వెలుగు మొలకలు

అవి ముట్టుకోకుండానే ప్రేమిస్తాయి.. మాట్లాడకుండానే పలకరిస్తాయి. ఆపదలో ధైర్యాన్నిస్తాయి.. ఆగ్రహమొస్తే నిప్పులు చిమ్ముతాయి. అనురాగంలో ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటాయి. ప్రేమ, జాలి, కరుణ, కోపం, తాపం, సంతోషం అన్నీ వాటికి మాత్రమే తెలిసిన విద్యలు. అవి వేటాడుతాయి.. వెంటాడుతాయి.. అవి చేసే ఒక్క సైగ ప్రపంచాన్నే మార్చేస్తాయి.. నిశ్శబ్దంగానే విప్లవాన్ని, వినాశాన్ని సృష్టిస్తాయి. ప్రపంచంలో జీవజాలాన్నంతా నడిపిస్తున్నవీ, శాసిస్తున్నవీ అవే.. ఒకటి నవ్వితే మరొకటి వెక్కిరిస్తుంది. ఒకటి జాలి పడితే మరొకటి భయపెడుతుంది. ఒకటి చిలిపి చేస్తే మరొకటి చికాకు పెడుతుంది. నవరసాలు వాటి సొంతం. అవి ఒకసారి తెరుచుకుంటే ప్రణయం పుడుతుంది. ప్రళయమూ పుడుతుంది.
ప్రపంచాన్ని నడిపించేవి.. శాసించేవి అవి. మన మనుగడకు.. ఇంకా చెప్పాలంటే అసలు అన్ని జంతువులకూ అవే మూలం. అవి కళ్లు.. మన కళ్లు.. మనలకు ప్రపంచాన్ని అన్ని రంగుల్లో చూపించే కళ్లు.. వెలుగు, చీకట్ల మధ్య తేడాని విప్పిచెప్పే కళ్లు.
కళ్ల గురించి తెలియందెవరికి చెప్పండి.. రోజూ లేస్తే వాటితోనే చూసేది.. వాటి సాయంతోనే నడిచేది.. నడిపించేది.. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే.. అయినా ఇప్పుడు ఆ కళ్ల గురించి ప్రత్యేకించి చెప్పేదేముంటుందనుకుంటున్నారా? మరదే.. మీరు పట్టించుకోనిదీ.. మేం పట్టించుకుని మీకు చెప్పాలనుకుంటున్నది.. చిన్న తేడా .. అదే కళ్లకుండే శక్తి.. వాటి పవర్.. అవి మేధస్సును సైతం ఏ విధంగా శాసిస్తాయన్నది..
నిశ్శబ్దం వాటి ఆయుధం. ఓరచూపే వార్ హెడ్. కనుకొలకుల్లోనుంచే దేన్నైనా సాధించగల సామర్థ్యం. వాటికి వేటాడటమూ తెలుసు. వెంటాడటమూ తెలుసు. వేధించటం తెలుసు. వెలిగించటమూ తెలుసు. అదే వాటి పవర్..
మనకు సూపర్ పవర్.
కన్నుల్లో నీ బొమ్మ చూడు.. అది కమ్మని పాటలు పాడు.. అన్నారో సినీ కవి.. కళ్లకున్న పవర్ అలాంటిది.. కళ్లు ఏమైనా చేస్తాయి. ఎవరినైనా దేనికైనా ప్రేరేపించే సత్తా వీటికి మాత్రమే ఉంది. మన శరీరంలో మరే ఇంద్రియానికీ లేని శక్తి వీటికి ఎలా వచ్చింది? వీటికి ఎందుకింత ప్రత్యేకత..
కన్ను….ఏక కణ జీవి నుంచి మనిషి దాకా అన్ని రకాల జీవుల్లో కామన్‌గా ఉండే ఎలిమెంట్.. వాటి ప్రధాన లక్ష్యం మనకు ప్రపంచాన్ని చూపించటం. ఎదురుగా ఉన్న కాంతిని గుర్తించి దాన్ని మనకు తెలపటం.. కాంతిని కెమెరాలాగా క్లిక్ చేసి నెగెటివ్‌ను మెదడుకు పంపించి ప్రాసెసింగ్ ద్వారా క్లియర్ పిక్చర్‌ను ఇచ్చేది కన్ను. గమ్మత్తేమిటంటే.. ఏ విజువల్ ఇమేజిని మనం చూడాలన్నా కన్నుల్లోనుంచి బ్రెయిన్‌కు ఓ ఆప్టికల్ నర్వ్ లైన్ ఉంటుంది. ఈ నరమే లోకాన్ని మనం చూసేందుకు తోడ్పడుతుంది.
మనిషి సంగతి సరే.. జంతువుల్లో కళ్లు అన్నింటికీ ఒకేరకంగా ఉండవు. దాదాపు పది రకాల డిజైన్లలో ఉంటాయి. వీటిలో 96శాతం చాలా క్లిష్టంగా ఉంటాయి. అయితే ప్రతిబింబాన్ని స్పష్టంగా చూసే స్థాయి కళ్లు ఉన్న జంతువులను వేళ్లపైన లెక్కించవచ్చు.
మిగతా అన్ని జీవుల్లో వెలుతురు, చీకటి మధ్య వ్యత్యాసాన్ని మాత్రమే చెప్తాయి. సముద్రంలోని ఏకకణ జీవుల్లో మాత్రమే సింపుల్ ఐస్ ఉంటాయి. ఇవి కేవలం వెలుతురు.. చీకటి ఈ రెంటి మధ్య తేడాను మాత్రమే గుర్తిస్తాయి.
మన దగ్గరకు వచ్చేసరికి కళ్ల పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది. రెండు కళ్లూ మెదడుకు రెండు కిటికీలుగా పని చేస్తాయి.. మనకు ఏదైనా ప్రమాదం ఎదురైతే, మన మెదడు కంటే కూడా ముందుగానే కనిపెట్టగలిగే సామర్థ్యం కళ్లకే ఉంది. కళ్లతో చూసిన తరువాతే మెదడు ఒక నిర్ధారణకు వస్తుంది. ఇదీ కళ్లలోని ప్రత్యేకత..
మొట్టమొదటి ప్రోటోటైప్ కళ్లు 600 మిలియన్ సంవత్సరాల క్రితం జంతువుల్లో కనిపించాయి. చేపలు, పాముల్లో కళ్లు ఫిక్స్‌డ్ లెన్స్ కలిగి ఉంటాయి. వీటిని కాంపౌండ్ ఐస్ అంటారు. కొన్ని కళ్లల్లో 28వేల రకాలైన సెన్సార్స్ ఉంటాయి. 360 డిగ్రీల్లో విజన్ కనిపిస్తుంది. మనిషిలో కళ్ళల్లో మల్టిపుల్ లెన్స్ ఉంటుంది. ఈ లెన్స్ వెనుక 200 వేల తెల్ల కణాలు సూక్ష్మంగా ఉంటాయి. వీటి నుంచి బ్రెయిన్‌కు ఆప్టికల్ నెర్వ్ ద్వారా ఇమేజ్ సమాచారం వెళ్తుంది..దానితో పాటే ఎమోషన్స్ కూడా కేరీ అవుతాయి. ఈ ఎమోషన్సే మనిషినైనా, జంతువునైనా శాసిస్తాయి.
మీరెప్పుడైనా మీ బాస్ కళ్లల్లోకి సూటిగా చూసి మాట్లాడారా? మీ గాళ్‌ఫ్రెండ్ కళ్లల్లోకైనా సూటిగా నేరుగా చూసి పలకరించారా? ఇప్పటిదాకా అలా చేయలేదంటే మీరు తప్పించుకుంటున్నారన్నమాట.. ఏదో తప్పు చేసినట్లు భయపడుతున్నారన్నమాట.. మీ కళ్లకున్న పవర్ గురించి మీకు తెలియటం లేదు. ఒక్కసారి.. ఒకే ఒక్కసారి కళ్లలో కళ్లుంచి ఎదుటి వ్యక్తితో మాట్లాడండి.. వాటి శక్తి ఏమిటో మీకే తెలుస్తుంది…
ఐ కాంటాక్ట్.. ఎప్పుడైనా విన్నారా? మామూలుగా అయితే దీని గురించి మనం పట్టించుకోం.. కానీ, జాగ్రత్తగా గమనించండి.. మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి.. మీ కళ్ల కున్న పవర్ మొత్తం ఈ కాంటాక్ట్‌లోనే ఉంది. మీరిద్దరూ లవర్సా.. ఒకరి కళ్లల్లోకి సూటిగా చూడండి.. అలా చూస్తూనే ఉండండి.. చూస్తూనే మాట్లాడండి.. మీ మాటల కంటే ఎక్కువగా మీ కళ్లే మీరేమిటో విప్పి చెప్తాయి.. మీ కేరెక్టర్‌ని ఎలివేట్ చేస్తాయి.
నా కళ్లు చెప్తున్నాయి.. నిను ప్రేమించానని.. అన్నది సినిమా పాటే అయినా ఇది అక్షరాలా నిజం.. ఆ కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుస్తుంది.. మన పెదవులు అబద్ధం చెప్పవచ్చు. మన చేతలు అబద్ధం చేయవచ్చు. మన నడకలో, నడతలో అబద్ధం దాగి ఉండవచ్చు. కానీ, కళ్లు మాత్రం ఎప్పుడూ అబద్ధం చెప్పలేవు. ఆ కళ్లను చదివే సామర్థ్యం కళ్లకే ఉంది.. ఆ కళ్లే ఇద్దరి మధ్య ప్రేమను చిగురింపచేస్తాయి. ఆకర్షణ కలిగేలా చేస్తాయి
నాలుగయిదు క్షణాలు చాలు.. ఎదుటి వాళ్లను మీ వశం చేసుకోవటానికి అది మీ కళ్లతోనే సాధ్యపడుతుంది. ఎందుకంటే ఆ కళ్లలోంచే మీకు కావలసిన ఫీడ్‌బ్యాక్ అందిపోతుంది. మీ చెలి మీ పట్ల ఎంత ఆరాధనతో ఉన్నదీ ఆమె కళ్లే చెప్పేస్తాయి. మీ చెలికాడిలోని నిజాయితీ అతని కళ్లు వద్దనుకున్నా బయటపెడతాయి.
మీ ఒక్క చూపు ప్రియుణ్ణి కట్టిపడేస్తుంది. ఓరకంట వలపుబాణాన్ని విసిరితే జారిపడని మగాడెవడైనా ఉంటాడా? అందుకే మహిళల్లో సెక్సీ ఆర్గాన్ ఏమిటీ అంటే ఠక్కున చెప్పే సమాధానం ఐస్. మత్తుగా, గమ్మత్తుగా, చిలిపిగా, అవి చేసే తుంటరి చేష్టలు ఒక్క మాట మాట్లాడకుండానే ఇద్దరినీ ఆ దరికి చేర్చేస్తాయి.. అ కళ్లలో కనిపించే ఆకళ్లకు మాటలు అవసరమవుతాయా? మీరే చెప్పండి?
ఆ కళ్లు కలిగించే ప్రేమ మత్తు అలాంటిలాంటిది కాదు.. ఫూటుగా మందుకొట్టినా ఎక్కని కిక్కు.. ఒక్క ఓరచూపు ఎక్కించేస్తుంది. గొంతు హస్కీగా ఉండటం విన్నాం.. కానీ, హస్కీ ఐస్ మీకు తెలుసా.. ? వాటికి మాత్రమే తెలుసు.. ఆ కళ్లకు తెలియని విద్య లేదు.. నేర్పుగా మనిషిని బోల్తా కొట్టించటంలో వాటికి సాటి లేదు.
ఈ కళ్లకు ప్రేమించటం ఎంత తెలుసో, ద్వేషించటమూ అంతే తెలుసు.. కంటపడితే వెంటాడి వేటాడటమూ తెలుసు.. ఎవరిని ఎలా వశపరచుకోవాలో చాలా బాగా తెలుసు.. మనిషిని తాకకుండా, తాను చెప్పినట్టల్లా వినేలా చేసుకోవటమూ తెలుసు.. ఆ కళ్లకు ఉన్న శక్తి అది.. ప్రపంచ పక్షులకు రారాజు.. గద్ద.. దీని కన్ను చూస్తేనే భయం కలుగుతుంది.. రెండు మైళ్ల దూరంలో ఉన్న వస్తువునైనా స్పష్టంగా చూడగల సామర్థ్యం దీని కళ్లకు ఉంది.. ఆకలేసిందంటే ఇది ఎంత దూరంలో కనిపించే ఆహారాన్ని సరే క్షణంలో తన్నుకుపోగలదు..
నీళ్లల్లో ఉండే మొసలి కళ్లు ది గ్రేట్ సైలెంట్ కిల్లర్. వీటి కళ్లకున్న నిశితమైన చూపు శక్తే వీటి బలం.. జంతువుల కంటే, మనిషి కళ్లకుండే పవర్ పది రెట్లు ఎక్కువగా ఉంటుంది. కళ్లతో కళ్లను కలగలిపి, ఒకరి మెదడును మరొకరు వశపరచుకోవచ్చు. ఇటీవల పునర్జన్మ గురించి పరిశోధనలు చేస్తున్న వైద్యులు చేస్తున్న పని అంతా ఈ ఐ కాంటాక్ట్ ద్వారానే సాగుతుంది. కళ్ల ద్వారానే వెనుక ఉన్న ఆప్టికల్ నెర్వ్ నుంచి మెదడుకు సంకేతాలు పంపించటం వల్ల సబ్‌కాన్షియస్ మైండ్‌ను తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటారు. ఆ తరువాతే ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న జ్ఞాపకాలను వాళ్లతోనే చెప్పిస్తారు. హిప్నటిజం కూడా పూర్తిగా ఇలాంటిదే. ఐ కాంటాక్ట్‌కు ఉన్న శక్తి చాలా తీవ్రమైంది.. దేవతా విగ్రహాల్లో జీవశక్తి అంతా ఆ మూర్తిలోని కళ్లల్లోనే ఉంటుంది. ఏ దేవాలయానికైనా వెళ్లినప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. ఆ స్వామి వారిని చూడండి.. ఆ కళ్ల నుంచి వెలువడే ప్రాణశక్తే మన బాధలన్నింటినీ తొలగిస్తుంది..మన ఆత్మకు రూపం అంటూ ఏదైనా ఉందా అంటే అవే కళ్లు.. మనల్ని ప్రేరేపించటమే కాదు.. మన కళ్లతో కాంటాక్ట్ అయ్యేవాళ్లనీ ప్రేరేపించే శక్తి కలిగిన ఇంద్రియం మన శరీరంలో.. అసలు జీవుల శరీరాల్లో మరేదీ లేదు.. అందుకే దీన్ని జ్ఞానేంద్రియం అని మన పూర్వీకులు అన్నారు.. మన లవ్‌లో, లైఫ్‌లో బిజినెస్‌లో అన్ని రకాల సక్సెస్ వెనుక దాగుండేవి కళ్లే మరి.. అలాంటి వాటిని నిర్లక్ష్యం చేస్తే అంతే మరి..

కోవెల సంతోష్ కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *