పిరికిపందనుకాదు.

స్త్రీ-నీవు పిరికిపందవని నా కానాడే తెలియును. నీవు ధైర్యస్తుడవైనచో నింకొక కర్ర పుచ్చుకొని అతని నెదిరించెడివాడవు. అంతమంది సైనికుల నేల తెత్తువు ,

నియంత_(నవ్వి) అయినచో ఆ చచ్చు వెధవను నేను కర్ర పుచ్చుకొని యెదిరించలేకపోతిననియా నీ యుద్దేశ్యం ?

స్త్రీ-అతను చచ్చిపోయినాడు. నీమాటకు రుజువు ఏమున్నది? ఇప్పుడు నీ ధైర్యాన్ని నీవు నాకు రుజువు పరచలేవు నిజంగా నీవు ధైర్యస్థుడవే అయితే ఆప్పుడలా చేసి యుండవు. ,

నియంతనాకు ధైర్యము లేకపోవుటకాదు. నా కప్పుడీ తెలివి లేక పోయింది.

స్త్రీమా జాతిలో తెలివికి ధైర్యానికి యెక్కువ భేదం లేదు. న్యాయానికి తెలివికి యెక్కువ భేదం లేదు, మాకు న్యాయమే తెలివి. తెలివే ధైర్యం.

నియంతమతి యిటువంటివారితో, నాతో నీవు సంసార మెందుకు చేస్తున్నావు ?

స్త్రీ నేను నీతో సంసారము చేయుటలేదు.

నియంతఈ మాటలు వింటే యెవరైనా నిన్ను మూడు రాల వను కొంటారు.

స్త్రీ నేను వాళ్లని మూఢులనుకుంటాను. నియంతఅయితే నీకు నాతో ఉండటం యిష్టం లేదన్న మాట. స్త్రీ-లేదని నీతో చెప్పుట యిది యెన్ని లక్ష లోసారి.

నియంత_నీవు నన్ను ప్రేమించటం లేదని నాకు తెలుసు, నీ ప్రేమను నేను సాధుమార్గాన సంపాదించవలసింది. అప్పుడు ప్రేమించే దానవు.

స్త్రీ నీ జాతి అంతా నశించిన తరువాత నిన్ను ప్రేమిస్తాను. నియంత_నిన్ను చం వేస్తాను.

స్త్రీ – పదియేళ్ల నుంచి అలా చేస్తావేమోనని యెదురు చూస్తు న్నాను.

నియంత – నీకు చావంటే అంత యిష్టమా ? స్త్రీ-ఆంతా యింతా యిష్టమా ? నియంత అయితే చావడానికి మార్గాలులేవా ? స్త్రీ-ఉన్నవి.

నియంత _ఆయితే ఎందుకు చావవు . సముద్రంలో పడి దావ వచ్చు. ఉరిపోసికొని చావవచ్చు.

స్త్రీనా కట్లా చావడం యిష్టం లేదు. నియంతఎట్లా చావడం యిష్టం ?

స్త్రీ-నీకు కోపముతెప్పించి నువ్వు నన్ను చంపితే దావాలని. నియంత అందే, నీకు నామీద ప్రేమ ఉన్నదన్నమాట.

స్త్రీ-అవును, ఉంది. ఆ ప్రేమ యెల్లాంటిదంటే-నాభర్త, నా పిల్లలు నీచేతి మీదుగా చచ్చారుగనుక అలా నీచేతి మీదుగానే చద్దా మన్నంత ప్రేమ.

నియంత ఈ మాటల కేమిగాని నీకు దావడానికిష్టం లేదు.

స్త్రీ- దాలాపొరపాటు. దానటానికిష్టం ఉన్నది. ఆ యిష్టము కూడా ఒళ్లంతా తగలబెడుతూ ఉన్నంత యిష్టం. కాని దావు రెండు రకాలు, ఒకటి తనంతట తాను చచ్చేదావు. రెండవది యెదటివాళ్లు చంపితే చచ్చేచావు. నాకు రెండవ బావే యిష్టము.

నియంత – అంటే నాతోకలిసి సుఖించడం యిష్టమన్నమాట.

స్త్రీ  – నిన్ను నేను పదేండ్ల నుంచి యెరుగుదును. నీవు పళవువు. నీ నాగరికత అంతా నీవుచేసే సురాపానంలో, నీవు ధరించే దుస్తుల్లో, నీ చేతిలోనున్న తుపాకీ మందులో ఉంది. నీమనసులో లేదు, నీజాతిలో లేదు. నీసృష్టిలో లేదు. నిన్ను నేను ప్రేమించటం లేదు; నీవు మనుష్యు ఢవేకాదు. నేను బ్రతుకుతున్నానన్న విషయం నీకాశ్చర్యంగా ఉంది.

నేను ఉరిపోసికునో, సముద్రంలో పడో దావటం నా జీవుడికి యిష్టం లేదు. నాజీవుడు ఈ శరీరాన్ని పట్టుకున్నాడు. వాడంతటవాడు వదలి పోరు. ఆనా చనిపోయిన భర్తకోసం, పిల్లలకోసం గుండె ఆట మటించి చావటం, మహాగ్ని జ్వాలలతో మగ్గిపోవటం ఈ జీవుడికి యిష్టం. ఈ జీవుడికి యిదియొక అనుభవం. ఆ జీవుడు తనంతట తాను చచ్చిపోడు. చచ్చిపోవటానికి యిష్టపడడు, సౌఖ్యమనుభవిద్దామని కాదు. దుఃఖమనుభవిద్దామని, సౌఖ్యమో దుఃఖమో యీ శరీరంతో పుట్టి, యీ శరీరానికి సంబంధించినవి అశుభవించటమే అతనికిష్టం.

శరీరానికి, యీ జీవుడికి ఒక యెడతెగరానిలం కె. ఈ శరీరంతో ఈ జీవుడికి యిష్టమైన అనుభవము వాడు అనుభవమను కొంటాడు. మరి యీ శరీరంతో నేను నీతో సంసారము చేస్తున్నాను గనుక అది వాడి యిష్టమే అనుకుంటావు కాబోలు. అల్లాకాదు. నా అంతట నేను చాప టం నాకిష్టం లేదు. నీవు చంపితే చచ్చిపోవటం చాలా యిష్టం. మృత్యువు దానియంతట అదివస్తే చావటం యింకా యిష్టం. అట్లాగే ఈ జీవుడు ఈ శరీరంతో తన యిష్టం వచ్చిన సౌఖ్యాన్ని అనుభవించి సౌఖ్యం అనుభవించావను కుంటాడు. ఇతరులవల్ల బలవంతంగా చేయ బడ్డ అనుభవం ఆదివాడికి సౌఖ్యంకాదు. అది దుఃఖమే. ఆ దుఃఖమైనా అనుభవించటం అతని కిష్టం.

నియంత-అయితే నీవు నాకక్కర లేదు.

స్త్రీ నేను నిన్నడుగ లేదు.

నియంత-నిన్ను చంపుతాను.

 స్త్రీ – ఊరికే అనట మెందుకు ?

  • నియంత ఆమెను చంపెను.

చనిపోవుచున్న యామె పెదవి మీద సంతోషపునవ్వు తాండవించెను.

ఆమె కొన యూపిరితో నిట్ల నెను.నీవు నీజన్మలో చేసిన మంచిపని యిది యొక్కడయే. నేను చనిపోవుచుంటినిగదా ! నీవు తరువాత యేమిచే సెదవు ?”

నియంత..  మరల నింకొక స్త్రీని సంపాదించెదను.

స్త్రీ — నీకు తగినమాట ! నీ జాతికి జీవుని యిష్టము తెలియదు.

(ఏప్రిల్ 1941)

 

 

 

One thought on “జీవుడి యిష్టము”

  1. విశ్వనాథ వారి చారిత్రక నవలల్లో బద్దన్న సేనాని, కడిమిచెట్టు, వీర పూజ మొదలైనవి, పురాణం వైరా గ్రంథమాలకు ముందరి రచనలు. భారత దేశ పునర్నిర్మాణం లో ప్రధాన పాత్ర వహించిన వల్లభ్ భాయ్ పటేల్ ఆమోఘ కృషి, వల్లభ మంత్రి లో చిత్రిపబడింది. ఇది చారిత్రక నవల ఏ అయినా.. వల్లభ మంత్రి పేరు తప్ప మిగిలినవి కల్పిత నామాలు. అందువల్ల ఇది రూపాంతరం పొందిన చారిత్రక నవలగా చెప్పుకోవచ్చు. తరువాత వచ్చి పురాణ వైరా గ్రంథ మాల 12 నవలలు, మహాభారత యుధ్ధా కాలం నుంచి క్రీస్తుశకం 10వ శతాబ్దం దాకా భారత చరిత్రను, పురాణాలు, జ్యోతిశాస్త్రము. ఇతర గ్రంథాలు ఆధారంగా కాలగణన చేసి రచింపబడ్డవి. ఈ పన్నెండింటిలోను మన సంస్కృతి కి భిన్నంగా విరుద్ధంగా, క్రీస్తు కు పూర్వం..నాలుగువేల సంవత్సరాలకు ముందే, సృష్టి ఆరంభమైందన్న క్రస్థావ భావన మూలంగా భారత దేశ చరిత్రను పాశ్చాత్యులు కుదించి వేయటం అన్న కుట్రను బలవత్తరంగా ఖండించడం కనిపిస్తుంది. ఆర్ష భావనకు, విరోధ రూపం లో సాగిన ఈ కుట్ర ఈ నవలలన్నిటిలోను ఒక అధర్మ ప్రాగృపంగా దైత్యభావనగా జయధ్రదు డనే పాత్ర రూపం లో ప్రకటి తమౌతున్నది. ఈ జయద్రథుడు భారతం లో తనకు చెల్లెలి వరుస అయిన ద్రౌపదిని అవమానించే ప్రయత్నం చేసాడు. ఈ అతివేల మైన కామ ప్రవృత్తి భగవద్విరోధమై చరిత్రలో ఎలా అనుసయుథిగా సాగిందో మరల మరల కొత్తకొత్త రూపాలలో వ్యక్తమైందో తుదకు అన్ని సందర్భాలలో ఓటమి పొందినదో ఈ కథనాలలో విశ్వనాథ నిరూపించారు. చివరకు ధర్మమే జయిస్తుందని నిరూపింపబడింది. ఒక విధంగా జయద్రథుడు క్రైస్తవ మేథాలజీ లోని సైతాను వంటివారు. ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే.. స్వాధ్యాయ లో ప్రకటి తమైన జీవుని ఇష్టము అన్న కథ తర్వాత అనిపించినా అంశము. దీంతో నియంత బాల హంతకుడైన కంసుని ప్రాగృపం. దీనిలోని స్త్రీ .. పరాజితమైన ఆ జాతి లో ప్రజ్వలిస్తున్న స్వాతంత్ర్య కాంక్షకు జ్వలించే ప్రతిరూపం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *